తాజా కథలు @ CCK

ఆరాటం

2015-02-20 08:32:31 చిన్నారుల కథలు
ఏదైనా ముఖ్య విశేషముంటే, దాన్ని అందరికన్న ముందుగా తాను తెలుసుకుని, అందరికీ చెప్పాలని సూరప్ప ఆరాటం. ఆ తొందరలో వాడు చాలాసార్లు తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యడంవల్ల వాడి మాటలు ఎవరూ నమ్మేవారు కారు. ఇది సూరప్పకు చాలా బాధ కలిగించింది. కాని వాడు తన మీద లోకులకు గల అభిప్రాయం మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక రోజు ఊళ్ళో ఏదో గొడవ జరిగింది.

అలాటి గొడవలను పరిష్కరించడంలో పొరుగూరి కరణంగారికి మంచి పేరున్నది. అందుకని ఊళ్ళోవాళ్ళు ఆయనకు కబురు చేస్తే, మర్నాడు ఉదయం వస్తానని ఆయన చెప్పి పంపాడు. గొడవ పడిన ఇరుపక్షాలవాళ్ళూ మర్నాడు ఉదయం పొరుగూరి కరణంగారి కోసం ఒక చోట చేరి, చాలా సేపు ఎదురు చూశారు. ఎందువల్లనో ఆయన ఎంతకూ రాలేదు. చివరకు రెండు పక్షాల వాళ్ళూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయూరు.

పొరుగూరి కరణం అన్నమాట తప్పే మనిషి కాడు. ఆయన రాకపోవడానికి తప్పకుండా ఏదో పెద్ద కారణమే ఉంటుంది. అదేమిటో అందరికన్న తనే ముందుగా తెలుసుకుని, అందరికీ చెప్పాలని సూరప్ప ఆరాటపడి, మండుటెండనూ, భోజనం వేళనూ కూడా లక్ష్యపెట్టకుండా పొరుగూరు బయలు దేరాడు. ఊరి వెలుపలనే సూరప్పకు ఒక శవం ఎదురయింది. దారిలో కనిపించిన ఒక మనిషితో వాడు, ‘‘ఎవరిదా శవం? మామూలు మనిషిదిలాగాలేదే?'' అన్నాడు.

"ఈ ఊళ్ళో ఉండే ఒక్క గొప్పవాడిది," అన్నాడా మనిషి. "ఈ ఉళ్ళో గొప్పవాడెవరు?" అని సూరప్ప ఆ మనిషిని మళ్ళీ అడిగాడు. "మా కరణంగారి కన్న ఈ ఊళ్ళో గొప్పవాడెవరున్నారు?" అని ఆ మనిషి జవాబు చెప్పాడు. సూరప్పకు అంతా అర్థమైపోయింది. పాపం, ఆ ఊరి కరణంగారు పోయూడు.

అందుకే ఆయన ఈ ఉదయం తగువుతీర్చటానికి తమ ఊరికి రావడం జరగలేదు! ఈ అపూర్వ వార్త తమ ఊళ్ళో అందరికీ అందించడానికి సూరప్ప పరిగెత్తుకుంటూ వచ్చి, కనిపించిన ప్రతి మనిషికీ, "పాపం, ఈ ఉదయం పొరుగూరి కరణంగారు పోయూరు! అందుకే ఆయన ఈ ఉదయం రాలేదు. శవాన్ని నేను కళ్ళారా చూశాను!" అని చెప్పనారంభించాడు.

ఒక్కడు కూడా వాడు తెచ్చిన అద్భుత వార్తను నమ్మలేదు. సూరప్పకు చాలా బాధ కలిగింది. నిజం చెప్పినా తన మాట ఎవరూ నమ్మరెందుకు? తాను నిజం చెబుతాడని అందరికీ నమ్మకం కలిగేలా చెయ్యడం ఎలా? "అయ్యూ, కరణంగారు పోయినందుకు మన ఊరి పెద్దలు కొందరు వెళ్ళి పరామర్శించి రావడం అవసరం కూడా గనక, వెంటనే బయలుదేరండి. నిజం మీకే తెలుస్తుంది!" అన్నాడు సూరప్ప. అలా అన్నప్పటికీ వాడి మాటలు ఎవరూ పట్టించుకోలేదు.

"ఆ ఊరి కరణంగారి శవాన్ని చూశానంటున్నావు గదా, ఆ కరణంగారు అసలు ఎలా ఉంటారో నువ్వెప్పుడైనా చూశావురా?" అని కొందరు సూరప్పను అడిగారు. "అంత గొప్పవాడు పోతే ఆ వార్త తెలియడానికి శవాన్ని గుర్తించాలా?" అన్నాడు సూరప్ప. తనతోబాటు, చచ్చిపోయిన పొరుగూరి కరణంగారికి కూడా తన గ్రామస్థులు తీరని అన్యాయం చేస్తున్నారు! అందుచేత, ఆ పొరుగూరికి చెందినవాణ్ణి ఒకణ్ణి పిలుచుకు వచ్చి చెప్పిస్తే, తనపైన తన గ్రామంవాళ్ళకున్న దురభిప్రాయం పోతుంది.

ఇలా అనుకుని సూరప్ప మరోసారి పొరుగూరికి బయలుదేరాడు. దారిలో వాడికి ఒక పెద్దమనిషి ఎదురయ్యూడు. ఆయన ఫలానా గ్రామం నుంచి వస్తున్నట్టు అడిగి తెలుసుకుని, "ఈ ఉదయం మీ గ్రామ కరణంగారు చచ్చిపోయూరని కనీసం మీరైనా నమ్ముతారుగా!" అన్నాడు సూరప్ప. "నమ్మను గాక నమ్మను!" అన్నాడాయన. "ఎందుకు నమ్మరు?" అన్నాడు సూరప్ప ఆశ్చర్యంగా.

"నేనే ఆ గ్రామ కరణాన్ని గనక!" అన్నాడాయన. సూరప్ప నిశ్చేష్టుడయ్యూడు. వాడు ఎలాగో తేరుకుని, ఆ ఉదయం తనకూ, ఇంకో మనిషికీ జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. "అకస్మాత్తుగా ఇవాళ ఉదయం మా ఊరి పెద్ద షావుకారు పోవడంవల్ల మీ ఊరు రాలేకపోయూను. మా ఊళ్ళో నీకు తగ్గవాడు ఒకడున్నాడు. వాడు అబద్ధం చెప్పకుండానే, వినేవాడికి అబద్ధం స్ఫురించేటట్టు చెప్పగలడు.

చచ్చి పోయినవాడు గొప్పవాడన్నాడు. ఊళ్ళో నేను గొప్పవాణ్ణి అన్నాడు. ఈ రెండూ నువ్వు జోడించుకుని, నేనే చచ్చిపోయూననుకున్నావు. నువ్వు వాడి సంగతి తెలియక నమ్మావుగాని, మా ఊళ్ళో వాడి మాట ఎవరూ నమ్మరు," అన్నాడు పొరుగూరి కరణంగారు. సూరప్పకు జ్ఞానోదయం అయింది. అబద్ధం స్ఫురించేటట్టు నిజం చెప్పేవాణ్ణే ఎవరూ నమ్మరంటే, నిజం తెలుసుకోకుండానే గ్రామంలో వార్తలు చెప్పే తనను ఎవరూ నమ్మకపోవటంలో ఆశ్చర్యం ఏమున్నదీ?

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం