తాజా కథలు @ CCK

సుభద్ర-అర్జునుల వీరకుమారుడు

2015-04-20 13:05:01 చిన్నారుల కథలు
సుభద్ర-అర్జునుల వీరకుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు అంటే భయం లేని వాడూ, కోపం కలవాడూ అని అర్థం. పేరుకు తగ్గ విధంగా అతడు అనుపమ పరాక్రమశాలిగా ప్రజ్వలించాడు! ఇంద్రప్రస్థం నుంచి తీర్థయూత్రలకు బయలుదేరిన అర్జునుడు అనేక తీర్థాలను సేవించి, ఆఖరికి ద్వారకకు సమీపంలోని ప్రభాస తీర్థాన్ని చేరుకున్నాడు.

అక్కడ గదుడనే యూదవుడు తటస్థపడి కృష్ణుడి చెల్లెలైన సుభద్ర అంద చందాలను అతనికి వివరించాడు. సుభద్ర తిలోత్తమను మించిన అందగత్తె అని అదివరకే అర్జునుడు విని ఉండడం వల్ల, ఇప్పుడామెను చూసి పెళ్ళాడాలనే ఆశ అతనిలో కలిగింది. యూదవులకు యతులంటే చాలా భక్తి. అందువల్ల అర్జునుడు యతి వేషం వేసుకుని ద్వారకకు బయలుదేరాడు. తన కోరికను కృష్ణుడికి చెప్పి సాయం అర్థించాడు.

సుభద్ర పెద్దన్నయ్య బలరాముడు అందుకు సుముఖంగా లేడు గనక, దీనిని కాస్త గోప్యంగా సాధించాలని కృష్ణార్జునులు నిర్ణయించారు. ద్వారక సమీపంలోని వనంలో యతివేషంలో ధ్యాన నిమగ్నుడై వున్న అర్జునుణ్ణి చూసి, నిజమైన యతియని భావించిన బలరాముడు-అతణ్ణి తన భవనానికి ఆహ్వానించాడు. అతడు అక్కడే చాతుర్మాస్య వ్రతం ఆచరించడానికి కావలసిన సకల సదుపాయూలూ ఏర్పాటు చేశాడు.

పైగా, అతడికి పరిచర్యలు చేయడానికి సుభద్రను వినియోగించాడు. సుభద్ర ఒకనాడు యతికి పరిచర్యలు చేస్తూ, ‘‘తమరు వివిధ ప్రాంతాలు దర్శించారు కదా! ఇంద్రప్రస్థం వెళ్ళారా? అక్కడ అనుపమ పరాక్రమశాలీ, మోహనాకారుడూ అయిన కుంతీ కుమారుడు అర్జునుణ్ణి చూశారా?'' అని అడిగింది.

అప్పుడు అర్జునుడు తన యతి వేషాన్ని తొలగించి తనే అర్జునుడని చెప్పాడు. ఇద్దరి మనసులూ కలవడంతో, బలరాముడు లేని సమయం చూసి, పెద్దల సమక్షంలో గాంధర్వ వివాహం చేసుకుని ఇంద్రప్రస్థం చేరుకున్నారు. కాలక్రమాన సుభద్రార్జునులకు అభిమన్యుడు జన్మించాడు. తండ్రి వద్దే, ఉపపాండవులతో కలిసి ధనుర్విద్య నభ్యసించాడు.

పాండవులు శకుని చేత మాయూజూదంలో ఓడి, రాజ్యాన్ని పోగొట్టుకుని వనవాసానికి వెళ్ళినప్పుడు, కృష్ణబలరాములు తమ చెల్లెలైన సుభద్రనూ, ఆమె కొడుకు అభిమన్యుణ్ణీ ద్వారకకు తీసుకువెళ్ళారు. పన్నెండేళ్ళు వనవాసం చేసిన తరవాత, పాండవులు మత్స్యదేశంలోని విరాట నగరంలో మారువేషాలతో యేడాది పాటు అజ్ఞాతవాసం చేశారు.

ఆ సమయంలో తన ఇంట బృహన్నలలా ఉండి, తన కుమార్తె ఉత్తరకు నృత్యగీతాలు నేర్పి, ఉత్తర గోగ్రహణ సమయంలో తన కుమారుడు ఉత్తరుణ్ణి సారథిగా చేసుకుని కౌరవసేనలను ఓడించి తన గౌరవం కాపాడినవాడు అర్జునుడని తెలియగానే విరాటరాజు అతనితో బంధుత్వం ఏర్పరచుకోవాలని ఆశించాడు. సరిగ్గా ఆ సమయూనికే సుభద్ర అభిమన్యుడితో సహా విరాట నగరం వెళ్ళి పాండవులను కలుసుకున్నది.

విరాట రాజు కోరిక మేరకు ఉత్తర-అభిమన్యుల వివాహం విరాట నగరంలోనే వైభవంగా జరిగింది. ఆ పెళ్ళి జరిగిన కొద్ది కాలానికే కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయింది. అభిమన్యుడు యుద్ధ రంగంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, తన ముందు ఎవరూ నిలువలేని విధంగా యుద్ధం చేశాడు.

కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి పతనానంతరం ద్రోణుడు కౌరవ సేనలకు సర్వ సేనాధిపత్యం వహించి ఐదు రోజుల పాటు యుద్ధం చేశాడు. ఒకనాడు ద్రోణుడు కౌరవ సేనను పద్మవ్యూహంలో నిలబెట్టాడు. పద్మవ్యూహాన్ని ఛేదించడం పాండవ పక్షంలో అర్జునుడికీ, అభిమన్యుడికీ మాత్రమే తెలుసు. కాని ఆరోజు అర్జునుడు ఇంకో రంగంలో సంశప్తకులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు.

అందు వల్ల పద్మవ్యూహాన్ని ఛేదించే బాధ్యత అభిమన్యుడి మీద పడింది. అయితే, పద్మవ్యూహం ప్రవేశించడం తప్ప, దాని నుంచి వెలుపలికి వచ్చే మార్గం తనకు తెలియదని అభిమన్యుడు చెప్పాడు. కాని, ధర్మరాజు మొదలైనవారు, ‘‘నీకేం భయం లేదు. మేమందరం నీ వెనకనే పద్మవ్యూహం ప్రవేశించి, శత్రువుల మధ్య నువ్వు ఒంటరిగా ఉండిపోకుండా చేస్తాం,'' అన్నారు.

అభిమన్యుడు మెరుపు వేగంతో శత్రు సేనలను చీల్చి చెండాడుతూ పద్మవ్యూహంలో ప్రవేశించాడు. కౌరవసేనలోని వీరాధి వీరులందరూ అతణ్ణి ఒక్కసారిగా చుట్టుముట్టారు. అయినా, అతడు ఏమాత్రం జంకకుండా అన్ని రూపాలు కలవాడిలా అటు ద్రోణుడి మీద, ఇటు కర్ణుడి మీద, మరో వైపు కృతవర్మ మీద బాణవర్షం కురిపించాడు. అతడి బాణాలకు దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణుడు హతుడయ్యూడు.

దుశ్శాసనుడు పారి పోయూడు. వృష సేనుడు మూర్ఛబోయూడు. అజేయంగా బాణవర్షం కురిపిస్తూన్న అభిమన్యుణ్ణి వంచనతో హతమార్చాలని నిర్ణయించారు. వెనక నుంచి వచ్చి కర్ణుడు అతణ్ణి విరథుణ్ణి చేశాడు. కృపుడు అశ్వాలను చంపాడు. అభిమన్యుడు నేలపైకి ఉరికి యుద్ధం చేయసాగాడు. వెనకనే వస్తామని చెప్పిన ధర్మరాజాదులు ఒక్కరూ ఎంతకూ రాలేదు.

వాళ్ళను అడుగు ముందుకు వేయకుండా సైంధవుడు అడ్డుకున్నాడు. ఒంటరివాడై అభిమన్యుడు పోరాడి పోరాడి బాగా అలిసి పోయూడు. కొలనులోకి దిగిన ఏనుగును బోయలు చుట్టుముట్టి ఆయుధాలతో వేధించినట్టు, కొదమ సింహంలాంటి అభిమన్యుణ్ణి కౌరవ వీరులు చుట్టుముట్టారు.

అతడు కౌరవ సేనల మధ్య ఒంటరిగా చిక్కి ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, దుర్యోధనుడు మొదలైన మహా వీరులు చుట్టుముట్టగా అందరితోనూ యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు! ఉత్తర గర్భం నుంచి జన్మించిన అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు ఒక్కడే పాండవ వంశాంకురంగా మిగిలాడు!

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం