తాజా కథలు @ CCK

అదృష్టం

2015-03-22 19:05:01 చిన్నారుల కథలు
సేవారామ్‌ అనే క్షురకుడు చాలా పేదవాడు. ఎంత కష్టపడినప్పటికీ పూట గడవడమే కష్టంగా ఉండేది. ఏరోజు సంపాదన ఆ రోజుకు బొటాబొటిగా సరిపోతూ ఉండేది. ఒక్కొక్క రోజు బియ్యం కొనడానికి కూడా డబ్బులు చాలేవి కావు. అలాంటి రోజుల్లో అతడి భార్య శివానీ, ‘‘పుట్టింట ఎంతో గారాబంగా, ఎలాంటి కొరతా లేకుండా పెరిగిన నేను, ఈ చేతగాని దద్దమ్మను కట్టుకోవడంవల్ల తిండికీ, బట్టకూ కూడా కరువై పోయింది కదా,'' అని వాపోయేది.

ఒకనాటి సాయంకాలం సేవారామ్‌ దమ్మిడీ సంపాదన కూడా లేకుండా వట్టి చేతులతో ఇంటికి తిరిగివచ్చాడు. భార్య నోట చీవాట్లు తింటూ పడుకున్నాడు. అయితే ఎంత సేపటికీ నిద్ర పట్టలేదు. తెల్లవారాక ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచించాడు. వేకువ జామునే లేచి, స్నానం చేసి కత్తి, కత్తెర, దువ్వెనలు, అద్దం, తలనూనెలు ఉన్న తన పెట్టెను తీసుకుని ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు. భార్యను కేక వేసి పిలిచి, ‘‘కావలసినంత డబ్బు సంపాయించిన తరవాతే తిరిగి వస్తాను,'' అని చెప్పి చకచకా వెళ్ళి పోయూడు.

గుమ్మంలోకి వచ్చిన అతడి భార్య శివానీ, భర్త కేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది గానీ, అతన్ని వెనక్కు పిలవలేదు. రోజూ క్షవరం, చేసుకునే ధనికులెవరూ ఆ గ్రామంలో లేరు. క్షవరం చేయించుకున్నా డబ్బులు తరవాత ఇస్తామని చెప్పే పేదలే ఆ గ్రామంలో ఎక్కువ. అందుకే సేవారామ్‌ నిరుపేద క్షురకుడుగానే కాలం గడుపుతున్నాడు. సేవారామ్‌ పట్నం కేసి వేగంగా నడవసాగాడు.

బాగా అలిసిపోయినప్పుడు చెట్ల కింద నీడలో విశ్రాంతి తీసుకుంటూ; అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, అటువైపు వచ్చే బాటసారులెవరైనా క్షవరం చేయమని అడిగితే బావుణ్ణుకదా అన్న ఆశతో ఎదురు చూస్తూ పయనం సాగించాడు. అయితే, ఏ ఒక్కరూ రాలేదు. చీకటి పడుతూండగా బాగా అలిసిపోయి ఒక ఎత్తయిన చెట్టుకింద పడుకుని అలాగే నిద్రపోయూడు.

ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉంటున్నది. సేవారామ్ గురక విని, మంచి ఆహారం దొరికిందన్న ఉత్సాహంతో ఒక్క ఉరుకున కిందికి దూకింది. వాణ్ణి చంపడానికి ముందు హడలగొట్టాలని నిర్ణయించి, వాడి భుజాలు పట్టుకుని ఊపింది. సేవారామ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. దయ్యం తన ముఖం భయంకరంగా కనిపించేలా నానా వంకర్లు తిప్పుతూ, ‘‘నిన్ను నేను మింగేస్తాను. మానవా!'' అన్నది రెండు చేతులతో గొంతును పట్టుకోబోతూ.

బాగా అలిసిపోయి నిద్రమత్తులో ఉన్న సేవారామ్ తను ఎలా చచ్చినా ఫరవాలేదనుకున్నాడు. దయ్యం మింగినా మింగనీ అనుకుంటూ హఠాత్తుగా భార్య జ్ఞాపకం రావడంతో, ‘‘పాపం శివానీ నేను లేకపోతే ఎలా బతుకుతుంది? కనీసం ఆమె కోసమైనా జీవించి తీరాలి,'' అనుకుని, ‘‘ఏమిటీ చిలిపి చేష్ట?'' అంటూ, ‘‘వెళ్ళిపో!'' అన్నట్టు చేయి ఊపాడు. అయితే దయ్యం అక్కడి నుంచి కదలలేదు.

‘‘నేను కిందటిసారి పట్టుకున్న దయ్యూన్ని చూడాలనుకుంటున్నావా?'' అంటూ సేవారామ్, తలకింద పెట్టుకున్న పెట్టెను తెరిచి, అందులోంచి చిన్న అద్దాన్ని వెలికి తీసి, ‘‘దీనిలోకి చూడు,'' అంటూ దాని ముందు ఉంచి, ‘‘ఇలాంటివి నా పెట్టెలో ఇంకా కొన్ని ఉన్నాయి,'' అన్నాడు.

అద్దంలో తన మొహం చూసి, దయ్యం హడలి పోయి కీచుమంటూ అరిచింది. అయ్యూ, ఆ భయంకరమైన దయ్యంతో కలిపి, నన్ను కూడా పెట్టెలో బంధించకు! అంటూ సేవారామ్  చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బతిమలాడసాగింది. అలా అయితే, నువ్వు తెల్లవారే సరికి నాకు మణులు, మాణిక్యాలు తెచ్చి ఇవ్వాలి! సరేనా? అని గద్దించాడు సేవారామ్  దృఢమైన కంఠ స్వరంతో.

మరు క్షణమే దయ్యం మాయమై పోయింది. సేవారామ్ అద్దాన్ని పెట్టెలో పెట్టి, కోడికూత వినిపించేంతవరకు కాచుక్కూర్చోవాలని నిర్ణయించాడు. అయితే, మరికొంత సేపటికల్లా దయ్యం తిరిగి రావడం చూసి అతడు ఆశ్చర్యపోయూడు. దయ్యం ఒక చిన్న మూటను తెచ్చి సేవారామ్ ముందు పడవేసింది. అందులో తళతళ మెరిసే మణులు, మాణిక్యాలు కనిపించాయి.

సరే, ఇప్పటికి నిన్ను వదిలి పెడుతున్నాను. పట్నం వెళ్ళి సాయంకాలానికి తిరిగివస్తాను, అంటూ సేవారామ్ అక్కడి నుంచి బయలుదేరి పట్నం కేసి నడవసాగాడు. తన వద్ద ఉన్న కొన్ని మణులను అమ్మి డబ్బుగా మార్చుకోవాలనుకున్నాడు. కొంత దూరం నడిచాక అతడికొక ఆలోచన కలిగింది. మణులను అమ్మకుండా తాకట్టు పెడితే, ఆ తరవాత విడిపించుకోవచ్చుకదా అనుకున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, తన వద్ద ఉన్న విలువైన మణులను కొన్నిటిని తాకట్టు పెట్టుకుని, కొంత మొత్తం ఇస్తే, ఒక నెల తరవాత వచ్చి, అసలూ, వడ్డీ చెల్లించి తన మణులు విడిపించుకోగలనని చెప్పాడు. వడ్డీ వ్యాపారి మణులను పరిశీలించి చూసి, నాణ్యమైనవే అని నిర్ధారించుకుని సేవారామ్ కు  అడిగిన డబ్బు ఇచ్చి పంపాడు.

సేవారామ్ బాగా ఆకలిగా ఉండడంతో భోజనశాలకు వెళ్ళి తృప్తిగా భోజనం చేసి, ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద నడుం వాల్చాడు. చాలా సేపు ఆదమరచి నిద్రపోయూడు. పొద్దువాలుతూండగా లేచి, ఉత్సా హంగా దయ్యం ఉన్న చెట్టు కేసి నడిచి, చీకటి పడుతూండగా అక్కడికి చేరుకున్నాడు.

తన పెట్టెను తలకడగా పెట్టుకుని నిన్నలాగే పడుకున్నాడేగాని, ఏ క్షణంలోనైనా దయ్యం రావచ్చు గనక నిద్రపోకుండా కాచుకున్నాడు. అప్పటికే చెట్టు మీది దయ్యం, దాపుల మరొక చెట్టు మీద ఉన్న దయ్యం స్నేహితుడితో రాత్రి జరిగినదంతా చెప్పింది. రెండు దయ్యూలు కలిసి, సేవారామ్  కు ఇచ్చిన   మణులను తిరిగి రాబట్టుకోవాలనీ, తమలాంటి భయంకర దయ్యూలను దాచి పెట్టిన పెట్టెను దొంగిలించాలనీ పథకం వేశాయి. అర్ధరాత్రి సమయంలో రెండు దయ్యూలూ చెట్టు దిగి వచ్చి, సేవారామ్ నిద్రపోతున్నాడా, లేడా అని మెల్లగా పరీక్షించి చూశాయి. అతడికి తెలియకుండా అతడి తలకింది పెట్టెను ఎత్తుకెళ్ళడానికి వీలవుతుందా అని పరిశీలించి చూడసాగాయి.

సేవారామ్ మేలుకునే ఉన్నప్పటికీ, నిద్రపోతున్నట్టు నటించసాగాడు. ఆ దయ్యూలు రెండూ కలిసి, అతడి తలకింది సంచీని మెల్లగా లాగాయి. కొంత లాగేంతవరకు, కదలకుండా ఉన్న సేవారామ్, మరుక్షణమే బంతిలా ఎగిరి లేచి, పెట్టె తెరిచి అందులోని కత్తెరనూ, అద్దాన్నీ వెలుపలికి తీశాడు. ఒక చేతిలో కత్తెరనూ, రెండవ చేతిలో అద్దాన్నీ పట్టుకున్నాడు. కత్తెరను రెండు దయ్యూల కేసీ గురిచేసి, వేళ్ళతో కత్తెరను వేగంగా కదిలిస్తూ వింత శబ్దాన్ని పుట్టించ సాగాడు.

అదే సమయంలో అద్దాన్ని కూడా వాటికేసి చూపాడు. దయ్యూలు కత్తెరకు భయపడ్డాయో, అద్దానికి ఎక్కువ భయపడ్డాయో తెలియదుగాని, రెండూ వేగంగా కదలడం చూడడంతో దయ్యూలు రెండూ హడలిపోయి, చెట్టెక్కడానికి ప్రయత్నించసాగాయి. దాన్ని గమనించిన సేవారామ్, కదలకండి. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి, బంగారు నాణాలు నాకు తెచ్చి ఇవ్వాలి. తెల్లవారే సరికి రాక పోయూరో, రెండో దయ్యం ఆ పెట్టెలోని భయూనక ప్రాణులతో కలిసిపోక తప్పదు! అని హెచ్చరించాడు.

ఇప్పుడు పరిగెత్తడం రెండవ దయ్యం వంతయింది. సేవారామ్   లోలోపల నవ్వుకున్నాడు. అయితే, చేతుల్లోని కత్తెరనూ, అద్దాన్నీ కదిలిస్తూనే ఉన్నాడు. మొదటి దయ్యం దీనంగా నిలబడుకుని, తన మిత్రుడు ఎప్పుడు వస్తాడా, చెట్టు మీదికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని భయం భయంగా ఎదురుచూడ సాగింది.

రెండవ దయ్యం తెల్లవారు జామున వచ్చి, తనతో తెచ్చిన బంగారు నాణాల సంచీని సేవారామ్  కు ఇచ్చింది. అతడు దానిని వెంటనే తన సంచీలో పెట్టుకుని, చేతిలోని కత్తెరను అదే వేగంతో కదిలిస్తూ, ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్నది. నేను పట్నం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను. మీరిద్దరూ బుద్ధిగా నడుచుకున్నట్టయితే, ఆ సంచీలోని ప్రాణులను వదిలి పెడతాను, అన్నాడు.

ఆ తరవాత కత్తెరను, అద్దాన్ని సంచీలో పెట్టుకుని బయలుదేరి తిన్నగా తన ఇల్లు చేరాడు. భార్య శివానీకి తన రెండు రోజుల అనుభవాలను వివరించాడు. అంతా విని, అమితాశ్చర్యం చెందిన అతడి భార్య, నువ్వు ప్రపంచంలోకెల్లా చాలా ధైర్యవంతుడివి, తెలివైనవాడివి! అని మెచ్చుకున్నది. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాలనే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను,అన్నాడు అప్పటికే పేదరికం నుంచి బయటపడిన సేవారామ్  ఎంతో సంతోషంగా.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం