తాజా కథలు @ CCK

బహుమతి

2015-05-10 19:05:01 చిన్నారుల కథలు
ఒకానొకప్పుడు గిసేలా అనే ఒక పేదపిల్ల ఒకరైతు ఇంట్లో పనిచేస్తూండేది. గిసేలాకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. నా అనే వాళ్ళెవరూ లేని అనాథ ఆమె. అందువల్ల కడుపుకూటికి కారుకష్టం చేయక తప్పింది కాదు. రైతు ఇంట్లో ఆమెకు రకరకాల పనులు చెప్పేవారు. జీతబత్తాలు లేవుగాని మూడు పూటలా కడుపునిండా తిండిమాత్రం పెట్టేవారు. తనకు తిండీ, తలదాచుకోవడానికి ఇంత నీడా ఇస్తున్న రైతు కుటుంబం పట్ల గిసేలా ఎంతో కృతజ్ఞత కనబరచేది. ఒకనాటి ఉదయం రైతుభార్య ఆమెను పిలిచి, ‘‘గిసేలా, గొడ్ల చావడి వద్దకు వెళ్ళి ఆవుల నుంచి పాలు పితుక్కుని రా,'' అన్నది.

గొడ్ల చావడి ఇంటికి కొద్ది దూరంలో ఉంది. వానకురుస్తోంది. ఆమె చావడి చేరేసరికి బాగా తడిసిపోయింది. చలికి వణుకుతూనే ఆమె ఆవుల నుంచి పాలు పితికింది. పాలు పాత్ర నిండుతూన్నప్పుడు ఆమెకు వెనక నుంచి బుస్సుమనే శబ్దం వినిపించింది. ఆమె తిరిగి చూసింది. పెద్ద నాగ సర్పం ఆమెకేసి వస్తున్నది. సర్పం పడగ మీద బంగారు కిరీటం మెరుస్తున్నది. భయం అరవబోయి, పాము కళ్ళల్లోకి చూసి అలాగే ఆగిపోయింది. పాము చాలా దాహంతో, ఆకలితో ఉన్నట్టు గ్రహించి పాలపాత్రను దాని ముందు పెట్టింది గిసేలా. పాము పాలను జుర్రేసి, ఆమెకేసి ఒకసారి కృతజ్ఞతతో చూసి, వెనుదిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయింది.

ఆ పాము పాత్రలోని పాలన్నిటినీ తాగేయడం చూసిన గిసేలా హడలిపోయింది. పాత్ర అడుగున మాత్రం చారెడు పాలున్నాయి. ఖాళీ పాత్రను చూస్తే రైతుభార్య తిడుతుంది. కోపంతో ఈపూట తిండి పెట్టకుండా మానేయవచ్చు కూడా. ఇలాంటి ఆలోచనలతో భయం భయంగా ఇల్లు చేరిన గిసేలా, చప్పుడు చే…యకుండా తనగదిలోకి వెళ్ళిపోయింది.

‘‘గిసేలా, ఆవులనుంచి పాలు పితికావా?'' అని కేకవేసింది వంట గదిలోంచి రైతుభార్య.

‘‘పితికాను,'' అన్నది గిసేలా మెల్లగా. ‘‘మరి అక్కడున్నావేమిటి? పాలను పాత్రలో పోయి,'' అన్నది రైతు భార్య.

గిసేలా పాలపాత్రను, పాలు కాచే పాత్రలో కు పోయింది.

అదొక్కటే కాదు. అలాంటి మూడు పాత్రలు నిండిపో…యాయి. దానిని చూసి పరమానందం చెందిన రైతుభార్య, జీవితంలో మొదటి సారిగా గిసేలా కేసి నవ్వుతూ చూస్తూ, ‘‘చాలా తెలివైన పిల్ల. ఇకమీదట రోజూ తెల్లవారగానే వెళ్ళి, ఆవుల నుంచి పాలు పితికే పని నీది!'' అన్నది. ‘‘వద్దమ్మా, ఇంకేదైనా పనివుంటే చెప్పండి, చేస్తాను,'' అన్నది గిసేలా పామును తలుచుకుంటూ.

‘‘అదేం కుదరదు. ఇకపై రోజూ పొద్దున, సాయంకాలం ఆవుపాలు పితికే పని నీది. మరేం మాట్లాడకు,'' అన్నది రైతుభార్య.

గిసేలా మరేం మాట్లాడలేదు. మాట్లాడినా ప్రయోజనం ఉండదని ఆమెకు తెలుసు. మరుసటిరోజు నుంచి ఆమె ఉదయం, సా…యంకాలం పాలు పితకడానికి వెళ్ళేది. పాలు పితికేది. ఆ తరవాత బంగారు కిరీటం నాగసర్పం వచ్చి పాలలో కొద్దిగా మిగిల్చి, మిగిలినదంతా తాగివెళ్ళేది. అయితే, ఇంటికి వెళ్ళి ఇంకో పాత్రలోకి కుమ్మరించినప్పుడు కావలసినంత పాలు వచ్చేవి. దాంతో రైతు భార్య ఎంతో సంతోషించేదే కాని, ఎందుకిలా జరుగుతున్నదో మాత్రం ఆలోచించేది కాదు. అనుమానించి ప్రశ్నించేది కాదు. అదృష్టవశాత్తు, ఆమెకు గొడ్ల చావడికి వెళ్ళి చూడాలని ఎప్పుడూ తోచలేదు. ఆ కారణంగా చావడి దాపులనున్న బంగారు కిరీటం నాగసర్పం గురించి ఎవరికీ తెలియలేదు.

రోజులూ, నెలలూ, సంవత్సరాలు గడిచాయి. గిసేలా ఇప్పుడు అందమైన యువతిగా ఎదిగింది. ఆమెను పెళ్ళాడడానికి ఎందరో రైతుయువకులు రాసాగారు. గిసేలా మరెంతో కాలం తమ వద్ద ఉండబోదని, రైతూ, రైతుభార్యా గ్రహించారు. అందువల్ల ఆమె పట్ల ఎంతో ఆప్యాయంగా మసలుకోసాగారు. గిసేలా మాత్రం ఎప్పటిలాగే, పాలుపితకడం నుంచి అన్ని పనులూ సక్రమంగా చేస్తూ రాసాగింది.

కొన్నాళ్ళ తరవాత ఆమెను పెళ్ళాడతానంటూ వచ్చిన ఒక రైతుయువకుడు ఆమెకు బాగా నచ్చాడు. మిగతా వారికన్నా అతడు చాలా భిన్నంగా కనిపించాడు. పేదవాడైనా, చాలా బుద్ధిమంతుడిలా కనిపించడంతో గిసేలా అతన్ని పెళ్ళాడడానికి సమ్మతించింది. పెళ్ళికుదిరి ముహూర్తం నిశ్చయించబడింది. పెళ్ళినాడు అందరికీ విందు చేయాలని రైతు దంపతులు నిర్ణయించారు.

గిసేలా ఆఖరుసారిగా పాలు పితకడానికి చావడికి వెళ్ళింది. పాలు పితికాక ఎప్పటిలా పాలు తాగడానికి నాగసర్పం వచ్చింది.

‘‘నీకు పాలు పితికి ఇవ్వడం నాకు ఇదే చివరి సారి. రేపే నాకు పెళ్ళి కాబోతున్నది.

పెళ్ళయ్యాక భర్తతో వాళ్ళ ఇంటికి వెళ్ళి పోతాను గనక, ఇకపై నిన్ను చూడలేను. నా కాబోయే భర్తకు ఆవులు లేవు. అందువల్ల నీకు పాలు పితికి ఇవ్వలేను,'' అన్నది గిసేలా ఎంతో బాధగా.

పాము కూడా ఆమెకేసి ఎంతో విచారంతో చూసింది.

‘‘రేపటినుంచి నిన్ను చూడలేను. అది తలుచుకుంటే చాలా బాధగా ఉంది. నువ్వు నా పట్ల ఎంతో ఆప్యా…యంగా ఉన్నావు. నేను పెళ్ళి చేసుకోనున్న యువకుడు చాలా పేదవాడు. అతని ఇంట్లో కావలసిన వస్తువులేవీ లేవు. అయినా నాకు బాధలేదు. అతడు చాలా మంచివాడు; దయాస్వభావి. పేదలమైనా సంతోషంగా ఉండగలమని భావిస్తున్నాను. మమ్మల్ని దీవించు,'' అన్నది గిసేలా గద్గద స్వరంతో.

సర్పం ఒకసారి ఆమెకేసి చూసి మెల్లగా వెనుతిరిగి వెళ్ళిపోయింది.

గిసేలా పెళ్ళివిందు గొప్పగా జరిగింది. విందుకు గ్రామప్రజలందరూ వచ్చారు. తృప్తిగా విందుభోజనం చేసి ఆడుతూ పాడుతూ తమ ఆనందాన్ని చాటసాగారు. హఠాత్తుగా జనం మధ్య బుస్సుమనే శబ్దం వినిపించింది. అందరూ ఆ శబ్దం వచ్చిన దిశకేసి చూశారు. తల మీద కాంతులు వెదజల్లే చిన్న బంగారు కిరీటంతో నాగసర్పం పెళ్ళి వేదిక కేసి రాసాగింది. అది పెళ్ళి కూతురు భుజాలమీదికి ప్రాకుతూ వెళ్ళి, తలను ఊపింది. దాని తల మీద కిరీటం పెళ్ళికూతురి తల మీద పడగానే అది అక్కడినుంచి వెనుదిరిగి వెళ్ళి చీకట్లో కలిసిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య చకితులయ్యారు. తన నేస్తం పెళ్ళికి రావడం చూసి గిసేలా కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. బంగారు కిరీటాన్ని తీసి భద్రంగా తన సంచీలో దాచుకున్నది. మళ్ళీ పెళ్ళివేడుకలు ఆరంభమై తెల్లవారేదాకా సాగాయి.

మరునాడు తెల్లవారాక, గిసేలా బంగారు కిరీటాన్ని దాచిన సంచీని విప్పిచూసింది. సంచీ నిండుగా బంగారు నాణాలు! ఆమె సంతోషంగా నాణాలను వెలుపలికి తీసింది. సంచీమళ్ళీ నాణాలతో నిండిపోయింది. ఆమె తీస్తున్న కొద్దీ సంచీలో నాణాలు వస్తూనే ఉన్నాయి. ఆ తరవాత ఆ సంచీ ఎప్పుడూ ఖాళీ కాలేదు. దాంతో గిసేలా దంపతులు ఆ గ్రామంలోనే అందరికన్నా ధనవంతులయ్యారు. అందరితో ప్రేమాదరాలతో మసలుకుంటూ తమ సంపదలను లేనివారితో పంచుకోవడంవల్ల, అందరూ వారిపట్ల ఎంతో ప్రేమగా నడుచుకోసాగారు. ముఖ్యంగా గిసేలాను చిన్నప్పటి నుంచి ప్రేమతో ఆదరించిన రైతుదంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది!

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం