తాజా కథలు @ CCK

సమయస్ఫూర్తి

2015-06-13 05:05:01 చిన్నారుల కథలు
ఒకప్పుడు సుజ్ఞాని అనే వర్తకుడు ఉండే వాడు అతడు తన తోటివాళ్లతో ఓ బృందంగా ఏర్పడి ఒక ఊరి నుండి మరొక ఊరికి సరుకులను తీసుకువెళ్లి అమ్ముతుండేవాడు.

ఒకసారి ఆ బృందం ఒక అరణ్యం గుండా వెళ్లవలసి వచ్చింది. అరణ్యంలోకి ప్రవేశించక ముందే సుజ్ఞాని తనవారిని పిలిచి, ఈ ఆడవిలో జాగ్రత్తగా ఉండండి. నాకు చెప్పకుండా ఇక్కడ ఏ పండూ,దుంపా, ఆకూ తినవద్దు అన్నాడు. ఆ బృందం అలా నడుస్తుండగా వారికి ఒక ఊరు కనిపించింది. ఆ ఊరికి చాలా దగ్గరలో ఒక పెద్ద చెట్టు, ఆచెట్టునిండా బోలెడు పళ్ళు కనిపించాయి. ఆ పళ్ళు చూడటానికి ఆకర్షణీయంగా, పక్వానికి వచ్చిన రుచ్చికరమైన వాటిలా అనిపించాయి. వాస్తవానికి అవి విషపు పళ్లు.

కాని , విషం సంగతి తెలియకపోవడంతో వారు వాటిని తినడానికి సిద్ధమయ్యారు. వారిలో కొంత మంది తమ బృందానికి నాయకుడైన సుజ్ఞాని చెప్పాలని నిర్ణయించుకున్నారు.

కాని , మరికొందరు మాత్రం తొందరపాటులో ఆ పళ్ళని కోసుకుని తినేశారు. ఇంతలో సుజ్ఞాని అక్కడకు చేరుకున్నాడు. కొద్దిసేపు ఆ చెట్టునీ, ఊరినీ పరీక్షగా చూసి, ఈ పళ్ళు తినడానికి పనికిరావు. బహుశ ఇవి విషపూరితం కావచ్చు అని చెప్పాడు.

దాంతో వాటిని అప్పటికే తిన్నవాళ్లు బలవంతంగా వాంతి చేసి ఆ పండు ప్రభావం నుండి బయటపడ్డారు.

ఊరి ప్రజలకు ఆ చెట్టువల్ల లాభం ఉంది, సుజ్ఞాని బృందంలాగే అంతకు ముందు అక్కడకి వచ్చిన వాళ్లు ఆ పళ్లును తిని చనిపొతే ఆ నవాళ్ల సామాన్లు తీసుకు పోయేవాళ్లు. ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకుపోవచ్చని భావించి ఊరివాళ్లు వచ్చి, అందరూ బాగానే ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

అందులో ఒకడు ధైర్యం చేసి సుజ్ఞానిని అడిగాడు ఈ పళ్లు విషమని మీకెలా తెలిసింది?

సుజ్ఞాని చిరునవ్వు నవ్వి ఈ చెట్టు ఎక్కడానికి చాలా సులువుగా ఉంది, ఊరికి చాలా దగ్గరలో ఉంది.

అయినా చెట్టు నిండా పళ్ళున్నాయి.ఎవరూ కోయడం లేదంటే ఈ పళ్ళు మంచివి కాదనేగా అర్ధం అన్నాడు.

తమ నాయకుడి సమయస్ఫూర్తి తమ ప్రాణాలను కాపాడిందని సంతోషిస్తూ అందరూ   ముందుకు సాగిపోయారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం