తాజా కథలు @ CCK

కోడిపుంజు

2015-04-16 05:05:02 చిన్నారుల కథలు
ఈనాటి ఇండొనేషియూలో అంతర్భాగమైన జావాలో శతాబ్దాలక్రితం పలు రాజ్యాలు ఉండేవి. అలాంటి ఒక రాజ్యానికి కేతనం కోడిపుంజు. దానికి సంబంధించిన పూర్వగాథ ఇది: రాజుగారి ఏకైక సంతానమైన యువరాజుకు కోడిపందాలంటే మహా ఇష్టం. ఎప్పుడు చూసినా స్నేహితులతో కలిసి కోడిపందాలాడుతూ వినోదిస్తూండేవాడు.

అందువల్ల ఆయన స్నేహితులు బలమైన కోడిపుంజులు ఎక్కడ కనిపించినా సరే, అవి ఎవరివైనా సరే, వాటిని పట్టుకుని కోడిపందాలు నిర్వహించేవారు. ఎవరో వచ్చి, తాము యువరాజు మిత్రులమని చెప్పి తమ కోడిపుంజులను పట్టుకుపోవడం రాజ్య ప్రజలకు బాధ కలిగించింది. అయినా, ఆ విషయూన్ని రాజుగారి దృష్టికి తీసుకు వెళ్ళే ధైర్యం ఎవరికీ లేదు.

అయితే, రాజు ఒకసారి మారువేషంలో తిరుగుతూ, కొందరు యువకులు రైతులనుంచి బలవంతంగా బలిష్ఠమైన కోడిపుంజులను లాక్కుపోవడం, ఇదంతా యువరాజు కోసమే చేస్తున్నట్టు చెప్పడం గమనించాడు. ఆ తరవాత ప్రజలు ఇది తరచూ జరుగుతూన్న వ్యవహారమే అని మారువేషంలో వున్న రాజు అడగడంతో తమ గోడును వెళ్ళబోసుకున్నారు.

విచారంతో రాజభవనానికి తిరిగి వచ్చిన రాజు, యువరాజును వెంటనే రాజ్యాన్ని వదిలి వెళ్ళమని ఆగ్రహావేశంతో ఆజ్ఞాపించాడు. యువరాజుకు రాజభవనాన్ని వదిలిపెట్టక తప్పలేదు. యువరాజు రాజ్యపొలిమేరల్లో వున్న అరణ్యం చేరే వరకు గూఢచారులు ఆయన్ను వెంబడించి వెళ్ళి, తిరిగివచ్చారు. అప్పటికే బాగా పొద్దుపోయింది.

అర ణ్యాన్ని మెల్ల మెల్లగా చీకటి ఆవరిస్తోంది. యువరాజు దారీ తెన్నూ తెలియక కొట్టుమిట్టాడ సాగాడు. ధైర్యశాలి అయినప్పటికీ క్రూర మృగాల అరుపులు అతన్ని ఆందోళనకు గురిచేశాయి. అంతలో దూరంలో వున్న ఒక గుడిసెలోంచి మిణుకు మిణుకుమంటూ దీపం వెలుతురు కనిపించడంతో, అక్కడికి వెళ్ళి తలుపుతట్టాడు. తలుపు తెరిచిన ఒక యువతి నఖ శిఖ పర్యంతం అతన్ని అనుమానంగా చూసింది.

అతడు తాను యువరాజునన్న విషయం మాత్రం దాచి, రాజుగారి ఆగ్రహానికి లోనై రాజ్యబహిష్కారం శిక్ష పొంది, అడవులు పట్టిన దురదృష్టవంతుణ్ణని మాత్రం చెప్పాడు. ఆ యువతి అతని మీద దయ తలచి తలదాచుకోవడానికి చోటిచ్చింది. ఆమె తల్లిదండ్రులు అడవిలో లభించే మూలికలను సేకరించి, వైద్యులకు అమ్మి, దాంతో వచ్చే ఆదాయంతో పొట్టపోసుకునేవారు. వారు అలా ఒకనాడు మూలికలతో, దాపులనున్న నదిని దాటుతూండగా, వెల్లువ వచ్చి వాళ్ళు ఎక్కిన పడవ తల్లకిందులు కావడంతో చనిపోయూరు.

ఆ తరవాత ఆ యువతి ఎక్కడికి వెళ్ళడమో తెలియక, తన తల్లిదండ్రులు చేసిన పనినే కొనసాగిస్తూ అక్కడే ఒంటరిగా ఉంటున్నది. ఆమె వివరాలు తెలుసుకున్న యువరాజు ఆమెతో పాటే ఉండిపోవాలని నిశ్చయించుకుని, ఆమె సమ్మతితో ఆమెను పెళ్ళాడాడు. అతడు దృఢమైన శరీర సౌష్ఠవం కలవాడూ, తెలివైనవాడూ కావడంతో జింకలనూ, పక్షులనూ పట్టి, కట్టెల కోసం అడవికి వచ్చినవారికి అమ్మేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. తన తండ్రి మరణించిన వార్త, కట్టెలు కొట్టేవారి ద్వారా యువరాజుకు చేరింది.

‘‘నేను ఇప్పుడే నగరం వెళ్ళి కొన్ని రోజుల తరవాత వస్తాను. వచ్చాక నీకో శుభవార్త చెబుతాను. మనకు మంచి రోజులు రానున్నాయి,'' అన్నాడు భార్యతో. ‘‘త్వరగా వచ్చెయ్‌. వచ్చాక నేనూ నీకో సంతోషకరమైన విషయం, చెబుతాను,'' అన్నది భార్య, తాను తల్లి కాబోతూన్న విషయం బయట పెట్టకుండా. తిరిగి వచ్చిన యువరాజును చూడగానే నగర ప్రజలు ఆనందోత్సాహాలు పొందారు. రాజ్యానికి ఏకైక వారసుడు ఆయన.

యువరాజుకు రాజ్య బహిష్కార శిక్ష విధించాడే తప్ప, రాజు తనకు వారసుడిగా వేరెవరినీ ప్రకటించలేదు. యువరాజుకు వెనువెంటనే రాజ్య పట్టాభిషేకం జరిగింది. సంప్రదాయ బద్ధమైన ఇతర క్రతువులు జరగడానికి మరికొన్ని రోజులు పట్టింది. వాటి మధ్య అడవికి వెళ్ళి భార్యను చూసే అవకాశం యువరాజుకు కలగలేదు.
అదే సమయంలో అడవిలో అకాలవర్షాలు, వెల్లువ బీభత్సం సృష్టించాయి. యువరాజు భార్య ఒక గుహలో తలదాచుకోవలసివచ్చింది. అడవి సమీపంలో నివసించే కట్టెలుకొట్టేవారి భార్యలు యువరాజు భార్య ప్రసవ సమయంలో దగ్గరుండి ఆమెను ఆదుకున్నారు. ఆమె చక్కని మగబిడ్డను కన్నది. పట్టాభిషేకానంతరం యువరాజు, తన భార్యను రాజధానికి వెంటబెట్టుకు రావడానికి అడవికి వెళ్ళాడు.

అయితే, అక్కడ ఆమెగాని, ఆమె గుడిసె ఆనవాళ్ళుగాని కనిపించలేదు. నిరాశతో వెనుదిరిగి వచ్చాడు. ఒకనాడు యువరాజు భార్య బిడ్డతో, గుహ ముందు కూర్చుని వున్న సమయంలో, ఆకాశంలో ఎగురుతూన్న ఒక గద్ద ముక్కు నుంచి ఒక కోడిపిల్ల జారి ఆమె ఎదుట పడింది. ఆమె దానిని తీసి కాపాడింది. తన బిడ్డతో పాటు ఆహారం పెడుతూ పెంచసాగింది.

కోడిపిల్ల, ఎవరూ ఎప్పుడూ ఎక్కడా కనీవినీ ఎరగనంతగా బలిష్ఠ మైన కోడిపుంజుగా ఎదిగింది. దాన్ని చూసిన ఇతర పక్షులూ, జంతువులూ ఆ గుహ దరిదాపు లకు రావడానికి కూడా జడుసుకునేవి. అక్కడ నగరంలో కొత్త రాజు మళ్ళీ కోడిపందాలను ప్రారంభించాడు. అయితే, ఇప్పుడు కోడిపుంజులను రైతుల నుంచి బలవంతంగా అపహరించడంలేదు. పందాలలో గెలిచిన పుంజులకు బహుమతులు ఇస్తామని ప్రకటించాడు.

ఆ ప్రకటన గురించి కట్టెల కొట్టే వారి ద్వారా అడవిలో పెరుగుతూన్న యువరాజు కుమారుడు కళేరసు చెవిన పడింది. అతనికిప్పుడు వయసు పన్నెండేళ్ళు. తల్లి అను మతితో కళేరసు తన కోడిపుంజును తీసుకుని రాజధానికి బయలుదేరాడు. అతడు అక్కడికి చేరేసరికే కోడిపందాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ రోజు రాజుగారే స్వయంగా శిక్షణ ఇచ్చిన కోడిపుంజు ఇతర పుంజులను ఢీకొని సులభంగా ఓడించింది.

‘‘మహారాజా! నా పుంజు, మీ పుంజును గనక ఓడిస్తే మీరు నాకేం బహుమతి ఇస్తారు?'' అని అడిగాడు కళేరసు, బుట్టలో దాచిన తన కోడిపుంజును చూపకుండా. రాజు మొదట ఆ కురవ్రాణ్ణి చూడగానే తెలి యని ఆకర్షణకులోనయ్యూడు. ‘‘అయితే, మా పుంజు నీ పుంజును ఓడిస్తే?'' అని అడిగాడు రాజు. ‘‘నేను నా పుంజు ద్వారా బహుమతి సంపాయిద్దామన్న ఆశతో వచ్చిన పేద కుర్రాణ్ణి. మీకేం ఇవ్వగలను? కొన్నాళ్ళు మీకు సేవలందించగలను,'' అన్నాడు కళేరసు. ఆ తరవాత బుట్టలోనుంచి కోడిపుంజును వెలుపలికి తీశాడు.

‘‘ఓరి దేవుడా! ఎంత పెద్ద కోడిపుంజు!'' అంటూ ఆశ్చర్యపోయూరు అక్కడి వారందరూ. పందాలు ఆరంభమయ్యూయి. అంతకు క్రితం, మిగతా పుంజులన్నిటినీ ఓడించిన రాజుగారి కోడిపుంజు, కళేరసు కోడిపుంజు వద్ద చిత్తుగా ఓడిపోయింది. రాజు కళేరసుకు వంద బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు.

ఆ తరవాత రాజుగారి వద్ద వున్న మిగిలిన కోడిపుంజులన్నింటినీ కళేరసు పుంజు సునాయూసంగా ఓడించడంతో, రాజు అతన్ని కాసులతో ఘనంగా బహూకరించాడు. ‘‘అబ్బాయీ, నీ పుంజును నాకు అమ్మడానికి నీకేమైనా అభ్యంతరమా?'' అని అడిగాడు రాజు. ‘‘క్షమించండి మహారాజా! ఈ పుంజు నా ప్రాణ నేస్తం. ఇది నేను పుట్టినప్పుడు చిన్న పిల్లగా ఆకాశం నుంచి వచ్చింది. ఇద్దరం కలిసి పెరిగి ఇంత వాళ్ళయ్యూం.

ఇప్పుడు ఈ పుంజు సంపాయించిన బహుమతి మొత్తంతో, నేనూ మా తల్లీ సుఖంగా జీవించగలం,'' అన్నాడు కళేరసు. ‘‘నువ్వు ఎప్పుడు పుట్టావు?'' అని అడిగాడు రాజు. ‘‘పన్నెండేళ్ళ క్రితం. అప్పుడు మహా ప్రవాహం అడవిని ముంచెత్తిందట! అప్పటికే మా తండ్రి, ఎందుకో హఠాత్తుగా వెళ్ళిపోవడంతో మా తల్లి దూరంలో వున్న ఒక గుహలోకి పారిపోయి ప్రాణాలతో తప్పించుకుందట,'' అన్నాడు కళేరసు.

‘‘సరే, పుంజును అమ్మడానికి నీకు ఇష్టంలేదనుకో, నువ్వు ఇక్కడే రాజభవనంలో నాతో ఉండడానికి నీకేమైనా అభ్యంతరమా?'' అని అడిగాడు రాజు. ‘‘అది మా తల్లి అభిప్రాయం మీద ఆధారపడి వుంటుంది మహారాజా!'' అన్నాడు కళేరసు. రాజు సింహాసనంపైనుంచి చటుక్కున లేచి, ‘‘నువ్వు నన్ను నీ తల్లి దగ్గరికి తీసుకు వెళ్ళు నాయనా,'' అన్నాడు గద్గద స్వరంతో. ‘‘అలాగే మహారాజా!'' అంటూ కళేరసు అక్కడి నుంచి బయలుదేరాడు.

రాజూ, ఆయన పరివారం అతడి వెంట బయలుదేరారు. అడవి ప్రాంతంలో నివసిస్తూన్న పేద ప్రజలు ఆ దృశ్యం చూసి విస్తుపోయూరు. రాజుగారి ముందు, గుర్రం మీద కూర్చుని వస్తూన్న తన బిడ్డను చూసిన కళేరసు తల్లి ఆనందాశ్చర్యాలకు హద్దులు లేకుండా పోయింది.

మరికొద్ది క్షణాల్లో రాజు ఎవరన్నదీ ఆమె గుర్తించి ఆనంద బాష్పాలు రాల్చింది. అప్పటి కప్పుడే మహారాజు కళేరసును యువరాజుగానూ, అతడి తల్లిని పట్టమహిషిగానూ ప్రకటించాడు. ఊరేగింపు రాజధానికేసి బయలుదేరింది. తండ్రి తదనంతరం కళేరసు రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించాక, కోడిపుంజును తన రాజ్యకేతనంగా ప్రకటించాడు!

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం