తాజా కథలు @ CCK

ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు

2015-05-13 21:05:01 చిన్నారుల కథలు
ఒక ఊర్లో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలసిమెలసి పనులు చేసుకుంటూ ఉండే వీరిద్దరూ ఒక రోజు వ్యాపారం కోసం పట్టణానికి బయలుదేరారు. అడవి గుండా నడచి వెళ్తున్న ఇద్దరు మిత్రులకు ఒక ఎలుగుబంటి తారసపడింది.

అంతే... దాన్ని చూసి బెంబేలెత్తిన రాము, సోములిద్దరూ భయంతో పరిగెడుతూ ఒక చెట్టు వద్దకు చేరుకున్నారు. సోము ఆలస్యం చేయకుండా వెంటనే గబ గబా చెట్టెక్కి కూర్చున్నాడు. రామూకి చెట్టెక్కడం రాకపోవడంతో, సోమూని సాయం చేయమని వేడుకున్నాడు.

తాను దిగి వచ్చే లోపు ఎలుగుబంటి వచ్చేస్తుందనీ, అప్పుడు ఇద్దరం దానికి బలవక తప్పదు. కాబట్టి, నేను దిగిరాను నువ్వే ఏదో ఒకటి చేసేయమని రామూతో అన్నాడు సోము. అయ్యో ! సాయం చేయాల్సిన మిత్రుడే ఇలా అంటున్నాడే, ఈ రోజు ఆ ఎలుగుబంటికి బలవక తప్పదా ? అంటూ ఆలోచనలో పడ్డాడు రాము.

వెంటనే ఓ ఉపాయం తళుక్కున మెరిసింది. అంతే, చచ్చిపోయినవాడిలా ఆ చెట్టు కింద కదలకుండా, మెదలకుండా పడిపోయాడు రాము. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. పైకి చూస్తే ఒకడు చెట్లో నక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు పైకి ఎక్కడం అంత సులభం కాదు. కింద చూస్తే వీడు చచ్చి పడి ఉన్నాడు.

ఏం చేయాలబ్బా ! అని ఆలోచించిన ఎలుగుబంటి ఎందుకైనా మంచిది కింద పడిన వాడు నిజంగా చనిపోయాడా, లేదో? తెలుసుకుని తన దారిన తాను వెళ్లిపోవాలని అనుకుంది. వెంటనే రామూ దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి, చనిపోయాడని నిర్ధారించుకుని చేసేదేమీలేక అక్కడినుంచి వెళ్లిపోయింది.

ఎలుగుబంటి దూరంగా వెళ్లిపోవడం చూసిన తరువాత మెల్లిగా చెట్టు దిగి వచ్చిన సోము, భలే ఉపాయం పన్నావు మిత్రమా ? ఎలాగైతేనేం ప్రాణాలు దక్కించుకున్నామని అన్నాడు. అది సరేగానీ ! ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గరకి వచ్చి ఏదో గుస గుసలాడుతూ చెప్పింది కదా ? ఏం చెప్పింది ? అని ఆరా తీశాడు సోము.

"ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వాడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దని" చెప్పి వెళ్లిపోయిందని అన్నాడు రాము. అప్పటికి గానీ తాను చేసిన తప్పును గుర్తించలేని సోమూ సిగ్గుతో తలదించుకున్నాడు.

 నీతి :

ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. అలా కానివారు అసలు స్నేహితులే కారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం