తాజా కథలు @ CCK

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి

2015-04-22 01:05:01 చిన్నారుల కథలు
నందివరం జమీందారు దివాణంలో రుచికరమైన వంటలు చేయడంలో మీసాల తిమ్మరాజు సాటిలేనివాడని పేరు. దివాణంలో చాలా సంవత్సరాలు ప్రధాన వంటవాడుగా పని చేసిన మీసాల తిమ్మరాజు వృద్ధాప్యం పైబడడంతో, భార్యతో కలిసి తన స్వగ్రామమైన సుబ్బన్న పేటకు  చేరుకున్నాడు.

అక్కడ జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నదిగాని, అతడు భోజనానికి కూర్చున్న ప్రతి ఒక్కసారీ, భార్య చేసిన వంటకాలలో ఉప్పు చాలలేదనీ, కారం ఎక్కువయిందనీ, సరిగ్గా ఉడకలేదనీ ఏదో ఒక వంక పెట్టేవాడు. దాన్ని వాళ్ళ పదేళ్ళ మనవడు తిమ్మరాజు శ్రద్ధగా గమనిస్తూండేవాడు. కొన్నాళ్ళకు మీసాల తిమ్మరాజు కాలం చేశాడు.

ఇప్పుడు ఇంట్లో ఉన్నది మీసాల తిమ్మరాజు భార్య, మనవడు తిమ్మరాజు మాత్రమే. కూరలో ఏమాత్రం ఉప్పు తగ్గినా, ‘‘ఏమిటి నాన్నమ్మా, ఇలా చప్పగా వండావు? నోట్లో పెట్టలేకుండా ఉన్నాను,'' అని విసుక్కునేవాడు తిమ్మరాజు. వాడిది అంతా తాత పోలిక అని లోలోపల నవ్వుకునేది నాయనమ్మ.

తల్లిదండ్రులు లేని బిడ్డగదా అని వాడు అడిగిందల్లా పూట పూటకూ రుచిగా చేసి పెట్టేది. దాంతో తిమ్మరాజు తిండి తినడానికి తప్ప, మరెందుకూ పనికి రాకుండా తయరయ్యాడు. ఎదుట ఎవరూ అనకపోయినా, చాటుగా ఊళ్ళోవాళ్ళందరూ అతణ్ణి," తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు " అని చెప్పుకుని నవ్వుకునేవారు.

ఇలా ఉండగా తిమ్మరాజుకు పెళ్ళయింది. అతడు కొద్దిపాటి ఆస్తిపరుడు కావడంతో నందివరానికి చెందిన ఒక రైతు తన కూతురు శారదనిచ్చి చేశాడు. పెళ్ళిరోజు భోజనాన్ని నానారకాలుగా వంకలు పెట్టాడు తిమ్మరాజు. అల్లుడి తిండిపుష్టికి సంతోషించి, కోరినట్టు వండించి పెట్టాడు మామగారు.

రెండు వారాలు గడిచాక భార్యను కాపురానికి తెచ్చుకోవడానికి తిమ్మరాజు అత్తగారింటికి వెళ్ళాడు.

అందరూ భోజనాలకు కూర్చున్నారు. అన్నీ వడ్డించారు. ‘‘ఇదేమిటీ వంకాయ కూర ? ఇందులో కాస్త అల్లం, పచ్చిమిరప దంచి వెయ్యాల్సింది. ఈ పరమాన్నంలో పచ్చకర్పూరం వేస్తే ఆ రుచే వేరు. అయ్యో ! ఈ గారెలేమిటి ఇంత గట్టిగా ఇలా చెక్కముక్కల్లా ఉన్నాయి ? పప్పు సరిగ్గా నానినట్టు లేదు,'' అంటూ తిమ్మరాజు తన పాకశాస్ర్త ప్రావీణ్యం వెలగబెట్టాడు.

అందరూ కొత్తల్లుడికి సర్ది చెప్పారు. అయితే ! అతడి భార్య శారదకు మాత్రం ఈ పద్ధతి నచ్చలేదు.

మౌనంగా ఊరుకున్నది. ఆనాటి రాత్రి శారద తెచ్చిన పాలను రుచి చూసి, ‘‘ఈ పాలల్లో కాస్త ఏలకుల పొడి, బాదం పలుకులు, చిటికెడు కుంకుమపువ్వు కలిపి ఉంటే అమోఘంగా ఉండేది. ఏమంటావు ?'' అన్నాడు తిమ్మరాజు. శారదకు చివ్వున కోపం వచ్చినా తమాయించుకుని, ‘‘మీకు రుచులు బాగా తెలుసనుకుంటాను. అలాగే వంట చేయడం కూడా వచ్చా?'' అని అడిగింది.

‘‘వండడం రాదు గానీ, రుచులు చెప్పడం వచ్చు,'' అన్నాడు తిమ్మరాజు దర్పంగా. ‘‘ఇదిగాక మీకు ఏ ఏ విద్యలు వచ్చు?'' అని అడిగింది శారద.

‘‘భలేదానివే ! కోటి విద్యలు కూటి కొరకే అని వినలేదూ. కూటికి లోటు లేనప్పుడు విద్యలు నేర్వవలసిన ఖర్మ మనకేమిటి ?'' అని ఎదురు ప్రశ్న వేశాడు తిమ్మరాజు.

పరిస్థితి అర్థమైన శారద, తల్లితో చెప్పుకుని బాధపడింది. భర్తను నెమ్మదిగా, మంచిగా దారికి తెచ్చుకోవాలని తల్లి బుద్ధిచెప్పాక, శారద భర్తతో సుబ్బన్న పేటకు కాపురానికి బయలుదేరింది.

పూటకో రకం పిండి వంట చేసుకుని తినడం తప్ప, అత్తవారింట్లో మరి దేని మీదా ఆసక్తి లేదని త్వరలోనే గ్రహించిన శారద, ఆ సంగతిని తిమ్మరాజు నాయనమ్మతో ఒకనాడు నెమ్మదిగా ప్రస్తావించింది.

‘‘అవును, శారదా, నేనేం చేయను ? వాడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఆ తరవాత ఈ ఊళ్ళో వాడి మేనమామ ఉన్నంత వరకు, తిమ్మరాజు అతనికి భయపడి బుద్ధిగా చదువుకుంటూండేవాడు. వ్యాపార నిమిత్తం అతడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ తరవాత అడిగే వాళ్ళు లేక, వాడు ఇలా తయారయ్యాడు,'' అని వాపోయింది నాయనమ్మ.

ఒకనాటి రాత్రి భోజన సమయంలో శారద భర్తకు వడ్డిస్తూ, ‘‘కూర్చుని తింటే కొండలైనా కరిగి పోతాయంటారు. ఎన్నాళ్ళిలా ఉన్నది ఖర్చు పెట్టుకుంటారు ? ఏదైనా పని చేయండి. కాస్త కాలక్షేపంగా కూడా ఉంటుంది,'' అన్నది.

తిమ్మరాజు సుష్టుగా భోజనం ముగించి, ‘‘నాకేపనీ రాదు. నన్నెవరు చేర్చుకుంటారు? పనిచ్చేవాళ్ళుంటే అలాగే చేరతాలే,'' అంటూ లేచి వెళ్ళి చేతులు కడుక్కున్నాడు విసురుగా. ఆమాత్రం ఒప్పుకున్నాడు చాలనుకున్నది శారద.

ఇంతలో శారద పుట్టిన ఊరైన నందివరంలో శ్రీరామ నవమి ఉత్సవాలు, అన్న సమారాధనలు జరుగుతున్నాయని కూతురునూ, అల్లుణ్ణీ పిలిచారు. భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. ఆ ఉత్సవాలు నందివరం జమీందారు సత్యరాజు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

అలవాటుగా అన్న సంతర్పణలో కూడా వంటకాలకు వంకలు పెట్టనారంభించాడు తిమ్మరాజు: ‘‘ఈ పూర్ణం బూరెలు తీపి తక్కువగా ఉన్నాయి. పులిహోరలో ఇంగువ పోపు మరింత తగిలిస్తే, నాలుగూళ్ళు ఘుమాయించేది. అయ్యో ! లడ్డూల్లో జీడిపప్పు పలుకులు మరిచారా ఏం ? ఈ ఎండా కాలంలో దోరమామిడి కాయతో రసం కాస్తే బావుండేది.''

ఈ వ్యాఖ్యలు ఆనోటా ఈనోటా జమీందారు దాకా చేరాయి. ‘‘రుచులకు ప్రసిద్ధిగాంచిన నందివరం జమీందారు ఆతిథ్యానికి ఈనాటి వరకు వంకలు పెట్టిన వాళ్ళెవరూ లేరు.ఎవరీ తెగువరి?'' అని ఉరిమాడు జమీందారు.

‘‘దొరవారు క్షమించాలి ! తమరడిగిన ఆ వ్యక్తి మా అల్లుడు తిమ్మరాజు. వంటలో నలమహారాజుకు సాటి. రుచులు, పాకాలు అతనికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు. తన విద్యను ఆదరించే ప్రభువులు కరువై, ఇలా ఉన్నాడేగాని, అవకాశం దొరికితే తన ప్రావీణ్యం చూపగలవాడే !'' అన్నాడు జమీందారుతో శారద తండ్రి భయం భయంగా.

‘‘తిమ్మరాజా ? మీసాల తిమ్మరాజు తాలూకువాడు కాదు కదా ?'' అని అడిగాడు జమీందారు. ‘‘సాక్షాత్తూ ఆయనగారి మనవడే ప్రభూ !'' అన్నాడు శారద తండ్రి. ‘‘అలా అయితే, మరీమంచిది ! వెంటనే మా దివాణంలో ప్రధాన వంటవాడిగా నియమించుకుంటాం. అతడి పాకశాస్ర్త ప్రావీణ్యాన్ని పరీక్షిస్తాం,'' అన్నాడు జమీందారు. విషయం విన్న తిమ్మరాజు వణికిపోయూడు.

‘‘మీ నాన్న ఎంత పని చేశాడు ! నాకు వంకలు పెట్టడం తెలుసుగాని, వంటలు చేయడం రాదు. ఇక జన్మలో వంకలు పెట్టను. వండింది తిని తిరుగుతాను. రాత్రికి రాత్రే, ఊరు వదిలి పారిపోదాం,'' అని తిమ్మరాజు భార్యతో లబలబలాడాడు.

‘‘అనవసరంగా బెంబేలు పడకండి. మీ పదవి ప్రధాన వంటవాడు. చెప్పి చేయించాల్సిందే తప్ప, చేయాల్సింది పెద్దగా ఉండదు. అనుభవమున్నవంటవాళ్ళు పదిమంది దాకా మీకింద ఉంటారు. ఏ ఏ దినుసులు, ఏ ఏ ప్రమాణాల్లో వేయాలో చెప్పి చేయించండి చాలు. కావాలంటే, వంటలకు సంబంధించిన వివరాలన్నీ నేను మీకు చెబుతాను,'' అని భర్తకు సర్ది చెప్పి ఒప్పించింది శారద.

మరునాడే దివాణానికి వెళ్ళిన తిమ్మరాజు, భార్య సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, కొద్ది రోజుల్లోనే మంచి వంటవాడుగా జమీందారు అభిమానానికి పాత్రుడయ్యాడు.

జమీందారు అతనికి "రుచిరాజు" అని బిరుదునిచ్చి సన్మానించాడు ! భర్తలో వచ్చిన మంచి మార్పుకూ, లభించిన గౌరవానికీ శారద పరమానందం చెందింది. ఆమె తల్లిదండ్రులు, తిమ్మరాజు నాయనమ్మ కూడా ఎంతో సంతోషించారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం