తాజా కథలు @ CCK

వికటకవి - తెనాలి రామలింగడు

2015-06-01 09:05:01 చిన్నారుల కథలు
తెనాలి అనే పట్టణంలో ఓ దంపతులకు రామలింగడు అనే కుమారుడుండేవాడు. రామలింగడికి చదువు సంధ్యలకంటే, ఆట పాటలంటేనే ఎక్కువగా ఆసక్తి ఉండేది. "విద్యలేని వాడు వింత పశువు" అనే నానుడిని తలుచుకుని భయపడుతున్న రామలింగడి తల్లిదండ్రులు, తమ కుమారుడు పశువు కాకుండా, అక్షర జ్ఞానం నేర్చుకుని, దాంతో లోకజ్ఞానం సంపాదించాలని ఆరాటపడేవారు.

అయితే బాల్యమంతా ఆట పాటలతో కాలక్షేపం చేసిన తెనాలి రామలింగడు పెద్దవాడు అయిన తరువాత బ్రతికేందుకు విద్య అవసరమని తెలుసుకున్నాడు. అయితే మానవ శక్తితో సాధ్యకానివి , దైవ శక్తితో సాధ్యమవుతాయని పెద్దలు చెప్పుకుంటుంటే చాలా సార్లు విన్న రామలింగడు - చివరికి దైవ శక్తిని ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాడు.

తన నిష్కల్మషమైన మనస్సుతో జగన్మాతను ఆరాధించసాగాడు. అలా రామలింగడు ప్రార్థనను చాన్నాళ్ళుగా గమనించిన జగన్మాత ఓ రోజున రామలింగడికి ప్రత్యక్షమైంది. ఒక చేతిలో ధనలక్ష్మి, మరో చేతిలో విద్యాలక్ష్మిలను పాయసంగా మార్చి, వెండి గిన్నెల్లో నింపి మరీ తీసుకొచ్చింది జగన్మాత.

జగన్మాత దర్శనంతో పులకించిపోయిన రామలింగడు, తనకు తెలియకుండానే చందోబద్ధమైన స్తుతి పద్యాలతో ఆమెను ప్రార్థించాడు. అక్షర జ్ఞానం లేని అతడి నోటి వెంట అక్షరాలు ముత్యాల జల్లుల్లాగా పొంగిపొర్లాయి. జగన్మాత మహిమా ప్రభావంతోనే ఇదంతా జరిగిందని గ్రహించిన అతడు తన్మయత్వంతో మురిసిపోయాడు.

"చూడు నాయనా ! నీ భక్తికి సంతోషించాను. నీకు కావలసిన వరం ఇస్తాను. ఏది కావాలో కోరుకో ?" అంటూ అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు నటిస్తూ రామలింగడిని అడిగింది జగన్మాత. "ఏమిస్తావు తల్లీ ! అన్నీ నీకు తెలుసు కదా? నీ బిడ్డకు కావాల్సింది నువ్వే ఇవ్వు తల్లీ !" అంటూ నిర్ణయాన్ని ఆమెకే వదిలివేశాడు.

"చూడు నాయనా కుడి చేతి గిన్నెలో ఉన్న పాయసం విద్యా లక్ష్మి, ఎడమ చేతి గిన్నెలో ఉన్న పాయసం ధనలక్ష్మి. ఈ రెండింటిలో ఏది కావాలో దాన్ని తీసుకుని సేవిస్తే, అది కడదాకా నీ వెంటే ఉంటుందని" చెప్పింది జగన్మాత. కాసేపు తటపటాయించిన రామలింగడు "తల్లీ బ్రతికేందుకు ఈ రెండు లక్ష్మిలు అవసరమే కదా ! ఎటూ తేల్చుకోలేక పోతున్నాను. ఏదీ ఆ రెండూ గిన్నెలు ఒక్కసారి నా చేతిలో ఉంచు చిటికెలో తేల్చుకుంటాను'' అన్నాడు.

వెంటనే అమ్మవారు రామలింగడు కోరినట్లుగానే రెండు గిన్నెల్నీ అతని చేతిలో పెట్టింది. అల్లరివాడు, కొంటెవాడు అయిన రామలింగడు వెంటనే ఆ రెండు గిన్నెల్లోని పాయసాన్ని రెండింట్లోనూ కలిపేసి, ఒక గిన్నెలో కలగలసిన పాయసాన్ని చటుక్కున తాగేసి మరో గిన్నెను జగన్మాత చేతిలో పెట్టాడు.

రామలింగడు చేస్తున్న పనికి ఆశ్చర్యపోయిన జగన్మాత కోపంగా అతడివంక చూడసాగింది. తప్పును గ్రహించిన రామలింగడు వెంటనే అమ్మవారిని శరణువేడాడు. దాంతో అమ్మవారి మనసు కరిగి, "తెలిసి చేశావో, తెలియక చేశావో గానీ.... నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. పండితుడివైనా వికటత్వంతోనే అందరి మెప్పును పొందుతావు. ధనలక్ష్మి నీ వెంట ఉన్నా, అది నీకు అక్కరకు రాదు" అంటూ దీవించింది. ఇక ఆనాటి నుంచి తెనాలి రామలింగడు "వికటకవిగా" ప్రసిద్ధి చెందాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం