తాజా కథలు @ CCK

గురుకులం

2015-04-10 07:05:01 చిన్నారుల కథలు
భూమేశం గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి సొంత ఊరికి తిరిగి వచ్చాడు. వివిధ శాస్త్రాలలో అతడికున్న పాండిత్యాన్ని గమనించిన అతడి తండ్రి పరమేశం ఎంతో సంతోషించాడు. వ్యవసాయంలో తనకు తెలిసిన కిటుకులు చెప్పి, తనకున్న పదెకరాల పొలాన్ని కొడుక్కు అప్పగించాడు. భూమేశం ఆ కిటుకులకు తన తెలివితేటలు జోడించి కొత్త పంటలు వేశాడు.

కొత్త ప్రయోగాలు చేశాడు. మొదటి సంవత్సరం అతనికి కొద్దిపాటి లాభమే వచ్చింది. ఆ తరవాతి సంవత్సరం మంచి లాభాలు వచ్చాయి. అప్పటి నుంచి అతడికి లాభాలే లాభాలు. దానిని చూసి తండ్రి పరమానందం చెందాడు. ఊరివాళు్ళ భూమేశం ప్రతిభను ఎంతో మెచ్చుకుని అతన్ని సలహాలడిగి బాగుపడ్డారు. భూమేశం వ్యవసాయరంగంలో సాధించిన ఘనవిజయాల గురించి గ్రామాధికారి ఆ దేశపు రాజుకు తెలియజేశాడు. రాజు భూమేశాన్ని తన కొలువుకు రప్పించి ఘనంగా సత్కరించి పంపాడు.

తమ ఊరికి పేరు తెచ్చిన భూమేశం గురించి అందరికీ తెలియాలని, ఆ ఊరివాళు్ళ పెద్ద వేడుక ఏర్పాటు చేసి, దానికి చుట్టుపక్కల ఊరి పెద్దలందరినీ ఆహ్వానించారు. అలా పిలుపును అందుకున్నవారిలో కామేశం, రామేశం కూడా ఉన్నారు. ఆ యేడాది కామేశం పొలంలో ఊరి వారందరికన్నా ఎక్కువ పంట దిగుబడి వచ్చింది. దాంతో వ్యవసాయంలో తనను మించినవాడు లేడని గొప్పలు చెప్పుకోసాగాడాయన. భూమేశానికి జరిగిన రాజసన్మానం మింగుడు పడక, పొరుగూరు వేడుకలకు వెళ్ళినప్పుడాయన భూమేశాన్ని కలుసుకుని, ``వ్యవసాయంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నవాణ్ణి. కిటుకులు చెప్పమని ఎక్కడెక్కడి రైతులూ నా దగ్గరికి వస్తూ ఉంటారు. నీకు అనుభవం లేదు.

నా సలహా తీసుకోలేదు. నీకింత పేరు రావడం ఆశ్చర్యంగా ఉంది,'' అన్నాడు. భూమేశం వినయంగా, ``అనుభవంలేక మొదట్లో ఆశించినంత పంట పండించలేక పోయాను. అప్పుడే తమబోటి అనుభవజ్ఞుల దర్శన భాగ్యం కలిగివుంటే అలా జరిగేది కాదు. ఇప్పుడు కూడా మించి పోయిందిలేదు. మీ అనుభవాలు చెప్పి పుణ్యం కట్టుకోండి. మీ పేరు కలకాలం చెప్పుకుంటాను,'' అన్నాడు. కామేశం ఉబ్బిపోయి, భూమేశానికి బోలెడు వ్యవసాయపు కిటుకులు చెప్పాడు. శ్రద్ధగా విన్న భూమేశం, ``అయ్యా, వ్యవసాయంలో మీకు మీరే సాటి.

మీరు నాకు గురుతుల్యులు. మిమ్మల్ని కలవడం నా అదృష్టం,'' అంటూ ఆయనకు పాదాభివందనం చేశాడు. కామేశం మరింత పొంగిపోతూ పక్కనే వున్న రామేశం వంక గర్వంగా చూశాడు. రామేశం చిన్నగా నవు్వతూ భూమేశంతో, ``నీకు అభ్యంతరం లేదంటే మనం మంచి మిత్రులుగా ఉందాం,'' అన్నాడు. భూమేశం అందుకు అంగీకరించడంతో, ఆ ఊరిపెద్దలు మరికొందరు అతని స్నేహం కోరారు.

మరుసటి యేడు వారందరూ కూడా కామేశం కంటే ఎక్కువ పంట పండించారు. దాన్ని చూసి కామేశం ఉక్రోషపడగలడని అందరూ అనుకున్నారు. కానీ అతడు, ``నా శిష్యుడైన భూమేశం సలహాలు పాటించి మీరు ఈ యేడాది ఎక్కువ పంట పండించారు. అది నాకు గర్వకారణమే కదా?'' అన్నాడు ఎంతో గొప్పగా.

అందుకు కొందరు, ``భూమేశం నిన్ను గౌరవిస్తే అది అతడి వినయం. అంతే తప్ప, అతడు నీ శిష్యుడంటే ఒప్పుకోలేం,'' అన్నారు. అయితే, రామేశం వారితో ఏకీభవించకుండా, ``మనతో స్నేహానికి ఒప్పుకున్న భూమేశమే మన కామేశాన్ని గురువుగా స్వీకరించాడు. కాబట్టి భూమేశం కామేశం శిష్యుడే. అంతేకాదు, ఈ రోజు నుంచి కామేశం నాక్కూడా మిత్రుడు కాదు; గురువే,'' అన్నాడు. ఈ మాటలకు ఊరిపెద్దలు తెల్లబోయారు. కామేశం, ``చూశారా, మన రామేశానికి రాజసన్మానం మీద ఆశపుట్టింది. కానీ అందుకు కేవలం నా శిష్యుడైతే మాత్రం చాలదు.

భూమేశానికున్న తెలివితేటలు కూడా కావాలి,'' అన్నాడు ఊరిపెద్దలతో. అప్పుడు రామేశం గంభీరంగా, ``గురువు నేర్పేవాడే కానీ, నేర్చుకునేవాడు కాదు. శిష్యుడు నేర్చుకునేవాడేగాని నేర్పేవాడు కాదు. మిత్రుడైతే నేర్పడు, నేర్చుకోడు. అతడు తెలివిని పంచుకుంటాడు. కాబట్టి మన కంటే తెలివి తక్కువవాణ్ణి మిత్రుడిగా కంటే గురువుగా భావించడమే లాభం. అప్పుడు అతడికి తెలిసిన కాస్త మనం నేర్చుకుని బాగుపడవచ్చు. మనకు తెలిసిందేమీ అతడికి నేర్పనక్కరలేదు. భూమేశం తెలివైన వాడని గ్రహించి మనమతణ్ణి మిత్రుడిగా భావించాం.

ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుని బాగుపడ్డాం. కామేశం తెలివి ఏపాటిదో భూమేశంఎప్పుడో అంచనా వేశాడు. అందుకే అతణ్ణి గురువుగా స్వీకరించి తను బాగుపడ్డాడు. తనవల్ల కామేశం బాగుపడే అవకాశం లేకుండా చేశాడు. నేనూ భూమేశం పద్ధతిలోనే కామేశాన్ని గురువుగా భావిస్తున్నాను,'' అన్నాడు.

నేర్చుకోవలసిన చోట నేర్చుకునేందుకు బదులు ప్రగల్బాలు పలికినందుకే కామేశాన్ని రామేశం గురువని ఎకసక్కెం చేశాడని గ్రహించిన ఊరిపెద్దలు ఫక్కున నవ్వారు.

కామేశం రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం