తాజా కథలు @ CCK

రాజకుమారులు

2015-05-12 13:05:01 చిన్నారుల కథలు
వింధ్యారణ్య సమీపంలో విద్యాపతి నడుపుతూన్న గురుకులాశ్రమంలో సునీతి అనే పేదవిద్యార్థితో జయవర్మ, అజయవర్మ అనే ఇద్దరు కేకయ రాజకుమారులు చాలా స్నేహంగా ఉండేవారు. జయ, అజయవర్మలు సోదరులే అయినప్పటికీ ఈర్షా్యద్వేషాలతో తరచూ పరస్పరం గొడవలు పడేవారు. సునీతి అలాంటి సందర్భాల్లో వారిద్దరినీ సముదాయించి, రాజీ చేస్తూ గురుకులంలో వారికి బాగా దగ్గరయ్యాడు. సునీతి నిత్యాగ్నిహోత్రం కోసం కావలసిన సమిథలు, దర్భలు తేవడానికీ; తమ విలువిద్యా ప్రావీణ్యాన్ని పరిశోధించుకోవడానికి జయ, అజయవర్మలూ రోజూ అడవికి వెళ్ళేవారు. ఒకరోజు సునీతి దర్భల కోసం ఒంటరిగా అడవికి వెళ్ళాడు.

జయ, అజయవర్మలు అంతకు ముందే అడవిని చేరారు. వారిద్దరూ పక్కపక్కగా నిలబడి బాణ ప్రయోగం చేస్తూండగా, నెత్తి మీద మణితో ఒక సర్పం వెళుతూ కనిపించింది. వారు దాని మీద బాణాలు ప్రయోగించారు. అది ఆవేశంతో ఇద్దరినీ కాటువేసి, దాపుల చెట్టుకింద వున్న పుట్టలోకి దూరింది. జయ, అజయవర్మలు నురగలు కక్కుతూ పడిపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన సునీతి, మిత్రుల దుస్థితి చూసి విషాదం చెందాడు.

ఆ పుట్టలో వాసుకి వంశానికి చెందిన సర్పరాజం ఉందని తమ గురువు ఎప్పుడో చెప్పిన సంగతి గుర్తురావడంతో, దాన్ని ప్రసన్నం చేసుకునే స్తవాన్ని ఏకాగ్ర చిత్తంతో పఠించి, ``సర్పరాజమా! మహావీరులై దుష్టశిక్షణ చేసి, రాజ్యానికి మేలు చేసే ఈ రాజకుమారులకు అకాల మరణం ప్రాప్తించకూడదు. కరుణించి వీరికి ప్రాణభిక్ష ప్రసాదించు,'' అని భక్తితో ప్రార్థించాడు. కొన్ని క్షణాలలో పుట్టనుంచి, ``స్నేహధర్మంతో నీ మిత్రులను బతికించ మంటావనుకున్నాను.

కాని వీరి శౌర్యం దేశానికి అవ సరం గనక, వీరికి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థించావు. నీ ఉన్నత ఆశయానికి సంతసించి, వారి దుందుడుకు చర్యను క్షమించి, ఓటమి ఎరుగని వీరులుగా వారిని ఆశీర్వదించి బతికిస్తాను. నువు్వ తలుచుకుంటే మాత్రమే వారిని ఓడించగలవు; హతమార్చగలవు. భవిష్యత్తులో నీకెంత కోపం వచ్చినా స్నేహధర్మం పాటించి వాళ్ళ మీద కయ్యానికి వెళ్ళనని మాట ఇవ్వగలవా?'' అన్న కంఠస్వరం వినిపించింది.

``అవసరమయితే, నా ప్రాణాలర్పిస్తానుగాని, వారి జోలికి వెళ్ళను. నా తనువులో ప్రాణ మున్నంతవరకు స్నేహధర్మాన్ని పాటిస్తాను,'' అన్నాడు సునీతి కన్నీరు కారుస్తూ. మరుక్షణమే ఇద్దరు రాజకుమారులూ నిద్రనుంచి మేల్కాంచినట్టు లేచి కూర్చున్నారు. అప్పుడు మళ్ళీ పుట్టలో నుంచి, ``రాజ కుమారులారా, మీ మిత్రుడు సునీతి ప్రార్థన మేరకు మీ అపరాధం క్షమించి మిమ్మల్ని సజీవుల్ని చేశాను. సునీతి తప్ప మిమ్మల్నెవరూ ఓడించలేరు. స్నేహధర్మం పాటిస్తూ సుఖంగా జీవించండి,'' అన్న కంఠస్వరం వినిపించింది. జయవర్మ, అజయవర్మలు సునీతితో, ``మా ప్రాణాలు కాపాడావు.

నీమేలు ఈ జన్మకు మరిచిపోము. నువు్వ ఏది కోరినా ఇస్తాం,'' అన్నారు
కృతజ్ఞతతో. ``అంతా, ఆ సర్పరాజు కరుణ. మీరిప్పుడు అజేయులైన వీరరాజకుమారులు. మీరు కలిసివుంటే మిమ్మల్ని జయించేవారు లేరు. మీ అన్నదము్మల ఐకమత్యమే నాకు కావలసింది. అంతకు మించి నేను కోరుకునేదేదీ లేదు,'' అన్నాడు సునీతి. ``మేమెప్పుడూ కలిసే ఉంటామని ప్రమాణం చేస్తున్నాం,'' అన్నారు అన్నదము్మలు ముక్త కంఠంతో. ఆ తరవాత ముగ్గురూ కలిసి గురుకులాశ్రమానికి తిరిగి వెళ్ళారు.

ముగ్గురు మిత్రులకూ విద్యాభ్యాసం పూర్తి కావస్తూండగా విద్యాపతి ఒకనాడు సునీతిని చేరబిలిచి, ``నాయనా, నా గురుకులంలో విద్యపూర్తయిందిగాని, నువు్వ నేర్వవలసింది ఇంకా ఎంతో వుంది. నైమిశారణ్యంలో విద్యాసాగరుడి గురుకులాశ్రమానికి వెళ్ళి, నేను పంపానని చెప్పి, అక్కడ మరో మూడేళు్ళ విద్యనభ్యసించిరా. అది నీకు ఎంతో ఉపయోగకరం,'' అన్నాడు.

సునీతి సంతోషంగా మరునాడు ఉదయం నైమిశారణ్యానికి బయలుదేరాడు. జయవర్మ, అజయవర్మలు విద్య పూర్తి చేసుకుని గురుకులం నుంచి రాజధానికి తిరిగివచ్చారు. అరణ్యంలో జరిగిన ఉదంతాన్ని తండ్రికి ఉత్సాహంగా చెప్పారు. దానిని విన్న తండ్రి, ``మీరు సర్పరాజం నుంచి అజేయులని వరం పొందినప్పటికీ, సునీతి తలుచుకుంటే మీకు ఓటమి తప్పదు. బలవంతుడైన శత్రువు తలమీద వేలాడే ఖడ్గంలాంటి వాడు. అలాంటివాడు పక్కనే ఉన్నప్పుడు మీరు అజేయులెలా అవుతారు?'' అన్నాడు విచారంగా.

తండ్రి మాటల్లోని నిజాన్ని అన్నదము్మలు గ్రహించి మౌనంగా ఊరుకున్నారు. అప్పుడు తండ్రి, ``నాకు సునీతి మీద కోపం లేదు. నాకతడు పుత్రభిక్ష పెట్టినవాడు. అయితే, స్నేహధర్మం కొద్దీ మీరతన్ని చేరదీస్తే, సర్ప వృత్తాంతం పదిమందికీ తెలిసి, పరాజయ భయంతో చేరదీశారని శత్రువుల మధ్య మీరు అవహేళనకు గురయ్యే ప్రమాదం ఉంది. కేకయ రాజ్యాన్ని రెండుగా విభజించి, చెరోభాగానికి మిమ్మల్ని రాజులుగా చేస్తాను. మీరిద్దరూ ఐకమత్యంతో మసలుకోండి. ఎట్టి పరిస్థితులలోనూ సునీతిని మాత్రం మీ దరి దాపులకు రానీయకండి,'' అన్నాడు.

అన్నదము్మలు అందుకు సరేనన్నారు. తన కుమారులిద్దరూ తమ మధ్య కలహించుకోరని తండ్రి సంతృప్తి చెందాడు. కేకయ రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి అన్నదము్మలిద్దరినీ పట్టాభిషిక్తుల్ని చేశాడు. కొన్నాళ్ళకు ఇద్దరికీ వివాహాలయ్యాయి. జయవర్మకు కూతురు పుట్టింది. అజయవర్మకు సంతానం కలగలేదు. అందువల్ల, జయవర్మ కూతురినే అతడు తన సొంత కూతురిగా భావించసాగాడు. ఆమెకు అయిదేళ్ళయింది.

అక్కడ నైమిశారణ్యంలోని విద్యాసాగరుడి వద్ద మూడేళ్ళ పాటు ఉన్నత విద్యాభ్యాసం చేసి వింధ్యారణ్యానికి తిరిగి వచ్చిన సునీతి గురువుతో,``నా మిత్రులిద్దరూ ఇప్పుడు రాజులయ్యారు కదా? మీ ఆశీస్సులతో వాళ్ళ ఆస్థానానికి వెళ్ళి ఏదైనా జీవనోపాధి వెతుక్కుంటాను. నా జీవితం సుఖంగా గడిచిపోతుంది,'' అన్నాడు. ఆ మాటవిని గురువు కొంత సేపు మౌనంగా ఆలోచించి, ``నాయనా, రాజుల చెలిమి పాములతో చెలగాటం వంటిది.

దానిని నమ్మ కూడదు. నాకు వయసు పైబడుతన్నది. నా తదనంతరం నువు్వ ఈ గురుకుల బాధ్యతలు స్వీకరించగలవని ఆశిస్తున్నాను. అందుకే నిన్ను ఉన్నత విద్యకోసం విద్యాసాగరుల వద్దకు పంపాను. ఇక్కడ ఉండడమే నీకు శ్రేయోదాయకం,'' అన్నాడు. సునీతి మొదట అందుకు అంత ఆసక్తి కనబరచకపోయినప్పటికీ, ఆ తరవాత నెమ్మదిగా ఆలోచించి, గురుకులాశ్రమ బాధ్యతలు స్వీకరించి, సక్రమంగా నిర్వర్తించసాగాడు.

అతడు పెళ్ళి చేసుకోలేదుగాని, గురుకులాశ్రమంలోని విద్యార్థులలో సువీరుడనే ఒక పదేళ్ళ క్షత్రియ కుమారుణ్ణి ఎంపిక చేసి, అతనికి క్షత్రియోచిత విద్యలు నేర్పి చక్కని వీరుడిగా శిక్షణ నివ్వసాగాడు. ఇలా పదేళు్ళ గడిచి పోయాయి. ఒకనాడు సువీరుడు ఏదో పని మీద కేకయ రాజధానికి వెళ్ళి గుర్రం మీద గురుకులానికి తిరిగి వస్తున్నాడు. అరణ్య ప్రాంతంలో హఠాత్తుగా, ``కాపాడండి, కాపాడండి,'' అన్న స్త్రీ ఆర్తనాదం విని గుర్రాన్ని ఆపి వెనక్కు తిరిగి చూశాడు.

వేగంగా వెళుతూన్న రథంలో ఒక యువతి జోడు గుర్రాలను అదుపు చేయలేక కేకలు పెడుతున్నది. సువీరుడు ఒక్క గెంతున రథంలోకి దూకి గుర్రాలను అదుపు చేసి ఆ యువతిని కాపాడాడు. ఆమె కృతజ్ఞతతో అతడి కేసి చూసింది. కొంతసేపటికి అక్కడికి నలుగురు చెలికత్తెలు రావడంతో, రథంలోని యువతి వనవిహారానికి వచ్చిన కేకయ రాజ్య యువరాణి ఇందువదన అని సువీరుడికి తెలిసింది.

సువీరుడు గురుకులానికి వచ్చి, మార్గ మధ్యంలో జరిగిన విషయం గురించి, గురువుకు చెప్పాడు. ఆ మాట విని సునీతి పరమానందం చెంది, రెండు రోజుల తరవాత సువీరుణ్ణి వెంటబెట్టుకుని కేకయ రాజధానికి బయలుదేరాడు. ఆయన్ను చూడగానే జయ, అజయవర్మలిద్దరూ సాదరంగా స్వాగతం పలికారు. ``ఎలా ఉన్నావు మిత్రమా? పాలనా వ్యవహారాలలో తల మునకలుగా ఉండడంతో ప్రాణ మిత్రుడివైన నీ మాటే మరిచాం,'' అన్నాడు జయవర్మ. ``నా మిత్రులైన మీరిద్దరూ ప్రజారంజకంగా పాలన చేయడం నాకెంతో ఆనందంగా ఉంది.

గురువుగారి తరవాత నేను గురుకులాశ్రమ బాధ్యతలు స్వీకరించడం వల్ల ఇటు రాలేకపోయాను,'' అన్నాడు సునీతి. పక్కనవున్న యువకుడు ఎవరన్నట్టు అజయవర్మ సువీరుడికేసి చూశాడు. ``అతడు క్షత్రియ కుమారుడు సువీ రుడు. నా ప్రియ శిష్యుడు. సాటిలేని మేటి వీరుడు. నాకు పుత్రసమానుడు. అతడి వివాహ ప్రయత్నం మీదే ఇటువచ్చాను. మూడు రోజుల క్రితం, వనవిహారానికి వెళ్ళిన యువరాణి ఇందువదనను చూశానని కూడా చెప్పాడు,'' అన్నాడు సునీతి. ``ఎవరూ? ఇందువదనను ప్రాణాపాయం నుంచి రక్షించిన వీరుడా? ఆ క్షణం నుంచి ఆమె ఇతన్ని గాఢంగా అభిమానిస్తున్నది.

ఆమెనిచ్చి సంతోషంగా వివాహం జరిపిస్తాం. స్నేహధర్మాన్ని పాటించిన ప్రాణమిత్రుడివైన నువు్వ, ఈ క్షణం నుంచి మా ఆత్మబంధువు కూడా కావడం పరమానందం కలిగిస్తున్నది,'' అన్నాడు జయవర్మ. ``చాలా సంతోషం. క్షత్రియధర్మాన్ని పాటిస్తూనే, స్నేహధర్మాన్ని మరిచిపోని మీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది. సువీరుడి పాలనలో మీ రాజ్య ప్రజలు సర్వసుఖాలూ అనుభవించగలరు,'' అన్నాడు సునీతి. ఇందువదన, సువీరుల వివాహంతో కేకయ దేశం మళ్ళీ ఒకే రాజ్యమయింది. సువీరుడు ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి ముగ్గురు మిత్రులకూ ఆనందం కలిగించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం