తాజా కథలు @ CCK

కోశాధికారి నియామకం

2015-03-07 07:05:01 చిన్నారుల కథలు
ప్రమోద దేశానికి రాజైన చంద్రచూడుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. ఉత్తముడైన ఆ ప్రభువు పాలనలో రాజ్యం సుభిక్షంగా వుండడానికి సమర్థులైన మంత్రులే కాక, నమ్మకస్థుడైన కోశాధికారి కూడా కారణం. ఇటీవలే ఆ కోశాధికారి హఠాన్మరణం చెందడంతో, రాజుకు ఆ పదవికి అర్హుడి నెన్నుకోవడం పెద్ద సమస్యగా మారింది.

చనిపోయిన కోశాధికారికి, విభీషణుడనే కొడుకున్నాడు. నమ్మకంలో, సమర్థతలో అతడు తండ్రిని మించిన తనయుడని, చంద్రచూడుడికి తెలుసు. కానీ అతన్ని నియమించడంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి.

రాజ్యానికి కోశాధికారి పదవి ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఆ పదవి సంపాయించాలని చాలామంది ఆశపడుతూంటారు. అలాంటివారిలో రాణిగారి బంధువు, రాజు చెల్లెలి బంధువు ఉండడం, రాజుకు ఇబ్బందిగా పరిణమించింది. సమస్య పరిష్కారం కోసం రాజు, వృద్ధ మంత్రి బుద్ధివర్మను సలహా అడిగాడు. బుద్ధివర్మ కాసేపాలోచించి, ‘‘ప్రభూ! రాజుకు ప్రజాక్షేమమే ముఖ్యం. కాబట్టి తమరు ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ప్రవర్తించాలి. ఈ విషయమై తమరు, రాణిగారి తమ్ముడు రంగసేనుణ్ణీ, తమ చెల్లెలి భర్త రాజగుప్తుణ్ణీ పిలిచి ముఖాముఖీగా చర్చించడం మంచిది,’’ అన్నాడు.

ఆ ప్రకారం రాజు, రంగసేనుణ్ణీ, రాజగుప్తుణ్ణీ పిలిచి, ‘‘మీరిద్దరూ నాకు కావలసినవాళ్ళు. కోశాధికారి పదవిని కోరుతున్న ఇద్దరూ మీకు కావలసిన వాళ్ళు. మీ ఇద్దరూ మాట్లాడుకుని, ఒక అంగీకారానికి రండి. మీ ఏకాభిప్రాయాన్ని నేను మన్నిస్తాను,’’ అన్నాడు.

రంగసేనుడు, రాజగుప్తుడు ఈ విషయమై చర్చించారు. ఎవరికి వారు తన వాడికే పదవి నివ్వాలని పట్టుబడుతూండడం వల్ల, వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు వారు నిర్ణయాన్ని రాజుకే విడిచి పెట్టారు. అప్పుడు చంద్రచూడుడు, ‘‘మీ ఇద్దరూ ఎవరికివారు, మీ మీ వ్యక్తి కోసం పట్టిన పట్టువిడవలేకపోతున్నారు.

అందుకని మీకొక ఉపాయం చెబుతాను. కోశాధికారి ఎన్నికకు ముగ్గురు రాజ ప్రతినిధులున్న సలహా సంఘాన్ని నియమిస్తాను. అందులో మీరిద్దరూ కాక, దేవనాథుడనే రాజోద్యోగి కూడా వుంటాడు. మీరు నగర న్యాయాధికారిని కలుసుకుని నియమావళి తెలుసుకోండి. ఆ నియమాలు పాటిస్తూ కోశాధికారిని ఎన్నిక చేయండి,’’ అన్నాడు.
రాజు మాటల్లోని అంతరార్థం రంగసేనుడికీ, రాజగుప్తుడికీ అర్థమైంది. తమ ఇద్దరిలో ఎవరు దేవనాథుణ్ణి తమ వైపు తిప్పుకుంటే, వారి మనిషికి కోశాధికారి పదవి దక్కుతుంది. ఈ ఏర్పాటు ఇద్దరికీ ఎంతగానో నచ్చింది. మర్నాడే రంగసేనుడూ,రాజగుప్తుడూ, దేవనాథుడూ న్యాయాధికారిని కలుసుకున్నారు. న్యాయాధికారి, వారికి నియమావళిని వివరిస్తూ, ‘‘మీరు సలహా సంఘంలో రాజప్రతినిధిగా వుండాలంటే, మీ దగ్గర బంధువు లెవరూ కోశాధికారి పదవి కోసం పోటీ పడకూడదు,’’ అని చెప్పాడు.

ఇది వినగానే రంగసేనుడు, రాజగుప్తుడు ఇబ్బంది పడ్డారు. సలహా సంఘంలో రాజప్రతినిధిగా వుండడం కంటే, తమ వారిని కోశాధికారిగా చేయడమే వారికి ముఖ్యం. చివరకు దేవనాథుడి నిర్ణయమే అమలవుతుందని వారికి తెలుసు. అందువల్ల, తాము సలహా సంఘం నుంచి తప్పుకుని, దేవనాథుణ్ణి మంచి మాటలతో జయించాలని ఇద్దరూ లోలోపల నిర్ణయించుకున్నారు. ఆవిధంగా, కోశాధికారిని ఎన్నిక చేసే బాధ్యత దేవనాథుడొక్కడి మీదే పడింది.

ఆనాటి సాయంత్రం రంగసేనుడు, దేవనాథుణ్ణి రహస్యంగా కలుసుకుని, ‘‘నాకు నీవు చేయబోయే నిర్ణయం మీద గౌరవ ముంది; అయినా చెబుతున్నాను! రాజుకు నా మాటంటే గురి. ఆయనకు చెప్పి నీకు ఘన సన్మానం చేయించగలను. లేదా నిన్ను కారాగారం పాలుచేయించగలను. నా మనిషి కోశాధికారిగా నియమించబడితే, ఇక మీదట నీ జీవితపు బాటలో పరిమళించే మెత్తటి పుష్పాలు మాత్రమే వుంటాయి. వేరొకర్ని కోశాధికారిగా ఎన్నిక చేశావంటే మాత్రం, నీ జీవితపు బాటలో ముళ్ళు మాత్రమే వుంటాయి. నేను రాజ బంధువును, నువ్వు రాజాశ్రితుడివి మాత్రమే. ఆ సంగతి గుర్తుంచుకో,’’ అంటూ విన్నపంలోనే హెచ్చరికను వినిపించాడు.

ఆ తర్వాత రాజగుప్తుడు కూడా దేవనాథుణ్ణి కలుసుకుని, తమ మనిషిని కోశాధికారిగా నియమించమని, రంగసేనుడి పద్ధతిలో విన్నపంలో హెచ్చరికను వినిపించాడు. దేవనాథుడు కలవరపడి, ‘‘ఆర్యా! మీకంటే ముందు రంగసేనుల వారు నన్ను కలుసుకుని, తన మనిషిని కోశాధికారిగా ఎన్నుకోమన్నారు. ఉన్నది ఒక్కటే పదవి! బలంలో, పలుకుబడిలో ఆయన మీకేవిధంగానూ తీసిపోరు. ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి,’’ అన్నాడు.
తనకూ, రంగసేనుడికీ ఈ విధంగా పోటీ వస్తుందని రాజగుప్తుడు ఉహించలేదు.
తను కొలువులో అద్భుతమైన ప్రతిభను కనపరిచాడని మెచ్చి, రాజు తన చెల్లెలి నిచ్చి వివాహం చేశాడు. ఇక, రంగసేనుడు, రాణికి స్వయానా తమ్ముడు.

తానిప్పుడు రంగసేనుడితో పోటీ పడితే ఓటమి తప్పదు. అందుకని అతడు బాగా ఆలోచించి, ‘‘రంగసేనుడి మనిషికంటే, నా మనిషి సమర్థుడు. నా మనిషికి కనక కోశాధికారి పదవి దక్కక పోతే, అంతకంటే సమర్థుడినే ఎన్నిక చేయాలి తప్ప, రంగసేనుడి మనిషికి మాత్రం అవకాశమివ్వరాదు. అలా ఇచ్చావో, ఫలితం అనుభవిస్తావు!’’ అని దేవనాథుణ్ణి హెచ్చరించి వెళ్ళిపోయాడు.

జరిగినదంతా దేవనాథుడు, రాజుకు చెప్పాడు. రాజు అతణ్ణి భయపడ వలసిందేమీ లేదని చెప్పి పంపేసి, రంగసేనుణ్ణీ, రాజగుప్తుణ్ణీ పిలిపించి, ‘‘దేవనాథుడు అందరి వివరాలూ సేకరించాడు. అతడికి నారాయణుడనే వాడొక్కడే కోశాధికారి పదవికి అర్హుడని పించిందట!

ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో చెప్పండి?’’ అన్నాడు. దేవనాథుడు తమ హెచ్చరికలకు భయపడినట్లు రంగసేనుడూ, రాజగుప్తుడూ భావించి ఎంతో సంతోషించారు. వాళ్ళు, రాజుతో తాము దేవనాథుడి అభిప్రాయానికి విలువనిస్తామని చెప్పారు. అప్పుడు చంద్రచూడుడు బాధ నటిస్తూ, ‘‘నేను నారాయణుడి గురించిన వివరాలు తెలుసుకున్నాను.

అతడి కంటే, మీ మనుషులే మెరుగేమో! వారిలో ఒకరిని కోశాధికారి పదవికి ఎన్నిక చేద్దాం,’’ అన్నాడు. ఆవెంటనే రంగసేనుడూ, రాజగుప్తుడూ ఏకకంఠంతో, ‘‘ప్రభూ! దేవనాథుడి అభిప్రాయానికి అడ్డుతగలగూడదనేదే, మా ఇద్దరి ఏకాభిప్రాయం,’’ అన్నాడు. అప్పుడు రాజు నెమ్మదిగా,‘‘మీరిద్దరూ నాకు ఆప్తులు, మీ సంతోషమే నాకు సంతోషం. దేవనాథుడు చేసిన ఎన్నిక నాకు తృప్తిగా లేదు. మీ మనషులు కాని పక్షంలో కోశాధికారి పదవి విభీషణుడికి దక్కడం మంచిదని, నా అభిప్రాయం. ఎందుకంటే, అతడి తండ్రి మన పట్ల ఎంతో విశ్వాసంగా, సమర్థంగా కోశాధికారి పదవి నిర్వహించాడు. ఆ కారణంగా, విభీషణుడు మన మనిషి. తండ్రిలాగా సమర్థుడూ, విశ్వాసపాత్రుడూ అని, నేను నమ్మకంగా తెలుసుకున్నాను. మీరు మన మనిషికి అవకాశమిప్పించండి!’’ అన్నాడు.

రాజుకు తమ ఇద్దరి పట్లా ఎంతో గౌరవ మర్యాదలున్నాయనీ, కోశాధికారి ఎన్నికలో తమ అంగీకారం ఆశిస్తున్నాడనీ భావించి, రంగసేనుడూ, రాజగుప్తుడూ, విభీషణుడి ఎన్నికకు సంతోషంగా తమ ఆమోదం తెలిపారు. ఆ విధంగా విభీషణుడు కోశాధికారి పదవిలో నియమితుడయ్యాడు. ఆ తర్వాత, రాజు చంద్రచూడుడు, వృద్ధ మంత్రిని కలుసుకుని, ‘‘చిన్న పామునైనా పెద్ద కరత్రో కొట్టాలంటారు. కోశాధికారి పదవి ఎన్నికకు కూడా రాజనీతిని ప్రదర్శించాలని, మీ సలహా వల్ల నాకు తెలిసింది!’’ అన్నాడు.

దీనికి వృద్ధమంత్రి చిరునవ్వు నవ్వి, ‘‘ప్రభూ! ఏ రాజనీతి అయినా, ప్రజాక్షేమం కోరే రాజుకు శోభనిస్తుంది; స్వార్థపరుడైన రాజుకు మచ్చతెస్తుంది. మీ రాజనీతి ప్రశంసనీయం!’’ అన్నాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం