తాజా కథలు @ CCK

కీర్తి ప్రతిష్ఠలు

2015-05-04 07:05:01 చిన్నారుల కథలు
పూర్వము రంగాపురం అనే గ్రామములో ధర్మయ్య అనే ఆసామి కలడు. ఆయన భార్య సుమలత. వారిద్దరూ ధర్మబుద్ధిగలవారు. పాపభీతి, దైవభక్తిగలవారు. వారు వ్యాపారము లో బాగా సంపాయించటమేగాక దాన ధర్మాలు చేయటంలో కూడా కీర్తి ప్రతిష్ఠలు గడించారు. పేదలకు భోజనము పెట్టందే తినేవారుకాదు. ధర్మయ్య, సుమలత దంపతులకు ముగ్గురు కుమారులు కలిగి యుక్తవయసుకి వచ్చారు. విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పెద్దవాడికి వివాహము చేశారు. పెద్ద కోడలు రాగానే దానధర్మాలు తగ్గించకపోతే మాకు ఏమి మిగులుతుందని రోజుకు ముగ్గురికంటే ఎక్కువమందికి పెట్టటానికి వీల్లేదంది. సరేనన్నారు ధర్మయ్య, సుమలత.

రెండో కోడలు రాగానే ఇద్దరికంటే ఎక్కువమందికి పెట్టటానికి వీల్లేదంది. మూడో కోడలు రాగానే దానధర్మాలు పూర్తిగా మానాలని చెప్పింది. ఈ విధంగా జరిగినందు వలన ధర్మయ్య సుమలత దంపతులకు విచారము కలిగింది. వారి కీర్తి ప్రతిష్ఠలకి భంగము కలిగినందువల్ల అక్కడ వుండలేక తీర్ధయాత్రలకని చెప్పి కొంతపైకము తీసుకుని వెళ్ళారు.

తీర్ధయాత్రలు చేస్తూ వెళుతున్నవారికి గోదావరి నదీ తీర ప్రదేశములో పాడుబడిన ఆలయము కనిపించింది. అక్కడే ఆశ్రమం నిర్మించుకుని తనకు తెలిసిన ఆకు పసర్లతో పేద ప్రజలకు వైద్యం చేయసాగారు. ఆయన హస్తివాసివల్ల దూర ప్రాంతమునుండి రావడం ప్రారంభించారు. ఆయన ఎవర్నిఏమీ అడగనప్పటికీ డబ్బు విపరీతముగా వచ్చింది. ఆ ధనముతో కూలీలను పెట్టి ఆలయము నిర్మించాలనే ఆలోచన కలిగింది. వచ్చిన వారందరకీ సుమలత భోజనము పెట్టి పంపేది. వారికి ఏలోటు లేకుండా జరిగిపోతోంది.

కొంత కాలము గడిచేసరికి ధర్మయ్య కొడుకులు ఆస్తి పోగొట్టుకుని వీధుల పాలయ్యారు. దేశాటనకి బయలుదేరగా గోదావరి నదీతీర ప్రాంతములో ఆలయము నిర్మిస్తున్నారని విని అక్కడికి వెళ్ళారు. దూరము నుంచే సుమలత కొడుకుల్ని, కోడళ్ళల్ని గుర్తించింది. వారిని రమ్మని పిలిచింది. పెద్దకోడలిని పిలిచి రోజుకు ముగ్గురికంటే పెట్టరమ్మా, అని రెండవకోడలితో ఇద్దరికంటే పెట్టరమ్మానీ, మూడో కోడలితో ఎవరికీ పెట్టరమ్మా అనగానే ముగ్గురు కోడళ్ళు నిశ్చేష్టులయ్యారు. అత్తగారుగా గుర్తించి క్షమించమని ప్రార్ధించారు.

సుమలత వారినందరినీ దగ్గరకు తీసుకుని వారికి పట్టిన దుర్ధశకి విచారించింది. ధర్మయ్య తన కొడుకుల్ని దగ్గరకు పిలిచి, తన దగ్గరే వుంచుకున్నాడు. వారు కూడా కష్టపడి పని చేస్తూ, దాన ధర్మములు చేస్తూ సంతోషముగా జీవించారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం