తాజా కథలు @ CCK

శిక్ష

2015-06-05 21:05:01 చిన్నారుల కథలు
హలాపురిని హేమచంద్రుడు పాలించేకాలంలో - దేవుడి విగ్రహం ముందు పూజలోగాని, ప్రార్థనలోగాని ఉన్న ఎవరినీ బంధించకూడదన్న శాసనం అమలులో ఉండేది. నేరస్థుడని తెలిసినా, పూజ ముగించుకుని ఇవతలికి వచ్చిన తరవాతే రక్షకభటులు వాణ్ణి పట్టి బంధించేవారు. ఈ శాసనాన్ని అడ్డుపెట్టుకుని పలువురు నేరస్థులు శిక్షనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు.

నేరానికి పాల్పడిన తమను ఖైదుచేయడానికి రక్షక భటులు వస్తున్నారని తెలియగానే, పూజగదిలోకిగాని, గుడిలోకిగాని వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడేవారు. పూజలు ప్రారంభించేవారు. రక్షకభటులు వేచి చూసి చూసి, విసుగు చెంది తరవాత వద్దామని వెళ్ళిపోయేంతవరకు ఈ పూజలు కొనసాగేవి. భటులు వెళ్ళి పోయూక, వెలుపలికివచ్చి, వాళ్ళ కంటబడకుండా తప్పించుకుని పారిపోయేవాళ్ళు.

రాజు హేమచంద్రుడి వద్ద కొత్తగా సలహాదారుగా చేరిన చంద్రహాసుడు ఒకనాడు ఈ శాసనంలోని లొసుగును రాజుగారి దృష్టికి తీసుకువచ్చి, ‘‘దేవాలయూలు పరమ పవిత్రమైనవి. మానవ జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగడానికి దైవభక్తి, పాపభీతి చాలా వరకు ఉపయోగపడతాయి.

అయితే, విగ్రహం సమక్షంలో నేరస్థులనుసైతం బంధించకూడదన్న పురాతన శాసనం ద్వారా నేరస్థులు రక్షకభటుల కళ్ళుకప్పి తప్పించుకుంటున్నారు. రోజురోజుకూ నేరాలు పెరిగి పోతున్నాయి. ప్రభువులు దీనిని గురించి ఆలోచించి, న్యాయూధికారులను సంప్రదించి తగునిర్ణయం తీసుకోవడం మంచిది కదా!'' అన్నాడు.

అంతా శ్రద్ధగా విన్న రాజు తలపంకిస్తూ, ‘‘ఈ శాసనం మన రాజ్యంలో మా తాత తండ్రుల నుంచి వస్తున్నది. దీనిని ఇప్పుడు హఠాత్తుగా మార్చడం భావ్యం కాదు. నేరాలు పెరగ కుండా ఉండడానికి మరేదైనా మార్గం ఆలోచిద్దాం,'' అన్నాడు.

చంద్రహాసుడు అప్పటికి మౌనంగా ఊరుకున్నప్పటికీ దానిని గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇలా వుండగా ఒకనాడు సుగంధపురిలో పెళ్ళికుమార్తె బంగారు నగలను దొంగిలించుకుని పారిపోతూన్న దొంగను పట్టుకోవడానికి రక్షకభటులు వాడివెంటబడ్డారు. అయితే, ఆ దొంగ వారికి దొరకకుండా ఊరి పొలిమేరను చేరుకున్నాడు. రక్షక భటులు వదలకండా తరమసాగారు.

అటవీ ప్రాంతంలో పరిగెత్తుతూన్న దొంగకు ఒక చోట నాలుగు గుంజలు పాతి, పైన తాటాకులు కప్పబడివున్న పాకలో పసుపూ, కుంకుమా పూసిన తెల్ల బండరాయి కనిపించింది. దొంగ పరమానందంతో పాకలోకి జొరబడి పసుపూ కుంకుమలు పూసిన తెల్లబండరాయి ముందు చేతులెత్తి మొక్కుతూ నిలబడ్డాడు. వాడి వెనకనే అక్కడికి చేరుకున్న రక్షక భటులు వాణ్ణి చూసి, ‘‘అరరే, దేవుడి విగ్రహం ముందు చేరాడే! బంధించలేక పోయూమే!''

అంటూ ఆశాభంగానికి గురై, చేసేది లేక అలాగే నిలబడిపోయూరు. దొంగ కళ్ళు మూసుకుని విగ్రహం ముందు కూర్చుని మరింత భక్తి నటించసాగాడు. అయితే, కొంతసేపటికి రక్షకభటులు తనను చుట్టుముట్టి, సంకెళ్ళు తగిలిస్తున్నారని గ్రహించి, దొంగ అమిత ఆగ్రహంతో కళ్ళు తెరిచి, ‘‘ఏమిటీ! దేవుడి ఎదుటే బంధిస్తున్నారా?'' అనబోయి నోట మాట రాక అలాగే ఉండిపోయూడు.

కారణం- అప్పటికే రక్షక భటులు వాడి ఎదుట వున్న పసుపు కుంకుమలు పూసిన బండరాతిని అవతలికి తొలగించారు. దొంగ కారాగారం పాలయ్యూడు. మరునాడు న్యాయూధికారి ద్వారా ఈ సంగతి గురించి విన్న రాజు హేమచంద్రుడు, నూతన సలహాదారు చంద్రహాసుడి సూచనలోని సత్యాన్ని గ్రహించి, పూజాది కార్యక్రమాలలో ఉన్న నేరస్థులను బంధించకూడదన్న పాతశాసనాన్ని రద్దు చేశాడు. అప్పటి నుంచి నేరస్థులు అంత సులభంగా తప్పించుకోలేకపోయూరు. క్రమేణా రాజ్యంలో నేరాలు తగ్గిపోయూయి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం