తాజా కథలు @ CCK

గౌరవం

2015-05-20 21:05:01 చిన్నారుల కథలు
జనకపురిలో శ్రీధాముడనే భాగ్యవంతుడికి కాముడు, పాత్రుడు అని ఇద్దరు కొడు కులు. వాళ్ళిద్దరూ చక్కగా చదువుకుని పెద్దవాళ్ళయి బుద్ధిమంతులన్న పేరు తెచ్చుకున్నారు. తండ్రి వాళ్ళిద్దరికీ తగిన సంబంధాలు చూసి పెళ్ళి చేశాడు కాని, ఆస్తివ్యవహారాలు మాత్రం ఇంకా తనే చూస్తున్నాడు. శ్రీధాముడి భార్య రమాదేవి ఒకనాడు భర్తతో ఈ విషయం ప్రస్తావించింది. ‘‘మనపిల్లలు బుద్ధిమంతులే కాని, ఆస్తి చేతికి వచ్చాక, వాళ్ళెలా మారుతారో తెలియదు.

ఇప్పటిలాగే వాళ్ళు మనల్ని గౌరవిస్తారని నమ్మకం కుదరడానికి కొన్నాళ్ళు పరీక్షిద్దాం,'' అని చెప్పి, ఆయన తన ఇంటిని మూడు వాటాలు చేశాడు. మధ్య వాటాలో తను ఉంటూ, అటూ ఇటూ కొడుకులచేత వేరుకాపురాలు పెట్టించాడు. పెత్తనం తనదే అయినా, పనులన్నీ కొడుకులకు అప్పగించి వాళ్ళ చేతలను గమనించసాగాడు. పెద్దవాడు కాముడు ఆస్తిని ఇంకా ఇంకా పెంచాలని ఆలోచిస్తూ, తనకు తోచిన ఉపాయూలను తండ్రికి చెప్పి, ఆయన ఆమోదించాకే అమలు చేసేవాడు.

చిన్నవాడు పాత్రుడు రోజూ నిద్రలేస్తూనే శ్రీధాముడి తండ్రి కుచేలుడి చిత్రపటానికి నమస్కరిస్తాడు. కుచేలుడి పేరు మీద అంతో ఇంతో దానధర్మాలు చేస్తూ, అందుకు తండ్రి అనుమతి కూడా అడగడు. ఎవరడిగినా కుచేలుడి మనమడినంటాడే తప్ప తన పేరు చెప్పడు. ఇలా ఒక ఏడాది గడిచాక, శ్రీధాముడు భార్యాసమేతంగా తీర్థయూత్రలకు బయలుదేరుతూ, తన ఆస్తిని రెండు భాగాలు చేసి చిన్న భాగం కాముడికీ, పెద్ద భాగం పాత్రుడికీ అప్పజెప్పాడు.

కాముడు చిన్నబుచ్చుకున్నాడు. భార్య అతన్ని హెచ్చరిస్తూ, ‘‘ఆస్తిని ఇద్దరు కొడుకులకూ సమానంగా పంచాలి. లేదా పెద్దవాడివైన నీకు పెద్ద భాగమివ్వాలి. నువ్వు ఊరుకోకుండా వెంటనే మీ నాన్నను అడుగు,'' అన్నది. కాముడు ఆమె మాట పాటించాడు.

కొడుకు గోడు విన్న శ్రీధాముడు నిర్లక్ష్యంగా నవ్వి, ‘‘ఈ ఆస్తి నా స్వార్జితం. పంపకం నా ఇష్టం. నాకు మీతాత, అనగా నా తండ్రి కుచేలుడంటే భక్తి, గౌరవం. ఆయన్ను గౌరవించే పాత్రుడికి పెద్ద భాగమిచ్చాను. ఐతే, ఈ పంపకం తాత్కాలికం. నా తీర్థయూత్రలయ్యేసరికి నీలో నేను మెచ్చేమార్పువస్తే, పెద్ద భాగం నీకే దక్కవచ్చునేమో,'' అనేసి యూత్రలకు వెళ్ళిపోయూడు.

పాత్రుడు కుచేలుణ్ణి గౌరవించడం వెనక ఇంత కథ ఉన్నదని తెలియని కాముడాశ్చర్యపడి, తమ్ముణ్ణి కలిసి, ‘‘తాత చనిపోయినప్పుడు నీకు మూడేళ్ళయితే నాకు ఆరేళ్ళు. నాకే తెలియని ఆయన గొప్పతనం నీకెలా తెలుసు? ఆయనపై నీకింత అభిమానం ఎందుకు?'' అని అడిగాడు. ‘‘మన తండ్రికి జన్మనివ్వడం ఆయన గొప్పతనం. మన తండ్రిని సంతోషపెట్టడం నా ధ్యేయం,'' అన్నాడు పాత్రుడు.

ఆ తరవాత కాముడు ఆ విషయం గురించి బాగా ఆలోచించి, పాత్రుడి వద్ద వున్న పటానికి మూడింతల పరిమాణంలో కుచేలుడి చిత్రపటాలను రెండింటిని తయూరు చేయించాడు. ఒక పటాన్ని తన ఇంట్లో అలంకరించాడు. రెండవ పటాన్ని ఊరి గుడి మంటపంలో అలంకరించడానికి నూరువరహాలు చందా ఇచ్చాడు.

ఇలా ఉండగా జనకపురికి పొరుగు గ్రామమైన సీతాపురంలోని చలమయ్య అనే రైతు, అప్పులపాలైపోయి, తీర్చేమార్గం తెలియక, ఆత్మహత్య చేసుకోబోయూడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పాత్రుడు అతణ్ణి అడ్డుకుని కాపాడాడు. తర్వాత విషయం అడిగి తెలుకుకుని, ‘‘నీకు నేను మా తాత కుచేలుడి పేరు చెప్పి పది వరహాలిస్తాను. ఆ పెట్టుబడితో పొలం సాగుచెయ్యి. మా తాత మహిమతో నీ కష్టాలన్నీ తీరిపోతే, నా డబ్బు నాకు తిరిగి ఇద్దువుగాని,'' అని ధైర్యం చెప్పాడు.

ఆ డబ్బు తీసుకుని సీతాపురం తిరిగి వెళ్ళిన చలమయ్యకు - మరునాడు పొలం దున్నుతుండగా లంకెబిందెలు నాగలి కర్రుకు అడ్డు తగిలాయి. వాటినతడు గ్రామాధికారికి చూపితే, ఆయన బిందెల మీది రాతలను చదివి, ‘‘ఇవి నీ పూర్వులు నీకోసం పాతిపెట్టినవి. ఈ ధనం నీదే!'' అన్నాడు.

చలమయ్య జాతకం మారిపోయింది. అతడు జనకపురి వెళ్ళి, పాత్రుడికి డబ్బు తిరిగి ఇచ్చి, కృతజ్ఞతలు చెప్పాడు. ‘‘ఇందులో నాదేంలేదు. అంతా మా తాత కుచేలుడి మహిమ,'' అన్నాడు పాత్రుడు. ‘‘నేనే కాదు. కుచేలుడి మహిమ అందరూ తెలుసుకోవడానికి, మా ఊరి గుడిలో ఆయన పటం ఆవిష్కరించి, వేడుక చేస్తాను. అది నీ ఆధ్వర్యంలోనే జరగాలని నా కోరిక. నువ్వు తప్పక రావాలి,'' అన్నాడు చలమయ్య. ఈలోగా తీర్థయూత్రలు ముగించుకుని శ్రీధాముడు రెండు రోజుల్లో తిరిగి రాగలనని కొడుకులకు కబురు పంపాడు.

ఆ కబురందిన సమయూనికే సీతాపురంలో వేడుకలకురమ్మని చలమయ్య నుంచి పిలుపు వచ్చింది. తండ్రి వచ్చేసరికి, తిరిగి వచ్చేస్తామని అన్నకు చెప్పి సీతాపురం వెళ్ళాడు పాత్రుడు. అయితే, శ్రీధాముడు వచ్చిన సమయూనికి పాత్రుడు జనకపురికి చేరుకోలేక పోయూడు. కాముడాయనకు ఘనస్వాగతం పలికాడు. తండ్రి పాత్రుడి గురించి అడిగితే, చలమయ్య విషయం చెప్పి, ‘‘నువ్వొస్తున్నట్టు తెలిసీ తమ్ముడు సీతాపురం వెళ్ళాడు,'' అంటూ నిష్టూరంగా మాట్లాడాడు.

ఆ తరవాత తండ్రి గౌరవార్థం విందు చేసి ఊరి పెద్దలను పిలిచాడు. అందరూ కాముడికి తండ్రిపై ఉన్న గౌరవాభిమానాలను కొనియూడారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక మనిషి, ‘‘అయ్యూ, కాముడుగారు ఎక్కడ ఉంటారు?'' అని అడిగాడు. కాముడు ముందుకు వచ్చి, ‘‘నేనే కాముణ్ణి. ఏం కావాలి?'' అని అడిగాడు. ‘‘సీతాపురం నుంచి కుచేలుడుగారి మనవడు పంపగా వచ్చాను. ఆయన రేపు సాయంకాలానికి ఇక్కడికి వస్తున్నట్టు చెప్పమన్నారు,'' అన్నాడు.

అది విన్న శ్రీధాముడు ఆ మనిషినడిగి సీతాపురం వేడుకల వివరాలు తెలుసుకుని, ‘‘ఆహా, పెద్దలంటే పాత్రుడికున్న గౌరవం, అపారం,'' అని మెచ్చుకున్నాడు. విందు ముగిసి అందరూ వెళ్ళిపోయూక, ‘‘నీ పట్ల తమ్ముడు చూపిన గౌరవానికీ, నేనిచ్చిన గౌరవానికీ తేడా కనబడుతూనే ఉంది. తాతగారి విషయూనికి వస్తే, తమ్ముడాయన పేరుతో ఇచ్చిన డబ్బు వెనక్కు తీసుకున్నాడు.

సీతాపురం గుడిలో చలమయ్య పెట్టిన తాతగారి చిత్రపటం చూడ్డానికి వెళ్ళాడు. నూరు వరహాలు ఖర్చుపెట్టి మన ఊరి గుడిలో తాతగారి చిత్రపటాన్ని పెట్టించిన నాకంటే వాడి గౌరవం గొప్పదనడం నీ పక్షపాత బుద్ధికాదా?'' అన్నాడు కాముడు ఉక్రోషంగా.

అందుకు శ్రీధాముడు నవ్వి, ‘‘ఏది చేసినా నీ పేరుతోనే చేస్తూ నువ్వు పేరు తెచ్చుకుంటున్నావు. అన్నీ తాత పేరుతో చేస్తూ ఆయన పేరునిలబెడతూన్న పాత్రుడి గొప్పతనం గ్రహించలేని నీకు గౌరవం అంటే ఏమిటో చెప్పగలవాడు దండకారణ్యంలో గురుకులాశ్రమం నడుపుతూన్న సుమేధుడొక్కడే. తమ్ముడు తిరిగి వచ్చాక వాణ్ణి వెంటబెట్టుకుని ఆయన వద్దకు వెళ్ళు. నీకు సందేహ నివృత్తి అవుతుంది,'' అన్నాడు.

మరునాటి సాయంత్రానికి పాత్రుడు తిరిగి వచ్చాడు. రెండు రోజుల తరవాత, తండ్రి ఆనతి ప్రకారం అన్నదమ్ములిద్దరూ దండకారణ్యం వెళ్ళి సుమేధుణ్ణి కలుసుకున్నారు. కాముడి సందేహం విన్న సుమేధుడు, ‘‘నీ తమ్ముడు పెద్దలను నీకంటే మిన్నగా గౌరవిస్తాడని నీ తండ్రి అభిప్రాయం. మీరిద్దరూ కొన్ని రోజులు ఇక్కడే నా ప్రియశిష్యుడు సునాధుడితో ఉంటూ-అన్నీ అతడు చెప్పినట్టే చేయండి,'' అంటూ వారిని సునాధుడికి అప్పగించాడు.

మరునాడు సుమేధుడు వారిని సూర్యోదయూనికి ముందే నిద్రలేపి, చన్నీటి స్నానం చేయించాడు. ఆ తరవాత ముగ్గురూ వెళ్ళి, సుమేధుడు శిష్యులకు చెబుతూన్న పాఠాలు విన్నారు. పాఠాలు చెప్పడం అయ్యూక సుమేధుడు, ‘‘ఇప్పుడు మీరు అడవిలోకి వెళ్ళి నేలరాలిన ఫలాలు సేకరించండి. చెట్టు నుంచి పండును కోయవద్దు. జీవహింసకు పాల్పడవద్దు. సేకరించిన ఆహారాన్ని అందరూ సమంగా పంచుకుని తినండి,'' అన్నాడు.

కాముడు, పాత్రుడు సునాధుడితో కలిసి అడవిలోకి వెళ్ళారు. దారిలో సునాధుడు వారిని ఒక చెట్టెక్కి పళ్ళు కోయమన్నాడు. గురువు వద్దన్నాడని కాముడు కొయ్యనన్నాడు. పాత్రుడు మాత్రం చెట్టెక్కబోతే అక్కడున్న కోతి ఒకటి మీద పడబోయింది. సునాధుడు చెప్పగా అతడా కోతిని చిన్నరాయి తీసి గురిచూసి విసిరి తరిమేశాడు. కాముడు వారిస్తున్నా వినలేదు.

చెట్టెక్కి సునాధుడు చెప్పినన్ని పళ్ళు కోశాడు. ‘‘కష్టపడి కోసిన పళ్ళు. వీటిని ఇతరులతో పంచుకోవద్దు. మనమే తినేద్దాం,'' అన్నాడు సునాధుడు. పాత్రుడు సరేనన్నాడు. అయితే, గురువు మాటను అతిక్రమించడానికి ఇష్టపడని కాముడు, పరుగున సుమేధుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు.

సుమేధుడు పాత్రుణ్ణి పిలిపించి సంజాయిషీ అడిగాడు. ‘‘గురువర్యా, మీ ఆశ్రమంలో ఉండగా - అన్నీ సునాధుడు చెప్పినట్టే చేయమని నన్ను ఆదేశించారు కదా? నేను మీ ఆదేశాన్ని పాటించాను,'' అన్నాడు పాత్రుడు. అందుకు కాముడు, ‘‘మరి గురువు పాఠం చెబుతూ ఇచ్చిన ఆదేశాల మాటేమిటి?'' అంటూ తమ్ముణ్ణి నిలదీశాడు.

అప్పుడు సుమేధుడు చిన్నగా నవ్వి, ‘‘నా పాఠాలు నా శిష్యులకోసమే తప్ప, మీ కోసం కాదు. నువ్వు, పాత్రుడు ఇక్కడికి విద్యార్థులుగా రాలేదు. నేను మిమ్మల్ని అన్నీ సునాధుడు చెప్పినట్టే చేయమని ఆదేశించాను. సునాధుడు నా మాట పాటించక పోతే అతడు నన్ను అగౌరవపరచినట్టు. సునాధుడి మాట పాటించక పోతే మీరు నన్ను అగౌరవపరచినట్టు. ఇప్పుడు నువ్వే చెప్పు. పెద్దల్ని గౌరవించేది పాత్రుడా, నువ్వా?'' అన్నాడు.

కాముడు తెల్లబోయి, ‘‘అసలీ సమస్య అంతా సునాధుడు మిమ్మల్ని అగౌరవ పరచడంవల్ల కదా వచ్చింది?'' అన్నాడు. ‘‘ఇందులో సునాధుడి తప్పేమీ లేదు. మిమ్మల్ని పరీక్షించడం కోసం నేనే అతణ్ణి అలా చెయ్యమన్నాను. నా ప్రియశిష్యుడి ప్రవర్తనలోనూ, ఆ ఆదేశంలోనూ ఏదో ఆంతర్యం ఉన్నదని నీకు స్ఫురించ లేదంటే నీకు నా మీద గౌరవం లేదని అర్థం. కాదంటావా?'' అన్నాడు సుమేధుడు.

తన తండ్రి శ్రీధాముడు చేసిన ఆస్తిపంపకంలో ఏదో ఆంతర్యం ఉన్నదని గ్రహించక, అదేమని ఎదురుతిరగడం వల్ల - తనకు ఆయనపట్ల గౌరవం తక్కువేనని అప్పటికి అర్థమైంది కాముడికి. తరవాత సుమేధుడికి పాదాభివందనం చేసి, తమ్ముడితో కలిసి జనకపురి వెళ్ళి తండ్రిని తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీధాముడు, ‘‘తండ్రి నిర్ణయూన్ని తప్పు పట్టడం గౌరవం కాదని నువ్వు గ్రహించాలనే ఇదంతా చేశాను. కానీ, మీరిచ్చే గౌరవాన్ని బట్టి ఆస్తి పంపకం చేయడం నాకూ గౌరవం కాదు,'' అంటూ కొడుకులిద్దరికీ ఆస్తిని సమంగా పంచి ఇచ్చాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం