తాజా కథలు @ CCK

పరీక్ష

2015-06-05 03:05:01 చిన్నారుల కథలు
భూస్వామి రంగనాధానికి వ్యవసాయంతో పాటు, పట్నంలో కొన్ని వ్యాపారాలు కూడా వున్నాయి. పనివాళ్ళను ఇంట్లోమనుషుల్లా చూస్తాడనీ, మంచి జీతంఇస్తాడనీ అంతా ఆయన గురించి చెప్పుకుంటారు. ఆయనవద్ద పనిలో చేరడానికి ఉత్సాహ పడుతూంటారు. ఇప్పుడు రంగనాధం వద్ద పని చేసే పుల్లయ్య అనేవాడు, దూర దేశంలో వున్న తమ్ముడికి సాయంగా వెళ్ళవలసి వచ్చింది. పుల్లయ్య తర్వాత అంత నమకస్థుడైన చంద్రన్నకు, అతడి స్థానమివ్వాలని రంగనాధానికి వున్నది.

కానీ, ‘‘నా తమ్ముడు శివుడికి చెబితే అంతకంటే మంచి పనివాణ్ణి చూసి పెడతాడు. మీరు ఈ విషయంలో తొందరపడకండి!'' అని భార్య వారించింది. కబురందుకుని వచ్చిన రంగనాధం బావమరిది శివుడు, ‘‘నాకు తెలిసిన హరి, నీ పుల్లయ్య కంటే కూడా మంచి పనివాడు, సమర్థుడు,'' అన్నాడు రంగనాధంతో. రంగనాధం వెంటనే, ‘‘అంత తొందరగా ఏ నిర్ణయూనికీ రాకూడదు. నేను పనివాళ్ళను వాళ్ళకు తెలియకుండా రకరకాలుగా పరీక్షిస్తూంటాను.

కొందరు కొన్నింటిలో నెగ్గినా, అన్నింటిలో నెగ్గాడనే పుల్లయ్యంటే నాకు ప్రత్యేకాభిమానం,'' అంటూ ఆ విశేషాలు చెప్పాడు: పుల్లయ్య పట్నంలో రంగనాధం బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. పుల్లయ్య వ్యాపార దక్షతవల్ల ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చాలా మంది వ్యాపారులు పుల్ల య్యకు ఎక్కువ జీతం ఇస్తామని ఆశచూపారనీ, కానీ పుల్లయ్య, రంగనాధాన్ని విడిచి రానన్నాడనీ, ఆనోటా ఈనోటా విన్న రంగనాధం, నిజానిజాలు తెలుసుకునేందుకు, విశ్వాసపాత్రుడైన బాపన్న అనే ఆసామీని నియమించాడు.

బాపన్న, పుల్లయ్యను కలుసుకుని, ‘‘నీకు రంగనాధం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు. నేను రెండు వేలిస్తాను. నేను పెట్టబోయే బట్టలదుకాణంలో పనిచేస్తావా?'' అని అడిగాడు. పుల్లయ్య తల అడ్డంగా వూపి, ‘‘అయ్యూ! ఇప్పటికే నెలకు మూడు వేలు ఇస్తామన్న వారుకూడావున్నారు. నేను ఒప్పుకోలేదు,'' అన్నాడు. బాపన్న అతడి వంక జాలిగా చూసి, ‘‘తనకుమాలిన ధర్మం కూడదు.

నీకు నేను నాలుగు వేలిస్తాను. ఆ రంగనాధంతో వుంటే, ఆయనకు లాభమే తప్ప, ఎన్నాళ్ళయినా సరే నీ బ్రతుకు ఎక్కడ వేశావే గొంగళీ అన్నట్లుంది,'' అని హితవు చెప్పాడు. పుల్లయ్య నవ్వి, ‘‘అయ్యూ! ముందు చూపున్న పనివాడికి, జీతంకంటే యజమానే ప్రధానం. ఆయన వ్యాపారం దెబ్బతీయడానికే కొందరు నాకు ఎక్కువ జీతం ఇస్తామంటున్నారు.

అది జరిగాక నన్ను నాదారి చూసుకోమంటారు. రంగనాధంగారు, నా అవసరం కనిపెట్టి నన్నాదుకోగలరని నా నమ్మకం,'' అన్నాడు. బాపన్న ఈ విషయం అప్పటికప్పుడే రంగనాధానికి చేరవేశాడు. ఆయన ఎంతో సంతోషించాడు. ఇది జరిగిన మర్నాడే పుల్లయ్య చెల్లెలికి మంచి చోట పెళ్ళి కుదిరింది. పెళ్ళికి మూడు నెలలు గడువున్నా, వియ్యూలవారు వెంటనే వెయ్యి రూపాయలు కావాలన్నారు. డబ్బు దగ్గరలేక పుల్లయ్య రంగనాధాన్ని డబ్బడిగాడు.

రంగనాధానికి, పుల్లయ్యను మళ్ళీ పరీక్షించాలనిపించింది. ఆయన బాధగా ముఖం పెట్టి, ‘‘నెల రోజులదాకా ఎవరికీ అప్పివ్వరాదని నియమం పెట్టుకున్నాను, ఈ మొత్తం నీ అవసరానికి సరిపడకపోవచ్చు!'' అంటూ అతడికి రెండు వేల రూపాయిలిచ్చి, ‘‘ఈ డబ్బును ఒక రహస్యకార్యం కోసం వుంచాను. దీన్ని రెండు నెలల పాటు నీ ఇంట్లో జాగ్రత్తగా దాచాలి. పొరపాటునైనా ఇందులో ఒక్క పైసా కూడా వాడకూడదు సుమా,'' అని హెచ్చరించాడు.

పుల్లయ్య మారుమాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని వెళుతూండగా, బాపన్న అతణ్ణి దారిలో కలిసి, ‘‘నీకు డబ్బు అవసరం అని విన్నాను. రంగనాధం మొండిచేయి చూపాడటగా-ఇప్పుడైనా బుద్ధితెచ్చుకుని నా పనిలోచేరు,'' అన్నాడు. పుల్లయ్య అదోలా ఆయన వంక చూసి, ‘‘నేనప్పుడో మాటా ఇప్పుడో మాటా చెప్పను.

అవసరానికి ఆదుకున్నా ఆదుకోక పోయినా, నాకు రంగనాధంగారే మంచి యజమాని,'' అన్నాడు. ఇదంతా రంగనాధం చెప్పగా విన్న శివుడు, ‘‘వ్యాపారంలో ఎంతో దక్షతవున్న వాడంటున్నా వుగదా? పుల్లయ్య నువ్వు పెట్టే పరీక్షలు అర్థం చేసుకోలేడా? నీ వల్ల అతడికి మంచి ప్రతిఫలం ముట్టేవుంటుందని, నా నమ్మకం,'' అన్నాడు. ఆ మాటకు రంగనాధం నవ్వి, ‘‘సరే, ఇంతకీ నువ్వు పుల్లయ్య స్థానంలో పనిచేయడానికి ఎన్నిక చేసిన వాడికి ఏం పరీక్షలు పెట్టావు?'' అని అడిగాడు.

శివుడు వెంటనే, ‘‘వేరే పరీక్షలు అవసరం లేదు, నా భార్యకు అందరి ఇళ్ళకూ వెళ్ళి ఆరాలు తీసే అలవాటుంది. ఏ ఇంట్లో అడిగినా భర్త చాలా కోపిష్టి అనీ తాము సర్దుకు పోతున్నామనీ చెబుతారట ఆడవాళ్లు. హరి భార్య అరవింద మాత్రం, మా ఆయన అందరిలాంటి వాడు కాదని హరిని అదేపనిగా పొగిడేసిందట. హరి మంచివాడనడానికి అదే తిరుగులేని సాక్ష్యం,'' అన్నాడు. రంగనాధానికీ సమాధానం సబబుగా తోచలేదు.

కానీ ఆయన భార్య కూడా తమ్ముణ్ణే సమర్థించి, ‘‘వాడి మాట మీద నమ్మకంలేకుంటే, చేతనైతే మీరు ఇంతకంటే మంచి పరీక్ష పెట్టండి,'' అన్నది. ఈ విషయమై పుల్లయ్యనే సలహా అడిగాడు రంగనాధం. అతడు కాసేపాలోచించి, ‘‘హరి లేని సమయంలో మనం వాళ్ళ ఇంటికి వెళదాం. హరిని గురించి అతడి భార్య అరవింద ద్వారా తగిన సమాచారం సంపాయించవచ్చు,'' అని చెప్పాడు. ఆ ప్రకారం వాళ్ళిద్దరూ హరి ఇంటికి వెళ్ళారు. పుల్లయ్య అరవిందతో, ‘‘నేనీ రంగనాధంగారి బట్టల దుకాణంలో చాలా కాలంగా పని చేస్తున్నాను.

నా తమ్ముడికి సాయం చేయవలసిన కారణంగా ఉద్యోగం మానుకోవలసి వచ్చింది. రంగనాధంగారు, నా స్థానంలో మీ దగ్గరబంధువు చంద్రన్నను నియమించాలనుకుంటున్నారు. అతణ్ణి గురించి నీకు తెలిసింది చెబితే వినాలని వచ్చాం,'' అన్నాడు. అరవింద గొంతు సవరించుకుని, ‘‘ఆ చంద్రన్న గురించి ఏం చెప్పేది? ఉత్త తాగుబోతు, లంచగొండి, అబద్ధాలకోరు. ఈమధ్య అతడు మా ఆయనతో మాట్లాడ్డం మానేశాడు,'' అన్నది తడుముకోకుండా.

‘‘చాలా సంతోషమమ్మా! మాకు ఎంతో ఉపయోగపడే సమాచారం ఇచ్చావు,'' అన్నాడు పుల్లయ్య. తర్వాత ఇద్దరూ అక్కణ్ణించి బయల్దేరారు. దారిలో పుల్లయ్య రంగనాధంతో, ‘‘గురివిందకు నలుపు తెలియదని సామెత. నా అభిప్రాయంలో అరవింద భర్త తాగుబోతు, లంచగొండి. చంద్రన్న గురించి మనకు తెలుసుకాబట్టి అరవింద చెప్పింది నిజం కాదని తెలుసుకున్నాం. నిజానికి అరవిందకూ, చంద్రన్నకూ ఏ బంధుత్వమూ లేదు.

తన భర్త హరికి, మీరు ఉద్యోగమివ్వాలనుకుంటున్న విషయం ఆమెకు తెలిసివుంటుంది. అందుకే లేనివి పోనివి చెప్పి, ఆమె తన భర్తకు పోటీ లేకుండా చేయూలనుకుంటున్నది,'' అని చెప్పాడు. ‘‘అది సహజమే! కానీ ఆమె చెప్పిన అవలక్షణాలు హరికి వున్నాయని ఎలా చెప్పగలవు?'' అని అడిగాడు రంగనాధం. ‘‘అయ్యూ! పాండుతనయుడు ధర్మ రాజును తనకు తెలిసినవారిలో మంచి వారెవరో, చెడ్డవారెవరో చెప్పమంటే, ఆయనకు అందరిలోనూ మంచే తప్ప చెడు కనబడలేదు.

అదే దుర్యోధనుణ్ణడిగితే, ఆయనకు ఎవరిలోనూ చెడు తప్ప, మంచికనబడలేదట! ఈ కథ తమరు వినేవుంటారు!'' అన్నాడు పుల్లయ్య. రంగనాధం చప్పున పుల్లయ్య చేతులు పట్టుకుని, ‘‘నీ విషయంలో నాకో అనుమాన ముంది. ఇంత తెలివైనవాడివి నువ్వే స్వయంగా వ్యాపారం చేయక, నా దగ్గర ఎందుకు పనికి కుదిరావు?'' అని అడిగాడు. దానికి పుల్లయ్య వెంటనే, ‘‘అయ్యూ! భూసారం ఒక్కటే అయినా పళ్ళ చెట్లు పళ్ళు కాస్తే, పూలచెట్లు పూలు పూస్తాయి.

అలాగే తెలివి ఒక్కటే అయినా, మనుషులందరూ ఒకటి కాదు. మీ తెలివి వ్యాపారానికి పనికివస్తుంది. నా తెలివి సరైన యజమానిని ఎన్నుకునేందుకు పనికివస్తుంది,'' అన్నాడు. రంగనాధం, పుల్లయ్య వివేకాన్ని మెచ్చుకుని, వారం తిరక్కుండానే చంద్రన్నకు పట్నంలోని తన బట్టల దుకాణం అజమాయిషీ అప్పగించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం