తాజా కథలు @ CCK

వీరసాహసం

2015-05-09 11:05:01 చిన్నారుల కథలు
1909 జూలై 1వ తేదీ సాయంకాలం లండన్‌ నగరం దిగ్భ్రాంతితో అట్టుడికి పోయింది. బ్రిటిష్‌ ఇండియన్‌ గవర్నమెంటుకు చెందిన సర్‌ కర్జన్‌ వైలీ కాల్చి చంపబడ్డాడు. చంపిన వాడు ఇంగ్లాండులో చదువుకుంటూన్న భారతీయ రహస్య విప్లవసంస్థ కార్యకర్త మదన్‌ లాల్‌ ధింగ్రా.

అత్యవసరంగా ఆంగ్లేయ ప్రముఖులూ, లండన్‌లోని భారతీయ ప్రముఖులూ సమావేశమై హత్యను ఖండిస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఒకే ఒక కంఠస్వరం వ్యతిరేకించింది. అందరూ అటు కేసి చూశారు. అక్కడ బక్కపలచగా వున్న సావర్కార్‌ నిలబడి ఉన్నాడు. ‘‘అతణ్ణి తన్ని తగలెయ్యండి. బయటకు గెంటండి!'' అన్న మాటలు వినిపించాయి. అంతలో ఒకడు ఆవేశంతో వెళ్ళి పిడికిలి బిగించి సావర్కార్‌ ముఖంపై బలంగా గుద్దాడు. సావర్కార్‌ కళ్ళజోడు పగిలిపోయింది. కళ్ళ దగ్గర తగిలిన గాయం నుంచి నెత్తురు కారసాగింది. అయినా సావర్కార్‌ కుడిచేతిని పైకెత్తి, ‘‘ఇప్పుడు కూడా నేను ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాను,'' అని నినాదం చేశాడు.

వినాయక్‌ దామోదర్‌ సావర్కార్‌ 1883 మే 28వ తేదీ మహారాష్ట్ర నాశిక్‌ జిల్లా భాగూర్‌ గ్రామంలో జన్మించాడు. ఆయనకు పండితుడైన ఆయన తండ్రి దామోదర్‌ సావర్కార్‌ బాల్యం నుంచే పురాణేతిహాసాల కథలు; రాణాప్రతాప్‌, శివాజీ వీరగాథలు చెప్పేవాడు. అతి పిన్నవయసులోనే కొడుకు హృదయంలో కవితాసక్తి, దేశభక్తి బీజాలు వెదజల్లాడు.

పదేళ్ళ ప్రాయంలోనే సావర్కార్‌ మాతృభాష మరాఠీలో పద్యాలు, పాటలు రాయడం మొదలు పెట్టాడు. పన్నెండేళ్ళకే ఆయన వ్యాసాలు పత్రికలలో ప్రచురించబడసాగాయి.1897లో అప్పటి బొంబాయి పరగణాలో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చెలరేగాయి. భారతదేశంలోని క్రూరులైన బ్రిటిష్‌ అధికారులు కొందరు హతమార్చబడ్డారు.

చర్యలకు బాధ్యులైన విప్లవకారులను ఖైదు చేసి మరణశిక్ష విధించారు. మరణశిక్ష నెరవేర్చబడిన రోజు వాళ్ళు అచంచలమైన ధైర్యంతో భగవద్గీత శ్లోకాలను పఠిస్తూ ఉరికంబం మీదికి చేరడం చూసిన సావర్కార్‌ హృదయం ఉప్పొంగింది. భారతదేశ దాస్య శృంఖలాలను ఛేదించడానికి తన జీవితాన్ని అంకితం చేయూలనీ, యువతలో స్వాతంత్య్ర దీప్తిని ప్రజ్వలింప జేయూలనీ ప్రతిజ్ఞ బూనాడు. అందుకు అనుగుణంగా ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేసుకుని స్వాతంత్య్ర సంగ్రామం జరపడానికి దేశపౌరులకు ఆయుధ శిక్షణనివ్వాలని నిర్ణయించాడు. అందుకు ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడ్డాడు!

1905లో పట్టభద్రుడయ్యూక, ఇంగ్లాండులో న్యాయవిద్యను అభ్యసించడానికి ఆయనకు ఉపకారవేతనం ఇస్తామన్నారు. ఆ విధంగానైనా ఇక్కడ అతడి కార్యకలాపాల బెడద తగ్గుతుందని బ్రిటిష్‌ అధికారులు భావించారు. అయితే 1906లో ఇంగ్లాండుకు బయలుదేరిన సావర్కార్‌ విద్యాభ్యాసంతో పాటు అమితోత్సాహంతో విప్లవకార్యకలాపాలను అక్కడ ప్రారంభించాడు. రహస్య సంస్థలను స్థాపించి వాటిలో యూరపులో చదువుకుంటూన్న భారతీయ యువకులను చేర్చుకుని, వారిలో మాతృదేశ పరిపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడే స్ఫూర్తిని ప్రేరేపించసాగాడు.

శత్రువు కోటలోకి ప్రవేశించి వాడి బలాబలాల మూలాధారాలను కనుగొనే సువర్ణ అవకాశంగా ఆయన దానిని భావించాడు. దేశ భక్తులైన కొందరు యువకులకు పవిత్ర లక్ష్యం కోసం పోరాడాలనీ, అయితే అది తమ అంతిమ లక్ష్యానికి అవరోధం కలిగించే విధంగా బ్రిటన్‌లో ఎలాంటి ఉద్రిక్తతను కలిగించరాదనీ హెచ్చరించాడు. అయినప్పటికీ, మదన్‌లాల్‌ ధింగ్రా తనను తాను అదుపు చేసుకోలేకపోయూడు.

ఎలాంటి పర్యవసానాలనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధుడై సర్‌ కర్జన్‌ వైలీని హతమార్చాడు. ‘‘అతడు భారతీయ యువకులకు విధించిన అమానుషమైన మరణశిక్షలకు ప్రతీకారంగానే నేనీ చర్యకు పూనుకున్నాను. మాతృభూమి విముక్తికి ఆయుధాలు చేపట్టడమే ఆ యువకులు చేసిన నేరం!'' అని ప్రకటించి ఆయన ఉరికంబం ఎక్కాడు! దాంతో అధికారులు నిఘా సంస్థలను, పోలీసులను లండన్‌లోని భారతీయ విద్యా ర్థుల మీదికి ఉసిగొల్పారు.

అయినా సావర్కార్‌ తన రహస్య కార్యకలాపాలను కొనసాగిస్తూనే వచ్చాడు. అనేక గ్రంథాలను రచించాడు. వాటిలో ముఖ్యమైనది ‘1857 భారతీయ స్వాతంత్య్ర సంగ్రామం'. అక్కడి నిఘాసంస్థలు ఆ గ్రంథాన్ని ‘విప్లవాత్మకమైనది, రెచ్చగొట్టేది, ద్రోహ పూరితమైనది' అని దాన్ని అచ్చుకాక ముందే నిషేధించాయి.

ఆ తరవాత పాలకుల కన్నుగప్పి దాన్ని హాలండ్‌లో ముద్రించి వందలాది ప్రతులను రహస్యంగా భారతదేశానికి చేరవేశారు. ఒకనాటి సాయంకాలం భారతదేశం నుంచి సంచలనాత్మకమైన వార్త వెలువడింది. సావర్కార్‌ అన్న గణేశ్‌ దామోదర్‌కు బహిష్కరణ శిక్ష విధించడంతో, ఒక యువకుడు ఆగ్రహం చెంది, దానికి ప్రతీకారంగా శిక్ష విధించిన నాశిక్‌ జిల్లా కలెక్టరూ, బ్రిటిష్‌ అధికారీ అయిన జాక్సన్‌ను కాల్చి చంపాడు.

దేశవిదేశ ఆంగ్ల పత్రికలలో ఈ వార్త తీవ్రమైన అలజడిని సృష్టించింది. ఈ చర్యకు మూలకారణమైన వ్యక్తి మీద కఠిన చర్య తీసుకోవాలన్న కోరిక బలపడసాగింది. అందరి దృష్టీ సావర్కార్‌ మీదికి మళ్ళింది. ఇక ఇంగ్లాండులో ఉండడం ఏమాత్రం క్షేమం కాదని మిత్రులు, శ్రేయోభిలాషులు నచ్చజెప్పడంతో సావర్కార్‌ ఫ్రాన్‌‌సకు వెళ్ళాడు. అయినా తన వాళ్ళందరూ భయంకరమైన కష్టాలు అనుభవిస్తూంటే, ఆయన అట్టే కాలం అక్కడ ఉండలేక మళ్ళీ ఇంగ్లాండుకు తిరిగివచ్చాడు.

అయితే, అతడు అక్కడ అడుగు పెట్టగానే పోలీసులు చుట్టుముట్టి ఖైదు చేసి, కారాగారంలో వేశారు. బ్రిటిష్‌ న్యాయస్థానాలు ఆయన్ను ఇండియూకు తిప్పి పంపాలని ఆజ్ఞాపించాయి. బలమైన సుశిక్షితులైన సైనికులతో పాటు, కొందరు స్కాట్‌లాండ్‌ యూర్‌‌డ అధికారుల కాపలాతో విప్లవకారుణ్ణి తీసుకుని ఓడ ఫ్రాన్‌‌సగుండా ఇండియూకు బయలుదేరింది. అది 1910వ సం. సావర్కార్‌ వయసు ఇరవై ఆరేళ్ళే.

ఇంగ్లాం ులో నాలుగేళ్ళు మాత్రమే గడిపినప్పటికీ ఆయన అక్కడి సాధారణ భారతీయ విద్యార్థులను ఉత్తేజపరచి మాతృదేశం కోసం ప్రాణాలను అర్పించడానికి సైతం వెనుకాడని దేశభక్తులుగా మార్చగలిగాడు. ఓడ ముందుకు వెళుతూండగా శత్రువుల నుంచి తప్పించుకోవడం ఎలాగా అని సావర్కార్‌ ఆలోచించసాగాడు. తాను తప్పించుకుంటేనే పోరాటాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది.

రాత్రి అవుతూండగా ఓడ మార్సీలీ అనే ఫ్రెంచి పట్టణాన్ని సమీపించింది. రేవుకు దూరంగా ఓడను ఆపి లంగర్లు దించారు. సావర్కార్‌ మనసులో నమ్మకం దీపకళికలా మెరిసింది. అప్పుడే తెల్లవారుతోంది. ఓడ కదిలిందంటే ఇక తప్పించుకునే అవకాశం ఉండదు. వెంటనే కాపలా భటుణ్ణి పిలిచి, ‘‘అయ్యూ, నన్ను కాస్త స్నానం గదికి తీసుకువెళతావా?'' అని అడిగాడు. కాపలాభటుడు ఆయన్ను గదికేసి నడిపించాడు.

ఆయన స్నానం గదిలోపలికి వెళ్ళాడు. భటుడు తలుపు దగ్గర నిలబడ్డాడు. ఆ తలుపు అద్దంతో తయూరైనది. లోపల జరిగేది ఎదుటనున్న అద్దంలో ప్రతిబింబించేలా ఏర్పాటు చేయబడి ఉంది. గది పైకప్పులో మనిషి జొరబడగల అంత రంధ్రం కనిపించింది. సావర్కార్‌ ఒంటి మీది పైచొక్కాను తీసి లోపలి అద్దాన్ని మూసేసి; రంధ్రం గుండా కప్పుపైకి ఎక్కి అక్కడి నుంచి నీళ్ళలోకి దూకి తీరం కేసి ఈదుకుంటూ వెళ్ళసాగాడు.

అంతలో అనుమానం వచ్చిన భటులు తలుపు పగలగొట్టి చూస్తే అసలు విషయం తెలిసింది. ఈదుకుంటూ వెళుతూన్న సావర్కార్‌ కేసి తుపాకీ గుళ్ళను పేల్చారు. వాటిని తప్పించుకుంటూ నెత్తురును గడ్డ కట్టించే చల్లటి నీటిలో, మునుగుతూ, తేలుతూ ఈదుకుని వెళ్ళి సావర్కార్‌ ఫ్రెంచి నేలపై అడుగు మోపి ఉపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడతడు స్వతంత్రుడు. ఎవరూ పట్టుకోలేరని సంతోషించాడు. అయితే కొంతసేపటికే, ‘‘పట్టుకోండి, ఆ ద్రోహిని!'' అంటూ బ్రిటిష్‌ భటులు రావడం గమనించి ఆయన మళ్ళీ పరిగెత్తడం మొదలు పెట్టాడు. అప్పటికే బాగా అలిసిపోయి ఉన్నాడు. అయినా ఉన్న శక్తినంతా కూడ దీసుకుని పరిగెత్తసాగాడు.

హఠాత్తుగా ఎదురుగా వచ్చిన ఫ్రెంచి పోలీసుకు ఢీకొని నిలబడ్డాడు. వచ్చీరాని ఫ్రెంచి భాషలో, ‘‘అయ్యూ, నేను బ్రిటిష్‌ రాజకీయ ఖైదీని మాత్రమే. ఫ్రాన్‌‌సలో అడుగు పెట్టాక నేను స్వతంత్రుణ్ణి. మీ ప్రభుత్వ రక్షణ కోరే హక్కు నాకు ఉన్నది. నన్ను మీ అధికారుల వద్దకు తీసుకువెళ్ళండి,'' అని చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బ్రిటిష్‌ అధికారులు, ఫ్రెంచ్‌ పోలీసుకు బంగారు నాణాలు కానుకగా ఇవ్వడంతో అతడు సావర్కార్‌ను శత్రువులకు అప్పగించాడు.

భారతదేశానికి వచ్చాక విచారణ ఆరంభమయింది. సావర్కార్‌ మీద ఆయుధాల అక్రమ రవాణా, రెచ్చగొట్టే ఉపన్యాసాలివ్వడం, ప్రజలను తప్పుదారి పట్టించడం మొదలైన ఆరోపణలు చేసి యూభైయేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించి 1911 జూలైలో అండమాన్‌ సెల్యులార్‌ జైలుకు తరలించారు. అక్కడ దుర్భర పరిస్థితుల మధ్య రాజకీయ ఖైదీలు నరక యూతనలు అనుభవించేవారు.

రోజూ కొద్ది గంటల విరామంతో చేతుల బేడీలను గోడలకు తగిలించి వారంపాటు నిలబెట్టేవారు. గానుగలకు ఎడ్లకు బదులు ఖైదీలను కట్టి లాగమని వేధించేవారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక, లాగలేక కొందరు ప్రాణాలు కోల్పోయేవారు. బ్రిటిష్‌ అధికారులు తాము పయనించే వాహనాలకు ఎడ్లకు, గుర్రాలకు బదులు ఖైదీలను పూన్చి లాగేలా చేయించడం గొప్పగా భావించేవారు. ఖైదీలు ఎత్తు పల్లాలలో బళ్ళను లాగలేక లాగుతూంటే, ‘‘వేగంగా, ఇంకా వేగంగా,'' అంటూ కొరడాలు ఝళిపించే వాళ్ళు.

పెన్ను, కాగితం కూడా ఖైదీలు ఉపయోగించకూడదు. అందువల్ల సావర్కార్‌ తనలో పెల్లుబికే కవితావేశాన్ని పద్యాలుగా అల్లి ముళ్ళతో, మేకులతో, సుద్దముక్కలతో జైలు గోడ మీద రాసేవాడట! సావర్కార్‌ జీవితఖైదు కాలాన్ని తగ్గించి పదేళ్ళ తరవాత, ఆయన్ను తీసుకువచ్చి అలిపూర్‌, రత్నగిరి చెరసాలలలో పెట్టారు.

ఆఖరికి 1924లో విడుదల చేయబడ్డాడు. ఆధునిక భారత దేశంలో అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన దేశభక్తుడైన ఆయన్ను వీర సావర్కార్‌ అని పిలువసాగారు. 1966 ఫిబ్రవరి 26వ తేదీ ఆయన కీర్తిశేషుడయ్యూడు. ఉన్నతమైన పవిత్ర లక్ష్యసాధన కోసం ఆయన సాగించిన పోరాటం, ప్రదర్శించిన ధైర్యసాహసాలు, చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి!

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం