తాజా కథలు @ CCK

మంచి పనితనం

2015-06-03 11:05:01 చిన్నారుల కథలు
కామయ్య, కనకయ్య ఒకే గ్రామం వాళ్ళు. కామయ్య కమ్మరం పనివాడు. కనకయ్య వడ్రంగి. ఇద్దరికిద్దరూ తమ తమ వృత్తుల్లో మంచి పనితనం గలవాళ్ళు. ఒకసారి ఆ గ్రామానికి పట్నంలో కంచు, రాగి పాత్రల వ్యాపారం చేసే వర్తకుడొకాయన వచ్చాడు. అతడికి కామయ్య చేసే కంచు, రాగి పాత్రల పనితనం బాగా నచ్చింది. మంచి జీతం ఇస్తానని చెప్పి కామయ్యను పట్నం రమ్మన్నాడు. కామయ్యకు వెళ్ళాలనుంది  కాని, భార్య అందుకు అభ్యంతరం చెప్పింది.

ఐతే! ఆ సమయంలో చెల్లెలిని చూడవచ్చిన కామయ్య బావమరిది కలగజేసుకుని కామయ్యతో ‘‘తప్పక వెళ్ళు మంచి జీతమే వుంటుంది. నాలుగైదు నెలల పాటు చూసి పనితీరూ, సంపాదనా తృప్తికరంగా లేకపోతే తిరిగి రావచ్చు'' అని చెప్పాడు. ఇది కామయ్యకూ, అతడి భార్యక్కూడా బావున్నట్టు తోచడంతో కామయ్య వర్తకుడి వెంట బయల్దేరి పట్టణానికి వెళ్ళాడు.

ఈ జరిగిందంతా పక్క వీధిలో వున్న వడ్రంగి కనకయ్య భార్య కామాక్షికి తెలిసింది. ఆమెకు తన భర్త కనకయ్యని మించిన వడ్రంగి చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కడా లేడని గట్టి నమ్మకం. ఆ కారణంగా, గ్రామం వదిలి పట్టణం పోదామనీ, అక్కడ బాగా సంపాయించి ఒక చిన్న డాబా ఇల్లు కట్టుకుని సుఖంగా కాలం గడుపుదామనీ భర్తతో పోరుతూండేది. ఇప్పుడు కామయ్య పట్నం వెళ్ళడంతో కనకయ్యకు భార్య పోరు మరీ ఎక్కువైంది.

‘‘భార్యా, పిల్లాజెల్లా వున్న కామయ్య వాళ్ళందరినీ ఇక్కడ వదిలి డబ్బు సంపాదనకు పట్నం వెళ్ళాడు. మనకా నువ్వూ నేనూ తప్ప మరెవరూ లేరు. పెళ్ళి నాటి నుంచీ చూస్తున్నాగా నీకు తెలివితేటలైతే వున్నవి గాని పిరికి '' అంటూ  కనకయ్యను బాధ పెట్టసాగింది. ఈ బాధ భరించలేక కనకయ్య బయల్దేరి పట్నం చేరాడు. అక్కడ కామయ్యను కలుసుకుని సంగతి చెప్పి తనకెక్కడైనా పని దొరికే మార్గం చూడమన్నాడు.

కాని  కామయ్య ఎందర్ని విచారించినా పట్నంలో ఇప్పుడున్న వడ్రంగులకే పనులు అంతంత మాత్రంగా  వున్నవనీ కొత్త వాళ్ళకు నాలుగు కాలాల పాటు నిలిచే పని దొరకదనీ తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో కనకయ్య   నాలుగు నెలల పాటు పట్నంలో చాలీ చాలని సంపాదనతో నానా అవస్థలూ పడి  ఇక ఇల్లు చేరడం  మేలనుకున్నాడు. ఐతే  చేతిలో చిల్లిగవ్వ లేకుండా తిరిగొచ్చిన తనను భార్య మరింత చులకనగా చూస్తుంది.

అందుకని  అతడు బాగా ఆలోచించి  ముక్కు నుంచి తల మీదికి చుట్టుకున్న తలగుడ్డతో చీకటి పడుతున్న వేళ ఇల్లు చేరి తలుపు తట్టాడు. భార్య కామాక్షి తలుపు తెరుస్తూనే అతణ్ణి చూసి ఆదుర్దాగా  ‘‘ఇదేమిటి ? ముక్కూ, చెవులూ కనబడకుండా తలగుడ్డ బిగించావు?'' అని అగింది. దానికి కనకయ్య నిబ్బరంగా ‘‘పట్నంలో సంపాయించిన డబ్బు సంచీతో వస్తూండగా  చీకటి పడే వేళ గ్రామ పొలిమేరల్లో ముగ్గురు దొంగలు నన్ను అటకాయించారు.

కష్టపడి సంపాయించిన డబ్బు కదా  నేను సాహసించి తిరగబడ్డాను. అప్పుడు దొంగల్లో ఒకడు కత్తి చూపుతూ ‘‘నీకు ప్రాణమే కావాలో, డబ్బే కావాలో వెంటనే తేల్చుకో . నోరు మెదపకుండా డబ్బు సంచీ ఇచ్చావో ప్రాణాలతో వదులుతాం. అలాకాక తిరగబడి గొడవ చేశావో ముక్కూ చెవులూ కోసేస్తాం'' అన్నాడు.

‘‘అయ్యో ఇంత అన్యాయమా!

ఆ పాడు డబ్బు, ఆ దొంగల ముఖాన కొడితే సరి పోయేది గదా ముక్కూ చెవులూ లేకుండా నలుగురి మధ్యా ఎంత అవమానం  సిగ్గు చేటు   అంటూ కామాక్షి  భర్త ముఖం మీద వున్న గుడ్డను తీయబోయేంతలో కనకయ్య దాన్ని తనే లాగి నువ్విప్పుడన్న పనే చేశాను.

పట్నంలో సంపాయించినదంతా ఆ దుష్టుల పాలయింది. భయం వదలక  ముక్కూ చెవుల్ని అలా కప్పి ఇల్లు చేరాను'' అన్నాడు గొంతు కాస్త వణికిస్తూ. ‘‘వాళ్ళు దోచుకున్నది డబ్బునే కదా, వడ్రంగి పనితనాన్ని కాదుగదా? బాధపడకు'' అంటూ కామాక్షి భర్తను ఊరడించింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం