తాజా కథలు @ CCK

స్నేహితులు

2015-03-04 23:05:01 చిన్నారుల కథలు
కూనవరం అనే ఒక మారుమూల గ్రామంలో రామయ్య, సోమయ్య, కామయ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వ్యవసాయదారులైన ఆ ముగ్గురిలో రామయ్య, సోమయ్యలు తెలివైనవాళ్ళు. అయితే, కామయ్య మాత్రం ఆ ఇద్దరి స్నేహితుల సలహా లేనిదే చిన్న పని కూడా చేసేవాడు కాడు. పొలం పనులకు సంబంధించినదైనా, ఇంటి సమస్యలకు సంబంధించినదైనాసరే మిత్రులను సంప్రదించకుండా ఒక నిర్ణయూనికి వచ్చేవాడు కాడు. బాల్యస్నేహితుడైన కామయ్య, తమ మీద చూపుతూన్న నమ్మకానికి తగ్గట్టుగా, ఆ ఇద్దరు స్నేహితులు కూడా సరైన సలహాలిస్తూ అతనికి సాయపడేవారు.

ఒకయేడు పంటలు బాగా పండాయి. రాజధానీ నగరంలో జరిగే వసంతోత్సవాలకు వెళ్ళి రావాలనుకున్నారు రామయ్య, సోమయ్యలు. ఆ సంగతి తెలిసిన కామయ్య, వారిని కలుసుకుని తను కూడా వస్తానన్నాడు. ‘‘చాలా దూరప్రయూణం. వెళ్ళేది కొత్త ప్రదేశం. అనుకోని ఇబ్బందులు ఎదురైతే నువ్వు తట్టుకోలేవు,'' అని మిత్రులు ఎంత వారించినా వినకుండా, ‘‘మీరుండగా నాకేం భయం? నేనూ వస్తాను,'' అని పట్టుబట్టి వారివెంట బయలుదేరాడు కామయ్య.

మూడు రోజుల ప్రయూణం తరవాత ముగ్గురు మిత్రులూ ఒక అడవిగుండా వెళుతున్నారు. రెండు కొండల నడుమ చిన్న ఏరు పారుతోంది. దాన్ని దాటడానికి అక్కడున్న పుట్టిలో ముగ్గురు మిత్రులూ ఎక్కికూర్చున్నారు. పుట్టి నాలుగు బారలు సాగిందో లేదో ఏరు పొంగసాగింది. ఎగువ ఎక్కడో కురిసిన వర్షం కారణంగా నదీ ప్రవాహం ఉధృతంకాసాగింది. దిగ్భ్రాంతి చెందిన ముగ్గురు మిత్రులు ఒకరినొకరు, గట్టిగా పట్టుకున్నారు. ప్రవాహ వేగానికి పుట్టి ఎటో కొట్టుకుపోయింది. అలా ఎంతదూరం వెళ్ళిందో తెలియదుగాని, స్పృహలోకి వచ్చి, కళ్ళు తెరిచే సరికి వాళ్ళొక దీవిలో పడివున్నారు.

ఒకవైపు కాలు కదపలేని నీరసం; మరోవైపు దహించి వేస్తూన్న ఆకలి. దాపులనే విరగకాచిన ఒక మామిడి చెట్టు కనిపించడంతో రామయ్య వెళ్ళి ఒక పండును అందుకోబోయూడు. అంతలో, ‘‘ఎవడ్రావాడు, నా అనుమతి లేకుండా నా చెట్టు పండు కోసేది?'' అంటూ ఒక భూతం చెట్టుపై నుంచి కిందికి దూకింది.

భూతాన్ని చూడగానే హడలిపోయిన మిత్రులు మళ్ళీ ఏట్లోకి దూకడానికి ఉరకబోయూరు. వాళ్ళ భయూన్ని చూసి పరమానందంతో దిక్కులు పిక్కటిల్లేలా నవ్వుతూ, ‘‘భయపడకండి. ఇలారండి, మిమ్మల్నేం చెయ్యను,'' అన్నది భూతం.

ముగ్గురూ భయం భయంగా దాన్ని సమీపించారు. ‘‘ఈ దీవిలోకి మీరెలా వచ్చారు?'' అని అడిగింది భూతం. ముగ్గురూ జరిగిందంతా వివరించారు. అంతా విన్న భూతం వాళ్ళ మీద జాలిపడి, తినడానికి మామిడి పళ్ళనిచ్చింది. ఆకలి తీరాక మిత్రులు భూతానికి కృతజ్ఞతలు చెప్పారు. వాళ్ళ మంచితనానికి మురిసిపోయిన భూతం, ‘‘మీరు ఇక్కడి నుంచి కాలినడకన ఎక్కడికి వెళ్ళాలన్నా సాధ్యం కాదు. అందువల్ల మీకు మనిషికోవరం ఇస్తాను. అయితే, ఒక నిబంధన. ముగ్గురూ ఒకే వరం కోరకూడదు. అడగండి మరి,'' అన్నది.

‘‘నన్ను నా భార్యాపిల్లల వద్దకు చేర్చు,'' అన్నాడు రామయ్య. మరుక్షణమే అతడు ఇల్లు చేరాడు. ‘‘రానే వచ్చాను, వసంతోత్సవాలు చూసే వెళతాను. నన్ను రాజధానికే చేర్చు,'' అన్నాడు సోమయ్య.

భూతం ‘అలాగే' అంటూ అతన్ని రాజధానికి చేర్చింది. కామయ్య వంతు వచ్చింది. కాని అతనికి ఏం వరం కోరాలో ఓ పట్టాన తోచలేదు. మనిషికో వరం కోరుకుని ఇద్దరూ వెళ్ళిపోయూరే! ఇప్పుడు నేనేం వరం కోరాలో ఎవరిని అడగను? ఏం వరం కోరను? అనుకుంటూ సతమతం కాసాగాడు. ఆఖరికి అద్భుతమైన ఆలోచన తోచినట్టయి, ‘‘అడగనా?'' అన్నాడు. ‘‘అడుగు, ఆలస్యం దేనికి?'' అన్నది భూతం.

‘‘నాకు ఏం వరం అడగాలో తోచడం లేదు. అందుకు నా మిత్రుల సలహా అడగాలి. కాబట్టి వాళ్ళిద్దరనీ మళ్ళీ ఇక్కడికి రప్పించు,'' అన్నాడు కామయ్య. మరుక్షణమే భూతం-రామయ్య, సోమయ్యలను అక్కడికి తెచ్చి వదిలి, అదృశ్యమై పోయింది.

జరిగింది గ్రహించిన ఇద్దరు మిత్రులు, ‘‘ఏమిటి కామయ్యూ, ఇలా చేశావు!'' అని బాధతో నిట్టూర్చి, స్వస్థలం చేరుకునే మార్గం ఏమిటా అని దిగులుగా ఆలోచించసాగారు.

కొంతసేపటికి, ‘‘అడిగావా, నీ మిత్రులను సలహా!'' అంటూ భూతం మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయింది. కామయ్య నోరు తెరవలేదు. ఇద్దరు మిత్రులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ‘‘ప్రతిదానికీ మమ్మల్ని సలహాలడగడం ఇతని స్వభావం. ఇతడు మమ్మల్ని రోజూ సలహాలడిగే, మా ఊరి గ్రామదేవత గుడి ముందున్న రావి చెట్టు కిందికి ఇతన్ని చేర్చు. నీకు పుణ్యముంటుంది. అలాగే మమ్మల్ని మేము కోరుకున్న ప్రదేశాలకు చేర్చావంటే నీ మేలు ఈ జన్మకు మరిచిపోము,'' అని భూతాన్ని వేడుకున్నారు.

భూతం నవ్వి, కామయ్య కేసి తిరిగి, ‘‘సలహాలు తీసుకోవడంలో తప్పులేదు. అయితే, మన మంచి చెడ్డలు మనమే ఆలోచించి నిర్ణయూలు తీసుకోవడం అవసరం. మందమతులమై ప్రతిదానికీ ఇతరుల సలహాల మీద ఆధార పడితే, మనం చిక్కుల్లో పడడంతో పాటు ఎదుటివారూ ఇబ్బందులపాలుకాక తప్పదు!'' అంటూ ముగ్గురు మిత్రులనూ వారు వారు కోరిన స్థానాలకు చేర్చింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం