తాజా కథలు @ CCK

దిక్కులేని వాళ్ళకు , దేవుడే దిక్కు

2015-06-18 17:05:01 చిన్నారుల కథలు
మాతంగుడికి పదేళ్ళ వయసులో, తలిదండ్రులు చనిపోతే, ఆ ఊళ్ళో వున్న దూరపు బంధువు పంచన చేరాడు. వాడు అమాయకుడని ఎరిగిన ఆ బంధువు, వాడి చేత గొడ్డు చాకిరీ చేయించుకుని, అర్ధాకలితో మాడ్చేవాడు. వాడి అవస్థ చూసిన పొరుగింటి భద్రయ్య, ఒక రోజున వాణ్ణి చాటుగా పిలిచి,  ‘‘ఒరే, మాతంగం ! ఎన్నాళ్ళిలా బానిస బ్రతుకీడుస్తావు? ఇదే చాకిరీ మరెక్కడైనా చేస్తే, నీకు కడుపు నిండా తిండి దొరుకుతుంది.

ఈ ఊళ్ళో నీ బంధువును కాదని, ఎవరూ నీకు పనివ్వరు. మహిషాపురంలో, నా చుట్టం వీరయ్య వద్దకు వెళ్ళు. ఆయన నీకు మంచి దారి చూపిస్తాడు,'' అని సలహా ఇచ్చాడు. మాతంగుడు ఆ ఊరొదిలి మహిషాపురం చేరుకుని, వీరయ్య ఇంటికి వెళ్ళి తన కథ చెప్పుకున్నాడు. వీరయ్య వాడితో, ‘‘ నేను అంతగా వున్నవాణ్ణి కాను. కానీ , మా భద్రయ్య పంపాడు కాబట్టి, నిన్ను ఇంట్లో వుంచుకుని కడుపు నిండా తిండి పెడతాను. రోజూ నేనెక్కడ పని చేయమంటే అక్కడ పని చేయాలి. ఎవర్నీ డబ్బడక్కూడదు '' అన్నాడు.

మాతంగుడు అమాయకంగా తలాడించి, వీరయ్య చెప్పినదానికి సరేనన్నాడు. వీరయ్య, మాతంగుణ్ణి ఊళ్ళో కొందరిళ్ళకు పంపి, పనులు చేయించి ప్రతిఫలంగా డబ్బు తీసుకునేవాడు. మాతంగుడికి రోజూ తిండి పెట్టేవాడే తప్ప, దమ్మిడీ కూడా ఇచ్చేవాడు కాదు. వీరయ్య తనచేత పని చేయించి డబ్బు సంపాదిస్తున్నాడని తెలియని మాతంగుడు, సొంత ఊళ్ళోని బంధువు దగ్గరకంటే, ఇక్కడే బాగున్నదని సంతోషించాడు.

అలా కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజున నిద్రలేచే సరికి మాతంగుడికి ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. వీరయ్యకు చెబితే, ‘‘ అలాగని పని ఎగవేస్తానంటే కుదరదు. నువ్వు పని చేస్తేనే, నేను నీకు తిండి పెడతాను,'' అన్నాడు.

ఆ సమయంలో మాతంగుడికి ఆకలిగా కూడా లేదు. అందుకని వాడు ఆ రోజుకు పని చేయకూడదనుకుని, నడవలేక నడుచుకుంటూ ఓ వైద్యుడింటికి వెళ్ళి, తన బాధ చెప్పుకున్నాడు. వైద్యుడు వాణ్ణి పరీక్షించి, ‘‘ నీకు జ్వర మొచ్చింది. డబ్బిస్తే మందిస్తాను '' అన్నాడు.

‘‘అయ్యా ! నా దగ్గిర డబ్బు లేదు. తమరిప్పుడు మందిస్తే, నయమయ్యాక మీ ఇంట్లో పని చేసి ఋణం తీర్చుకోగలను '' అన్నాడు మాతంగుడు. వైద్యుడందుకొప్పుకోక, ‘‘నువ్వెవరింట్లో పని చేసినా, డబ్బు వీరయ్యకే ఇవ్వాలి. కాబట్టి నువ్విప్పుడు వీరయ్యనే అడిగి డబ్బు తీసుకుని రా '' అన్నాడు.

వైద్యుడి మాటల ద్వారా, వీరయ్య తన వల్ల ధనలాభం పొందుతున్నాడని, మాతంగుడికి అర్థమైంది. వాడు వీరయ్య ఇంటికి వెళ్ళి, వైద్యుడన్న మాటలు చెప్పాడు. మాతంగుడు తనను నిలదీస్తున్నాడని అనుమానించిన వీరయ్య కోపంగా, ‘‘ నేను నీకు తిండి పెడతానన్నానే తప్ప, వైద్యం చేయిస్తాననలేదు. ఐనా ! నువ్వు చేసే పనికి వచ్చే డబ్బు, నీ తిండికే చాలదు. ఆపైన, రాత్రిపూట నిన్ను ఇంటి అరుగు మీద ఊరికే పడుకోనిస్తున్నాను కూడా '' అన్నాడు.

‘‘ ఇప్పుడు నాకు జ్వర మొచ్చింది. ముందు నాకు వైద్యానికి డబ్బివ్వండి. ఆ తర్వాత మీరెలా చెబితే అలా నడుచుకుంటాను,'' అంటూ మాతంగుడు, వీరయ్యను బ్రతిమాలాడు.

కానీ, వీరయ్య ఏమాత్రం చలించక, ‘‘ఏదో పేదవాడివని జాలిపడి చేరదీశానుతప్ప, నా వద్ద డబ్బేమీ మూలిగి పోవడంలేదు. ఊరికే ఎవరైనా సాయపడతారేమో వెళ్ళి నీ ప్రయత్నం నువ్వు చేసుకో '' అంటూ విసుక్కున్నాడు.

మాతంగుడు తను పని చేసిన ఒకో ఇంటికీ వెళ్ళి డబ్బడిగితే ఒక్కరూ ఇవ్వలేదు. వాడు మళ్ళీ వైద్యుడింటికే వెళ్ళి, ‘‘ దిక్కులేని వాణ్ణి. తమరే నన్ను కనికరించి వైద్యం చేస్తే ఏదో రోజున తప్పక మీ ఋణం తీర్చుకుంటాను '' అని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.

‘‘దిక్కులేని వాళ్ళకు, దేవుడే దిక్కు ! వైద్యుడు కాదు '' అన్నాడు వైద్యుడు.

చేసేది లేక మాతంగుడు, శివాలయం  బయల్దేరాడు. అప్పటికే ఆకాశం మబ్బులు పట్టి ఉరుములతో, మెరుపులతో ఫెళఫెళ మంటూ జడివాన ప్రారంభమైంది.

చేరి, ‘‘స్వామీ ! నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నీరసం వచ్చేస్తోంది. నువ్వే కాపాడాలి '' అంటూ నంది విగ్రహం పక్కన స్పృహ తప్పి పడిపోయాడు.

ఐదారు నిమిషాలు గడిచేలోపల, అప్పటికే ఉరవళ్ళు పరవళ్ళతో ప్రవహిస్తున్న గోదావరి పొంగి, వరద నీరు ఊళ్ళో ప్రవేశించి గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి. చాలా ఇళ్ళు మునిగిపోయాయి. ఎన్నో ఎకరాల పంట నీటి పాలైంది. గ్రామస్థులందరూ పేదా గొప్పా తేడా మరిచి, ఒకరికొకరు సాయపడ్డారు. గ్రామాధికారి మందీ మార్బలంతో ముందుకొచ్చి, ఊరి వాళ్ళకు ధైర్యం చెప్పాడు. గుడి ముందు పడున్న మాతంగుణ్ణి ఎవరో రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు.

ఈలోగా కబురు తెలిసిన ఆ దేశపు రాజు, మహిషాపురానికి నందివర్మ అనే వాణ్ణి రాజ ప్రతినిధిగా పంపాడు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన పునరావాస కేంద్రాలలో నిరాశ్రయులందరూ తలదాచుకున్నారు. వరద బాధితులకు ఆహారం, బట్టలు, వైద్య సహాయం ఉచితంగా లభించాయి.

మాతంగుడికి డబ్బివ్వకుండానే వైద్యం జరిగింది, పని చేయకుండానే తిండి దొరికింది. అంతే కాదు, వరదలో అనాధలైన పసివారిని విద్యాభ్యాసానికై గురుకులాలకు పంపే ఏర్పాటు కూడా జరగడంతో, వాడి ఆనందానికి అంతులేదు.

పరమశివుడు తన మొర విని, తన దూతను మహిషాపురానికి పంపాడనుకుని వాడు, నందివర్మను దర్శించి కాళ్ళకు మొక్కి, ‘‘ అయ్యా ! తమరు కైలాసానికి తిరిగి వెళ్ళినప్పుడు, పరమశివుడికి, నా కృతజ్ఞతలు తెలపండి '' అన్నాడు.

ఆ మాటలు అర్థంకాని నందివర్మ, మాతంగుణ్ణి అడిగి వివరాలు తెలుసుకుని, ‘‘ ఓయీ ! నేను శివదూతను కాను. నీవంటి అనాధలకు, అసహాయులకు సాయపడమని మన దేశపు రాజు పంపగా వచ్చిన రాజప్రతినిధిని. మన రాజు  మంచివాడు. ఆయన చల్లగా వుంటే నీబోటి వాళ్ళకు మేలు జరుగుతుంది. నీవు పరమశివుణ్ణి నమ్మేవాడివైతే, మన రాజుకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిమ్మని, ఆ దేవదేవుణ్ణి ప్రార్థించు '' అన్నాడు.

వెంటనే మాతంగుడు రెండు చేతులూ జోడించి కళ్ళు మూసుకుని, ‘‘ దేవదేవా ! నేనిక్కడి నుంచే నీకు, నా ప్రార్థన వినిపిస్తున్నాను. ఈ దేశపు రాజు  మంచివాడు. ఆయన్ను చల్లగా చూడు. ఆయన మాబోటి వాళ్ళకు సాయపడేందుకుగాను ప్రతి ఊరుకూ, పట్టణానికీ గంగమ్మను పంపి వరదల్లో ముంచెత్తు !'' అన్నాడు గట్టిగా.

అది విని నందివర్మ కోపంగా, ‘‘మూర్ఖుడా ! దేశానికి వరదలు రావాలంటావా ! అదేం ప్రార్థన ?'' అంటూ గద్దించాడు.

మాతంగుడు అమాయకంగా, ‘‘అయ్యా ! నేను జ్వరంతో బాధ పడుతూంటే, వైద్యుడితో సహా ఊళ్ళో ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. వరద రాకపోతే నేను జ్వరంతో చచ్చిపోయే వాణ్ణేమో కూడా. కూడూ, గుడ్డా, నీడా లేని పేదవాళ్ళకు, వరదల్లో పోయేదేమీ వుండదు. రాజుగారిచ్చేదంతా మాకు లాభమే కదా. లాభం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పా ?'' అన్నాడు.

నందివర్మ ముందు తెల్లబోయినా తర్వాత అసలు సంగతి గ్రహించి, రాజధానికి వెళ్ళాక రాజుకు విషయం విన్నవించాడు. అది విన్న రాజు, వరదల్లాంటి ఉత్పాతాలొచ్చినప్పుడే కాక, అన్ని వేళలా పేదలకు సాయపడే పథకాలను రూపొందించి అమలు పరిచాడు.

మాతంగుడు అమాయకత కొద్దీ చేసిన ప్రార్థన పుణ్యమా అని ఆ తరవాత వచ్చిన పథకాల ఫలితంగా దేశప్రజలు సుఖసంతోషాలతో జీవించారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం