తాజా కథలు @ CCK

శ్రీకృష్ణదేవరాయలు

2015-04-11 11:05:01 చిన్నారుల కథలు
ఐదువందల ఏళ్ల క్రితం  దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు . ఈ చక్రవర్తి యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో కూడా అంత నేర్పరి. ఈ చక్రవర్తికి   " సాహితీ సమరాంగణ చక్రవర్తి " అనే బిరుదు ఉండేది. " ఆముక్తమాల్యద ",  శ్రీకృష్ణదేవరాయలు రచించిన గొప్ప కావ్యం.

శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఎనిమిది   గొప్ప కవులుండేవారు. వారిని " అష్టదిగ్గజాలు " అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, పింగళిసూరన, మాదయగారి మల్లన, తెనాలిరామకృష్ణుడు రాయల ఆస్థాన కవిదిగ్గజాలు.

ఆయన సభకు " భువన విజయం " అని పేరు ఉంది .

ఓ సారి రాయల వద్దకు ఒక మహాపండితుడు వచ్చాడు. అతడు వివిధ భాషల్లో ధారాళంగా మాట్లాడుతున్నాడు . ఇంతకీ సమస్య ఏoటంటే రాయలవారి సభలోని   పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన అష్టదిగ్గజాలు ఈ సమస్య విడగొట్టమని కోరాడు. మొదట " ఆంధ్రకవితాపితామహుడు ", అని పేరు పొందిన పెద్దన కవి లేచి, తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి, వాదించి కూడా, అతని భాషని కనిపెట్టలేకపోయాడు.

తరువాత, ఆరుగురూ అంతే ! చివరికి, తెనాలిరామకృష్ణుని వంతు వచ్చింది.

తెనాలిరామకృష్ణుడు ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు.   అతనికి ఎదురుగా నిలబడి ఏo అడగలేకపోయాడు. ఓటమి తప్పదని రాయలవారు భావించాడు. ఆ మహాపండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో, అకస్మాత్తుగా తెనాలిరామకృష్ణుడు   ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు " అమ్మా " అన్నాడు. అంతే !  మీ మాతృభాష " తెలుగు ", పండితోత్తమా !  అని తేల్చశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు ఒప్పుకోకతప్పలేదు.

రాయలవారి ఆనందానికి అంతులేదు. శభాష్ ! " వికటకవీ ", అని తెనాలిరామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా " సువర్ణహారం " ఇచ్చాడు. మాతృభాష గొప్పతనం అదే !

ఆనందంలో కాని , విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్నతల్లిలా, మాతృభూమిలా, మాతృభాష మధురమైనది, మరపురానిది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం