తాజా కథలు @ CCK

వేణువు

2015-05-17 03:05:01 చిన్నారుల కథలు
నూతుంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన కార్యాలయంలోని గోడగడియూరం కేసి చూశాడు. ఒంటి గంట అయింది. మధ్యాహ్న భోజన విరామ సమయం. అయితే, ఇంకా గంట మోగలేదు. ప్యూను గంట కొట్టడానికి మరిచిపోయూడా ఏం? అని ఆయన ఆలోచించసాగాడు.

ఉన్నట్టుండి శ్రావ్యమైన వేణునాదం వినిపించింది. అదే సమయంలో గంట కూడా మోగింది. తరగతి గదుల నుంచి పిల్లలు బయటకు పరుగులు తీశారు. వారిలో కొందరు పాఠశాల ప్రాంగణంలో చెట్టు కింద నిలబడ్డ తొమ్మిదేళ్ళ కురవ్రాడి చుట్టూ మూగారు. వాడి పేరు రాధూ; వేణువులు అమ్మే కురవ్రాడు.

రోజూ భోజన సమయంలో వాడు పాఠశాలకు వస్తాడు. వాడు వేణువు ఊదడం వినగానే, గంట ఒకటయిందని గ్రహించి ప్యూను గంట మోగిస్తాడు. అతడు గడియూరం చూడ వలసిన పనిలేదు. సరిగ్గా ఒంటి గంటకు వస్తాడు రాధూ.

రాధూ వేణుగానం అంటే చాలా మంది పిల్లలకు చాలా ఇష్టం. కొందరు తాము తెచ్చుకున్న ఫలహారం కూడా రాధూతో పంచుకుని తినేవారు. అయితే, కొందరు ఉపాధ్యాయులకు ఇది నచ్చలేదు. ముఖ్యంగా నాలుగవ తరగతి ఉపాధ్యాయుడు పాత్రోకు మరీ చీదరగా అనిపించేది. మధ్యాహ్న విరామ సమయంలో గొడవ చేయడమే గాక, రాధూ పిల్లల్ని పాడుచేస్తాడేమో అని ఆయన అనుమానించాడు. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. ప్రధానోపాధ్యాయుడు అక్కడికి వెళ్ళి, పిల్లల్ని తరగతులకు వెళ్ళమని చెప్పి, ఆ పిల్లలు వెళ్ళిపోగానే, రాధూ కేసి తిరిగి, ‘‘వెళ్ళిపో. ఇకపై ఈ దరిదాపులకు రావద్దు,'' అని కోపంగా ఆజ్ఞాపించాడు.

ఆ తరవాత కొన్నాళ్ళు రాధూ పాఠశాలకేసి రాలేదు. ప్యూనుకు వాడు రాని వెలితి కనిపించింది. గంట మోగించడంలో మరింత జాగ్రత్త వహించాడు. రోజూ కొంతసేపు రాధూ వేణుగానం వినే అవకాశం దూరంకావడంతో చాలా మంది పిల్లలు విచారం చెందారు. ఒకనాడు ఏదో అద్భుతం జరిగినట్టు, మళ్ళీ వేణుగానం వినిపించింది. అదే సమయంలో మధ్యాహ్నం గంట మోగింది. చాలా మంది పిల్లలు ఉత్సాహంతో వేణువు ఊదుతూన్న రాధూ వద్దకు పరుగులు తీశారు. చాలా వేణువులు అమ్ముడయ్యూయి.

దాన్ని ఎలా ఊదాలో రాధూ పిల్లలకు నేర్పసాగాడు. వాడు మళ్ళీ రావడం పాత్రోకు నచ్చలేదు. ప్రధానోపాధ్యాయుణ్ణి వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. ఆయన్ను చూడగానే, పిల్లలు మెల్లగా జారుకున్నారు. అక్కడ మిగిలిన పిల్లల ఎదుట ప్రధానోపాధ్యాయుడు రాధూను చెంప దెబ్బ కొట్టాడు. రాధూ చెక్కిళ్ళపై కన్నీరు కారసాగింది.

తను మరీ కఠినంగా శిక్షించానా అన్న అనుమానం ప్రధానోపాధ్యాయుడికి కలిగింది. మనసులో నొచ్చుకున్నాడు. ఆ తరవాత తన జేబులోని పర్సు తీసి, అందులోంచి పది రూపాయల కొత్త నోటు తీసి రాధూకు ఇవ్వబోయూడు. అయితే, దాన్ని పుచ్చుకోవడానికి తిరస్కరించిన రాధూ, ‘‘అయ్యూ, నేను ఈ బడిలో మూడో తరగతి చదువుకుంటున్నప్పుడు నా తల్లితండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

నా చదువు కొనసాగించలేక పోయూను. నేను నా తల్లిదండ్రులకు ఒకడే సంతానం. నన్ను ఆదుకునే వారెవరూ లేకపోయూరు. ఆకలికి తట్టుకోలేక ఈ వేణువులమ్మే పని చేపట్టాను. అయినా, బడి అంటే నాకు మహా ఇష్టం. పిల్లలతో స్నేహం చేయడమంటే ఇంకా సంతోషం. అందుకే ఈ బడిని మరువలేక రోజూ ఇక్కడికి వస్తున్నాను. దీన్ని గొడవగా భావించి తమరు వద్దంటే మాత్రం ఇకపై రాను,'' అన్నాడు వినయంగా.

వాడి మాటలు విన్న ప్రధానోపాధ్యాయుడి నోటి నుంచి మాట రాలేదు. తనలాగే అవాక్కయి నిలబడిన పాత్రో కేసి మౌనంగా చూశాడు. ఆ తరవాత రాధూ కేసి తిరిగి, ‘‘నన్ను క్షమించు బాబూ. నిన్ను కోప్పడి ఉండకూడదు. నువ్వు అనాథవు కావు. నీ సంరక్షణాబాధ్యతలు మేమే చూసుకుంటాం. నువ్వు మళ్ళీ చదువును కొనసాగించాలి. రేపు ఉదయం రా. నాలగవ తరగతిలో చేర్చుకుంటాను,'' అన్నాడు. మరునాడు ప్రార్థనా సమావేశంలో, ప్రధానోపాధ్యాయుడు రాధూ జేబు నుంచి వెలుపలికి కనిపిస్తూన్న వేణువును చూశాడు. వాణ్ణి పిలిచి ప్రార్థనా గీతాన్ని వేణువులో వాయించమన్నాడు. నాటి నుంచి రోజూ అలాగే జరుగుతూ వచ్చింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం