తాజా కథలు @ CCK

నీచ వృత్తి

2015-06-07 11:05:01 చిన్నారుల కథలు
పూర్వం వైశాలీనగరంలో రంగిశెట్టి అనే కిరాణావ్యాపారి ఉండేవాడు. వ్యాపారం మీద శెట్టికి సుఖంగా జరుగుబాటు కావటమేగాక, కొంత మిగులుతూండేది కూడా. అయినా శెట్టికి తన ‘‘బెల్లం, చింతపండు'' వ్యాపారం ఎదుగూ బొదుగూలేని వ్యాపారంగా కనబడింది. ఎన్నాళ్ళీ అర్ధణా, కాణీ వ్యాపారం చేస్తే నాలుగు డబ్బులు కూడబెట్టగలం అన్న అసంతృప్తి వెన్నాడసాగింది. ఎలాగైనా తను కూడా నగరంలోని చెప్పుకోతగ్గ ధనికుల్లో ఒకడు కావాలనీ అందుకు ఏదైనా మార్గం చూడాలనీ తీవ్రంగా ఆలోచించసాగాడు.

కోటీశ్వరుడు కావటానికి ఇంకేదన్నా వృత్తి చేపట్టాలనిపించింది. శెట్టి బుద్ధి ఇలా పెడతోవనపడుతూండగా, అతని పక్కవీధిలో ఉన్న ఒక లక్షాధికారి ఇంట దొంగలు పడి, లక్ష వరహాలు విలువచేసే వెండీ, బంగారమూ ఎత్తుకు పోయూరు. పొద్దస్తమానం కొట్లో కూర్చుని అవస్థ పడడంకన్నా అలాంటి దొంగతనం ఒక్కటిచేస్తే జీవితాంతం హాయిగా బతక వచ్చుననిపించింది శెట్టికి. తాను దొంగతనం చెయ్యూలంటే ముందుగా దొంగలను పరిచయం చేసుకోవాలి, ఆ వృత్తిలో సాధకబాధకాలు తెలుసుకోవాలి.

దొంగలు రాత్రిపూట సమావేశమయ్యే స్థలాల కోసం వెతికి, చివరకు శెట్టి, ఊరిబయట పాడుబడిన శివాలయం దగ్గిర అర్ధ రాత్రిపూట కొందరు దొంగలు చేరుతూంటారని తెలుసుకుని, అర్ధరాత్రికి ముందే అక్కడికి వెళ్ళి ఆలయం అరుగు మీద పడుకుని నిద్ర పోతున్నట్టు నటించుతూ, దొంగల సంభాషణ ఆలకించసాగాడు. శెట్టికి వాళ్ళ మాటలు వింటూంటే చెప్పరానంత ఆశ్చర్యం వేసింది.

దొంగలకు ఎంత ధైర్యసాహసాలు కావాలి, ఎంత దూరదృష్టి, సమయస్ఫూర్తి ఉండాలి! రోజూ రంగిశెట్టిని అరుగు మీద చూస్తున్న దొంగలకు, అతను ఎవరో దిక్కులేనివాడనీ, తమకు ఎప్పుడైనా అవసరంవస్తే ఉపయోగపడవచ్చుననీ అనిపించింది.

ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు చెరొక కావడీ మోసుకొచ్చారు. వారిలో ఒకడు చిన్నవాడు, రెండోవాడు పెద్దవాడు. చిన్నవాడు దొంగనిద్ర నటిస్తున్న శెట్టిని లేపి, ‘‘మా మనిషి ఒకడు రాలేదు. మాతో వస్తావా? నీకు తగినంత ముట్ట జెప్పుతాంలే! మా పని నీకు కొత్త అని భయపడవలసినపనిలేదు. మేం చెప్పినట్టు చేస్తేచాలు. నిన్ను కాపాడే పూచీ మాది!'' అన్నాడు. అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూన్న రంగిశెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు.

దొంగలు ముందు శెట్టి అవతారం మార్చేశారు: అతని చొక్కా విప్పేసి, తలకు తలగుడ్డ చుట్టి, మూఖానికి మసి పులిమి, చిన్నగడ్డం అంటించి, బట్ట ఎగకట్టించి, చేతికి కర్ర ఇచ్చి, నెత్తిన గోతపు సంచీ పెట్టి, చేతికి ఏడెనిమిది బెల్లపు గడ్డలు ఇచ్చి, ‘‘ఇక పద!'' అన్నారు. దొంగతనానికి పోవాలంటే ఇంత తతంగం ఉన్నదని శెట్టికి తెలియదు. తనని దొంగలు నిమిషాలలో ఒక రైతుగా మార్చేశారు. ఈ రూపంలో తనను చూసి తన భార్య కూడా గుర్తించలేదు.

ఇలా ఆలోచించుకుంటూ పోతున్న శెట్టి చీకట్లో చూడక, దారిలో పడుకుని ఉన్న ఒక వీధికుక్క తోక తొక్కాడు. అది గట్టిగా మొరగడం ప్రారంభించింది. శెట్టి ఒక్కసారిగా అదురుకుని, ‘‘అమ్మో!'' అంటూ గట్టిగా అరిచి చేతిలోని బెల్లపుగడ్డలు జారవిడిచాడు. కుక్క మొరగడం ఆపి, బెల్లపుగడ్డలను నాకనారంభించింది. పెద్దదొంగ శెట్టితో, ‘‘మనం వెళుతున్నది దొంగతనానికి, నాయనా! పెండ్లి భోజనానికి కాదు.

ఆ సంగతి గుర్తుంచుకుని కొంచెం జాగర్తగా ఉండాలి,'' అని శెట్టికి మరికొన్ని బెల్లపు ఉండలు ఇచ్చాడు. చిన్నదొంగ శెట్టితో, ‘‘కుక్క అరవటమూ, వెంటనే మానటమూ కొత్వాలు గమనిస్తాడు. అతను రాకమానడు. వచ్చి రకరకాల ప్రశ్నలు వేస్తాడు. మనని ఏమార్చి బుట్టలో వెయ్యటానికి ప్రయత్నిస్తాడు. నువ్వు నోరెత్తకు. అన్ని ప్రశ్నలకూ నేనే సమాధానం చెబుతాను,'' అన్నాడు. చిన్నదొంగ ఊహించినట్టే కొత్వాలు గుర్రం మీద అటుగా వచ్చాడు. అతను కోపంగా, ‘‘ఎవర్రా మీరు? అర్ధరాత్రి ఇలా వీధులవెంట తిరగరాదని తెలీదా? ఈవేళప్పుడు ఏం పని మీద బయలుదేరారు? నిజం చెప్పండి,'' అని గద్దించాడు.

కొత్వాలు గొంతు వింటుంటేనే శెట్టికి గుండెల్లో అదురుపుట్టింది. ‘‘ఛీ, ఛీ! క్షణక్షణమూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే ఈ వృత్తి ఏం వృత్తి? ఇందులో ఎంతలాభం ఉంటే మటుకేం? ఇంతకుముందు ఈ కొత్వాలు కాదుగదా, ఇంతకన్న పెద్ద అధికారిని చూసి కూడా ఎన్నడూ భయపడలేదే,'' అనుకున్నాడు రంగిశెట్టి. చిన్నదొంగ కొత్వాలుతో, ‘‘మాది పక్క గ్రామం రామాపురం దొరా! బెల్లపు ఉండలు అమ్ముకుందామని కావళ్ళు వేసుకొచ్చాం.

ఈ చీకట్లో సత్రందారి తెలీక వీధులన్నీ తిరుగుతున్నాం. తమరు కాస్త సత్రందారి చూపించి పుణ్యంకట్టుకొండి,'' అన్నాడు ఎంతో అమాయకంగా. ‘‘సత్రందారి చెబుతాను. ముందు మీ పేర్లు చెప్పండి. ఈ బొరవ్రాడెవడు? కాయకష్టం చేసేవాడులాగా లేడే!'' అన్నాడు కొత్వాలు శెట్టిని చూసి. శెట్టికి గుండె దడపుట్టింది.

‘‘నా పేరు రాములండి, వీడు మా అన్న కిష్టయ్య. ఈయన మారుబేరగాడు మంగయ్య. కాయకష్టం చెయ్యకుండానే కూర్చున్న చోటు నుంచి కదలకుండా లాభాలు తిని బొర్ర పెంచాడు,'' అన్నాడు చిన్న దొంగ. కొత్వాలు నవ్వి, సత్రందారి చెప్పి, ‘‘ఓ ఘడియలో సత్రం కేసి వస్తాను. మీరు ముగ్గురూ ఉన్నారో, లేదో చూస్తాను.

జాగ్రత్త! వెళ్ళండి,'' అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ, ముగ్గురూ ముందుకు సాగారు దొంగతనానికి. ఇప్పటికి శెట్టికి దొంగవృత్తి మీద పూర్తిగా ఏవగింపుకలిగింది. అడుగడుగునా అబద్ధాలు! క్షణక్షణం భయం! ఇంకా దొంగతనం చెయ్యకమునుపే ఇలా ఉంటే, వృత్తి చేపట్టినాక మనశ్శాంతి పూర్తిగా పోవడం ఖాయం. ‘‘చచ్చినా ఈ వృత్తి లోకి దిగరాదు.

ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకు పోవాలి!'' అనుకున్నాడు రంగిశెట్టి. ముగ్గురూ ఒక పెద్ద ఇంటి ముందు ఆగారు. అదే వాళ్ళు కొల్లగొట్టదలచుకున్న ఇల్లు. ‘‘నేను తాళం పగలగొట్టుతాను. మనిద్దరమూ లోపల పనిముగించుకుని వచ్చే దాకా ఇతను బయట కాపలా ఉంటాడు,'' అని కూడబలుక్కుని దొంగలు తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు. వెంటనే రంగిశెట్టి అక్కడినుంచి మెల్లగా కదిలి, తన ఇంటికి బయలుదేరాడు.

అతను కొంతదూరం వెళ్ళి గబగబా తమ వీధిమలుపు తిరుగుతూండగా రాజభటులు ఒక దొంగను పెడరెక్కలు విరిచికట్టి, కొరడాలతో బాదుతూ చెరసాల కేసి తీసుకుపోతూ కనిపించారు. దొంగ వెంట వాడి భార్యా, పిల్లలూ గోల గోలగా ఏడుస్తూ పోతున్నారు. తెల్లవారవచ్చే సమయంలో ఇది చూసిన గ్రామస్థులెవరూ, ‘‘అయ్యో, పాపం!'' అనలేదు. శెట్టికి ఆ దొంగ మీద కొండంత జాలి వేసింది.

‘‘ఇదేం వృత్తోగాని, పట్టుబడ్డ వాణ్ణి ఎంత శిక్షించినా లోకం ఇంకా శిక్షించాలనే అనుకుంటుంది. ఎంత నీచవృత్తి. నేను పట్టు బడినా నా గతీ ఇంతేగదా!'' అనుకున్నాడు అతడు. శెట్టి దొడ్డిదారిన లోపలికి వెళ్ళి, కొద్దిగా మిగిలి వున్న తన వేషం పూర్తిగా కడిగేసుకుని, ప్రశాంత మనస్సుతో తన ఇంటి అరుగు మీద పడుకున్నాడు. బాగా తెల్లవారినా నిద్రలేవని శెట్టిని అతని భార్య లేపి, కొత్వాలు ఇద్దరు దొంగలను తెల్లవారుఝామున పారిపోతుంటే, వెంటతరిమి కత్తులతో చంపిన వార్త చెప్పింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం