తాజా కథలు @ CCK

భూస్వామి

2015-05-20 19:05:02 చిన్నారుల కథలు
రామాపురం మారుమూల గ్రామం. గ్రామాధికారి రంగనాథం పెద్ద భూస్వామి. పెద్దల నుంచి ఆయనకు సంక్రమించింది పదెకరాల పొలమే అయినప్పటికీ, తన తెలివితేటలతో, వడ్డీ వ్యాపారంతో దానిని ఇరవై ఎకరాలుగా పెంచుకోగలిగాడు. దాంతో ఆయనకుసాటి రాగల భూస్వామి ఆ గ్రామంలో లేకపోయాడు. ఆ గ్రామస్థులు అధిక సంఖ్యాకులు పేదవాళ్ళే. కొందరు సన్నకారు రైతులున్నప్పటికీ, వాళ్ళు కూడా డబ్బు అవసరమైనప్పుడు రంగనాథం మీద ఆధారపడక తప్పేదికాదు. అందువల్ల గ్రామంలో రంగనాథం మాటకు తిరుగు ఉండేది కాదు. పరిస్థితులు తనకు అనుకూలంగా మారడంతో రంగనాథంలో క్రమంగా అహంకారం పెరిగింది. గ్రామాధికారిగా ఉన్నప్పటికీ, గ్రామం బాగోగు లను పట్టించుకునేవాడు కాదు. గ్రామంలోని పిల్లలు చదువుకుని బాగుపడితే తనను పట్టించుకోరన్న స్వార్థం కొద్దీ, వానకు కూలిపోయిన పాఠశాలను బాగుచేయలేదు. వచ్చిన ఉపాధ్యాయులను బెదిరించి రాత్రికిరాత్రే వెళ్ళిపోయేలా చేసేవాడు.

ఇలా ఉండగా ఆ గ్రామానికి సూర్యం అనే యువకుడు ఉపాధ్యాయుడుగా వచ్చాడు. అతడు కృష్ణాపురంలో ఉంటూన్న రంగనాథం చెల్లెలి కుమారుడు. మేనమామ చేస్తూన్న అన్యాయాలను చూసి బాధపడి గ్రామ ప్రజలకు సాయపడాలనుకున్నాడు.

సూర్యం మేనల్లుడు గనక, రంగనాథం అతన్ని బెదిరించలేక పోయాడు. మంచిగా ఇంటికి పిలిచి, ‘‘ఈ పల్లెటూళ్ళో ఏం చేస్తావ్‌? బాగా చదువుకున్నవాడివి. సరే అని చెప్పు, ఏ పట్నానికైనా బదిలీ చేయిస్తాను,'' అన్నాడు.

‘‘పట్టణాలలో పనిచేయడానికి చాలామంది ఉన్నారు. ఈ మారుమూల గ్రామానికి ఎవరూ రారుకదా, అందుకే నేను వచ్చాను, మామయ్యా. పైగా, చదువు అవసరం ఈ గ్రామప్రజలకు చాలా ఉంది,'' అన్నాడు సూర్యం.

ఆ మాటలు విని రంగనాథం లోలోపల మండి పడినప్పటికీ, పైకి ఏమీ అనలేక ఊరుకున్నాడు. సూర్యం గ్రామప్రజల సాయంతో కూలి పోయిన పాఠశాలను బాగు చేయించి, పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించాడు.

రాత్రుల్లో పెద్దలకు చదవడం, రాయడం నేర్పడంతో పాటు, జీవనోపాధికి వాళ్ళు చేపట్టదగిన చేతివృత్తుల గురించీ, ప్రభుత్వం అందిస్తూన్న సహాయ సహకారాల గురించీ చెప్పాడు. గ్రామ ప్రజల జీవితాల్లో మెల్లమెల్లగా మార్పురాసాగింది.

ఇది గ్రామాధికారి రంగనాథానికి కోపం తెప్పించింది. గ్రామంలో తనంటే గౌరవాదరాలు తగ్గిపోతున్నాయని భయపడ్డాడు. సూర్యం పీడ వదిలించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఒకనాటి సాయంకాలం పాఠశాలవైపు వెళ్ళాడు. అప్పుడు సూర్యం ఆ గ్రామంలోని చిన్నా పెద్దలను కూర్చోబెట్టుకుని ఏదో చెబుతున్నాడు. రంగనాథం చాటుగా నిలబడి దానిని విన్నాడు.

‘‘ప్రకృతిలో మార్పు మన ప్రమేయం లేకుండానే వస్తుంది. అయితే, మన జీవితాల్లో మాత్రం మనం ప్రయత్నించి పాటుపడితే తప్ప రాదు. అందరూ ఒకేలా పుట్టినప్పటికీ, ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని శ్రమించిన వారు బాగు పడతారు.

తక్కినవారు వెనకబడి పోతారు. బాగుపడిన వారికి, కిందివారికి చేయూతనివ్వాలనే ఉదార బుద్ధి ఉండాలి. వెనకబడినవారికి ముందున్నవారిని అందుకోవాలనే తపన ఉండాలి. అంతేగాని ద్వేషం, పగ పనికిరాదు. ఊరంతా బావుంటేనే ఒక్కొక్కరూ బావుంటారు....'' అంటూ సూర్యం ఇంకా ఏదో చెప్పబోయాడు. ఆ మాటలు విని, ఆ మాటల్లో వున్న వాస్తవం, మానవత్వం గ్రహించిన రంగనాథంలో ఒక్క సారిగా మార్పు వచ్చింది. ఆయన వాళ్ళ ఎదుటికి వచ్చి, ‘‘సూర్యం, యువకుడివైనా నువ్వు నా కళ్ళు తెరిపించావు. గ్రామాధికారిగా ఇన్నేళ్ళు ఉండి కూడా నేను చేయలేని పనిని ఆరునెలలలో నువ్వు చేయగలిగావు. ఉపాధ్యాయుడిగానే కాదు; నువ్వు ఈ గ్రామాధికారిగానే ఉండదగిన వాడివి!'' అన్నాడు.

‘‘మీలో ఈ మంచి మార్పుకోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను మామయ్యా. ఇప్పుడే మీరు నిజమైన గ్రామాధికారి. ఇకపై మీ గ్రామ ప్రజల అవసరాలు తీరుస్తూ, మంచి పేరు తెచ్చుకోండి, నేను రేపు ఉదయమే రంగాపురం వెళ్ళాలి,'' అన్నాడు సూర్యం తృప్తిగా.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం