తాజా కథలు @ CCK

తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు

2015-06-05 13:05:01 చిన్నారుల కథలు
ఒకరోజు కొందరు గ్రామస్థులు రచ్చబండ వద్ద కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి బాలన్న అనే యువకుడికి తుమ్ములు మొదలైతే, ‘‘ఈ మధ్య నాకు జలుబుచేస్తే గుంటగలవరాకు మాత్రలు వేసుకుంటే వెంటనే మటుమాయమయింది. మా ఇంటికెళ్ళి మాత్రలడిగి తీసుకో,'' అన్నాడు కామేశం. బాలన్న సరేనని తుమ్ముకుంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

‘‘బాలన్న ఓపట్టాన ఎవరి మాటా వినడు. వాణ్ణి భలే ఒప్పించావే !'' అంటూ ఓ పెద్దమనిషి కామేశాన్ని మెచ్చుకున్నాడు. దాంతో కామేశం రెచ్చిపోయి, ‘‘నాకీ బాలన్న ఓ లెక్కా? తాను పట్టినకుందేలుకి మూడే కాళ్ళనే వాణ్ణి కూడా నేను నా మాటలతో ఒప్పించగలను,'' అంటూ దంబాలు పలికాడు.

అప్పుడు పక్కనే ఉన్న రామేశం కలగజేసుకుని, ‘‘ఎవరి సంగతో ఎందుకు ? కంటికి కనిపిస్తే చాలు - నిజమని ఒప్పుకునే నాలాంటి వాణ్ణి కూడా నేనిష్టపడితేనే ఒప్పించగలవు. ఉదాహరణకు నా వెనక ఉన్న రావిచెట్టును, వేపచెట్టని ఇప్పటికిప్పుడు నా చేత ఒప్పించు చూద్దాం,'' అన్నాడు రామేశం.

రామేశం వెనకనున్నది నిజంగానే వేపచెట్టు కావడం వల్ల, ‘‘నీ వెనక నున్నది వేపచెట్టయితే, రావిచెట్టంటావేమిటి ?'' అంటూ చిరాకు పడి అటు వెళ్ళి, దాని ఆకులు కోసి తెచ్చి చూపాడు కామేశం.

‘‘ఇవి వేపాకులే. కానీ ! ఆ ఆకులు నా వెనుక చెట్టువేనని ఎలా నమ్మడం ?'' అన్నాడు రామేశం. అప్పుడు కామేశం అక్కడున్న ఊరి పెద్దలను సాక్ష్యం చెప్పమన్నాడు. రామేశం ఒప్పుకోక, ‘‘ఒప్పించాల్సింది నువ్వయితే, వాళ్ళ చేత చెప్పిస్తావేమిటి ? ఐనా ! చూసి తెలుసుకునేందుకు నా కళ్ళు నాకుండగా, ఇతరుల మాటలు వినాల్సిన అవసరం నాకేమిటి?'' అన్నాడు. ‘‘ఐతే ! వెనక్కి తిరిగి చూడు. నీ కళ్ళు బావుంటే అది వేపచెట్టని నీకే తెలుస్తుంది,'' అన్నాడు కామేశం ఉక్రోషంగా.

‘‘ఇప్పుడు నాకు వెనక్కు తిరగాలనిలేదు. కావాలంటే ఆ చెట్టును తెచ్చి నా ముందుంచు. లేదా నన్ను ఒప్పించలేక పోయానని ఒప్పుకో,'' అన్నాడు రామేశం. అంతా నవ్వారు. రామేశం చేతిలో కామేశం భంగపడ్డాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం