తాజా కథలు @ CCK

మీనా బొమ్మ

2015-05-05 23:05:01 చిన్నారుల కథలు
మీనా చిత్రపూర్‌లో ఉంటోంది. ఆమె చాలా తెలివిగల అమ్మాయి. తల్లితండ్రులు ఆమె పట్ల ఎంతో ప్రేమ కనబరచేవారు. ఆ రోజు ఆమె చాలా సంతోషంగా ఉంది. అమెరికాలో చదువుకుంటూన్న అన్నయ్య, ఆమె పుట్టినరోజు కోసం వస్తున్నాడు. అన్నయ్యకు స్వాగతం పలకడానికి మీనా తల్లిదండ్రులతో కలిసి విమానాశ్రయూనికి వెళ్ళింది. అన్నయ్యను చూడగానే మీనా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇంటికి వస్తూ అన్నయ్య తన కాలేజీ గురించీ, విశ్వవిద్యాలయం గురించీ ఎన్నో ఆసక్తికరమైన విషయూలు చెబుతూ వచ్చాడు.

అప్పటికే మీనా ఇంజినీరై, పైచదువుల కోసం అమెరికా వెళ్ళాలని నిర్ణయించింది. ఆమె ఆ రాత్రి తను చదవబోయే కాలేజీ గురించి కలలుకంటూ నిద్రపోయింది. మరునాడు ఆమె పుట్టిన రోజు. ఆమెకు ఎన్నో కానుకలు వచ్చాయి. అయితే, అన్నయ్య ఇచ్చిన అమెరికన్‌ డాల్‌ అన్నిటికన్నా చాలా అందంగా ఉంది. అందమైన ఆ బొమ్మకు బంగారు జుట్టు, పచ్చటి దుస్తులు ఉన్నాయి. పైకెత్తితే కళ్ళు తెరుస్తుంది. కిందికి దించితే కళ్ళు మూసుకుంటుంది. అది అన్నిటికన్నా చాలా భిన్నమైనది. ఎంతో బావున్నది. దాన్ని తన స్నేహితులకు చూపించాలని మీనా ఎంతో ఉత్సాహ పడింది.

అందువల్ల ఆమె బొమ్మను తన స్కూలు బ్యాగ్‌లో దాచుకుని వెళ్ళింది. తరగతిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాల మీద మనసును నిలుపలేక పోయింది. సంచీలో నిదుర పోతూన్న బొమ్మ మీదే ఉంది ఆమె ధ్యాసంతా. మీనా పరధ్యానంతో ఏదో పగటి కలలుకంటున్నదని హిస్టరీ టీచర్‌ గమనించి, హెచ్చరించింది. ఉలిక్కి పడిన మీనా తన బొమ్మను ఒకసారి తాకి చూసుకున్నది.

అప్పుడామె చేతికి ఏదో బటన్‌ తగలడం గమనించింది. అప్పుడే గంట మోగడంతో, మరాఠీ టీచర్‌ తరగతిలోకి వచ్చింది. ఆమె భూకంపాలకు సంబంధించిన చిత్రాలు తీసుకు వచ్చి పిల్లలకు భూకంపాల గురించి బోధించసాగింది. అయితే, మీనా మనసంతా ఆ బొమ్మ మీదే ఉంది.

సమయం దొరికినపుడల్లా దాన్ని రహస్యంగా చూసుకోసాగింది. మూడో పిరియడ్‌ ఆరంభమవుతూండగా, తరగతి గోడ మెల్లగా కంపించింది. దాన్ని మొదట ఎవరూ గమనించలేదు; ఆ తరవాత భవనమంతా ఉధృతంగా ఊగడంతో గోడ కూలి పోయింది. పిల్లలు వెలుపలికి వెళ్ళలేకపోయూరు.

మీనా హడలి పోయింది. ఆమె బొమ్మను శరీరానికి గట్టిగా అదిమి పట్టుకున్నది. దాంతో బొమ్మ గట్టిగా మాట్లాడసాగింది: ‘‘భూకంపం వస్తే, మొదట వెలుపలికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది సాధ్యం కాలేదంటే మేజా కిందగాని, బెంచీ, మంచం కిందగాని దాక్కుని మీరెండు చేతులను మెడపై ఉంచుకోవాలి.'' టీచర్‌ చెప్పిన మాటలు బొమ్మలో రికార్డయిందని మీనా వెంటనే గ్రహించింది. అందువల్ల మెషీన్‌లో రికార్డయిన దాన్ని, గట్టిగా నొక్కి పట్టినప్పుడు బొమ్మ మళ్ళీ మళ్ళీ చెప్పగలదని తెలుసుకున్నది. మీనా బటన్‌ను మళ్ళీ నొక్కింది. బొమ్మ బిగ్గరగా, ‘‘భూకంపం, భూకంపం,'' అని అరవసాగింది.

దాని మాటలు వెలుపలనున్న వారికి వినిపించడంతో, శిథిలాల మధ్య పిల్లలు చిక్కుకుని ఉన్నారని గ్రహించి, వెలుపలికి తీయడానికి పూనుకున్నారు. తగిన సమయంలో వారికి సహాయం అందింది. మీనా తరగతిలోని పిల్లలందరినీ ప్రాణాలతో కాపాడారు. తమ ప్రాణాలను కాపాడినందుకు తరగతిలోని పిల్లలందరూ మీనాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘మీరు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదు; నా బొమ్మకు,'' అన్నది మీనా. ఆమె అన్నయ్య, ‘‘నువ్వే గనక ‘భూకంపం, భూకంపం,' అని ఆ బొమ్మను అరిచేలా చేయకుండా ఉన్నట్టయితే, మిమ్మల్ని కనుగొనడం చాలా కష్టమై ఉండేది. మంచిపని చేశావు,'' అంటూ మీనాను అభినందించాడు. మీనా చాలా సంతోషించింది.

తను స్నేహితులందరినీ కాపాడడానికి ఉపకరించిన బొమ్మను ఇచ్చినందుకు అన్నయ్యకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘బాగా చదివి మంచి ర్యాంకు తెచ్చుకున్నావంటే వచ్చే బర్‌‌తడేకు కంప్యూటర్‌ కానుకగా ఇస్తాను,'' అన్నాడు అన్నయ్య. ఆ మాట విని మీనా ఆనందంతో నాట్యం చేసింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం