తాజా కథలు @ CCK

తెలివి

2015-06-13 11:05:01 చిన్నారుల కథలు
జమోరిన్‌ రాజు పరిపాలించిన కోళిక్కోడుకు సమీపంలోని ఒక గ్రామంలో కోమన్‌ అనే నిరుపేద క్షురకుడు ఉండేవాడు. రోజూ తెల్లవారగానే వాడు కత్తి, కత్తెర, చిన్నఅద్దం, చిన్నగిన్నె గల తన పెట్టెను చంకన బెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళేవాడు. వీధివీధికీ వెళ్ళి, అవసరం అయిన వాళ్ళకు జుట్టు కత్తిరించేవాడు. క్షవరం చేసే వాడు. పని పూర్తయ్యాక అద్దాన్ని వాళ్ళ చేతికిచ్చి చూసుకోమనేవాడు. వాళ్ళు చూసుకుని మురిసిపోతూ సలహాలిస్తే ‘తుది మెరుగులు' దిద్దేవాడు. యువకులయితే, కోమన్‌ కత్తిరించే హస్తనైపుణ్యాన్ని అద్దంలో చూడడానికి, మొదటే అద్దాన్ని అడిగి తీసుకునేవారు. వాళ్ళిచ్చింది పుచ్చుకుని మరో చోటికి వెళ్ళేవాడు.

కోమన్‌ రోజూ ఒక నిర్ణీత మార్గం గుండా వెళ్ళేవాడు. అతడు వచ్చే సమయం తెలుసు గనక, జుట్టు కత్తిరించుకోవాలనుకునే వాళ్ళు ఆ సమయానికి అక్కడ సిద్ధంగా ఉండే వాళ్ళు. అయితే, జుట్టు కత్తిరించుకోవడం అన్నది రోజూ చేయించుకోవలసిన అవసరం లేదుగనక, అప్పుడప్పుడు ఎవరూ కనిపించే వాళ్ళు కాదు. ఒక్కోసారి చెప్పిన సమయానికి రాలేదని కొందరు కోపంతో వద్దు పొమ్మనేవారు. తను పెట్టె తీసుకుని వెనుదిరగ్గానే అలాంటి వాళ్ళు కొందరు, ‘పనికిమాలిన వెధవ' అని గొణుక్కోవడం కోమన్‌కు వినిపించేది. అలాంటి సమయాలలో దమ్మిడీ సంపాయించలేకపోయానన్న బాధతో, వట్టి చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చేది.

ఆ రోజు కోమన్‌, అతడి భార్య గోమతి పస్తుగానే పడుకోవలసి వచ్చేది. అలాంటి స్థితిలో ఒకనాడు అతడి భార్య, ‘‘నీలాంటి పనికిమాలిన మొగుడితో ఎలా కాపరం చేసేది? ఎలా బతి కేది?'' అనడం విని కోమన్‌ ఉలిక్కిపడ్డాడు.

అయితే, అతడేమీ మాట్లాడలేదు. రేపు వెళ్ళి నాలుగు డబ్బులు ఎక్కువగా సంపాదించుకుని వస్తే, భార్యకు తన మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చేయవచ్చని ఆశించాడు.

మరునాడు తెల్లవారక ముందే పెట్టెను తీసుకుని బయలుదేరాడు. ఆ రోజంతా తిరిగి కొంత సంపాయించాడు. అయితే, దాన్ని తీరా లెక్కించి చూసుకుంటే, ఒక్క పూట ఆహార పదార్థాలు కొనడానికి కూడా సరిపోయేలా లేదని గ్రహించి హతాశుడయ్యాడు. అయినా, మరో మార్గం లేక, వెనక్కు తిరిగి వెళ్ళి, ఆ రోజుకు ఎలాగైనా సర్దుకోగలదన్న ఆశతో, ఆ నాటి సంపాదనను భార్య చేతిలో పెట్టాడు. దానిని చూడగానే భార్య కోపంతో, ‘‘నీ మందమతి మండా!'' అన్నది.

ఆ రోజు నుంచి గోమతి ప్రతినిత్యం భర్తను సూటిపోటి మాటలతో తిడుతూనే ఉండేది. ఒకనాడు సాయంకాలం కోమన్‌ ఇంటికి తొందరగా తిరిగి వచ్చాడు. దమ్మిడీ సంపాదన లేదు. ‘‘ఇలా అయితే, మనం ప్రాణాలతో ఎలా బత గ్గలం? అసలు నీకా ఆలోచన అంటూ ఉందా?'' అని నిలదీసింది భార్య.

‘‘నన్నేం చెయ్యమంటావు? పొద్దస్తమానం పనికి మాలినవాడు, బుద్ధిమాలినవాడు అని తిట్టడమే నీ పనిగా ఉంటోంది. అంటే, ఒక్క మంచి పనికూడా చేయలేని దద్దమ్మను నేననేగా నీ ఉద్దేశం?'' అంటూ కోమన్‌ పెట్టెను కోపంగా విసిరికొట్టి కాళ్ళుచేతులు కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళాడు. భర్త వచ్చేంత వరకు ఓపిగ్గా ఉన్న గోమతి, అతడు రాగానే, ‘‘ఇలా అయితే, ఆకలితోనే చావక తప్పదు. అలా చావడం నాకిష్టం లేదు,'' అన్నది నిష్కర్షగా.
‘‘సరే, నేను మూర్ఖుణ్ణే అనుకో. నువ్వు గొప్ప తెలివైనదానివే కదా? సంపాదనకు మరేదైనా మార్గం చెప్పు చూద్దాం,'' అన్నాడు కోమన్‌.

‘‘హాయిగా బిచ్చమెత్తుకోవడం మేలు!'' అన్నది గోమతి. ‘‘బిచ్చమెత్తడమా? నేనా? ఎక్కడికి వెళ్ళి బిచ్చమడగమంటావు?'' అని అడిగాడు కోమన్‌.

‘‘ఎక్కడికో ఎందుకు? తిన్నగా జమోరిన్‌ రాజభవనానికే వెళ్ళవచ్చుగా!'' అన్నది సవాలు విసురుతున్నట్టు గోమతి. ఆ తరవాత కాస్సేపు ఆగి, ‘‘రాకుమారికి త్వరలో వివాహం కాబో తోంది. అందువల్ల రాజు అందరిపట్లా కరుణతో ఉంటాడు. వెళ్ళి ఆయన్ను ఏదైనా అడుగు,'' అని సలహా ఇచ్చింది.

మరునాడు సూర్యోదయానికి ముందే లేచి, తన పెట్టెను కూడా తీసుకోకుండా రాజధాని కేసి బయలుదేరాడు.

కాలినడకనే రాజభవనాన్ని సమీపించి, రాజుగారి దర్శనం కోసం వరుసగా నిలబడ్డ జనంలోకి వెళ్ళి నిలబడ్డాడు. రాజదర్శనానికి తన వంతు రాగానే, ‘ఏదైనా' దానంగా అడగాలనే నిర్ణయించుకున్నాడు. అతని వంతురానే వచ్చింది. రాజభవనం భటుడు, ‘‘క్షురకుడు కోమన్‌,'' అని పిలవగానే, కోమన్‌ తడబడే అడుగులతో ముందుకు వెళ్ళి చేతులు జోడించి, రాజుకు భక్తితో వంగి నమస్కరించాడు. ఆ తరవాత రెండు చేతులు తెరుస్తూ రాజు కేసి అర్థిస్తున్నట్టు వినయంగా చూశాడు.

‘‘కోమన్‌, నీకేం కావాలి?'' అని అడిగాడు రాజు. ‘‘ఏదైనా ఇవ్వండి, మహాప్రభూ!'' అన్నాడు కోమన్‌.

‘‘ఏదైనా? అదేంటి!'' అని విస్మయం చెందిన రాజు, ‘‘నీకు ఏది కావాలో అది అడుగు, ఇస్తాను,'' అన్నాడు.

‘‘ఏదైనా ఇవ్వండి, ప్రభూ!'' అన్నాడు కోమన్‌ పట్టుదలగా. రాజు ఒక్క నిమిషం ఆలోచించాడు. మంత్రి కేసి చూశాడు. మంత్రి రాజును సమీపించి, ‘‘ఆజ్ఞాపించండి, ప్రభూ!'' అన్నాడు విన యంగా. ‘‘ఇతడొక క్షురకుడు. ప్రజలకు సేవలందిస్తూంటాడు కదా.

రాజధానికి సమీపంలో ఉన్న ఐదెకరాల బంజరు భూమిని ఇతనికి ఇప్పించు. అందులో ఎలాంటి పంటలు పండించగలడో చూద్దాం,'' అని మంత్రి చెవిలో చెప్పాడు రాజు.

జుట్టు కత్తిరించేవాడు, బంజరు భూమిలో పంట పండించాలి! ఆహా! రాజుగారి వితరణను మంత్రి మనసులోనే మెచ్చుకుంటూ దాపులనున్న భటుణ్ణి పిలిచి, ‘‘ఇతన్ని తీసుకు వెళ్ళి రాజభవనానికి తూర్పున ఉన్న ఐదెకరాల బంజరు భూమిని చూపించు,'' అని ఆజ్ఞాపించి, కోమన్‌ కేసి తిరిగి, ‘‘ఈ భటుడు నీకు ఐదెకరాల భూమిని చూపిస్తాడు. రాకుమారి వివాహ సందర్భంగా రాజుగారు నీకిస్తున్న బహుమతి అది. దాన్ని సాగుచేసుకుని హాయిగా జీవించు,'' అన్నాడు.

తాను భార్య చెప్పినట్టు ఏదైనా ఇవ్వమని అడిగితే, రాజుగారు ఐదెకరాల పొలం ఇచ్చాడు అని కోమన్‌ పొంగిపోయాడు. అయితే, భటుడి వెంట వెళ్ళి తీరా పొలాన్ని చూశాక, అది రాయి రప్పలతో నిండిన బంజరుభూమి అని తెలుసుకుని కాస్త నీరుగారిపోయాడు. అయినా, ఏదో సంపాయించాం. దీంతో గయ్యాళి భార్య నోరు మూయగలం అన్న ధీమాతో ఇంటిదారి పట్టాడు. అయితే, గోమతి సంగతి వినగానే, ‘‘పొలమా? అదీ బంజరు నేలా? దాంతో ఏం చేసుకుంటాం? సాగు చేయాలంటే నాగలి కావాలి.

దున్నడానికి ఎడ్లు కావాలి. మన దగ్గర ఏవీ లేవే! పైరు పెట్టినా, అది చేతికి అంది వచ్చేవరకు రోజులు గడవడం ఎలా? ముందు రాజు వద్దకు వెళ్ళి డబ్బు అడిగి తీసుకురా. మనకు ఇప్పుడు కావలసింది అదీ,'' అని మండిపడింది.

అయితే, కోమన్‌ మళ్ళీ రాజు వద్దకు వెళ్ళ డానికి నిరాకరించాడు. ‘‘నువ్వు ఇంకేదైనా ఆలోచించాలి. తప్పదు,'' అన్నాడు భార్యతో ప్రాథేయపడుతున్నట్టు. గోమతి కొంతసేపు తీవ్రంగా ఆలోచించి, ‘‘సరే, ఆ పొలం దగ్గరికి వెళదాం, రా. అక్కడ నేను ఏం చేస్తానో, నువ్వు అలాగే చేయాలి, సరేనా?'' అంటూ భర్తను వెంటబెట్టుకుని రాజుగారిచ్చిన పొలం వద్దకు వెళ్ళింది.

గోమతి పొలంలో అక్కడక్కడ ఉన్న ఒక్కొక్క బండరాయినీ తీసి అవతల పారేస్తూ, దాని అడుగున తవ్వి చూస్తూ, నిస్పృహతో ఆశాభంగాన్ని ప్రదర్శించసాగింది. ఎవరైనా తనను సమీపిస్తున్నారని తెలిస్తే చాలు; అలాగే కదలా మెదలక కూర్చునేది. భార్య ఎందుకలా చేస్తున్నదో ఏమాత్రం అంతుబట్టక పోయినప్పటికీ, కోమన్‌ కూడా ఆమె ఒకరాయిని పెకలిస్తే, తాను ఇంకొక రాయిని పెకలిస్తూ, ఆమె లాగే నేలను అక్కడక్కడ తవ్వి చూస్తూ, తన్నుతూ, నిరాశా నిస్పృహలను ప్రదర్శిస్తూ ఆమెను అనుకరించసాగాడు.

దారిన వెళ్ళేవాళ్ళు ఆ దంపతుల వింత ప్రవర్తనకు విస్తుపోతూ, ఆగి కొంత సేపు చూసి వెళ్ళిపోసాగారు. అయితే, నలుగురు దృఢకాయులు మాత్రం భార్యాభర్తలను చాలా సేపు పరిశీలించి చూశారు. ఆ తరవాత వాళ్ళల్లో ఒక్కడు గోమతిని సమీపించి, ‘‘మండే ఎండలో ఏం చేస్తున్నారు? ఏదో చాలా విచారంతో ఉన్నట్టున్నది?'' అని అడిగాడు.

తన మనసులోని మాటను చెబుదామా, వద్దా అని తటపటాయిస్తున్నట్టు గోమతి ఆ మనిషిని కొంతసేపు ఎగాదిగా చూసింది. ఆ తరవాత, ‘‘అదెందుకు అడుగుతావులే. అదో పద్ద సమస్య,'' అన్నది.

‘‘చెప్పు, నేనూ వింటాను. ఏదైనా సాయం కావాలన్నా చేస్తాను,'' అన్నాడు ఆ మనిషి. ‘‘సాయం ఏదీ వద్దు గాని, నేను చెప్పే సంగతిని మరెవ్వరికీ చెప్పనని మాట ఇస్తేనే నీకా రహస్యం చెబుతాను,'' అన్నది గోమతి చుట్టుపక్కల అనుమానంగా చూస్తూ. ‘‘మా తల్లి మీద ఒట్టు. ఎవరితోనూ చెప్పను,'' అంటూ ఆ సంగతేదో చెప్పమన్నట్టు వంగాడు.

‘‘మేము ఇప్పుడు పేదవాళ్ళమేగాని, మా తాతముత్తాతలు గొప్ప ధనికులు. మా తాతయ్య బంగారాన్ని కుండలలో వేసి ఈ పొలంలో పూడ్చి పెట్టాడన్న రహస్యం ఇప్పుడే తెలిసింది. ఐదెకరాల పొలం కదా. ఎక్కడ తవ్వాలో, ఏమో తెలియక అవస్థ పడుతున్నాం,'' అన్నది నిట్టూరుస్తూ.

‘‘అలాగా!'' అని తల పంకించిన ఆ మనిషి, ‘‘మీకా నిధులు తప్పక దొరుకుతాయి. బాగా తవ్వి చూడండి,'' అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

వాడు నిజానికి ఒక దొంగ. గబగబా వెళ్ళి దూరంలో నిలబడ్డ మరి ముగ్గురు తోడు దొంగలను కలుసుకున్నాడు. వాళ్ళు వెళ్ళేంతవరకు అక్కడే కూర్చున్న గోమతి, వాళ్ళు కనుమరు గయ్యాక భర్తతో, ‘‘ఈ రోజుకు చాలు. ఇంటికి వెళదాం, రా. రేపు పొద్దున వద్దాం,'' అంటూ అక్కడి నుంచి బయలుదేరింది.

మర్నాడు ఉదయం వచ్చి చూసే సరికి పొలంలోని రాళ్ళూ రప్పలూ గట్టు మీద పడి ఉన్నాయి. పొలమంతా బాగా దున్నినట్టు లోతుగా తవ్వబడి ఉంది. అంటే, అక్కడ కుండలు కుండలుగా బంగారం ఉందని విన్న దొంగలు ఊరుకోలేకపోయూరు. ఆ బంగారాన్నంతా కైవసం చేసుకోవాలని రాత్రికి రాత్రే వచ్చి పొలమంతా తవ్వేశారన్నమాట!

‘‘చూశావా! పొలమంతా ఎంత బాగా తవ్వించానో! విత్తనాలు కొనుక్కొచ్చి విత్తడమే ఇక మనపని. రెండు పూటలు కాదు; రోజూ మూడు పూటలూ కడుపు నిండా తినే మంచి రోజులు ఆట్టే దూరంలో లేవు. ఏమంటావు తెలివిలేని మొగుడా?'' అన్నది గోమతి చిన్నగా నవ్వుతూ.

‘‘తెలివిగల భార్య ఉండగా నాకేం తక్కువ?'' అంటూ పెద్దగా నవ్వాడు కోమన్‌ భార్యను మెచ్చుకుంటూ.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం