తాజా కథలు @ CCK

విద్య

2015-04-10 03:05:01 చిన్నారుల కథలు
ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి ఆస్తి అంతా కలిసి నాలుగు ఆవులు. వాడు వాటిని రోజూ మేతకు తీసుకుపోయి, ఏ చెట్టు మీదనో, గుట్టమీదనో కూర్చుని వేణువు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒక రోజు వాడు ఒక చెట్టు మీద కూర్చుని వేణు గానంలో నిమగ్నుడై ఉండగా సమీపంలో పులిగాండ్రింపు వినిపించింది.

వాడు ఉలిక్కిపడి తన ఆవులు మేస్తున్న దిక్కు చూసి, ఒక అపూర్వ దృశ్యం కంటపడే సరికి, నిర్ఘాంతపోయూడు. శరభుడి ఆవులు నాలుగూ ఒక పెద్దపులిని చుట్టుముట్టి దాన్ని కొమ్ములతో భయంకరంగా పొడుస్తున్నాయి. పులి వాటి నుంచి తప్పించుకుని పారిపోయి, ప్రాణాలు దక్కించుకుందామని విశ్వప్రయత్నం చేస్తున్నది. కాని ఆవులు దానికి సందు ఇయ్యక, చివరకు దాన్ని చంపేశాయి.

శరభుడు తన ఆవుల పౌరుషాన్ని చూసి పరమానందం చెందాడు; చాలా గర్వపడ్డాడు. ఆవులు, ఏమీ జరగనట్టుగా, తిరిగి మేత మేయసాగాయి. తరవాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక, బీళ్ళు ఎండిపోయి, పశువులకు మేత కరువయింది. తిండిలేక పశువులు ఎండిపోతున్నాయి. తన ఆవులు తిండికి మాడటం చూడలేక, శరభుడు వాటిని తోలుకుంటూ, దూరంగా ఉన్న కొండప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి బయళ్ళలో గడ్డి చాలా ఏపుగా పెరిగి ఉన్నది.

చాలా రోజులుగా దొంగిలించటానికి పశువులు దొరకక ఇబ్బంది పడుతున్న దొంగ గంగులు ఒకనాడు శరభుడి ఆవులను చూశాడు. అవి బాగా బలిసి ఉన్నాయి. వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లోచేరి, నిశ్చింతగా వేణువు వాయించు కుంటూ వాడికి కనిపించాడు. గంగులు ఆ ఆవులను కాజెయ్యటానికి నిశ్చయించుకుని, తాను ఏ పొదల మధ్య దాక్కుంటే సులభంగా పని జరుగు తుందో జాగ్రత్తగా చూసుకుని, మర్నాడు పశువులకన్న ముందుగా వచ్చి, ఆ పొదలో కూర్చున్నాడు. శరభుడి ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి మేయసాగాయి.

శరభుడు వేణువు వాయించటం ప్రారంభించాడు. కొంత సేపు గడిచాక వాడికి పెద్దపులి గాండ్రింపు వినిపించింది. ఆటే కంగారుపడకుండానే వాడు లేచి తన పశువుల కోసం చూశాడు. వాడు అనుకున్నట్టే అవి ఒక పొదకు నాలుగుపక్కలా చేరి, తలలు వంచి, పొదలో నుంచి పులి వచ్చిన మరుక్షణం దాన్ని కుమ్మీ, పొడిచీ, చంపటానికి సిద్ధంగా ఉన్నాయి. శరభుడు వేణువు వాయించడం కట్టిపెట్టి వింత చూస్తూ అలాగే ఉండిపోయూడు.

ఈ లోపల గంగులుకు విచిత్రమైన అనుభవం కలగసాగింది. తన అరుపు విని ఆవులు బెదిరి పారిపోక పోగా, తాను ఆహ్వానించినట్టుగా పొద దగ్గిరికి వచ్చాయి. వాటికి పులి అంటే భయం తెలియదు కాబోలు ననుకుని, సింహంలాగా గర్జించాడు.

ఆవులు ఆ గర్జన విని భయపడక పోగా, బుసలు కొట్టుతూ, గిట్టలతో నేలను గీరి, ‘‘దమ్ము ఉంటే బయటికిరా! నీ ప్రాణం తీస్తాం!'' అన్న ధోరణిలో కనిపించాయి. తనకు ఆవులు దక్కకపోగా, తన ప్రాణానికే ప్రమాదం వచ్చిందని గంగులు తెలుసుకునేటందుకు కొంత వ్యవధి పట్టింది. ఆ తరవాత వాడికి ముచ్చెమటలు పోశాయి.

వాడు కాస్సేపు పులిలాగా, కాస్సేపు సింహంలాగా మార్చి, మార్చి అరవసాగాడు. అందువల్ల వాడికి ఏమీ ప్రయోజనం కలగకపోగా, ఆవులు మరింత పెద్దగా బుసలు కొట్టసాగాయి. అయితే, ఆ అరుపులు విని గ్రామం పరిసరాలలో మేస్తున్న పశువులు బెదిరి, అన్ని దిక్కులా పారిపోసాగాయి. కట్టేసి ఉన్న పశువులు కట్టుతాళ్ళు తెంచుకుని మరీ పారిపోయూయి. ఊరి మనుషులు వాటికోసం అటూ ఇటూ పరిగెత్తసాగారు.

ఇంతలో శరభుడు గ్రామం కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘నా ఆవులు పులినీ, సింహాన్నీ పట్టాయి! చూతురుగాని రండి!'' అంటూ కొంత మందిని తీసుకుపోయూడు. వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకుని శరభుడి వెంట వెళ్ళారు. తన ఆవులు చుట్టిముట్టి ఉన్న పొదకు సమీపంలో శరభుడు ఆగగానే, ఊరి వాళ్ళు అమిత ఆశ్చర్యంగా, ‘‘ఏదీ పులి?'' అని అడిగారు.

‘‘అది ఒకంతట బయటికి వస్తుందా! నా ఆవులు చీల్చెయ్యవూ? మీరంతా ఆ పొద మీదికి రాళ్ళు విసరండి. పులిలాగానూ, సింహంలాగానూ అరవగల జంతువు బయటికి వస్తుంది!'' అన్నాడు శరభుడు. నలుగురూ బలంగా రాళ్ళు విసరటం ప్రారంభించగానే శరభుడి ఆవులు పొద నుంచి ఇవతలికి వచ్చేశాయి. తలకూ, ఒంటికీ గాయూలుతగిలి, రక్తం కారుతూన్న దొంగ గంగులు చావుకేకలు పెడుతూ పొదలో నుంచి వెలుపలికి వచ్చి, మనుషుల కాళ్ళ మీద పడ్డాడు.

తమ పశువులను దొంగిలించినవాడు వాడేనని తెలియగానే గ్రామస్థులు వాణ్ణి హెచ్చరించి కొసప్రాణంతో వదిలేశారు. అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యూడు. గ్రామంలో పశువులు కొండ కింది బీళ్ళలో మేసి, చక్కగా బలిశాయి

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం