తాజా కథలు @ CCK

మురుగులు

2015-03-25 17:05:01 చిన్నారుల కథలు
ఒక ఊళ్ళో రామయ్య అనే ఆయన ఉన్నాడు. ఆయనకు అరవై యేళు్ళ నిండాయి. ఆయన కొడుకు సుబ్బారాయుడు. అతని భార్య దుర్గాంబ. దుర్గాంబకు ఆంజనేయులు అనే తము్మడు ఒకడు ఉన్నాడు. వీరంతా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. రామయ్య చేతులకు నాలుగయిదు వందల విలువ చేసే బంగారు మురుగులు ఉన్నాయి.

దుర్గాంబ ఎప్పుడూ వాటి వంక ఆశగా చూస్తూండేది. వాటి కోసమైనా తన కోడలు తన కింత గంజి పోస్తుంది లెమ్మని రామయ్య అనుకునేవాడు. తండ్రి చనిపోయినాక వాటిని చెడగొట్టి, తన పెళ్ళాం ఇష్ట ప్రకారం నగలు చేయించాలని సుబ్బారాయుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు రామయ్య మామూలు ప్రకారం సాయంత్రంవేళ పొలంలోని మామిడిచెట్టు కింద కూర్చుని, ఏదో ఆలోచనలో పడిపోయి చీకటి పడినదాకా ఇంటికి రావటం ఏమారాడు. చీకటి పడితే ఆయనకు బొత్తిగా చూపు ఆనదు.

ఆలోచన కట్టిపెట్టి ఆయన చుట్టూ కలయజూసి కంగారుపడ్డాడు. ``ఎవరర్రా? దగ్గిరలో ఎవరన్నా ఉన్నారా?'' అని ఆయన కేకపెట్టాడు, ఎవరైనా సాయంగా వచ్చి తనను ఇంటికి చేరుస్తారని. కొంచెం దూరంగా పొలంలో పని చేసుకుంటున్న ఆంజనేయులు ముసలాయన పెట్టిన కేక విని, ఆయన పరిస్థితి అర్థం చేసుకుని, దగ్గిరికి వచ్చి, కొడవలి ఆయన పీకకు పెట్టి, మారు గొంతుకతో, ``మురుగులు ఇచ్చెయ్యి!'' అన్నాడు. చేసేది లేక, రామయ్య తన మురుగులు తీసి ఆంజనేయులుకు ఇచ్చాడు.

వాటిని తీసుకుని ఆంజనేయులు వెళ్ళిపోయాడు. తరవాత ఎలాగో రామయ్య ఇంటికి చేరాడు.

రామయ్య వద్ద నుంచి మురుగులు కాజేసిన ఆంజనేయులు స్వర్ణకారుడు కనకరాజు దగ్గిరికి వెళ్ళి, ``నీకు సగం వాటా ఇస్తాను. ఈ బంగారం అమ్మి పెట్టు,'' అన్నాడు. అతడు సరేనన్నాడు. పొద్దుపోయి ఇల్లు చేరిన మామగారి చేతులు బోడిగా ఉండటం చూసి, దుర్గాంబ ఉండబట్టలేక, మురుగులు ఏవీ అని అడిగింది. ``నీకు నగలు చెయ్యమని స్వర్ణకారుడికి ఇచ్చాను,'' అన్నాడు రామయ్య సమయస్ఫూర్తితో.

దుర్గాంబ సంతోషపడి, తమ కోసం ప్రత్యేకంగా చేసుకున్న వంటకాలు కూడా ఆ రాత్రి మామగారికి వడ్డించింది. కనకరాజు అర్ధరాత్రి అయినా ఏదో పని చేస్తూండటం గమనించి, అతని భార్య మీనాక్షి లేచి వచ్చి, ఇంత పొద్దుపోయి ఏం చేస్తున్నావని అడిగింది. భార్యను చూసి కంగారుపడి కనకరాజు చెయ్యి కాల్చుకుని, పోయి పడుకోమని ఆమెను కసిరాడు. ఆమెకు అనుమానం వేసింది, అయినా వెళ్ళి పడుకున్నది.

దుర్గాంబ కోడికూయక ముందే లేచి కనకరాజు ఇంటికి పరుగు తీసింది. కనకరాజు ఇంట్లో లేడు, కాలవగట్టుకు వెళ్ళాడు. ``మా మామగారు బంగారు మురుగులు చెడగొట్టి నాకు నగలు చెయ్యమని ఇచ్చారట. నాకు ఫలానా ఫలానా నగలు కావాలి. మీ ఆయన రాగానే ఒకసారి వచ్చి, నాతో మాట్లాడమని చెప్పు,'' అని మీనాక్షికి చెప్పి, దుర్గాంబ ఇంటికి తిరిగి వచ్చింది. కనకరాజు ఇంటికి రాగానే మీనాక్షి అతనితో దుర్గాంబ చెప్పమన్నట్టు చెప్పింది.

అతను మొదట ఆశ్చర్యపడి, ``ఆ సరుకు వారిది కాదులే,'' అని తన భార్యకు నచ్చచెప్పాడు. తాను స్వర్ణకారుడి ఇంటికి వెళ్ళివచ్చిన సంగతి ఇంట్లో అందరి ముందూ దుర్గాంబ చెప్పింది. రామయ్య కూడా ఎంతగానో ఆశ్చర్యపోయాడు. కాని, ఇద్దరూ బయటపడలేదు. ఆతరవాత వీలు చూసుకుని ఆంజనేయులు కనకరాజు వద్దకు వెళ్ళి, మురుగుల ప్రసక్తి తెచ్చాడు. గుడినీ, గుళ్ళో లింగాన్నీ కూడా మింగగల కనకరాజు, ``ఏం మురుగులు? నువు్వ నా కేమీ ఇయ్యలేదు. కావలిస్తే న్యాయస్థానానికి వెళు్ళ,'' అన్నాడు.

అప్పటికి అతనికి ఆ మురుగులు రామయ్య వన్న సంగతి కూడా తెలిసింది. ఈ మాటకు ఆంజనేయులు తెల్లబోయి, తాను దొంగ అన్న సంగతి రుజువు చేసుకోలేక, చేసిన దానికి పశ్చాత్తాపపడుతూ, ఇంటి దారి పట్టాడు. రామయ్య మాత్రం రహస్యంగా తన కొడుకుతో, తన మురుగులు క్రితం సాయంకాలం ఎవరో బలాత్కారంగా తీసుకున్నారనీ, చూపు ఆనక తాను ఆ మనిషిని గుర్తుపట్టలేక పోయినాననీ చెప్పాడు.

ఈ మాట చెవిని పడిన అనంతరం సుబ్బారాయుడు, తన బావమరిది ఆంజనేయులు స్వర్ణకారుడి ఇంటికి వెళ్ళి రావటం ఒక కంట కనిపెట్టాడు. ఆంజనేయులు వచ్చి కనకరాజుతో మాట్లాడేటప్పుడు తలుపు చాటున పొంచి ఉండి, కనకరాజు భార్య మీనాక్షి అంతా విని, సంగతి గ్రహించింది. పుట్టింటి వారు మీనాక్షికి ఏమీ పెట్టలేదని కనకరాజు ఎప్పుడూ సాధించే వాడు. ఆ సాధింపులు వినలేక పోయేది మీనాక్షి.

కిందటి రాత్రి తన భర్త కరిగించిన బంగారం తాను కాజేసి, తన పుట్టింటి వారికిచ్చి నగలు చేయించి తెచ్చుకుంటే తన భర్త సాధింపులు కట్టుపడతాయని ఆమె అనుకున్నది. భర్త అలా బయటికి వెళ్ళగానే మీనాక్షి బంగారం సంగ్రహించి తన బొడ్డులో దాచుకున్నది. బయటి పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి, కనకరాజు, బంగారం కనపడక పోయేసరికి, తన పెళ్ళాం మీద ఎగిరిపడ్డాడు.

తనకు దాని ఊసే తెలియదని ప్రమాణాలు చేసింది మీనాక్షి. కనకరాజు తనకు చేసిన మోసానికి, అతన్ని చంపి కసి తీర్చుకోవాలని ఆంజనేయులు అర్ధరాత్రివేళ కనకరాజు ఇంటికి వచ్చి, ఇంటి బయట గల చెట్లలో ఒకదాని చాటున పొంచి, అవకాశం కోసం చూస్తూ నిలబడ్డాడు. మురుగుల విషయంలో ఆంజనేయులుకూ, కనకరాజుకూ ఏదో సంబంధం ఉందని అనుమానించిన సుబ్బారాయుడు, ఆంజనేయులును వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండి, అతని వెనకనే తాను కూడా వచ్చి, ఒక పొద చాటున దాగి ఆంజనేయులు మీదనే దృష్టి ఉంచాడు.

ఇంట్లో ఉన్న బంగారం ఇంట్లోనే మాయమయిందంటే అది భార్య పనే అనుకుని, నిద్రపోతున్నట్టు నటించి, పెళ్ళాన్ని కనిపెట్టసాగాడు కనకరాజు. బంగారం తన వద్దనే ఉండటం మంచిది కాదనుకుని మీనాక్షి చెంబుతో నీళు్ళ పట్టుకుని, ఇంటి నుంచి బయటికి వచ్చి, ఊరు చివరకు బయలుదేరింది. దొంగనిద్ర నటిస్తున్న కనకరాజు ఆమె వెనకనే బయలుదేరాడు.
వాళ్ళిద్దరినీ చూసి, వాళు్ళ ఎక్కడికి పోతున్నదీ అర్థంగాక, ఆంజనేయులు కనకరాజు వెనకగా తాను కూడా బయలుదేరాడు. ఆంజనేయులు వెనకగా సుబ్బారాయుడు కూడా బయలుదేరాడు. ఈ నలుగురిలో ఎవరికీ తమ వెనక ఎవరో వస్తున్న సంగతి తెలియదు. మీనాక్షి తాను ఒంటరిగా పోతున్నాననే అనుకున్నది. కనకరాజు తన భార్యను తాను ఒక్కడే అనుసరిస్తున్నాననుకున్నాడు.
అలాగే ఆంజనేయులుకు తన ముందున్న ఇద్దరూ తెలుసుగాని, తన వెనక వస్తున్న సుబ్బారాయుడి సంగతి తెలీదు. ఈ నలుగురూ పిల్లుల లాగా ఒకరి వెనకగా ఒకరు పోతూండటం వీధిలో అరుగు మీద నిద్రపోతున్నట్టు పడుకుని ఉన్న ఒక వ్యక్తి గమనించి, సుబ్బారాయుడి వెనకగా ఎవరూ లేకపోవటం చూసి, తాను అతనివెంట బయలుదేరాడు. మీనాక్షి ఊరి చివర పాడుబడ్డ దేవాలయం దగ్గిర ఆగి, అక్కడ చిన్న గుంటలో బంగారం ఉంచి, దాని మీద ఇంత మట్టి కప్పి, ఇంటికి వెళ్ళిపోయింది.
వెంటనే మిగిలిన ముగ్గురూ ఆ గుంట మీదికి ఒక్కసారిగా దూకి, దాని కోసం తన్నుకోసాగారు. ఇంతలో, ``ఆగండి!'' అని వెనక వచ్చిన మనిషి గట్టిగా గర్జించాడు. ముగ్గురూ వెనక్కి తిరిగిచూసి, ఆ కేక పెట్టినది ఆ ఊరి రాజు అని గ్రహించి, ఆయన కాళ్ళమీద పడ్డారు. రాజు వాళ్ళ కథ అంతా విని, బంగారాన్ని దొంగిలించినందుకు ఆంజనేయులునూ, తోడుదొంగ అయి, నమ్మక ద్రోహం చేసినందుకు కనకరాజునూ శిక్షించి, బంగారాన్ని రామయ్యకు తిరిగి ఇప్పించాడు. కాలక్రమాన దుర్గాంబ ఆ బంగారంతో నగలు చేయించుకున్నది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం