తాజా కథలు @ CCK

ఈ ఇసుక రేణువుల పరిమాణం ఎంత ?

2015-05-03 01:05:01 చిన్నారుల కథలు
విదర్భ దేశస్థుడైన సూర్య నారాయణ శాస్త్రి తన పాండిత్యంతో కోశల దేశానికి చెందిన పండితుడు శంకర శాస్త్రిని ఓడించాలని బయలుదేరాడు. ఇంకాస్త దూరంలో కోశల దేశం చేరుకుంటాడనగా ఒక పశువుల కాపరి ఆయనకు ఎదురుపడ్డాడు.

సూర్య నారాయణ శాస్త్రిని ఎగాదిగా చూసిన పశువుల కాపరి, ఊరికి ఇతడెవడో కొత్తవానిలా ఉన్నాడనుకున్నాడు. వెంటనే "స్వామీ ! నమస్కారం. మీరెవరో కొత్త వారిలా ఉన్నారు. ఎందాక మీ ప్రయాణం ?" అంటూ వినయంగా ప్రశ్నించాడు.

సకల శాస్త్రాలూ ఔపోశన పట్టిన ఉద్ధండ పండితుడిని. నా పేరు సూర్య నారాయణ శాస్త్రి. మీ కోశల దేశంలో ఉండే శంకర శాస్త్రిని ఓడించేందుకు విదర్భ దేశం నుండి వస్తున్నానని జవాబిచ్చాడు శాస్త్రి.

"అలాగా ! మంచిది స్వామీ. నేనొక చిన్న ప్రశ్న వేస్తాను. జవాబు చెప్పగలరా ?" మళ్లీ అడిగాడు పశువుల కాపరి.

"ముందే చెప్పాను కదా ! ఎంతటి గొప్ప ప్రశ్నకైనా క్షణకాలంలో జవాబు చెప్పగల పండితుడినని. అడుగు చెప్పేస్తా " అన్నాడు శాస్త్రి.

అలాగే స్వామీ అన్న పశువుల కాపరి, శాస్త్రి చూస్తుండగానే, నేల మీదికి వంగి, తన కుడి చేతి నిండా ఇసుక తీసుకున్నాడు. వెంటనే "స్వామీ ! ఈ ఇసుక రేణువుల పరిమాణం ఎంత ?" అని అడిగాడు.

"ఇసుక రేణువులను ఎన్ని రేణువులని తను లెక్కించగలడు ? అది తనకు సాధ్యమయ్యే పనేనా ?" అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శాస్త్రి.

కాసేపటి తరువాత పశువుల కాపరి,"స్వామీ ! నా ప్రశ్నకు సమాధానం చెప్పారు కాదు " అంటూ మళ్లీ ప్రశ్నించాడు.

"నువ్వే చెప్పవయ్యా " అన్నాడు శాస్త్రి.

"ఒక పిడికిట్లో ఉన్న ఇసుకను పిడికెడు ఇసుక అంటారని చెప్పలేని మీరు ఏం పండితుడివయ్యా " అంటూ ఎగతాళిగా నవ్విన పశువుల కాపరి,పిడికిట్లో ఉన్న ఇసుకను నేల మీద పడేసి తన దారిన తను వెళ్లిపోయాడు.

"ఒక పశువుల కాపరి అడిగిన అతి చిన్న ప్రశ్నకే సమాధానం చెప్పలేని నేను,శంకర శాస్త్రిని ఎలా ఓడించగలను ?" అని తనను తానే ప్రశ్నించుకున్న సూర్య నారాయణ శాస్త్రి.  పశువుల కాపరికి మనసులో కృతజ్ఞతలు తెలియజేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం