తాజా కథలు @ CCK

దేవుడి అద్భుతమే వారి ప్రాణాలను రక్షించింది

2015-02-19 07:30:50 చిన్నారుల కథలు
దాదాపు యాభై సంవత్సరాలకు పూర్వం అమెరికా దేశం నెబ్రాస్కాలోని బియాట్రిస్‌ అనే చిన్న పట్టణంలో ఒక అందమైన చిన్న చర్చ్ ఉండేది. రోజూ అక్కడ " క్వాయర్‌ " సంగీత  కళాకారులు నిర్ణీత సమయానికి వచ్చి పాటలుపాడి ప్రాక్టీస్‌ చేస్తూండేవాళ్ళు. సంగీత కళాకారులందరూ  సమయపాలన పట్ల చాలా జాగ్రత్త వహించేవాళ్ళు.

అయితే ! 1950 మార్చ్ 1వ తేదీ అక్కడొక ఘోర సంఘటన జరిగింది. మతాధికారి వాల్టర్‌ క్లెంపెల్‌, ఎప్పటిలాగే ఆరోజు మధ్యాహ్నం చర్చ్‌కి వచ్చి సాయంకాలం క్వాయర్‌ సంగీత సాధనకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళాడు. సాయంకాలం 7.15 గం.లకు సంగీత కళాకారులు వచ్చేసరికి బాగా చలిగా వుంటుంది గనక, చలిమంటను రగిలించి, భోజనానికి వెళ్ళాడు.

ఆయన సాయంకాలం 7.10 గం.లకు భార్యా, కూతుళ్ళతో కలిసి చర్చ్‌కి తిరిగి రావడానికి బయలుదేరాడు . కాని , రాలేకపోయాడు. బయలుదేరే సమయంలో, బట్టలు నలిగిపోయి ఉన్నాయి. వాటిని ఇస్ర్తీ చేస్తే తప్ప చర్చ్‌కి రానని ఆయన భార్య చెప్పడంతో వాళ్ళు బయలుదేరడంలో ఆలస్యమయింది. వాళ్ళు ఇంటి వద్ద ఉన్న సమయంలోనే ఆ అసాధారణ సంఘటన సంభవించింది .

మెషినిస్టుగా పని చేసే హార్వీ ఆల్‌, భార్య దగ్గర లేకపోవడంతో తన ఇద్దరు కొడుకుల బాధ్యతను తనే చూసుకుంటున్నాడు. అయితే ! ఆరోజు అతడు అనుకోకుండా తన మిత్రుడితో ఆసక్తికరంగా మాటల్లోపడి సమయం గడిచిపోవడం గమనించలేదు. తీరా గడియారం చూసేసరికి అప్పటికే 7.15 దాటిపోయింది.

పియానిస్ట్ మేరీలిన్‌ పాల్‌, నిజానికి ఆరోజు అరగంట ముందే ప్రాక్టీసుకు వెళ్ళాలనుకుంది. అయితే ! సాయంకాలం భోజనం చేశాక, చిన్న కునుకు తీద్దామనుకుని అలాగే నిద్రపోయింది.

ఆమె తల్లి వచ్చి నిద్రలేపే సరికి ఏడుంబావు అయింది. అప్పటికే ఆలస్యం. ఆపైన హడావుడిగా వెళ్ళినా అక్కడికి సమయానికి చేరుకోలేమనుకున్నది.

క్వాయర్‌ డైరెక్టర్‌ మిస్సస్‌ ఎస్‌.ఇ. పాల్‌, పియానిస్ట్ తల్లి. ఎంతసేపు లేపినా కూతురు నిద్ర లేవలేకపోవడంతో, ఆమె కూడా బయలుదేరలేక పోయింది. అసాధారణమైన ఆ దుర్ఘటన జరిగినప్పుడు, ఆ తల్లీకూతుళ్ళు ఇంటిపట్టునే ఉన్నారు .

ఆ సాయంకాలం చలి మరీ ఎక్కువగా ఉండడంతో, స్టెనోగ్రాఫర్‌ జాయిస్‌ బ్లాక్‌ బద్ధకంగా చివరి నిమిషం వరకు ఇంట్లోని చలిమంట ముందు వెచ్చగా కూర్చున్నది. అయితే ఆమె క్వాయర్‌కు బయలుదేరే సమయంలోనే అనూహ్యమైన ఆ దుర్ఘటన జరిగిపోయింది .

హైస్కూల్లో చదువుతున్న లడోనా వ్యాండ్‌ గ్రిఫ్‌‌ట అనే అమ్నాయి లెక్కలు వేయడంలో లీనమైపోయింది. క్వాయర్‌ ప్రాక్టీస్‌ ఠంచనుగా 7.15 గం.లకు ఆరంభమవుతుందని ఆమెకు తెలుసు. అందువల్ల ఎప్పుడూ పది నిమిషాలు ముందే ఆమె అక్కడ వుంటుంది. అయితే ! ఆరోజు మాత్రం లెక్కల్లో మునిగిపోయి సమయం గడవడం చూసుకోలేదు.

శాడీ, రొయూనా ఎస్ట్స్ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అయితే ! వాళ్ళ కారు స్టార్ట్ కాలేదు. అందువల్ల వాళ్ళు,తన కారులో తమను కూడా తీసుకువెళ్ళమని లడోనా వ్యాండీ గ్రిఫ్‌‌టను అడిగారు. అయితే ! లడోనా లెక్కలు వేయడంలో తలమునకలుగావుంది. అందువల్ల వాళ్ళు కూడా ఆమెకోసం వేచివుండవలసి వచ్చింది. వాళ్ళు లడోనా రాక కోసం కాచుకుని ఉన్నప్పుడే పట్టణంలో ఆ అసాధారణ దుర్ఘటన జరిగింది .

లూసిలీ జోన్‌‌స, డోరొతీవూడ్‌ సహాధ్యాయులు, ఇరుగుపొరుగులు. వాళ్ళు మామూలుగా క్వాయర్‌ ప్రాక్టీస్‌కు కలిసే వెళ్ళేవాళ్ళు. అయితే ! ఆరోజు లూసిలీ 7 నుంచి 7.30 వరకు ఏదో ఆసక్తికరమైన రేడియో కార్యక్రమం వింటూ వుండిపోయింది. ఆ కార్యక్రమాన్ని చివరిదాకా వినాలన్న కుతూహలంతో ఆమె సమయానికి బయలుదేరలేకపోయింది. డోరొతీ తన స్నేహితురాలి కోసం కాచుక్కూర్చున్నప్పుడే బియాట్రిస్‌ పట్టణంలో అమితాశ్చర్యకరమైన ఆ సంఘటన జరిగింది .

మిసస్‌ లియొనార్డ్ స్కుస్టర్‌, ఆమె చిన్నారి కూతురూ సమయానికి క్వాయర్‌కు చేరుకుని ఉండేవారే. అయితే ఆరోజు సాయంకాలం ఆమె తన తల్లిని చూడడానికి వెళ్ళింది. అందువల్ల అక్కడ ఆలస్యమైపోయింది. ఆ తల్లీ కూతుళ్ళు చర్చ్‌ని సమీపించడానికి ముందే ఆ భీకర దుర్ఘటన జరిగిపోయింది .

లేథ్‌ ఆపరేటర్‌ హెర్బర్ట్ కిఫ్‌ మామూలుగా అందరికన్నా అరగంట ముందే చర్చ్‌కి వచ్చేవాడు. అయితే ! ఆ రోజు బయలుదేరే ముందు అసంపూర్తిగా ఉన్న ఉత్తరం రాయడానికి కూర్చున్నాడు. అతడు తన ఇంట్లో ఉత్తరం రాస్తున్నప్పుడే ఆ వింత సంఘటన జరిగింది .

ఇంతకూ ఆ రోజు, అంటే 1950 మార్చ్ 1 సాయంకాలం ఏం జరిగిందో తెలుసా ? మామూలుగా క్వాయర్‌ పాట కచేరీ ఒద్దిక సరిగ్గా సాయంకాలం 7.15 గం.లకు ఆరంభమయ్యింది. ఆరోజు ఆ సమయానికి పది నిమిషాలు తరవాత అంటే సరిగ్గా 7.25 గంటలకు, బియాట్రిస్‌ పట్టణమంతా మారుమోగిన పేలుడు సంభవించింది. సాయంసంధ్య ఆకాశంలో అగ్ని ఖండాలు సుడులు తిరిగాయి. క్వాయర్‌ పాటకచేరీ ప్రాక్టీస్‌ చేసే చర్చ్ గోడలు నేల కూలాయి. కలపతో నిర్మించిన పైకప్పు భీకర శబ్దంతో నేలకు ఒరిగింది .

అదృష్టవశాత్తు చర్చ్ ఖాళీగా ఉంది. సమయపాలనకు పేరుగాంచిన క్వాయర్‌ బృంద సభ్యులు ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ లేకపోవడం విశేషం. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో సమయానికి అక్కడికి చేరుకోలేకపోయారు. రేడియో కార్యక్రమం వినడం, నలిగిన బట్టలు ఇస్ర్తీచేయడం, అసంపూర్తిగా ఉన్న ఉత్తరం పూర్తిచేయడం, లెక్కలు వేయడంలో నిమగ్నమవడం, కునుకుతీయడం, కారుస్టార్ట్ కాకపోవడం వంటి అతిసాధారణమైన కారణాల వల్ల వాళ్ళు సమయానికి బయలుదేరలేకపోయారు. ఇది ఎలా జరిగింది ? కేవలం అన్నీ యాదృచ్ఛికాలేనా ? లేక వీటన్నిటికీ వెనక ఏదైనా అదృశ్య శక్తి పని చేసిందా ? అన్నది నిగూఢ రహస్యంగానే మిగిలిపోయింది ! అది సరే ! మరి చర్చ్ పేలిపోవడానికి కారణం ఏమిటి ? కారణం ఇదమిత్థంగా నిర్ధారించబడలేదు.

అయితే ! అగ్నిమాపకదళం మాత్రం - వెలుపల వున్న విరిగిన పైపు నుంచి సహజవాయువు వెలువడి చర్చ్లోకి వెళ్ళి వుంటుంది. లోపల రగులుతూన్న చలిమంట కొలిమి నుంచి నిప్పంటుకుని భారీ పేలుడు సంభవించి ఉండవచ్చని అభిప్రాయపడింది.

ఆ రోజు సాయంకాలం తమకు జరిగిన సంఘటనలను తలుచుకున్నప్పుడు క్వాయర్‌ బృంద సభ్యుల హృదయాలు దేవుడి పట్ల కృతజ్ఞతతో పొంగిపొర్లాయి. దేవుడి అద్భుతమే తమ ప్రాణాలను రక్షించిందని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసించారు !

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం