తాజా కథలు @ CCK

ఋణదాతలు - ఋణవిముక్తి

2015-06-18 17:05:01 చిన్నారుల కథలు
ఒక గ్రామంలో రామ స్వామి అనే పరమ లోభి  ఉండేవాడు. అతను తన ఇంటి మీద పిచ్చుక వాలినా సహించలేక  పోయేవాడు .బోలెడంత కూడబెట్టి కూడా  దరిద్రుడిలా బతికే వాడు. రామ స్వామి భార్య చచ్చిపోయింది. తెలివి తేటలు లేని కొడుకు  ఉన్నాడు.

రామ స్వామి  వాడికి గంజి నీళ్ళు మాత్రమే పెట్టేవాడు. వాడు తిండికి ముఖం వాచి , కానీ దొరికితే చాలు  మిఠాయి దుకాణానికి పోయి , ఏదో ఒకటి కొనుక్కుతినేవాడు. డబ్బు కూడబెట్టటానికి రామ స్వామి ఒక ఉపాయం ఆలోచించాడు . అతను తన ఇంట్లో ఒక మూలన గొయ్యి తీసి , అందులో ఒక బిందె పాతిపెట్టి , దాని మీద పెట్టిన మూతలో డబ్బులు పట్టేటంత సందు ఉంచి , ఆ సందు తప్ప , పైకి బిందె జాడ ఏమీ కనబడకుండా చేశాడు. అతను తనకు వచ్చే డబ్బులో స్వల్పంగా ఖర్చుకు ఉంచుకుని , మిగిలినది బిందెలోకి జారవిడిచే వాడు.

తండ్రి ఇలా చెయ్యటం కొడుకు ఒకరోజు  చూశాడు గాని , డబ్బులను తండ్రి భూమిలో ఎందుకు వేస్తున్నదీ ఊహించలేక పోయాడు. వాడు తన తండ్రిని , ‘‘ అదేమిటి  నాన్నా ? ఇంకో పూటకు నూకలైనా కొనకుండా చిల్లర డబ్బులు భూమి లోకి అలా జారవిడుస్తున్నావు ?’’ అని అడిగాడు.

రామ స్వామి వాడితో  ‘‘ చూడు  బాబూ! భూమిలో మనకు అప్పు పెట్టిన ఋణదాతలున్నారు. వారికి మనం చాలా ఇయ్యవలసి ఉంది. మనం పేదవాళ్ళం గనక ఒక్కసారిగా అంతా ఇచ్చుకోలేం. అందుకే రోజూ కొంచెం కొంచెంగా వారికి ముట్ట జెప్పుతున్నాను. నేను వేసే ప్రతి చిల్లిగవ్వా వారికి ముట్టుతుంది ’’ అన్నాడు.

ఈ మాట కొడుకు నమ్మేసి  తన తండ్రి లోభిగా బతకటం ఇందుకే కాబోలుననుకున్నాడు. వాడికి ఋణదాతల మీద పట్టరాని కోపం కూడా కలిగింది. వాడు తండ్రితో  ‘‘ వాళ్ళ వల్లనే గదా మనం ఇలా రోజూ కడుపు కట్టుకుంటున్నాం ? వాళ్ళకు ఇవ్వటం మానేసి మనం రెండు పూటలా కావలసినంత కడుపునిండా తింటే సరి’’ అన్నాడు.

కొడుకు ధోరణి చూస్తే వాడు తన ప్రయత్నానికి అడ్డం తగిలేటట్టు కనిపించే సరికి  వాణ్ణి బెదరగొట్టటానికి రామ స్వామి  ‘‘ చూడు  బాబూ! వాళ్ళు సామాన్యులు కారు. ఒక్క రోజు మనం డబ్బులు వెయ్యటం మానితే , పెద్ద పెద్ద కత్తులతో వాళ్ళు మనని నరకటానికి వస్తారు ’’ అన్నాడు.

రామ స్వామి కొడుకు బురల్రో ఈ మాటలు నాటుకున్నాయి. చలి కాలంలో ఒక రాత్రి భోజనాల వేళ ఒక బైరాగి  ‘‘ ధర్మదాతలు , పట్టెడు అన్నం పెట్టించండి ’’ అంటూ తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు. అది చూసి రామ స్వామికి పట్టరాని ఆగ్రహం వచ్చి  ‘‘ ఇది మీ తాత కట్టించిన ధర్మసత్రం కాదు ’’ అని అరిచాడు. బైరాగి బిత్తరపోయి  ‘‘ అయ్యా ! భోజనం సంగతి దేవుడెరుగు. ఈ రాత్రికి నన్నీ వసారాలో పడుకోనివ్వండి ’’ అని ప్రాధేయపడ్డాడు.

రామ స్వామి మరింత మండిపడి  ‘‘ చెప్పుతూంటే మనిషివి కాదూ ? నీకు పరిచర్యలు చెయ్యటానికి నేనేమన్నా బాకీ ఉన్నానా ? వెళ్ళు ’’ అంటూ ఆ బైరాగిని మెడపట్టి బయటికి గెంటాడు. ‘‘ నాకు కాకపోతే మరెవరికో బాకీ ఉండటం మూలాన్నే ఇలా పస్తులుంటూ కూడబెట్టుతున్నావు. నువ్వు సంపాదించినదంతా మరెవడికో దక్కుతుంది. దాన్ని అనుభవించే అర్హత నీకుండదు ’’ అన్నాడు బైరాగి.

‘‘ నీలాంటి  పాపిష్ఠి ముఖాలను ఇంట్లోకి రానిస్తే అదే జరగవచ్చు.ఈ రాత్రి బయట చలిలో అఘోరించావంటే నీకూ తెలుస్తుంది అనుభవం ’’ అన్నాడు  రామ స్వామి కసిగా. ‘‘ సమయం వస్తే నీకూ అదేగతి పట్టుతుంది మిడిసిపడకు ’’ అన్నాడు బైరాగి. లంకంత ఇల్లు ఉండగా నాకెందుకు అలా జరుగుతుందిరా ? వీధులన్నీ ఉన్నవి నీలాంటి వెధవల కోసమేరా!  అంటూ రామ స్వామి దభీమని తలుపు మూశాడు. కొన్నాళ్ళ అనంతరం రామ స్వామికి అనుకోకుండా ప్రయాణం తగిలింది. అతను తన కొడుకుతో  ‘‘ ఒరేయ్ ! ఇల్లు జాగ్రత్త. రోజూ వచ్చిన డబ్బులు భూమిలో వేస్తూ ఉండు. నేను రెండు , మూడు రోజుల్లో తిరిగి వస్తాను ’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

రామ స్వామి కొడుకు , చేతికి అందిన చిల్లరడబ్బులు భూమిలో వెయ్యటం ఇష్టంలేక , దానితో మిఠాయి కొనుక్కు తినసాగాడు. రెండు రోజులు గడిచాయి. మూడో రోజు రాత్రి ఒక చిత్రం జరిగింది. అర్ధరాత్రివేళ ఎవరో తలుపుకొట్టారు. రామ స్వామి కొడుకు నిద్రమొహంతో లేచి వెళ్ళి తలుపుతీశాడు. ముగ్గురు దొంగలు కత్తులూ , కటార్లతో లోపలికి వచ్చారు. కురవ్రాడికి వాళ్ళను చూడగానే తండ్రి ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొచ్చింది.

వాళ్ళు తప్పక ఋణదాతలై ఉంటారనుకున్నాడు వాడు. తాను రెండు రోజులుగా వాళ్ళకు డబ్బువెయ్యలేదు! వాడు వాళ్ళతో  ‘‘ అయ్యా  ఋణదాతలూ! మన్నించండి. డబ్బు చేతికి రానందున రెండు రోజులుగా భూమిలో డబ్బు వెయ్యని మాట నిజమే. మా నాన్న గనక ఇంట్లో ఉంటే మీ డబ్బు ఎంతో కొంత వెయ్యకుండా నిద్ర పోయేవాడు కాడు. ఆయన ఊళ్ళో లేడు. నాకు ఆ పని చెయ్యటం చేతకాలేదు.

రేపు మీ డబ్బు మొత్తం అంతా ఎలాగైనా సరే అందులో వేస్తాను.ఈ సారికి నన్ను వదిలి వెయ్యండి ’’ అన్నాడు. వాడు ఏ మంటున్నదీ వాళ్ళకు అర్థం కాలేదు. కాని డబ్బు ఎక్కడో  తమ కోసం వేస్తున్నట్టు వాళ్ళకు స్పష్టమయింది. వారిలో ఒకడు కురవ్రాడితో  ‘‘ ఏదీ ? మీ నాన్న డబ్బు ఎక్కడ వేస్తున్నాడు ? చాలా కాలంగా మాకు డబ్బు చేరలేదు ?’’ అన్నాడు. రామ స్వామి కొడుకు అక్కడ వున్న మంచం పక్కకు నెట్టి , బిందె పాతిన చోటు దొంగలకు చూపాడు. దొంగలు అక్కడ తవ్వి , బిందెను పైకి తీశారు. దాని నిండా మొయ్యలేనంత చిల్లర ఉన్నది.

దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు రామ స్వామి ఊరు నుంచి తిరిగి వచ్చి  బిందె ఉండ వలిసిన చోట గొయ్యి చూసి , లబోదిబో మన్నాడు. ‘‘ నా బిందె! నా డబ్బు! ’’ అంటూ బావురుమని ఏడుస్తూ , జుట్టు పీక్కున్నాడు.

తండ్రి ప్రవర్తన చూసి కొడుకు  ‘అదేమిటి  నాన్నా ! మన సొమ్మంతా దొంగ లెత్తుకుపోయినట్టు బాధ పడుతున్నావూ ? అని అడిగాడు. అయితే   తీసి దాచావా ? అని రామ స్వామి కొడుకును అడిగాడు ఆశగా.  నువ్వేమీ కంగారు పడకు. అది వాళ్ళ సొమ్మే గనక వాళ్ళను తీసుకు పోనిచ్చాను అన్నాడు కొడుకు.

రామ స్వామికి ఒళ్ళు మండిపోయింది. అతను తన కొడుకు గొంతు పట్టుకుని   ఎవర్రా వాళ్ళు ? నా సొమ్ము వాళ్ళదెలా అవుతుంది ? అని అరిచాడు.  అదే  నాన్నా! ఆనాడు నువ్వు చెప్పావు చూడూ , ఆ ఋణదాతలే వచ్చారు , అంటూ కొడుకు రామ స్వామికి జరిగినదంతా వివరించాడు. ‘‘ ఒరేయ్ !బుద్ధి గడ్డి తిని నీతో అలా చెప్పాను. ఆ వచ్చింది పచ్చి దొంగలురా! ముక్కూ మొహమూ తెలియని వాళ్ళు వచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టితే  బుద్ధి ఉన్నవాడివైతే తలుపులు తీస్తావుట్రా ? అన్నాడు రామ స్వామి.

అవును !  తన వల్ల పొరపాటే జరిగింది. ఇంకెప్పుడూ అలా చెయ్యరాదని నిర్ణయించుకున్నాడు రామ స్వామి కొడుకు.

తనకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్టయితే తన డబ్బు గురించి అందరికి తెలిసిపోతుందని , రామ స్వామి రాత్రివేళ దొంగలను అన్వేషిస్తూ చుట్టుప్రక్కల గ్రామాలు తిరగసాగాడు. అతను ఒకరోజు అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టాడు. ఎంతగా గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేకపోయింది. తన కొడుకు మతిమాలిన వాడయినందుకు విచారిస్తూ ... రామ స్వామి వీధి తలుపుకు చేరగిల బడ్డాడు.

చలికి ఒళ్ళు కొంకర్లు పోయింది. తెల్లవార్లూ చలికి బిగిసి , తెల్లవారగట్ల రామ స్వామి కునుకు తీశాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న బైరాగి రామ స్వామిని తట్టిలేపి  ‘‘ అయ్యా ! లంకంత ఇల్లు ఉండగా , ఈ చలిలో ఇలా వీధిలో పడుకున్నావేం ?’’ అని అడిగాడు. ‘‘ ఏం చెప్పమంటావు ? ఆనాడు నువ్వన్న మాటలు శాపంలా తగిలాయి.ఒకడికి పెట్టకుండా , నేను తినకుండా కూడబెట్టినదంతా దొంగలు దోచుకున్నారు ’’ అన్నాడు రామ స్వామి.

‘‘ అలా అనుకోవద్దు. వాళ్ళు దొంగలు కారు  ఋణదాతలు . ఋణవిముక్తి అయినందుకు సంతోషించండి ’’ అంటూ బైరాగి  వెళ్లి పోయాడు. ఆ నాటి నుంచీ  రామ స్వామి మారిపోయి , తాను తింటూ , ఇతరులకు ఇంత పెట్టుతూ , సుఖంగా చాలా కాలం జీవించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం