తాజా కథలు @ CCK

జబ్బు

2015-05-02 13:05:01 చిన్నారుల కథలు
సారంగపట్నంలో ఆనందాచారికి ఒక పెద్ద బంగారు నగల దుకాణం ఉన్నది. ఆ దుకాణం ఆయనకు తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు. ఆయన కష్టార్జితం. ఆయన చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోతే, జీవనోపాధికి ఒక నగల దుకాణంలో పనికి కుదిరాడు. నిజాయితీగాకష్టపడి పనిచేస్తూ యజమాని విశ్వాసానికి పాత్రుడయ్యూడు. పదేళ్ళపాటు తన యజమాని మాట్లాడే విధానం, పనిలోని మెళకువలు అన్నీ ఆకళింపు చేసుకున్నాడు.

ఆ తరవాత బయటికి వచ్చి, అంతవరకు పొదుపు చేసిన డబ్బుతో, స్వర్ణకారుల సహకారంతో పట్నంలో చిన్న నగల దుకాణం పెట్టాడు. ఆ దుకాణం దినదినాభివృద్ధి చెంది, ఐదు సంవత్సరాలలో ఆ పట్నంలోనే నాణ్యమైన దుకాణంగా పేరు తెచ్చుకున్నది. ఆనందాచారికి బాగా ఉన్న ఇంటి అమ్మాయి నాగావళి భార్యగా వచ్చింది. తోడుగా బోలెడంత ఆస్తి తెచ్చింది. దాంతో పనివాళ్ళ మీద పెత్తనం కూడా చలాయించ సాగింది.

డబ్బును బంగారు నాణాలుగా మార్చి రహస్యంగా దాచడం మొదలుపెట్టింది. భర్త అంటే ప్రేమ ఉన్నప్పటికీ, ధనం మీది పేరాశకొద్దీ భర్తను ఓ క్షణం పాటు ఇంటి పట్టున ఉండనిచ్చేది కాదు. సూర్యోదయం ముందే నిద్రలేపి, స్నానపానాదులు, పూజ పూర్తిచేయించి దుకాణానికి పంపేది. మధ్యాహ్న భోజనానికి కూడా ఇంటికి రానివ్వకుండా, దుకాణానికే భోజనం పంపేది. ‘‘ఈ కాలంలో ఎవరినీ నమ్మడానికి లేదండీ. అందరివీ దొంగ బుద్ధులు. మన జాగ్రత్తలో మనం ఉండాలి.

రేపు మనకేదైనా అయితే ఎవరు ఆదుకుంటారు? పనివాళ్ళ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచండి,'' అంటూ భర్తకు పొద్దస్తమానం బాలపాఠాలు చెబుతూ ఉండేది. వ్యాపారం పట్ల భార్యకున్న శ్రద్ధను చూసి మొదట ఆనందాచారి సంతోషించినప్పటికీ, రోజులు గడిచే కొద్దీ ఆమె పోరు వెగటు పుట్టించసాగింది. భార్యతో ఆ మాట చెప్పలేక మౌనంగా భరించసాగాడు. మరికొన్నాళ్ళకు ఆయనలో ఆనందం, తృప్తి అడుగంటిపోయి చెప్పరాని దిగులు చోటుచేసుకున్నది.

దాన్ని గురించి ఆయన ఒకనాడు భార్యతో ప్రస్తావిస్తే, ‘‘ఇదేంటండీ, ఈ మాయదారి జబ్బు! పట్నంలో ఈ రోజు బ్రహ్మాండంగా వెలుగుతున్న మీరు, అన్నీ పోగొట్టుకున్న అనాథలా దిగులుపడి పోతారెందుకు? అది సరే, నాతో మరో దుకాణం పెట్టిస్తానన్నారు కదా? దాని మాటేమయింది?'' అని మాట మార్చింది నాగావళి. ఆనందాచారి మరేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయూడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చి పట్నం పొలిమేరలో భక్తులకు దర్శనమిస్తూ, సమస్యలలో ఉన్నవారికి తగిన సలహాలు ఇస్తున్నాడని అందరూ చెప్పుకోసాగారు.

ఒకనాటి సాయంకాలం ఆనందాచారి సాధువు దర్శనానికి వెళ్ళాడు.భక్తులందరూ వెళ్ళి పోయూక ఆనందాచారి సాధువు వద్ద తన బాధను చెప్పుకుని, ‘‘జీవనోపాధికోసం మరో చోట పనిచేసినప్పుడే సంతోషంగా గడిపాను. ఇప్పుడేమో, కావలసినంత ఆస్తి ఉన్నది గాని, అప్పటి ఆనందం, తృప్తి కరువయ్యూయి స్వామీ,'' అన్నాడు విచారంగా. మందహాసంతో అంతావిన్న సాధువు తల పంకిస్తూ, ‘‘జీవితంలో ఎలాగైనా పైకి రావాలనే ఉత్సాహం ఆనాడు నీలో ఉండేది. అదే నీకు ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం అలాంటి లక్ష్యం లేదు. పదిమందికి సాయపడడానికి ప్రయత్నించు.

ఆ సాయమేదో నీ దుకాణంలో పనిచేసే వారితో ప్రారంభించు. పదిమందికోసం జీవించడం నేర్చుకుంటే, మునుపటి ఆనందాన్ని మించిన జీవనమాధుర్యం నీకు తెలియవస్తుంది,'' అన్నాడు. ‘‘నా భార్య అందుకు సమ్మతించాలికదా. ఆమెకు ధనవ్యామోహం ఎక్కువ,'' అన్నాడు ఆనందాచారి కాస్త సంకోచంగా. ‘‘ధనం కన్నా విలువైనవి జీవితంలో చాలా ఉన్నాయని నీ భార్యకు అనుభవ పూర్వకంగా నువ్వే తెలియజేయూలి. తెలివిగల వ్యాపారివి.

ప్రేమగల భార్యలో అంత మాత్రం మార్పుతీసుకురావడం ఆలోచిస్తే కష్టం కాదనుకుంటాను,'' అన్నాడు సాధువు మళ్ళీ నర్మగర్భంగా నవ్వుతూ. ‘‘చిత్తం స్వామీ,'' అంటూ ఆలోచనతో లేచి నమస్కరించిన ఆనందాచారికి విభూతి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించాడు సాధువు. ఆ రోజు రాత్రి పడుకున్న ఆనందాచారి మంచం మీది నుంచి లేవలేదు. నాగావళి కంగారుతో వైద్యులను పిలిపించింది. పరీక్షలు చేసి చూసిన వైద్యులు ఆయనకు ఫలానా వ్యాధి అని నిర్థారించలేక పోయూరు.

దూర ప్రాంతాల నుంచి పేరు మోసిన వైద్యులను పిలిపించింది. అయినా ఫలితం కనిపించలేదు. ఆనందాచారి అన్నం తినడానికి బుద్ధికాలేదంటూ ఏవో నాలుగు మెతుకులు తినేవాడు. భర్త నీరసించి పోవడంతో నాగావళికి భయం పట్టుకున్నది. భర్త ఆరోగ్యం బాగుపడాలని భక్తిశ్రద్ధలతో పూజలు ప్రారంభించింది. దేవుళ్ళందరికీ మొక్కుకున్నది. అయినా ఆనందాచారిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.

ఈ స్థితిలో భర్తను వదిలి వెళ్ళడానికి మనసురాక ఆమె దుకాణంకేసి వెళ్ళడం మానేసింది. ఇలా ఉండగా కొన్నాళ్ళకు నాగావళి చినతాతయ్య ఆమెను చూడడానికి వచ్చి, ‘‘ఆలుమగలు మూడు నెలల పాటు తీర్థయూత్ర చేసిరండి. శుభం జరుగుతుంది,'' అన్నాడు. ఆ స్థితిలో ఉన్న భర్తను తీర్థయూత్రలకు ఎలా తీసుకువెళ్ళడమా అని నాగావళి మొదట వెనుకాడింది.

కాని తాతయ్య మాట మీది గురితో ఒక నౌకరును తోడు చేసుకుని వెళ్ళాలని నిశ్చయించింది. అన్నాళ్ళు వ్యాపారమే సర్వస్వం అనుకున్న ఆమె, నగల దుకాణాన్ని పనివాళ్ళకు అప్పగించి తీర్థయూత్రలకు బయలుదేరింది. మూడు నెలల తీర్థయూత్రలో ఆమె బయటి ప్రపంచాన్ని, రకరకాల మనుషులను చూసింది. దేవాలయూలలో జరిగే ప్రవచనాలను విన్నది.

భర్త ఆరోగ్యం మెరుగవడంతో పాటు, ఆమె మనసు పరిపక్వం చెందింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె దుకాణంలో ఎలాంటి ఇబ్బందులూ, పొరబాట్లూ లేకుండా వ్యాపారం మరింత బాగా జరగడం చూసి పరమానందం చెందింది. ఒకనాడు నాగావళి భర్తతో, ‘‘మన నగల దుకాణం చూసుకుంటూన్న బసవయ్య సమయూనికి దేవుడిలా ఆదుకున్నాడండీ. అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ, మనం దుకాణానికి వెళ్ళకున్నా, దానిని సక్రమంగా నడుపుతున్నారు.

వాళ్ళ కేదైనా సాయం చేయూలండీ,'' అన్నది నెమ్మదిగా పాలలోటా అందిస్తూ. ‘‘నాగావళీ,'' అంటూ ఆనందాచారి ఆశ్చర్యపోయూడు. ‘‘మనకు కావలసినంత ధనం ఉంది. ఇక కావలసింది మంచి పేరు, దయూగుణం. మీకున్నది మాయదారి జబ్బు అనుకున్నాను. కానే కాదు. ధనవ్యామోహం అనే మాయదారి జబ్బు నాది,'' అన్న భార్య మాటలు విన్న ఆనందాచారి కళ్ళు మెరిశాయి. మనసులోని దిగులు పటాపంచలైపోయింది. ‘‘మనం బావుండాలి.

మనతోపాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళూ, మన చుట్టూ వున్న వాళ్ళూ సుఖంగా ఉండాలి,'' అంటూ నవ్వాడు ఆనందాచారి. చాలా రోజులకు భర్త నవ్వు ముఖం చూసిన నాగావళి కళ్ళ నుంచి ఆనందబాష్పాలు రాలాయి. కానీ ఆమెలో ఈ మార్పు తీసుకురావడానికి తాను ఆకలి దహిస్తున్నా నాలుగు మెతుకులే తింటూ మనిషి సగమైపోయిన రహస్యం, బయట పొక్కనివ్వకూడదనుకున్నాడు ఆనందాచారి లేచి కూర్చుంటూ.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం