తాజా కథలు @ CCK

మరువరాని గుణపాఠం

2015-06-08 23:05:01 చిన్నారుల కథలు
మత సంబంధమైన విషయాలను కూలంకషంగా అభ్యసించిన ఒకానొక పండితుడు తన మత ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించడంలో అమితోత్సాహం కనబరచేవాడు. దేశదేశాలు పర్యటించి ప్రార్థనలు ఎలా చేయాలో ప్రజలకు బోధించడంలోఅమితానందం చెందేవాడు. మతబోధకుడి బోధనావిధానం, ఆ దేశాన్నేలే రాజుకు ఎంతగానో నచ్చింది.

రాజుకూడా బోధకుడి మతానికే చెందినవాడు. ఆయన బోధకుడు దూర దేశాలకు వెళ్ళడానికి వీలుగా ఉండేందుకు ఒక ఓడను ఏర్పాటు చేశాడు. రాజు తన పట్ల చూపుతూన్న అపూర్వ ఆదరాభిమానాలకు బోధకుడు ఎంతో సంతోషించాడు. ఓడలో ఒకసారి ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వస్తూండగా మార్గమధ్యంలో ఒక చిన్న దీవి కనిపించింది. దానిని చూడగానే ఓడను నడిపేవాళ్ళ నాయకుడు, ‘‘మహాత్మా, ఈ దీవిలో ముగ్గురే ముగ్గురు సన్యాసులు ఉన్నారు. ఇంతకు ముందు ఇదే మార్గంలో వస్తూ మంచినీళ్ళ కోసం ఆ దీవిలోకి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు వాళ్ళను చూశాను. అపరిచితులతో మాట్లాడరు. మౌనంగా కూర్చుని ఏవో ప్రార్థనలు చేస్తూ ఉంటారు,’’ అన్నాడు.

‘‘అలాగా! అయితే మనం వెంటనే వెళ్ళి వారికి సాయపడాలి. నన్ను అక్కడికి తీసుకు వెళతావా?’’ అని అడిగాడు బోధకుడు ఉత్సాహంగా. ‘‘మహాభాగ్యంగా భావిస్తున్నాను, మహాత్మా,’’ అంటూ నావికుడు ఓడను దీవికేసి నడిపించాడు. ఓడ దీవిని సమీపించింది. అరకొర బట్టలతో ముగ్గురు సన్యాసులు ఓడకేసి వింతగా చూడడం బోధకుడు గమనించాడు.

వారి తెల్లటి పొడవాటి గడ్డాలు గాలికి కదలాడుతున్నాయి. బోధకుడికి వారి పట్ల కనికరం కలిగింది. ‘దేవుడు వారిపట్ల కరుణ చూపుతున్నాడు. అందుకే వారికి సరైన ప్రార్థనా విధానం బోధించడానికి ఇవాళ ఇక్కడికి రాగలిగాను,’ అనుకుంటూ ముందుకు నడిచాడు. తనకేసి నిర్లిప్తంగా చూస్తూ నిశ్చలంగా నిలబడ్డ ముగ్గురు సన్యాసులను సమీపించి, ‘‘మిత్రులారా, బావున్నారుకదా! దేవుడు మీ పట్ల కరుణ చూపుతున్నాడు,’’ అన్నాడు బోధకుడు చిరనవ్వు నవ్వుతూ. బోధకుడి మాటలు అర్థంకానట్టు ఒకరినొకరు చూసుకున్నారు ముగ్గురూ. బోధకుడు మళ్ళీ ఒకసారి అదేమాట అన్నాడు.

అప్పుడు ఆ ముగ్గురిలో ఒకడు, ‘‘దేవుడు కరుణలేకుండా ఎలావుండగలడో మాకు తెలియడం లేదు,’’ అన్నాడు.
ఆ మాటతో గతుక్కుమన్న బోధకుడు మరుక్షణమే తేరుకున్నాడు. వారికి ఎలాగైనా ప్రార్థనా విధానాన్ని, పవిత్ర ప్రార్థనా వాక్యాలనూ బోధించాలనుకున్నాడు. ‘‘మిత్రులారా! మీరు ప్రార్థన చేస్తారని నాకు అర్థమయింది. ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు?’’ అని అడిగాడు.

మళ్ళీ ఒకరినొకరు వాళ్ళు విచిత్రంగా చూసుకున్నారు. వాళ్ళు ఎలాంటి ప్రత్యేక విధానాన్నీ అనుసరించడం లేదు. బోధకుడు రకరకాలుగా ప్రశ్నించి వాళ్ళనుంచి అసలు విషయం రాబట్టాడు. వాళ్ళు, ‘‘దేవుడా, నువ్వున్నావు, మేమున్నాము,’’ అని మళ్ళీ మళ్ళీ అంటారు.

‘‘అంతేనా!’’ అంటూ బిగ్గరగా నవ్విన బోధకుడు, ‘‘మిత్రులారా, శాంతినీ, శక్తినీ ప్రసాదించే ఉత్తమ ప్రార్థనా విధానాన్ని మీకు నేను బోధిస్తాను,’’ అన్నాడు. సన్యాసులు మరేమీ మాట్లాడలేదు. బోధకుడి నుంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.

బోధకుడు ధ్యానానికి ఎటు తిరిగి ఎలాంటి భంగిమలో కూర్చోవాలి? ప్రార్థనా సమయంలో పవిత్ర గ్రంథాలనుంచి ఏ ఏ శబ్దాలను ఎలా ఎలా చెప్పాలి? మొదలైన విషయాలను గంట సేపు వివరించాడు. ఆ తరవాత ఒక గొప్పపని చేశానన్న తృప్తితో ఓడలోకి వచ్చి ప్రయాణాన్ని కొనసాగించాడు. ‘‘ప్రార్థన సముద్ర ప్రయాణం లాంటిది. సరైన మార్గం తెలియాలి. లేకుంటే పయనం కొనసాగించినా ఎప్పటికీ గమ్యస్థానం చేరుకోలేము!’’ అన్నాడు నావికుడితో. ‘‘అవును, మహాత్మా! తమరే గనక దయచూపకుండా ఉన్నట్టయితే, పాపం ఆ సన్యాసులు, తమ శేషజీవితాలను వృధా ప్రయాసలతో నిష్ప్రయోజనంగా గడిపి ఉండేవారు!’’ అన్నాడు నావికుడు, అలాంటి గొప్ప బోధకుడి సాన్నిహిత్యం లభించినందుకు ఎంతో పొంగిపోతూ.

అంతగొప్ప బోధకుణ్ణి, దీవిలోకి తీసుకువెళ్ళి, మూఢులైన సన్యాసులకు ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగించినందుకు అతనిలో కొంత గర్వంకూడా తలెత్తింది. ఓడ కొంత దూరం ముందుకు వెళ్ళింది. మరికొంత సేపటికి సూర్యాస్తమయమై క్రమంగా చీకటి కమ్ముకోసాగింది. అర్ధ రాత్రి సమయంలో దట్టంగా మబ్బులు కమ్ముకుంటూ నాలుగో జాముకల్లా తుఫాను గాలులు వీచసాగాయి. ఉరుములు మెరుపులతో వర్షం; కొండల్లా అలలు ఎగిసి పడడంతో, ఓడ అటూ ఇటూ ఓలలాడుతూ, ఓడలోని వారిని ‘‘మహాత్మా, మీ దైవ ప్రార్థనలే మనల్ని ఇప్పుడు ఈ ఘోర ప్రమాదం నుంచి రక్షంచాలి,’’ అన్నాడు దీనంగా.భయభ్రాంతుల్ని చేసింది. నావికుడూ, సిబ్బందీ విచార వదనుల…య్యారు. నావికుడు బోధకుడితో, బోధకుడికి దిక్కుతోచలేదు. ఇది తన శక్తికి మించిన పని అని అతడికి మాత్రమే తెలుసు. అయినా నౌకా సిబ్బందిలో ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఏదో ఒకటి చేసితీరాలి. అతడు వానకూ, ఉరుములకూ భయపడకుండా ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తూ ఓడ పైభాగానికి చేరాడు. హఠాత్తుగా తూరుపు దిశలో తుఫాను ఆగినట్టు అతడు గమనించాడు. అటుకేసి పరిశీలనగా చూశాడు. మేఘాలు విడిపోతున్నాయి. నీళ్ళ మీద మూడు చిన్న ఆకారాలు ఓడకేసి వస్తున్నాయి. అవి దగ్గరికి వస్తున్న కొద్దీ పెద్దవిగా కనిపించ సాగాయి. వర్షం పూర్తిగా ఆగిపోయింది. గాలిమెల్లగా వీచసాగింది. ఆ వస్తూన్న ఆకారాలు మనుషులని గ్రహించి బోధకుడు ఆశ్చర్యపోయాడు. అతడు దీవిలో చూసిన ముగ్గురు సన్యాసులు!

అరుణోదయకాంతిలో, అలల మీద ఉరుకులతో పరుగులతో వాళ్ళు రావడం చూసి బోధకుడు దిగ్భ్రాంతి చెందాడు. వారినుంచి వెలువడిన ప్రకాశమే తుఫాను మేఘాలను విడిపోయేలా చేసి, తుఫాను గాడ్పులను శాంతింప చేసింది!
వారు ఓడను సమీపించి బోధకుణ్ణి చూడగానే, ‘‘అయ్యా, తమరు బోధించిన ప్రార్థనా విధానం మరిచిపోయాం. మళ్ళీ ఒకసారి నేర్పుతారా?’’ అని అడిగారు నీళ్ళపై నిలబడి. తాము నీళ్ళపై నిలబడడం ఒక అద్భుతమైన విషయం అన్న సత్యం కూడా వారికి గుర్తు లేదు. బోధకుడు ఓడపై మోకరిల్లి, ‘‘దేవుడి బిడ్డలారా! మీకు బోధించడానికి ప్రయత్నించిన నా దుందుడుకుతనాన్ని క్షమించండి. మరువరాని గుణపాఠం నేర్చుకున్నాను. నన్ను క్షమించండి! నన్ను క్షమించండి!’’ అన్నాడు వణుకుతూన్న కంఠస్వరంతో.

‘‘కృతజ్ఞతలు!’’ అంటూ సన్యాసులు వెనుదిరిగి నీళ్ళమీద వచ్చిన వేగంతోనే వెళ్ళిపోయారు.
బోధకుడు ఓడ పైభాగాన సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. అసలు జరిగిందేమిటో ఎరుగని నావికుడు ఓడ పైభాగానికి వచ్చి, ‘‘మహా అద్భుతం చేసి చూపారు మహాత్మా,’’ అన్నాడు బోధకుడితో ఆనందంగా.

ఆ మాటకు బోధకుడి కళ్ళవెంట మరిన్ని కన్నీళ్ళు పెల్లుబికాయి. తాము చేస్తున్నదేమిటో తెలియకుండానే ఇన్ని అద్భుతాలను చేసిందెవరో అతడికి మాత్రమే తెలుసు. దేవుడిలోనే ఉంటూన్న మహానుభావులని గ్రహించక, వారికే తను మిడిమిడి జ్ఞానంతో దేవుణ్ణి చేరడానికి సరైన మార్గం ఏమిటో చూపడానికి ప్రయత్నించాడు!

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం