తాజా కథలు @ CCK

గోరంతలు కొండంతలు

2015-05-23 11:05:01 చిన్నారుల కథలు
ఘనపురంలో, భూమయ్య అనే వడ్డీ వ్యాపారికి కర్కోటకుడనీ, దయూదాక్షిణ్యాలు లేని వాడనీ పేరుంది. ఘోషయ్య అనే ధనవంతుడాయన గురించి, ‘‘భూమయ్యను చూసి ఎలావుండకూడదో నేర్చుకోవాలి. అందుకే నేను వడ్డీ లేకుండా అప్పులిస్తున్నాను, గుప్తదానాలు చేస్తున్నాను,'' అనేవాడు. తనకు వసూలు కావలసిన కొన్ని లక్షల వరహాలలో, ఒక్క లక్ష వరహాలు వసూలైతే, ఆ ఊరి గుడికీ, బడికీ ఐదేసివేల వరహాలు విరాళంగా ఇస్తానని ఘోషయ్య ఊరివాళ్ళకు మాటిచ్చాడు.

ఘోషయ్య తన ముందు చేయిచాచినవారికి కుంటిసాకులు చెబుతాడనీ, ఆయన అప్పుగా కానీ, దానంగా కానీ ఎవరికీ డబ్బిచ్చిన దాఖలాలు లేవనీ కొందరంటారు. ఘోషయ్య గోరంతలు, కొండంతలు చేసి గొప్పలు చెప్పుకుంటాడని, ఆయన గురించి చాలా మంది చెప్పుకుని చాటుగా నవ్వుకుంటారు. సూరన్న అనే పేదరైతు మాత్రం, ఆయన నిజంగానే పరోపకారి అని నమ్మి, కూతురు పెళ్ళికి వున్నపళంగా నూరు వరహాలు కావలసివస్తే వెళ్ళి ఘోషయ్య నడిగాడు.

ఘోషయ్య బాధనటించి, ‘‘మొన్న ముగ్గురికి మూడువేల వరహాలు దానమిచ్చాను. నిన్న ఒకడికి వడ్డీ లేకుండా పదివేల వరహాలు అప్పిచ్చాను. మరి ఈ రోజున నాదగ్గర పదివరహాలు కూడా లేవు. అది నీ దురదృష్టం!'' అనేశాడు. గత్యంతరం లేక సూరన్న, భూమయ్య దగ్గరకెళ్ళాడు.

ఆయన, అతడికి వెంటనే డబ్బిచ్చి, ఏడాదిలోగా వడ్డీతో సహా బాకీ తీర్చకపోతే సూరన్న, అతడి భార్య సూరమ్మ తన ఇంట్లో వెట్టిచాకిరికి చేరాలని పత్రం రాయించుకున్నాడు. సూరన్న సరేనని ఆ డబ్బుతో కూతురి పెళ్ళి చేసి కాపురానికి పంపాడు. కానీ ఆ ఏడాది సరిగా పంటలు పండక డబ్బు సర్దుబాటు కాలేదు.

భూమయ్య బాకీ తీర్చడానికి మళ్ళీ ఘోషయ్యనే డబ్బడిగాడు సూరన్న. ఘోషయ్య కాసేపాలోచించి, ఇతరుల సాయంతో ఎన్నాళ్ళని బ్రతుకీడుస్తావు? నీ మేలు కోరి చెబుతున్నాను. భూమయ్య దగ్గర వెట్టిచాకిరికి చేరిపో. నీకూ, నీ భార్యకూ జీవితాంతం తిండికీ, గుడ్డకూ అసలు లోటుండదు,   అన్నాడు.   అయ్యూ, నేనూ, నా భార్యా వెట్టిచాకిరీకి సిద్ధమే. కానీ మా అబ్బాయి శేఖరుడు ఒప్పుకోవడంలేదు.

వాడు అంతోయింతో చదువుకున్నాడు. వ్యాపారం చేసి డబ్బు సంపాదించి, నా బాకీలన్నీ తీరుస్తానంటున్నాడు. ఈలోగా మీ సాయం కావాలి,   అన్నాడు సూరన్న.   ఐతే, నువ్వు శేఖరుణ్ణి నా కప్పచెప్పి భూమయ్య దగ్గరచేరు. వాణ్ణి గొప్పవాణ్ణి చేసి వాడి చేతే నీకు వెట్టిచాకిరీ తప్పిస్తాను. అప్పుడు ఊరంతా నీ పౌరుషాన్నీ, నా ఔన్నత్యాన్నీ మెచ్చుకుంటారు. ఇలా ఇప్పటికి పదికుటుంబాలకు సాయపడ్డాను. నీది పదకొండోది,   అన్నాడు ఘోషయ్య. సూరన్న, శేఖరుణ్ణి ఘోషయ్య వద్ద వదిలి, భార్యతో పాటు భూమయ్య వద్ద వెట్టిచాకిరీకి చేరాడు.

అప్పుడు శేఖరుడు, ఘోషయ్యను వ్యాపారంలో పెట్టుబడికి వెయ్యి వరహాలిప్పించమని కోరాడు.   వెయ్యేం కర్మ! లక్ష వరహాలిస్తాను. కానీ ఒకర్నడిగి తెచ్చే పెట్టుబడితో, ఏ వ్యాపారమూ రాణించదు. నీ తెలివితేటలే వ్యాపారానికి పెట్టుబడి కావాలి. ఒకప్పుడు నేను పుల్లయ్య, రంగడు, భద్రం అనే ముగ్గురు పేదవాళ్ళను చేరదీసి చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేశాను. వ్యాపారం చేసుకోమని ఒక్కొక్కరికి పదివేల వరహాలు అప్పిచ్చాను.

వాళ్ళు ఏడాది తిరక్కుండా వెనక్కొచ్చి, నేనిచ్చినదంతా నష్టపోయూమని చెప్పి, మళ్ళీ డబ్బడిగారు. నేనివ్వనంటే జనపురం వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసి లక్షలు గడించారు. వడ్డీ కూడా అక్కర్లేదన్నా, ఈనాటి వరకు నాకు ఒక్క వరహా కూడా చెల్లు పెట్టలేదు,   అన్నాడు ఘోషయ్య.

ఆ మాటలకు శేఖరుడు చిన్న బుచ్చుకుని,   తమరీ కథ నాకెందుకు చెప్పారో కానీ, నేనలాంటివాణ్ణికాను. నాకిచ్చిన డబ్బును వడ్డీతో కలిపి పువ్వుల్లో పెట్టి వెనక్కివ్వగలను,  అన్నాడు. ఘోషయ్య చిరునవ్వు నవ్వి,   నాకు వడ్డీ లెందుకూ? డబ్బు తిరిగొస్తే వేరెవరికైనా సాయపడొచ్చని, నా ఆశ.

కాబట్టి నువ్వు జనపురం వెళ్ళి, ఆ ముగ్గురినీ కలుసుకో. నీ తెలివంతా ఉపయోగించి వసూలు చేయగలిగినంత తీసుకో. అదే పెట్టుబడిగా వ్యాపారం మొదలు పెట్టు. బాగు పడ్డాక నా డబ్బు నాకిచ్చెయ్యి,   అన్నాడు. శేఖరుడు జనపురం వెళ్ళాడు. ముందుగా భద్రంను కలిసి జరిగింది చెప్పాడు. భద్రం ముఖం కోపంతో ఎరబ్రడింది.   ఘోషయ్య, గోరంతసాయం చేసి, కొండంత చేసినట్లు ప్రచారం చేస్తాడు. నిజానికాయన నాకూ, రంగడికీ, పుల్లయ్యకూ ఇచ్చిందెంతో తెలుసా? ఒక్కొక్కరికి మూడేసి వరహాలు.

మొదటి వరహా చదువుకు, రెండోది పెళ్ళికి, మూడోది వ్యాపారానికి! ఆయన మాటలు నమ్మి నా దగ్గరకొచ్చిన నిన్ను చూస్తే జాలేస్తున్నది,   అన్నాడు. దానికి శేఖరుడు,   నేను డబ్బు వసూలుకు మీ వద్దకు రాలేదు. ఆ ఘోషయ్య మాటలు నమ్మి మా నాన్న వెట్టిచాకిరి పాలయ్యూడు. ఆయన మాటలెంత నమ్మదగినవో మిమ్మల్నడిగి తెలుసుకుని, ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పాలనే వచ్చాను,   అన్నాడు. భద్రం,   నువ్వాయనకు బుద్ధి చెబుతానంటే, నిన్ను నా వ్యాపారంలో భాగస్వామిని చేయగలను.

ఐతే, అందుకు నువ్వు వారం రోజుల్లోగా, నీ తల్లిదండ్రులకు వెట్టిచాకిరి తప్పించి, నీ తెలివి నిరూపించుకోవాలి,   అన్నాడు. తర్వాత శేఖరుడు, రంగణ్ణి కలుసుకుని జరిగింది చెప్పాడు. రంగడు వచ్చే కోపాన్నణుచుకుని,   ఘోషయ్యకు బుద్ధి చెబుతానంటే, నేను నీ తల్లిదండ్రులకు వెట్టిచాకిరి తప్పించగలను. అందుకు నువ్వు వారం రోజుల్లో, ఓ అయినింటి పిల్లతో పెళ్ళి సంబంధం కుదుర్చుకుని, నీ తెలివి నిరూపించుకోవాలి,   అన్నాడు.

చివరగా శేఖరుడు, పుల్లయ్యను కలుసుకుని అంతా చెప్పాడు. భార్య పోతే యూభై ఏళ్ళ వయసులో రెండో పెళ్ళి చేసుకున్నాడాయన. పెళ్ళీడుకొచ్చిన కూతురు, సవతి తల్లి అయిందానికీ, కానిదానికీ ప్రతిరోజూ గొడవ పడుతూంటే, ఆయనకు ఇల్లు నరకమైంది. యోగ్యుడిలా కనబడిన శేఖరుడికి, తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుందని తోచి,   నీకు నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను. నువ్వు వారం రోజుల్లో ఘోషయ్యకు బుద్ధి చెప్పి, నీ తెలివి నిరూపించుకోవాలి,   అని షరతు పెట్టాడు. కాసేపాలోచించగా శేఖరుడికో ఉపాయం తట్టింది.

పుల్లయ్యకు చెబితే ఆయన ఎంతో సంతోషించి, అతడికి ముపై్ఫ వరహాలిచ్చాడు. శేఖరుడు తిరిగి ఘనపురానికి వెళ్ళి, ఘోషయ్యను కలుసుకుని,   పుల్లయ్య, రంగడు, భద్రం మీ నుంచి ఒక్కొక్కరు మూడేసి వరహాలు మాత్రమే తీసుకున్నారట. వడ్డీతో సహా బాకీ తీర్చేస్తామని బలవంతంగా ముగ్గురూ కలిసి, ఈ ముపై్ఫ వరహాలూ నాకిచ్చి పంపారు. మీరు తీసుకోకపోతే, ఈ ఊరొచ్చి రభస చేస్తారట!   అంటూ ఆయన చేతిలో ముపై్ఫ వరహాలూ వుంచాడు.

పుల్లయ్య, రంగడు, భద్రం నిజంగానే ఇక్కడికొచ్చి రభస చేస్తారని భయపడ్డ ఘోషయ్య ఒక క్షణం తటపటాయించి,   సరేలే! ఈ మాట ఇంకెవ్వరితో అనకు,   అని ఆ డబ్బు తీసుకున్నాడు.   మీరు నాకు ఆదర్శం! ఎవరికేంచెప్పినా, మీకులాగే చెబుతాను,   అన్నాడు శేఖరుడు. అందుకు ఘోషయ్య సంతోషించగా, శేఖరుడాయన వద్ద సెలవు తీసుకున్నాడు.

తర్వాత శేఖరుడు ఊళ్ళో కొందరు ముఖ్యులను కలుసుకుని,   ఘోషయ్యగారు గోరంతలు కొండంతలు చేస్తారన్నది అబద్ధం. ఆయన నిజంగానే ఎవరికో ముపై్ఫవేల వరహాలు అప్పిచ్చి నిమ్మకు నీరెత్తినట్లు వూరుకున్నాడు. నేనా బాకీని ముక్కుపిండి వసూలు చేస్తే, వడ్డీతో సహా లక్షరూపాయలొచ్చింది. అందుకు సంతోషించి ఆయన మానాన్నను వెట్టిచాకిరీ నుంచి తప్పించి, నాకు ఉద్యోగంవేయించి, పెళ్ళి చేయిస్తానని మాటిచ్చాడు. నేనిక జీవితంలో స్థిరపడినట్టే!   అని చెప్పాడు.

ఈ వార్త ఊరంతా పాకి ఘోషయ్యనూ చేరింది. ఆయన కంగారుపడి శేఖరుణ్ణి పిలిచి,   నువ్వు నాకిచ్చింది ముపై్ఫవరహాలు. ఊళ్ళో లక్ష అని చెప్పావు. నేను నీకే ఉపకారం చేస్తాననలేదు. చేస్తానన్నట్లు ఊళ్ళో చెప్పావు. అంతా దానధర్మాలంటూ వెంటబడి నన్ను దోచాలని, నీ ఆలోచనైతే అది సాగనివ్వను. నీ అబద్ధాల గురించి ఊళ్ళో చెప్పేస్తాను,   అంటూ బెదిరించాడు.

అందుకు శేఖరుడు వినయంగా,   ఎవరికేంచెప్పినా మీకులాగే చెబుతానని ముందే మీతో అన్నాను. అప్పుడు మీరు సంతోషించారు కూడా. తమరు పుల్లయ్య, రంగడు, భద్రంలకు మూడేసి వరహాలిచ్చి పదివేలన్నారు. అంటే ముపై్ఫవరహాలు లక్షేకదా! గోరంతలు కొండంతలు చేయడం తమ పద్ధతే కదా; మెచ్చుకుంటారనుకున్నాను. నచ్చకపోతే, నావి అబద్ధాలని ఊళ్ళో చెప్పేయండి. నేనేమీ అనుకోను,   అన్నాడు.

శేఖరుడు చెప్పింది అబద్ధమంటే బయట పడేది తన బండారమే అని గ్రహించిన ఘోషయ్య తేలుకుట్టిన దొంగలా వూరుకున్నాడు. అంతేకాదు. గతంలో మాటిచ్చిన ప్రకారం ఊళ్ళో గుడికీ, బడికీ కలిపి పదివేల వరహాల విరాళమిచ్చాడు.   బుద్ధొచ్చింది. ఇక ఈ జన్మలో గోరంతలు కొండంతలు చేసి గొప్పలు చెప్పుకోను,   అని మనసులో అనుకున్నాడు. ఈలోగా పుల్లయ్య, రంగడు, భద్రం ఘనపురం వచ్చారు.

ఘోషయ్యకు తగిన శాస్తి జరిగిందని సంతోషించారు. ఆ తర్వాత భద్రం, శేఖరుడికి తన వ్యాపారంలో భాగమిచ్చాడు. రంగడు, భూమయ్య అప్పు తీర్చి సూరన్న దంపతులకు వెట్టిచాకిరి తప్పించాడు. పుల్లయ్య అతడికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు. శేఖరుడు జనపురానికి మకాం మార్చే ముందు ఘనపురంలో గొప్ప విందు ఏర్పాటు చేసి,   ఈ రోజు నా జాతకమిలా మారిపోవడానికి ఘోషయ్యగారే కారణం!   అని ఊరి పెద్దలకు చెప్పాడు.   ఒరేయ్  , గోరంతలు కొండంతలు చేయకు! అది మంచి అలవాటు కాదు,   అన్నాడు ఘోషయ్య కంగారుగా.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం