తాజా కథలు @ CCK

పులి తోలు కప్పుకున్న గాడిద

2015-04-29 21:05:02 చిన్నారుల కథలు
పూర్వం ఒక గ్రామంలో విలాసుడు అనే చాకలి వాడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. అయితే ! బట్టల మూటలు మోసే ఓపిక లేక,  ఒక గాడిదను కొనుక్కున్నాడు. గాడిదను కొనగానే సరిపోతుందా ? దాన్ని మేపాలంటే ఈ చాకలివాడి తల ప్రాణం, తోకకు వచ్చింది.

గాడిదను మేపాలంటే డబ్బులు ఖర్చయిపోతాయన్న బెంగతో చాకలివాడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అదేంటంటే !బాగా పాతదైపోయిన పులితోలును ఒకదాన్ని సంపాదించిన అతడు, దాన్ని గాడిదపై కప్పి, రాత్రుళ్లు గ్రామస్తుల చేలల్లో వదిలివెసేవాడు. ఆ గాడిద చేలల్లో తనకు ఇష్టమైన ఆహారాన్ని కడుపారా తిని చాకలి ఇంటికి వెళ్లిపోయేది.

పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన ఆ చేలల్లో కావలి ఉండే గ్రామస్తులు, "అయ్యబాబోయ్..... పులి వచ్చింది" అని భయపడి పారిపోయేవారు. భయం వల్ల గ్రామీణులెవరూ ఆ పులిని ఏం చేయగలం అంటూ ఊరకుండిపోయారు. అయితే ! ఆ ఊర్లోనే ఉంటున్న ఒక యువకుడికి మంచి ఆలోచన తట్టింది.

దాంతో, అతడు ఈ పులి సంగతేంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికే తన పెంపుడు గాడిదలను వెంటబెట్టుకుని పంట పొలానికి కాపలాగా వెళ్ళాడు. ఆ రాత్రి కూడా విలాసుడి గాడిద, యజమాని కప్పిన పులి తోలు ముసుగులో చేలల్లో పడి, పైరుల్ని మేయసాగింది.

అక్కడే పొలానికి కాపలాగా ఉన్న ఆ యువకుడు దీన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో అతడి వద్ద ఉన్న గాడిదలు పులిని చూసిన భయంతో కాబోలు ఓండ్రబెట్టినాయి. చాలా రోజులుగా మౌనంగా మేత మేయటం అలవాటయిన చాకలివాడి గాడిదకు తన జాతి వారి అరుపులు వినబడటంతో సంతోషం పట్టలేకపోయింది.

వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా ఓండ్రపెట్టసాగింది. తోలును చూసి పులి అని భ్రమ పడుతున్న ఆ యువకుడు అది నోరు తెరచి ఓండ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు. తక్షణమే తన వద్దనుండే దుడ్డు కర్రతో ఆ గాడిదకు బడితె పూజ చేశాడు. ఆ రకంగా చాకలివాడి పులి తోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది.

 నీతి : యదార్థం బయటపడే వరకు మాత్రమే ఎవరి ఆటలైనా కొనసాగుతాయి. కాబట్టి, నిజాన్ని ఎంత కాలమూ దాచలేము. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు. నిజం బయటపడ్డాక మోసకారుల ఆటలు సాగవు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం