తాజా కథలు @ CCK

రాములమ్మ

2015-04-23 17:05:01 చిన్నారుల కథలు
హఠాత్తుగా భర్త మరణించడంతో రాములమ్మ దిక్కులేనిదయింది. సంతానం లేని రాములమ్మ, తన దగ్గర మిగిలిన కొంచెం డబ్బుతో బతుకుతెరువు కోసం ఉన్న ఊరొదిలి అక్కడికి కొంత దూరానవున్న రామాపురం చేరింది. రామాపురం చిన్న గ్రామం. ఊరి మధ్య చిన్న బడి. ఆ బడి ఎదుట చిన్న బడ్డీ కొట్టులో పిల్లలు ఇష్టపడే వేరుశనగలు, బఠానీలు, కొబ్బరి మిఠాయిలు మొదలైన తినుబండారాలు అమ్ముకుంటూ కాలంగడపసాగింది.

అరవైయేళ్ళు దాటిన రాములమ్మ ముగ్గుబుట్టలాంటి తల, నిమ్మపండురంగు శరీరంతో, కీచుమనే కంఠస్వరంతో వింతగా కనిపించేది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఆమె ఆ ఊరికి వచ్చిన మూడో నెలకల్లా రామాపురంలో మహమ్మారి సోకింది. పిల్లలకు వాంతులు, విరేచనాలు పట్టుకున్నాయి. పెద్దవారికి విషజ్వరాలు సోకి కొందరు మరణించారు. దీనికంతటికీ కారణం కొత్తగా వచ్చి చేరిన బడ్డీ కొట్టు రాములమ్మే అనీ, ఆ ముసలిది మంత్రగత్తె అనీ రామాపురంలో వదంతి బయలుదేరింది.

ఆ వదంతిని పుట్టించింది ముత్యాలమ్మ. బడి పక్కనే చిరుతిళ్ళు అమ్మే అంగడి ఆమెకు ఉన్నది. రాములమ్మ బడ్డీ కొట్టు పెట్టాక ఆమె తయూరుచేసే తినుబండారాలు రుచిగా, శుచిగా ఉండడంతో పిల్లలందరూ అక్కడే కొనుక్కోసాగారు. ముత్యాలమ్మ దుకాణం సరిగా సాగడంలేదు. అందువల్ల ఆమె ఎలాగైనా రాములమ్మ అంతుచూడాలని ఆలోచించసాగింది. ఒకనాడు తమ కష్టాలు తొలగించమని ఊరి జనం గ్రామదేవతకు పొంగళ్ళు పెట్టి ప్రత్యేక పూజలు చేయించారు. అప్పుడు గణాచారికి పూనకం వచ్చి, ‘‘ఒరే, మీ కష్టాలన్నీ ఆ మంత్రగత్తె రాములమ్మవల్లే. అదిఈ ఊళ్ళో ఉండడం అరిష్టం.

దాన్ని ఊరి నుంచి తరుమగొట్టండి. మీ రోగాలు తొలగిపో తాయి,'' అని చెప్పాడు. దాంతో రెచ్చిపోయిన జనం, రాములమ్మ బడ్డీ కొట్టును ధ్వసం చేశారు. ఒకరిద్దరయితే, ఆమె మీదకు రాళ్ళు రువ్వారు. రాములమ్మ కుయ్‌ కయ్‌ మనలేదు. తలకు గాయూలై నెత్తురు కారుతున్నా సహించింది.

ఆ సమయంలో అటుగా వచ్చిన యువకుడైన బడిపంతులు సూర్యం ఆ దృశ్యాన్ని చూసి జనం మధ్యకు వెళ్ళి, ‘‘ఆగండి. ఏమిటి మీరు చేస్తున్న పని? దిక్కూ మొక్కూ లేని ముసలావిడను అలా కొడుతున్నారెందుకు? ఒక్క నిమిషం ఆగి, నా మాట వినండి,'' అన్నాడు. ‘‘ఏమిటి నీ మాట వినేది? మన బాధలూ రోగాలన్నీ ఎక్కడి నుంచో వచ్చిన ఆ ముసలి మంత్రగత్తెవల్లే. గణాచారి కూడా చెప్పాడు,'' అన్నాడు ఒక వృద్ధుడు.

‘‘ఏమిటీ! ఈ దీనురాలు మంత్రగత్తా? నిజంగా ఆమెకు అంత శక్తే గనక ఉంటే, మీరు కొడుతూ ఉంటే ఊరుకుంటుందా? ఆమె మీది పగకొద్దీ గణాచారికి డబ్బు ఆశచూపి అలా చెప్పమన్నది ముత్యాలమ్మ. అతనికి ఆమె డబ్బులివ్వడం నేనే చూశాను. అయినా, మన రోగాలకు మూలకారణాన్ని మనమే పెంచిపోషిస్తున్నాం. తాగునీటి కొలనులో గేదెలను కడుగుతున్నాం. దీనికి తోడు ఊళ్ళో చెత్తా చెదారం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయూయి. వర్షాకాలం రావడంతో దోమలు, ఈగలు పెరిగి పోయూయి.

వాటి ఫలితమే ఈ రోగాలు. అలాగే మూఢనమ్మకాలనే మానసిక కాలుష్యం కూడా మనకు చెప్పరాని కీడు కలిగిస్తుంది. ఈరెండు కాలుష్యాల నుంచి బయటపడితేనే ఆరోగ్యం, అభివృద్ధి సాధ్యం కాగలదు. మొదట మన ఊరిని కలుషిత వాతావరణం నుంచి కాపాడుకుందాం. రోగాలు తప్పక తగ్గుముఖం పడతాయి. ఈ విషయంగా గ్రామాధికారితో మాట్లాడదాం రండి,'' అన్నాడు సూర్యం. జనానికి అతడి మాటల్లోని నిజం అర్థమయింది. రాములమ్మకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఆమె వారికి చేతులెత్తి మొక్కింది. ఆ తరవాత పరిశుభ్రతా చర్యలు చేపట్టడంతో రామాపురంలో రోగాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం