తాజా కథలు @ CCK

మహానగర పాలకుడు

2015-05-25 03:05:02 చిన్నారుల కథలు
ఒకానొకప్పుడు విశాల దేశంలో  రాజధానికి ఇరవై ఆమడల దూరంలో వున్న మహానగరం ఆదర్శపురంగా విలసిల్లుతూండేది. దేశమంతటా కరువొచ్చినా  మహానగరం మాత్రం సుభిక్షంగా వుండేది. అక్కడి భూములు సారవంతమైనవని కొందరంటారు. అక్కడి పౌరులు ఉత్తములని కొందరంటారు.

అయితే  నగర సౌభాగ్యానికి కారణం మహానగరానికి పాలకుడైన హేమశంకరుడని అందరూ అంటారు. హేమశంకరుడు సకల శాస్ర్తాలూ చదివాడు. ఏ ఆర్భాటాలూ లేకుండా జీవించడం అతడికి ఇష్టం. తనకోసమని వున్న రాజభవనంలో కాక నగర పౌరుల మధ్య ఒక చిన్న ఇంట్లో తన కుటుంబంతో వుండేవాడు. రాజభవనంలో నగర పాలనకు సంబంధించిన వ్యవహారాలు చూడడానికి పగలు మాత్రమే గడిపేవాడు. సామాన్యులతో సామాన్యుడిలా కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకుని తగిన విధంగా పరిష్కరించేవాడు.

నగరంలో అందరూ హేమశంకరుడంటే ఇష్టపడేవారు  ఒక్క రాజబంధు తప్ప. రాజబంధు పేరుకు తగ్గట్లే రాజు గారికి దూరపు బంధువు. అతడు మహానగరంలోనే పుట్టి పెరిగాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తితోనే కూర్చుని తిన్నా తర తరాలు గడిచి పోతుంది. ఎంత ఆస్తి వున్నా వైభవం పెరుగుతుందే తప్ప  పేరు ప్రతిష్ఠలలో వెనుకబడే వున్నానని అతడు తరచుగా బాధపడుతూండేవాడు.

రాజబంధు భార్య రాణిబంధు. ఆమె రాణి గారికి దూరపు బంధువు. ఒక రోజున ఆ భార్యా భర్తలిద్దరూ కలిసి పేరుప్రతిష్ఠల గురించి మాట్లాడుకున్నారు. పేరు ప్రతిష్ఠల కోసం ఏం చేయాలా అని చాలా సేపు ఆలోచించారు. ‘‘ దానధర్మాలకు పేరుపొందిన శిబి, యయాతి, బలి లాంటి వాళ్ళందరూ కూడా చక్రవర్తులే. దాన గుణంలో తనకు తనే సాటి అని పేరు పొందిన కర్ణుడు కూడా అంగ రాజు అయినాకే చెప్పుకోతగ్గ గుర్తింపు పొందాడు.

అంటే  పేరుప్రతిష్ఠలకు పదవి అవసరం ఎంతైనా వుంది ’’ అన్నాడు రాజబంధు  భార్యతో.రాణిబంధు కొద్దిసేపు ఆలోచించి ‘‘పదవి లేనప్పుడు రాని పేరు పదవి రాగానే ఎందుకు వస్తుంది? పదవి లేకుండా పేరు సంపాదించిన వారు మాత్రం లేరా?’’ అన్నది.

అందుకు రాజబంధు నవ్వి ‘‘స్వయం ప్రతిభ వున్న మహానుభావులకు, ఏ పదవీ లేకున్నా పేరు వస్తుంది. మనకు స్వయం ప్రతిభ వుంది కానీ, మనం మహానుభావులం కాదు. మన వంటి వారికి పేరు రావాలంటే పదవి వుండాలి. కాబట్టి మనమిద్దరం వెళ్ళి రాజునూ, రాణినీ కలుసుకుని మహానగర పాలకుడిగా నన్ను నియమించమని కోరాలి. వాళ్ళు మన కోరికను కాదనరనే నా నమ్మకం’’ అన్నాడు.

రాణిబంధు సరేనన్నది. అప్పుడా దంపతులిద్దరూ రాజధానికి వెళ్ళి రాజునూ, రాణినీ కలుసుకుని తమ కోరిక గురించి చెప్పారు. ఇది విన్న రాజు ఆలోచనలో పడి ‘‘నిన్ను మహానగరానికి పాలకుడిగా చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అయితే, మహానగరం ఆదర్శపురంగా వర్థిల్లుతున్నది. అందుక్కారణం ఇప్పటి నగర పాలకుడు హేమశంకరుడని అంతా అంటున్నారు. అతణ్ణి పదివి లోంచి తప్పించడం న్యాయం కాదు కదా!’’ అన్నాడు రాజబంధుతో.

దానికి రాజబంధు ‘‘ప్రభూ! మహానగరం సుభిక్షంగా వుండడానికి కారణం, ఆ నగర పౌరుల సమిష్టి కృషి. అది తెలియక అంతా హేమశంకరుణ్ణి పొగుడుతున్నారు. ఆ పొగడ్తలు ఏదశకు చేరుకున్నాయంటే  హేమశంకరుడే విశాల దేశపు రాజైతే బాగుండునని, ఇప్పటికే కొందరంటున్నారు. అతడి పేరుప్రతిష్ఠలను అదుపు చెయ్యకపోతే   మీ సింహాసనానికే ముప్పు రాగలదు’’ అంటూ రాజును హెచ్చరించాడు.

రాజుకు హేమశంకరుడి వల్ల తన సింహాసనానికి ముప్పు  రాగలదన్న అనుమానం అంతవరకూ లేదు. రాజబంధు మాటలాయనను కలవరపర్చాయి. రాణి కూడా రాజబంధు మాటల ప్రభావంలో వుండడం వల్ల ‘‘హేమశంకరుణ్ణి పదవి నుంచి తప్పించడం అన్ని విధాలా శ్రేయస్కరం’’ అన్నది. ఆలోచించగా, ఆలోచించగా రాజుకూ, రాణికీ ఒక ఉపాయం తట్టింది. వారు వెంటనే ఒక దూతను మహానగరానికి పంపారు.

ఆ దూత   హేమశంకరుడితో  ‘‘మీ పాలనలో మహానగరం ఎంతో పురోభివృద్ధిని సాధించింది. దేశం కూడా అలాంటి పురోభివృద్ధి సాధించడానికి   మన రాజు గారు మీ సాయం కోరుతున్నారు. మీరు రాజు గారికి సలహాదారుగా వుండాలి. మీ స్థానంలో ఇక్కడ రాజబంధు నగరపాలకుడుగా వుంటాడు’’ అని చెప్పాడు.

ఈ విధంగా రాజబంధు మహానగరానికి పాలకుడయ్యాడు. అతడు తన చుట్టూ తిరుగుతూ పొగడ్తలతో ముంచెత్తే వాళ్ళను చేరదీస్తూ  తన గురించి గొప్పగా ప్రచారం చేయించసాగాడు. దానివల్ల రాజబంధుకు గతంలో ఎరుగని పేరుప్రతిష్ఠలు వచ్చాయి. ఇక  హేమశంకరుడు రాజధాని చేరాడు. అనేక విషయాల్లో రాజు  ఆయన సలహాలు తీసుకుని అమలు చేశాడు. ఆ కారణంగా విశాల దేశం మరింత సుభిక్షమూ, సుసంపన్నమూ అయింది.

అలా రెండు సంవత్సరాలు గడిచాక  ఒక చిత్రం జరిగింది. అంత వరకూ ఎంతో సుభిక్షంగా వున్న మహానగరంలో కరువొచ్చింది. తిండి సంగతి సరే, త్రాగడానికి నీళ్ళు కూడా లేక జనం ఇబ్బంది పడుతూంటే, విషయమేమిటో ఆరా తీయడానికి రాజు, హేమశంకరుణ్ణి అక్కడికి పంపాడు.

అప్పుడు మంత్రులు, రాజుతో  ‘‘ఇప్పుడు దేశమంతా సుభిక్షంగా వున్నప్పటికీ, మహానగరంలో కరువొచ్చింది. హేమశంకరుడు మహానగరాన్ని పాలించే కాలంలో అక్కడ బాగుంది. అతడిక్కడ మనకు సలహాలిస్తే దేశమే బాగుంది. అతడు లేకపోవడం వల్ల మహానగరం పాడైంది. మహానగరానికి అపకారం జరక్కుండా, దేశానికి ఉపకారం జరిగే ఏర్పాటేదో తమరు చేయాలి’’ అని చెప్పారు.

రాజు తల అడ్డంగా వూపి ‘‘మీ ఆలోచనల్లో ఎక్కడో లోపముంది. హేమశంకరుడి వల్ల దేశానికి మేలు జరిగితే మహానగరం కూడా దేశంలో భాగమే కదా! మరి మహానగరానికెందుకు మేలు జరగలేదు?’’ అని ప్రశ్నించాడు. దీనికి మంత్రులు వెంటనే  ‘‘ఈ ప్రశ్నకు సమాధానం మహానగర పాలకుడు రాజబంధు చెప్పాలి. అతడు తమరి ఆదేశాలను సక్రమంగా పాలించాడో లేదో తెలుసుకోవాలి’’ అన్నారు. రాజుకు మంత్రుల సూచనలో నిజమున్నదనిపించింది. ఆయన వెంటనే మహాగరానికి ప్రయాణం కట్టాడు.

అక్కడికి చేరుకున్నాక ఆయనకు ఎంతో బాధనిపించింది. ఒకప్పుడు భూతల స్వర్గమని అనిపించేలా వుండే ఆ నగరం, ఇప్పుడు పాడుపడింది. పేదలకు ఉపాధి లేదు. కలిగిన వారికి దొంగల భయం. అందరికీ విషరోగాల భయం. అయితే రాజు నగరం ప్రవేశించగానే ఆయననూ, రాజబంధునూ పొగుడుతూ హర్షధ్వానాలు వినిపించాయి.

రాజభవనం చేరుకున్నాక రాజును, రాజబంధు, హేమశంకరుడు కలుసుకున్నారు. హేమశంకరుడు, రాజుతో  ‘‘ప్రభూ! కొద్ది కాలంగా పాలనా యంత్రాంగంలో అవినీతి పరులు చేరారు. అందువల్లనే మహానగరానికి ఇలాంటి దుస్థితి పట్టింది. నాకు రెండు మాసాల పాటు తిరిగి నగరాన్ని అప్పగిస్తే, ఈ నగరానికి ఎప్పటి శోభ రాగలదు’’ అన్నాడు.
రాజబంధు తన మాటగా ‘‘ప్రభూ! రోజులన్నీ ఒకేలా వుండవు. నగర దుస్థితికి అవినీతిపరులు కారణం కాదు. దురదృష్టం, విధిలీల. నాకు రెండే రెండు మాసాలు గడువివ్వండి, నగరానికి పూర్వశోభ తేగలను’’ అన్నాడు.

రాజు, రాజబంధు వంక అదోలా చూసి  హేమశంకరుడితో  ‘‘నేను రాజబంధు మాట నమ్మాలా, నీ మాటలు నమ్మాలా?’’ అన్నాడు. దానికి హేమశంకరుడు వినయంగా  ‘‘ప్రభూ! రాజుబంధు అసత్యం చెప్పడం లేదు. కానీ నేను అప్పట్లో ప్రజల మధ్య నివసించే వాణ్ణి. ఈయన రాజభవనంలో వుంటున్నాడు. ప్రజలు నాతో చెప్పుకున్నట్లు అన్ని విషయాలూ, ఈయనకు చెప్పరు. అందువల్ల చాలా విషయాలు రాజబంధుకు తెలిసే అవకాశం లేదు’’ అన్నాడు.

రాజబంధు దీనికి ఒప్పుకోక ‘‘ప్రభూ! నాకూ, ప్రజలకూ మధ్య దూరం లేదని ఋజువు చేయడానికి ఒక్కటే మార్గం. మనం నగరంలోని అన్ని తరహా మనుషులనూ చూసివద్దాం’’ అన్నాడు. రాజు కొంచెం సేపు ఆలోచించి ‘‘అలాగే! మారువేషంలో ముందు నీతో వస్తాను. ఆ తర్వాత హేమశంకరుడితో వెళతాను’’ అన్నాడు.

ఆ ప్రకారం మారువేషంలో రాజూ, రాజబంధూ నగరంలోకి బయల్దేరారు. వాళ్ళు ముందుగా ఒక ధనికుడి ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంట్లో దొంగతనం జరిగి లక్ష వరహాలు పోయాయి. ఆయన కొడుకును దుండగులు ఉత్తపుణ్యాన ఎడాపెడా కొడితే మంచం పట్టాడు. ఇది చెపుతూ ధనికుడూ, ఆయన ముగ్గురు సోదరులూ రాజబంధు చేతులు పట్టుకుని భోరుమన్నారు.

రాజబంధు ఆ ఇంట్లో ఆడవారిని కూడా పలకరించి తనూ భోరున ఏడ్చాడు. ఆ ఇంటి నుంచి బయటికి రాగానే రాజబంధు  రాజుతో ‘‘చూశారా  ప్రభూ! నేనంటే ప్రజలకు ఎంతటి ఆదరణా, గౌరవమో. నేను వాళ్ళతో మాట్లాడుతూ దుఃఖం ఆపుకోలేక పోయాను. ఆలోచించండి   ప్రజలకు నేనెంత దగ్గరివాణ్ణో ’’ అన్నాడు ఉత్సాహంగా.

ఆ తర్వాత వాళ్ళు, మరిద్దరు ధనికులనూ, నలుగురు మధ్య తరగతి కుటుంబీకులనూ, అయిదుగురు పేదలనూ కలిసి మాట్లాడారు. అన్నిచోట్లా అలాగే జరిగింది.
సాయంత్రం రాజు తిరిగి మారువేషంలో హేమశంకరుడితో కలిసి నగరంలోని మరొక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడా అన్ని వర్గాల ప్రజల స్థితీ దయనీయంగానే వున్నది. హేమశంకరుడు మాత్రం వాళ్ళను ఆప్యాయంగా పలకరించి, వాళ్ళ బాధల గురించి శ్రద్ధగా విని, మరింత వివరణ కోసం ఏవేవో ప్రశ్నలు అడిగాడు.

రాజభవనానికి తిరిగి వచ్చాక రాజు  హేమశంకరుడితో ‘‘నగర వాసుల పరిస్థితి చాలా దారుణంగా వున్నది. వారిని చూడగానే రాజబంధు నిలువునా భోరుమంటూ ఏడ్చాడు. కానీ నీకు ఏమాత్రం దుఃఖం కలిగినట్టు లేదు’’ అన్నాడు.

దీనికి హేమశంకరుడాశ్చర్య పడి  ‘‘ప్రభూ! నాకూ దుఃఖం కలిగింది, కానీ అతి కష్టం మీద ఆపుకున్నాను. మనం పాలకులం! ఏ సందర్భంలో అయినా సరే   ప్రజల ఎదుట అర్భకుల్లాగా కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం, మనస్థాయిని కించపరుచుకోవడమే అవుతుంది గదా! నేను ప్రజలను ప్రశ్నించి గ్రహించినదేమంటే, పాలనా యంత్రాంగం అవినీతి పాలయిందని. ఆ విషయం మీరూ విన్నారు కదా. దీనికి మనం పరిష్కార మార్గం ఆలోచించాలి’’ అన్నాడు.

హేమశంకరుడి జవాబు విన్న రాజు ఎక్కువ ఆలోచించలేదు. ఆయన వెంటనే హేమశంకరుణ్ణి మహానగర పాలకుడుగా నియమించి, రాజబంధును తనకు సలహాదారుగా వెంటబెట్టుకుని రాజధానికి తిరిగివెళ్ళాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం