తాజా కథలు @ CCK

బతకడానికి ఎన్ని మార్గాలు లేవు ?

2015-05-22 03:05:02 చిన్నారుల కథలు
రంగాపురంలోని హనుమంతు తన ఇరవైయవ యేట ఒక పడవ ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. బతుకు తెరువుకు దిక్కుతోచక నిలబడ్డ హనుమంతును, అతడి తండ్రి స్నేహితుడు నాగయ్య చేరదీసి ఆదరించాడు. నాగయ్య సలహా ప్రకారం ఆయన దగ్గరే అప్పు తీసుకుని   హనుమంతు నాలుగు మేక పిల్లల్ని కొన్నాడు. వాటికి బాగా తిండిపెట్టి మేపాడు. అవి పెద్దయ్యాక వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో నాగయ్య అప్పు తీర్చేయడమేగాక, మరొక పది మేకపిల్లల్ని కొని మేపడం మొదలు పెట్టాడు. తిండికీ, బట్టకూ ఎలాంటి లోటూ లేకుండా రోజులు గడవసాగాయి.

కొన్నాళ్ళకు హనుమంతు పేరు మేకల హనుమంతుగా మారిపోయింది. రెండు మూడేళ్ళలో అతని వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. ఒక పేదింటి అమ్మాయి మంగమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెకు జంతువులన్నా, పక్షులన్నా ప్రాణం. భర్త చేస్తూన్న మేకల వ్యాపారం ఆమెకు అసలు నచ్చలేదు. కొత్త కాబట్టి భర్తను ఏమీ అనలేక, తనూ సర్దుకుపోలేక సతమతమవుతూ చాలా ఇబ్బంది పడసాగింది.

కొన్ని రోజులు గడిచాక ఒకనాడు ధైర్యం చేసి, భర్తతో వ్యాపార విషయం మెల్లగా ప్రస్తావించింది. అయితే ! అతడు, " ఇది వ్యాపారం, తప్పదు,'' అని ముక్తసరిగా జవాబివ్వడంతో మరేమీ మాట్లాడలేకపోయింది. ఒకనాడు సంతకు వెళ్ళి వచ్చిన భర్త స్నానానికి నీళ్ళు తోడి, అన్నం వడ్డిస్తూ, " అంత ప్రేమగా పెంచిన ఆ మేకను కసాయివాడికి ఎలా అప్పగించావయ్యా ? నీకు మనసెలా ఒప్పింది ?'' అని అడిగింది మంగమ్మ.

"అది అంత లావుగా, బొద్దుగా ఉందిగనకే మంచి ధర పలికింది,'' అన్న భర్త మాటకు అడ్డు తగులుతూ, " ఇలాంటి కసాయిపని చేస్తున్నావు గనకే, ఇంకా మనకు పిల్లలు పుట్టలేదు. అయినా ! బతకడానికి ఎన్ని మార్గాలు లేవు ? రెండెకరాల పొలం కౌలుకు తీసుకుందాం. దాంతోపాటు రెండు గేదెలు కొనుక్కుంటే, పాల వ్యాపారం చేసుకుంటూ హాయిగా బతకవచ్చు,'' అన్నది మంగమ్మ. "చాలు నీ బోడి సలహా. సంపాయించి తెచ్చి ఇస్తున్నాను కదా. ఇంట్లో కూర్చుని ఎన్నయినా చెప్పగలవు. నోరు మూసుకుని వెళ్ళి పడుకో,'' అంటూ ఇంత తిని వెళ్ళి పడుకున్నాడు హనుమంతు.

మరునాడు నిద్రలేస్తూనే హనుమంతు భార్యతో, " గంగాపురం భూస్వామి కొడుక్కి రేపు పుట్టెంటుకలు తీస్తున్నారట. గ్రామ దేవతకు బలి ఇవ్వడానికి మేకపిల్ల కావాలని కబురు చేశారు. తెల్లవారేసరికి బలి ఇవ్వాలట. రాత్రికి రాత్రే తోలుకు రమ్మన్నారు. మంచి బేరం. కొట్టంలో సరైన మేకపిల్ల లేదు. నువ్వు మేపుతున్నావు కదా. దాన్ని సాయంకాలం తోలుకుపోతాను,'' అన్నాడు. ఆ మాట వినగానే మంగమ్మ మనసు విలవిలలాడింది.

ఒక కంటి చూపు సరిగా లేదని ఆ మేకపిల్లపై కనికరంతో మంగమ్మ దాన్ని బిడ్డలా పెంచుతున్నది. ఇప్పుడు దాన్ని అమ్ముతానంటున్నాడు భర్త. వద్దని బతిమలాడింది. కానీ , హనుమంతు ఏమాత్రం పట్టించుకోలేదు. "కావాలంటే నువ్వు మరొక మేకపిల్లను   సాకు,'' అంటూ ఆ సాయంకాలం మేకపిల్లను తోలుకుని గంగాపురం బయలుదేరాడు. ఇంతకు ముందు ఇలా రాత్రి వేళ రెండు మూడుసార్లు మాత్రమే వెళ్ళాడు. మామూలుగా ఉదయమే వెళుతూ ఉంటాడు. ఆ రోజన  హఠాత్తుగా ఉరుములు మెరుపులతో మబ్బులు పట్టడంతో మరీ చీకటిగా ఉంది. మామూలు దారిగుండా వెళితే, ఎక్కువ సమయం పడుతుందని అడ్డదారిగుండా నడవసాగాడు.

అంత చీకటి దారిలో నడుస్తూన్న అతడికి మొదటిసారిగా భయంవేసింది. అడుగుల వేగం పెంచాడు. మార్గ మధ్యంలో దారి పక్కన గట్టులేని ఒక నేలబావి ఉంది. తొందరగా వెళ్ళాలన్న ఆదుర్దాలో, హనుమంతు ఆ బావి సంగతి మరిచాడు.

దాని పక్కగా వెళుతూ కాలుజారి ఆ బావిలో పడిపోయాడు. భయంతో కేకలు వేశాడు. లోతుబావి కావడంతో అతడి   కేకలు బయటకు వినిపించలేదు. హనుమంతు వెంట అంత దూరం వచ్చిన మేకపిల్ల దీనంగా బావి చుట్టూ తిరుగుతూ, బావిలోకి తొంగి చూస్తూ, తన యజమాని కోసం అరవసాగింది. తన కోసం మేకపిల్ల పడుతూన్న ఆరాటం గమనించిన హనుమంతు మనసు కలుక్కుమన్నది. బావి లోపల ఏదో పట్టు దొరికితే, దాన్ని పట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపాడు.

తెలతెలవారుతూండగా మేకపిల్ల అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తి, ఇద్దరు ముగ్గుర్ని వెంటబెట్టుకు వచ్చి బావిలోకి తొంగి చూస్తూ అరిచింది. దాన్ని చూసి మరికొందరు పోగయ్యారు. పరిస్థితిని గ్రహించి, వాళ్ళందరూ కలిసి హనుమంతును బయటకు తీశారు. బయటకు వచ్చీ రాగానే హనుమంతు మేకపిల్లను కౌగిలించుకుని భోరున ఏడ్చాడు. తనని అలాగే వదిలేసి మేకపిల్ల వెళ్ళిపోయి దాని ప్రాణాలు కాపాడుకుని వుండవచ్చు. అయినా ! అది అలా చేయలేదు. తనను కాపాడాలనుకున్నది. దాన్ని గురించి ఆలోచిస్తూంటే హనుమంతుకు కన్నీళ్ళు ఆగలేదు. తనను బావి నుంచి బయటకు తీసిన వారికి కృతజ్ఞతతో చేతులెత్తి మొక్కి, మేకపిల్లను ప్రేమగా నిమిరి వెనుదిరిగి ఇంటిదారి పట్టాడు. మేకపిల్లతో తిరిగి వచ్చిన భర్తను ఆశ్చర్యంగా చూసింది మంగమ్మ.

"ఎప్పటినుంచో పొరుగూరు వెంకటసామి వీటన్నిoటినీ అమ్మమంటున్నాడు. అతడు ఈ మేకల వ్యాపారం చేసుకుంటాడట. రేపే వీటిని అమ్మేస్తున్నాను. నువ్వు చెప్పినట్టే పొలం కౌలుకు తీసుకుందాం. పాల వ్యాపారం చేసుకుందాం. దీన్ని మాత్రం నాతోపాటే ఉంచుకుంటాను. ఇప్పటికి ఇదే నా సంతానం,'' అంటూ హనుమంతు మేకపిల్లను దగ్గరికి తీసుకున్నాడు. మంగమ్మకు ఏదీ అంతుబట్టక, "ఇంతకూ ఏం జరిగింది ?'' అని భర్తను విస్మయంతో అడిగింది. మేకనే కళ్ళనిండా చూసుకుంటూ రాత్రి జరిగిన విషయం భార్యకు వివరించాడు హనుమంతు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం