తాజా కథలు @ CCK

చీమ మంచితనం

2015-06-15 21:05:01 చిన్నారుల కథలు
అనగనగా ఒక నది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు. చెట్టుపైన పిట్టగూడు. ఆ గూటిలో పావురాల జంట. ఆ పావురాలు రెండూ కలసికట్టుగా ఆహారం కోసం వెళ్లేవి. తిరిగి చీకటిపడే వేళకు గూటికి చేరి ఊసులాడుకుంటూ ఒకదానికొకటి ఆహారం తినిపించుకునేవి. ఆ చెట్టుకింది పుట్టలో ఒక గండు చీమ. పాపం! అది ఒంటరిది. దానికి నా అనేవాళ్లెవరూ లేరు. రోజూ పావురాల జంట ఆనందంతో కువకువలాడటం చూసేది. వాటితో స్నేహం చేయాలనుకుంది. ఓ రోజున పావురాలను "మిత్రులారా! కష్టసుఖాలు చెప్పుకోడానికి నాకెవరూ లేరు. నేను మీతో స్నేహం చేయవచ్చా?" అని అడిగింది.

చీమ మాటలకు పావురాలు ఫక్కున నవ్వాయి. "నేల మీద నడిచే నువ్వెక్కడ? ఆకాశంలో ఎగిరే మేమెక్కడ? మేము తెల్లగా, అందంగా ఉంటాము. నువ్వేమో, నల్లగా, అసహ్యంగా ఉంటావు. నీకూ మాకూ పొంతన లేదు. నీతో మేము స్నేహం చేయము" అని చెప్పాయి. చీమ బాధపడి ఊరుకుంది.

ఓ రోజు ఒక తుంటరి పిల్లాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి, ఉండేలు తీసి, పావురాలకి గురిపెట్టి, కొట్టబోయాడు. చీమ అది గమనించి మెల్లగా వెళ్లి, వాడి పాదాన్ని గట్టిగా కుట్టింది. పాదం మీద చురుక్కుమనేసరికి పిల్లాడి ఏకాగ్రత దెబ్బతిని, ఉండేలులోని రాయి గురితప్పింది, ఆ అలికిడికి పావురాలు రివ్వున ఎగిరిపోయాయి.

ఆ పిల్లాడు వెళ్లిన కాసేపటికి పావురాలు ఆ చెట్టుమీదకి వచ్చి "చీమా! నువ్వెంత మంచిదానివి? మేము నిన్ను చులకనగా మాట్లాడినా, మనస్సులో పెట్టుకోకుండా మమ్మల్ని కాపాడవు. ఇక నుంచి మనం మంచి స్నేహితులుగా ఉందాం" అన్నాయి. పావురాళ్లతో చెలిమి కుదిరినందుకు చీమ చాలా సంతోషించింది.

నీతి: రూపాన్ని చూసి కాదు, వారి మనసును, మంచితనాన్ని బట్టి ఎదుటివాళ్లను అంచనా వేయాలి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం