తాజా కథలు @ CCK

భవిష్యవాణి

2015-06-17 23:05:01 చిన్నారుల కథలు
అంకాయస్‌ అనే పెద్ద మనిషి చాలా సాహసోపేతమైన జీవితం గడిపాడు. ఓడను నడిపే నావికుల నాయకుడిగా ఎన్నో క్లిష్టమైన పనులను సులభంగా నెరవేర్చాడు. పదవీ విరమణ చేసి ఒక చిన్న కొండ మీద అందమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. దాని చుట్టూ పూలతోటలూ, పళ్ళ తోటలూ పెంచడానికి నౌకర్లను నియమించుకుని సుఖంగా జీవించసాగాడు. ‘‘నాయనా, భగవంతుడు నీకు సంపదలతో పాటు, ఎంతో అనుభవాన్ని ప్రసాదించాడు.

ఇకపై సాటి మనుషులకు ఉపయోగపడే మంచిపనులు చేస్తూ, జీవితంలోని వివిధ అంశాల గురించి లోతుగా ఆలోచిస్తూ శేషజీవితాన్ని ఫలవంతంగా సాగించు,'' అని సలహా ఇచ్చాడు వృద్ధుడైన ఆయన గురువు. తన గురువు సలహాను అంగీకరిస్తున్నట్టు తల పంకించాడే తప్ప, అంకాయస్‌ వాటిని అసలు పట్టించుకోలేదు. వినోదం తప్ప మరేదీ తెలియని కొందరు మిత్రులు ఆయన చుట్టూ చేరారు.

హాస్యోక్తులతో అంకాయస్‌కు వినోదం కలిగిస్తూ, ఆయన సంతోషపడేలా పొగు డుతూ, ఆయన నుంచి తమకు కావలసిన వాటిని సంపాయించుకునేవారు. ఆ కాలంలో చిన్న చిన్న రాజ్యాలు తరచూ ఒకదానితో ఒకటి యుద్ధాలు చేస్తూండేవి. యుద్ధంలో గెలుపొందిన రాజ్యం సైనికులు ఓడిపోయిన రాజ్యం నుంచి స్ర్తీ పురుషులను బానిసలుగా తరలించుకుని వెళ్ళేవారు. వారిని ఎవరు కావాలన్నా అడిగిన డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చు.

అలా బానిసలుగా విక్రయించబడే వారిలో కొందరు ప్రతిభావంతులుగానూ, జ్ఞాన సంపన్నులుగానూ ఉండేవారు. అయినా యజమానులు వారిచేత కఠిన శ్రమ చేయించేవారు. బానిస వృద్ధుడైనా, బలహీనుడైనా వ్యాధిగ్రస్తుడై మరణించబోయే స్థితిలో వున్నా కూడా ఏమాత్రం కనికరం చూపకుండా కఠినమైన పనులు చేయించుకునేవారు. అంకాయస్‌ వద్ద కూడా పలువురు బానిసలు ఉన్నారు. వాళ్ళను పర్యవేక్షించే అధికారి పరమ క్రూరుడు. అంకాయస్‌ ఉత్తమమైన ద్రాక్షపళ్ళ తోట వేయూలని నిర్ణయించాడు.

అందుకోసం రాళ్ళతో నిండిన భూమిని బాగుచేయడానికీ, దున్నడానికీ బానిసలు రాత్రింబవళ్ళు కష్టపడి చెమటోడ్చ వలసివచ్చింది. అలా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ క్రూరుడైన బానిసల అధికారి, ‘‘త్వరగా కానివ్వండి, సోమరి గాడిదల్లారా! ఇంత మందగొడిగా పనిచేస్తూంటే, తోట తయూరయ్యేదెప్పుడు? ఉత్తమమైన ద్రాక్ష పండేదెప్పుడు? ఆ ద్రాక్ష నుంచి తయూరయ్యే మధురసాన్ని మన యజమాని తాగేదెప్పుడు?'' అంటూ కొరడా ఝళిపించేవాడు.

తోటపని ఎంతవరకు వచ్చిందో చూద్దామని ఒకనాడు అంకాయస్‌ అటుకేసి వచ్చాడు. ఆ సమయంలో అధికారి బానిసలను బెదిరించడం ఆయన విన్నాడు. ‘‘అవును, నేను ఇక్కడ పెంచుతూన్న ద్రాక్ష ప్రపంచంలోనే చాలా ఉత్తమమైనది. నా సొంత తోటలో పండిన ద్రాక్ష నుంచి తయూరైన మధురసాన్ని చవిచూసే క్షణాలకోసం ఎదురు చూస్తున్నాను,'' అన్నాడు. ‘‘మూర్ఖులారా, విన్నారా మన యజమాని మాటలు! మీరు పండించే ద్రాక్ష నుంచి తయూరయ్యే మధురసం కోసం ఆయన ఆతృతగా ఎదురు చూస్తున్నారు!''

అంటూ కొరడాతో బానిసల వీపులను ఛెళ్ళుమనిపించసాగాడు. ‘‘అయ్యో!'' అని బాధతో మూలిగిన ఒక బానిస, ‘‘ఈ తోటలో పండే ద్రాక్షల నుంచి తయూరయ్యే మధురసాన్ని యజమాని ఈ జన్మలో చవిచూడలేడు,'' అన్నాడు మెల్లగా. అయినా అది పర్యవేక్షకుడికి వినిపించడంతో, ‘‘ఏమన్నావురా దుర్మార్గుడా!'' అని గద్దిస్తూ అడిగాడు దిక్కులు పిక్కటిల్లేలా. ‘‘ఏమన్నాడేమిటి?'' అని వెనక్కు తిరిగాడు యజమాని.

పర్యవేక్షకుడు బానిస మెడపట్టి ముందుకు తోస్తూ, ‘‘ఈ వెధవకు పిచ్చెక్కింది. అందువల్లే ఏదో వాగాడు!'' అన్నాడు. ‘‘ఏం చెప్పావో దాన్ని మరోసారి చెప్పు!'' అని ఆజ్ఞాపించాడు యజమాని. ‘‘ఈ తోటలో కాచే ద్రాక్షల నుంచి తయూరయ్యే మధురసాన్ని మన యజమాని రుచి చూడలేడు, అన్నాను,'' అని చెప్పాడు బానిస. అంతటా కొంతసేపు మౌనం అలముకున్నది. యజమాని ఆ పొగరుబోతు బానిసను కఠినంగా శిక్షించగలడని అందరూ అనుకున్నారు. అయితే, అంకాయస్‌ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయూడు. రోజులు గడిచాయి. ద్రాక్షతోట విరగకాచింది.

నిగనిగలాడే ఆ ద్రాక్ష పళ్ళ నుంచి మధురసం తయూరుచేయడానికి దూర ప్రాంతం నుంచి నిపుణులైన వారిని పిలిపించారు. మధురసం తయూరయింది. దానిని అందమైన మధుపాత్రలో నింపి, యజమాని ముందున్న మేజామీద ఉంచారు. అంకాయస్‌ పరమానందం చెందాడు. దానిని రుచి చూడడానికి ముందు ఆనాడు భవిష్యత్తు చెప్పిన బానిసను పిలుచుకుర మ్మన్నాడు.

మధురసాన్ని సేవిస్తూ, తమ యజమాని బానిసను శిక్షంచగలడని అందరికీ అర్థమయింది. బానిస రానే వచ్చాడు. వాడి ముఖంలో పశ్చాత్తాపంగానీ, భయంకానీ లవలేశం కూడా కనిపించలేదు. ప్రశాంతంగా నిలబడ్డాడు. అంకాయస్‌ గట్టిగా నవ్వుతూ, ‘‘ఆనాడు నువ్వు మూర్ఖంగా పలికిన మాట గుర్తుందా? ఇప్పుడు చూడు నేను అదే తోటలో పండిన ద్రాక్ష నుంచి తయూరు చేసిన మధురసాన్ని రుచి చూడబోతున్నాను,'' అంటూ తన వెనకా, ఇరువైపులా నిలబడ్డ తన మిత్రులు, సేవకుల కేసి ఒకసారి గర్వంగా చూసి, మళ్ళీ బానిసతో, ‘‘ఇప్పుడేమంటావు?'' అంటూ నవ్వసాగాడు.

‘‘చేతికందింది, నోటికి అందకపోవచ్చు కదా?'' అన్నాడు బానిస ప్రశాంత కంఠస్వరంతో. అంకాయస్‌ మరింత గట్టిగా నవ్వుతూ, మధుపాత్రను అందుకున్నాడు. ఆ క్షణమే ఒక సేవకుడు పరుగున వచ్చి, ‘‘ప్రభూ! కోరలు తిరిగిన భయంకరమైన అడవిపంది ఒకటి మన తోటలో పడినాశనం చేస్తున్నది!'' అన్నాడు. ‘‘ఏమిటీ, అడవిపందా?'' అంటూ మధుపాత్రను మేజాపై ఉంచి, దాపుల గోడకు వేలాడుతూన్న ఖడ్గాన్ని తీసుకుని అడవిపందిని చంపడానికి పళ్ళతోట కేసి పరిగెత్తాడు, అంకాయస్‌.

అయితే, అతడు అడవిపందిని చంపలేదు. అడవిపంది అతన్ని చంపేసింది! మనం ఎంత జాగ్రత్తగా పథకం వేసినప్పటికీ, ఒక్కొక్కసారి అనుకోని సమయంలో, అవాంతరాలు వస్తూంటాయి. పరిస్థితి వికటిస్తుంది. దాన్నే చేతికి అందింది నోటికి అందక పోయిందని అంటూవుంటాం!

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం