తాజా కథలు @ CCK

అదృష్టం

2015-06-09 07:05:01 చిన్నారుల కథలు
మునిపల్లె గ్రామంలో సాంబయ్య అనే రైతువుండేవాడు. భార్యా, పదిహేనేళ్ళ కూతురూ అతడి కుటుంబం. తండ్రి, తాతలు వదిలి పోయిన ఐదెకరాల వ్యవసాయభూమి అతడి ఆస్తి. దాపులనున్న కొండ ప్రాంతం నుంచి, ఒక నీటివాగు అతడి పొలంగుండా ప్రవహిస్తూండేది. గత నాలుగైదేళ్ళుగా వర్షాలు సరిగా కురవక పోవడంతో, ఆ చిన్న వాగు దాదాపు ఎండిపోయే స్థితికి వచ్చింది.

వాగులో బాగా నీరుండే రోజుల్లో, గ్రామస్థులతో పాటు సాంబయ్య కూడా తన పొలంలో జొన్నా, కందీ లాంటి మెట్టపైర్లతో పాటు కూరగాయలు కూడా పండిస్తూండేవాడు. ఇప్పుడు నీటికరువు రావడంతో, గ్రామంలోని కొందరు, ఏ కూలీనాలో చేసుకుంటూ బతకవచ్చునని, పట్టణానికి వలస పోవడం ప్రారంభించారు.

కాని, సాంబయ్య ఆలోచనలు మాత్రం - ఎక్కడో దండకారణ్య ప్రాంతాల దొరుకుతున్న మణిమాణిక్యాల మీదనే వున్నది. నెలరోజుల క్రితం అతడు ఇంటి అవసరాల కోసం పచారీ వస్తువులు కొనితెచ్చేందుకు పట్నం వెళ్ళి, ఆ రాత్రికి ఒక సత్రంలో దిగాడు. ఆ సమయంలో సత్రంలో వున్న ప్రయూణీకులు కొందరు, ఆ అరణ్య ప్రాంతాన దొరుకుతున్న విలువైన మణుల గురించి వింతగా చెప్పుకోసాగారు.

ప్రయూణీకుల్లో ఒకడు పెద్దగా నిట్టూర్చి, ‘‘దేనికైనా అదృష్టం వుండాలి! నా దూరపు బంధువుల్లో ముగ్గురు వాటి కోసం ఆ ప్రాంతాలకు వెళితే ఒక్కడికి మాత్రం ఆ విలువైన మణులు దొరికాయి. మిగిలిన ఇద్దరూ అనారోగ్యాలకు గురై ఇళ్ళకు తిరిగి వచ్చారు,'' అన్నాడు.

ఇది విన్న ప్రయూణీకుల్లో మరొకడు పెద్దగా ఆవులించి, ‘‘ఎవడికైనా తను అదృష్టవంతుడో కాదో తెలుసుకోవాలంటే ఇల్లొదిలి కొంత సాహసం చేయక తప్పదు,'' అన్నాడు.

‘‘అంతే మరి! సాహసే లక్ష్మీ అన్నారు కదా,'' అంటూ మిగిలినవాళ్ళు అతడికి వంతపాడారు. ఈ సంభాషణ విన్న సాంబయ్య వెంటనే ఒక నిర్ణయూనికొచ్చాడు. అతడు ఇల్లు చేరుతూనే భార్యను పిలిచి, సత్రంలో జరిగింది చెప్పి, ‘‘కొద్దికాలం పాటు, మీ అన్నగారి ఊరెళ్ళి అక్కడ వుండండి. ఈ మణుల విషయంలో నా అదృష్టం ఎలా వుంటుందో తేల్చుకోబోతున్నాను,'' అన్నాడు.

సాంబయ్య మొండితనం గురించి బాగా ఎరిగిన అతడి భార్య, భర్తతో చెప్పకుండా తన అన్నకు కబురు చేసింది. ఆయన మర్నాటికల్లా వచ్చి సంగతి తెలుసుకుని, సాంబయ్యకు దురాశ కీడుకు దారితీస్తుందని చెప్పి, ‘‘ఏ ప్రాంతానా సంవత్సరాల తరబడి అసలు వానలంటూనే లేకుండా పోవు. నాలుగైదు నెలల్లో రానున్న తొలకరికి వానలు ఇక్కడ కురవ్వొచ్చు,'' అని హితవు చెప్పాడు.

అయినా, సాంబయ్య, బావమరిది మాటలు పెడచెవిని పెట్టి, మణులు సంపాయించేందుకు అరణ్యమార్గం పట్టి, ఆరు నెలలు మరి కొందరితో పాటు వాటి కోసం వెతికి వేసారి, అనారోగ్యానికి గురై ఇంటికి తిరిగివచ్చాడు.

అతడు కోలుకుని మామూలు మనిషి కావడానికి రెండు వారాలు పట్టింది. అంతలో ఆ చుట్టు పక్కల జడివానలు ప్రారంభమయినై. అతడి పొలం గుండా ప్రవహించే నీటివాగు, కొండల మీది నుంచి చిన్న చిన్న రాళ్ళతో పాటు సెలయేరులా ప్రవహించసాగింది.

ఎడతెరిపి లేని ఆ నీళ్ళధాటికి సాంబయ్య పొలంలోనూ మోకాళ్ళలోతు నీళ్ళు నిండాయి. అంత నీళ్ళతో పొలం దున్నడానికి వీలుకాదు గనక, పొలంగట్టు తెగగొట్టాడు సాంబయ్య. అతడు పొలంలోకి వచ్చి చేరిన రాళ్ళను ఏరి పారేస్తూండగా, ఒక చోట చెల్లాచెదరుగా పడివున్న చిన్న రాళ్ళలో రెండు రాళ్ళు మెరుస్తూ కంటబడినై. అతడు వాటిని ఆత్రంగా తీసుకుని ఇంటికి వెళ్ళి, బావమరిదికి చూపించాడు. ఆయన వాటిని కొద్దిసేపు పరీక్షగా చూసి, ‘‘ఇవి సాన బట్టని మణులు. చూశావా, ఎక్కడో కాదు, నీ అదృష్టం నీ పొలంలోనే వున్నది!'' అన్నాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం