తాజా కథలు @ CCK

హారం

2015-05-11 15:05:01 చిన్నారుల కథలు
హేలాపురిలో గుప్తధనుడనే వ్యాపారి ఇంట్లో, సోములనే పద్నాలుగేళ్ళ కురవ్రాడు పని చేస్తూండేవాడు. సోములు తండ్రి గుప్తధనుడి ఇంట పనివాడుగా వుంటూ హఠాత్తుగా మరణించడంతో, అప్పటికే తల్లిని పోగొట్టుకున్న సోములు, చిన్నతనంలోనే యజమాని ఇంట పనిలో చేరాడు. వాడు గుప్తధనుడి ఇంటి వెనుకవున్న తోటలోని పాకలో వుంటూండేవాడు.

గుప్తధనుడు నెల తిరిగే సరికి సోములుకు జీతం రూపేణా ఎంతో కొంత ఇస్తూండేవాడు. తిండీ, బట్టా గుప్తధనుడి ఇంట్లోనే దొరుకుతూండడంతో, సోములుకు వేరే అవసరాలేమీ లేక, ఆ డబ్బులన్నీ ఒక చిన్న డబ్బాలో వేసి దాచుకునేవాడు. గుప్తధనుడి ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా, సోములు మీదే ఆధారపడేవాళ్ళు.

రోజులిలా గడుస్తూండగా - ఒకనాటి ఉద…యం, నూతిలో నుంచి నీళ్ళుతోడి తొట్టెలు నింపుతున్న సోములుతో, గుప్తధనుడు, ‘‘ఒరేయ్, సోములూ! బారెడు పొద్దెక్కి పోతున్నా ఇంకా పాలు పిండలేదేమిట్రా? పిల్లలు పాలకోసం గోలపెడుతున్నారు!'' అన్నాడు గట్టిగా గదమాయిస్తున్నట్టు.

ఆమాటలకు సోములు రోషం తెచ్చుకుని, ‘‘అయ్యా! మా అమ్మానాన్నలు నాకు పెట్టిన పేరు సోమశేఖరప్రసాద్‌. అలా పిలవకుండా, మీరిలా ఒరేయ్ సోములూ అని పిలవడం ఏమీ బాగాలేదండీ!'' అన్నాడు.

గుప్తధనుడు నిర్ఘాంతపోయాడు. ఇంట్లో వాళ్ళందరికీ, వాణ్ణి సోములు అని పిలవడమే అలవాటు. అయినా, లోగడ ఎన్నడూ ఇలా దురుసుగా వాడు మాట్లాడలేదు. ఈ రోజు వీడికేమయిందబ్బా, అనుకుంటూ, గుప్తధనుడు, ‘‘అలాగేనండీ, సోమశేఖర్‌ప్రసాద్‌గారూ! కాస్త గేదెపాలు తీస్తారా?'' అన్నాడు వేళాకోళంగా.

దాంతో తృప్తిపడిన సోములు చెంబు పట్టుకుని పాలు తీయడానికి గొడ్లచావడిలోకి వెళ్ళాడు ఉత్సాహంగా.

కొద్దిసేపు తర్వాత, సోములు పాలు పిండి తెచ్చిన చెంబు అందుకుంటూ, గుప్తధనుడి తల్లి, ‘‘ఒరే, సోములూ! నిన్ననగా ఇంట్లో కూరగా…యలు నిండుకున్నాయి. అలా సంతకువెళ్ళి, కూరగాయలు పట్టుకురా!'' అన్నది.

సోములుకు చర్రున కోపం ముంచుకొచ్చింది. వాడు విసురుగా, ‘‘డబ్బూ, కూరల సంచీ ఇటు పడేయండి!'' అన్నాడు.

గుప్తధనుడి తల్లి ఎక్కడలేని ఆశ్చర్యంతో వాడి కేసి చూస్తూ ఏదో అనబోయి వూరుకున్నది. కాస్తదూరంలో వుండి, సోములు ప్రవర్తనను గమనించిన గుప్తధనుడు, వాడిలో వచ్చిన మార్పుకు ఏదో బలమైన కారణంవుండి వుంటుందని భావించి, అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు.

ఇంట్లో అందరూ నిద్రపోతూండగా, ఆ నాటిరాత్రి గుప్తధనుడు, సోములుంటున్న పాకదగ్గరకు వెళ్ళి, లోపల వాడేంచేస్తున్నాడో గమనించేందుకు కిటికీలోంచి చూశాడు. ఆ సమయంలో వాడు గుడ్డిదీపం వెలుగులో ఒక వజ్రాల హారాన్ని తిప్పి తిప్పి చూస్తూ తెగమురిసిపోతున్నాడు. ఆ హారం వాడికి అడవికి కట్టెల కోసం పోయినప్పుడు, చెట్టు మీది కాకి గూడుకు దిగువవున్న కొమ్మకు వేలాడుతూ కనిపించింది. ఆ హారాన్ని కాకి గ్రామంలో ఎవరి మెడనుంచో జారిపడగా, ఏదో తినే వస్తువని గూటికి తెచ్చి, కాదని తెలుసుకుని కొమ్మల్లో వదిలేసివుంటుంది!

సోముడిలో వచ్చిన మార్పుకు, ఆ వజ్రాల హారం కారణమని గుప్తధనుడికి తెలిసి పోయింది.

ఈ విధంగా కొద్ది రోజులు గడిచాయి. ఆ ఏడు గుప్తధనుడి తోటలో అరటిగెలలు విరివిగా కాసినై. గుప్తధనుడు, సోములుతో కాస్త వెటకారంగానే, ‘‘సోమశేఖర్‌ప్రసాద్‌గారూ! అరటి గెలలు దింపించి, సుగంధపురి సంతలో అమ్ముకొద్దామా?'' అన్నాడు.

అందుకు సోములు సంతోషంగా తలవూపాడు. ఆ సా…యంత్రం వాళ్ళిద్దరూ అరటి గెలలతో సంతకు వెళ్ళారు. గుప్తధనుడు వాటిని అక్కడి దుకాణదారులకు అమ్మి, ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా, సోములు ఆయనతో, ‘‘నేను సంతలో కొద్ది సేపు తిరిగి, దుకాణాల్లో ఎలాంటి వస్తువులు అమ్మజూపుతున్నారో చూసి రావాలనుకుంటున్నాను,'' అన్నాడు.

‘‘సరే, అలాగే వెళ్ళిరా,'' అన్నాడు గుప్తధనుడు.

అరగంట తర్వాత వాడు తలవంచుకుని నేల చూపులు చూస్తూ, గుప్తధనుడి దగ్గరకు వచ్చి, ‘‘అయ్యగారూ! తమరి ఇష్టం. బ…యల్దేరదామంటారా?'' అన్నాడు పీలగొంతుతో.

‘‘అలాగే, సోమశేఖర్‌ప్రసాద్‌గారూ!'' అన్నాడు గుప్తధనుడు.

ఆ వెంటనే సోములు దీనంగా ముఖం పెట్టి, ‘‘నేను తమ ఇంటి పనివాణ్ణి, అయ్యగారూ! తమకళ్ళెదట పుట్టి పెరిగినవాణ్ణి. తమరు నన్ను ఒరే సోములూ, అని పిలిస్తే సంతోషంగా వుంటుంది!'' అన్నాడు.

ఒక్క అరగంట కాలంలో వాడిలో ఇంతమార్పు ఎందుకొచ్చిందో గుప్తధనుడికి అర్థంకాక వాడికేసి ఆశ్చర్యంగా చూశాడు. దానిని గ్రహించిన సోములు, ‘‘అయ్యగారూ, తమరు క్షమిస్తానంటే ఒక సంగతి చెబుతాను,'' అన్నాడు. ఏమిటి అన్నట్టు చూశాడు గుప్తధనుడు.

‘‘వారం రోజుల క్రితం నాకొక వజ్రాల హారం దొరికింది. దాంతో హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇళ్ళూ, పొలాలూ కొని మహావైభోగంగా బతగ్గలనని కలలుగంటూ మిడిసిపాటుతో ప్రవర్తించాను. తీరా ఇప్పుడు దాన్ని అమ్ముదామని నగల దుకాణంవాడి దగ్గిరికి తీసుకువెళితే, అది నకిలీదని తేల్చేశాడు. కాదు, అది అసలుహారమే అని వాదించబోతే పనివాళ్ళచేత నాలుగు తన్నించి మరీ బయటికి గెంటించాడు,'' అంటూ వెలవెలబోతూన్న హారాన్ని చూపాడు.

దాన్ని ఒకసారి పరిశీలనగా చూసిన గుప్తధనుడు, ‘‘సోములూ, నువ్వు పసివాడివి. మునుముందు ఎంతో జీవితం వుంది. కష్టపడి పని చేసి, అదృష్టం కలిసివస్తే, ఒక వజ్రాలహారం కాదు. ఎన్నయినా సంపాయించవచ్చు. అంతేగాని, ఎక్కడో దొరికిన హారాన్ని సొంతంచేసుకోవాలనుకుని మిడిసి పడడం ప్రమాదకరం. ఒకవేళ ఇది నిజమైన హారమే అయివున్నా దీన్ని పోగొట్టుకున్నవాళ్ళు ఎంతగా బాధపడి వుంటారో ఆలోచించావా? దొరికిన వెంటనే దాన్ని నువ్వు న్యా…యాధికారికి అప్పగించి ఉండాలి. అవునా?'' అన్నాడు.

అవును అన్నట్టు తల ఊపాడు సోములు. ‘‘కష్టపడి సంపాయించినదే నిజమైన ధనం. పైగా ధనం ఉన్నా లేకపోయినా మనిషి మంచిగా, అణకువగా నడుచుకోవాలి. అదే మనిషికి అలంకారం,'' అన్నాడు గుప్తధనుడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం