తాజా కథలు @ CCK

ఉచిత సలహాలు

2015-05-13 17:05:01 చిన్నారుల కథలు
నారయ్యకు తాతలనాటి పూరిపాక ఒకటి ఉన్నది. దానిని అనుకుని విశాలమైన పెరడు ఉన్నది. నారయ్య ఆ పెరట్లో అరటిపిలకలు నాటాడు. అరటితోట ఏపుగా పెరిగి పచ్చగా, కంటికి ఇంపుగా ఉన్నది. ఒక రోజు ఉదయం నారయ్య అరటి తోటలో కాలువలు సరిచేస్తూ ఉండగా జమీందారుగారి పాత గురప్రుబండి వచ్చి ఆగింది. అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతూండగా, బండిలో నుంచి జమీందారుగారి భార్య దిగి, నారయ్యను పిలిచింది.

నారయ్య హడావిడిగా మట్టిచేతులు కడుక్కుని, పైపంచతో తుడుచుకుంటూ వచ్చాడు. ఆమె అతని పేరు అడిగి తెలుసుకుని, ‘‘చూడు. నారయ్యూ, పెరటితో సహా నీ పాకను నాకు అమ్ముతావా?'' అని అడిగింది. నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్ప లేదు. జమీందారుగారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి అంతుబట్టలేదు. ‘‘డబ్బు గురించి సందేహించకు, అయిదు వందలు ఇస్తాను,'' అన్నదామె.

నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయూడు. ఆ పూరిపాకకు ఎవరూ రెండువందలు కూడా ఇయ్యరు. అందుచేత, ఆమె అయిదు వందలు అనేసరికి అతని నోట మాట రాలేదు. అతను మాట్లాడక పోవటం చూసి జమీందారుగారి భార్య, ఆ మొత్తం చాల లేదు కాబోలు ననుకుని, ‘‘సరే, ఏడు వందలయూభై ఇస్తాను. మరి మాట్లాడకు,'' అన్నది.

నారయ్యకు మూర్ఛ వచ్చినంత పని అయింది. ఏడు వందల యూభై! అది పెట్టి ఎంత వ్యాపారమైనా చేసుకోవచ్చునని అతను ఆలోచనలో పడ్డాడు. అప్పటికీ నారయ్య సరేననకపోయే సరికి, జమీందారుగారి భార్య విసిగిపోయి, ‘‘ఆఖరి మాట! వెయ్యరూపాయలిస్తాను.

నీ పాక ఇస్తావో ఇయ్యవో ఇప్పుడే చెప్పెయ్యి,'' అన్నది. నారయ్య అంగీకరించినట్టు తల ఊపి, ‘‘అమ్మగారూ, సాయంత్రం లోపల మేం పాకను ఖాళీచేసిపోతాం. సాయంత్రం మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు,'' అన్నాడు. ‘‘సాయంత్రం డబ్బు ఇచ్చి మనిషిని పంపుతాను,'' అని జమీందారుగారి భార్య బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి, ‘‘మన పంట పండిందేవ్‌!'' అంటూ ఎగిరి గంతువేశాడు.

జమీందారుగారి బండి నారయ్య పాక ముందు ఆగిన క్షణం నుంచీ ఇరుగు పొరుగుల వాళ్ళు అంతా శ్రద్ధగా వింటూనే వున్నారు. వాళ్ళు అందరూ నారయ్య దగ్గిరికి వచ్చి, ‘‘పాకను నిజంగానే జమీందారుగారికి అమ్మేస్తావేమిటి?'' అని వింతగా అడిగారు. ‘‘వెయ్యి రూపాయలు వస్తూంటే అమ్మక ఏం చేస్తాను?'' అన్నాడు నారయ్య. ‘‘నీ తెలివి తెల్లవారినట్టే ఉన్నది! నీ ముష్టి పాకకు వెయ్యిరూపాయల ధర ఎందుకు పలికిందో ఆలోచించాలా, వద్దా? ఆవిడ గారు ఏ లాభమూ చూసుకోకుండానే అంత డబ్బు ఇస్తున్నదా? నీ పెరట్లోనో, పాకలోనో ఏదో నిధినిక్షేపం ఉన్నట్టు ఆవిడకు రూఢిగా తెలిసి ఉండాలి.

నువ్వు వెర్రివెధవవు కనుక అమ్మెయ్యటానికి సిద్ధపడ్డావు. చూడు! ఏ పరిస్థితిలోనూ నువ్వు నీ పాకను అమ్మకు. ఆ నిధినిక్షేపమేదో నువ్వే తవ్వి తీసుకో. ముష్టి వెయ్యిరూపాయలకు ఆశపడకు,'' అని నలుగురూ నారయ్యకు ఉచిత సలహాలు ఇచ్చి, ఉక్కిరిబిక్కిరి చేసి, వెళ్ళిపోయూరు. ఈ సలహాలు నారయ్యకు నచ్చాయి. అతని భార్య కూడా, ‘‘వాళ్ళు చెప్పినది నిజమే. రేపు కూతురికి పెళ్ళి చెయ్యబోతూ ఆవిడ వెయ్యిరూపాయలు పెట్టి ఈ పాక ఎందుకు కొంటుంది? కూతుర్ని ఇందులో గృహ ప్రవేశం చేయిస్తుందా?'' అన్నది.

సాయంత్రం జమీందారుగారి మనిషి డబ్బు తీసుకుని వచ్చినప్పుడు, భార్యా భర్తలిద్దరూ పాకను అమ్మే ఉద్దేశం మానుకున్నామన్నారు. అతను వెళ్ళిపోయూడు. ఆ రాత్రి లాంతరు వెలుగులో నారయ్య పెరట్లోని అరటిచెట్లన్నీ పీకి పారేసి, పెరడంతా లోతుగా తవ్వి చూశాడు. ఏమీ దొరకలేదు. పాక లోపల తవ్వినా ఏమీ లేదు. కప్పంతా పీకి చూసినా ఫలితం లేకపోయింది.

తెల్లవారింది. ‘‘బంగారంలాంటి బేరం చెడగొట్టుకున్నాం,'' అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో. ‘‘ఇప్పుడైనా మించిపోయిందేముందీ, నువ్వు వెళ్ళి ఆవిడతో పాకను అమ్ముతామని చెప్పు. అయిదువందలు ఇస్తానన్నా సరేనని ఒప్పేసుకో,'' అన్నది నారయ్య భార్య. నారయ్య జమీందారుగారి ఇంటికి వెళ్ళి, జమీందారుగారి భార్యతో, ‘‘బుద్ధి లేక, నలుగురి సలహాలూ విని, పాకను అమ్మనని చెప్పాను. ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాను.

మీకు తోచిన ధర ఇప్పించండి,'' అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి, ‘‘ఇంక నీ పాక నాకు దేనికీ? పందెం ఎలాగూ ఓడాను,'' అంటూ ఆమె తనకూ, జమీందారుగారికీ మధ్య పందెం మాట చెప్పింది: జమీందారుగారి బండి తాత ముత్తాతల నాటిది. ఆమె కాపరానికి వచ్చినప్పటి నుంచీ జమీందారుగారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తున్నది. కాని జమీందారుకు పాతబండీ అంటే ప్రాణం. ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు.

‘‘పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరూ వదులుకోరు. చివరకు, ఊరి చివర అరటిపిలకలు నాటిన వాడు కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు. నిలువెత్తు ధనం పోసినా వాడు దాన్ని అమ్మడు. కావలిస్తే అడిగి చూడు!'' అన్నాడు జమీందారు. దాని మీదట ఇద్దరూ వెయ్యేసి రూపాయలు పందెం వేసుకున్నారు. ఆ పందెం ఓడిపోయింది జమీందారు భార్య. ‘‘పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ, జమీందారుగారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ వెయ్యిరూపాయలు నీ కిస్తానన్నాను.

నువ్వు ఊళ్ళో వాళ్ళ ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు. నీకు తెలుసా? నీకు సలహాలిచ్చిన వాళ్ళే నా దగ్గిరికి వచ్చి తమ ఇళ్ళను ఏడువందలకే ఇస్తామన్నారు! నలుగురి మాటలూ విని నష్టపోయూవు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. వెళ్ళు,'' అన్నది జమీందారుగారి భార్య. నారయ్య తలవంచుకుని ఇంటి దారి పట్టాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం