తాజా కథలు @ CCK

రాజుగారికోతి

2015-05-27 19:05:01 చిన్నారుల కథలు
నక్కవానిపాలెంలో నటేశం అనే కోతులాడించేవాడు ఉండేవాడు. భార్యతో కలిసి వాడు సిరిపురం జమీలోని గ్రామ గ్రామాన తిరుగుతూ కోతుల నాడిస్తూ జీవనం గడిపేవాడు. వాడి దగ్గర ఒక మగకోతి, ఒక ఆడకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజలను ఆకట్టుకుని, చివరలో ఒక చిప్ప పట్టుకుని డబ్బులిమ్మని అడగడం జనానికి సరదాగా ఉండేది. నటేశానికి ఆటచివర నాలుగు డబ్బులు లభించడంవల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది.

ఎప్పటికైనా తన కోతులాట ద్వారా జమీందారును మెప్పించి ఆయన చేత సన్మానం పొంది, మాన్యం సంపాదించాలన్నది వాడి ఆశ. వానాకాలం సమీపించే సరికి, నటేశం కోతులాట ముగించుకుని, సామానంతా గాడిద మీద వేసుకుని, కోతులను భుజాల మీదికి ఎక్కించుకుని, మజిలీలు చేస్తూ నక్కవానిపాలెం సమీపించాడు.

వాడు ఊళ్ళోకి వచ్చేలోగా చీకటిపడి, అప్పటికే వాన ప్రారంభమయింది. వాడు గాడిద మీదున్న సామానంతా దాపుల కనిపించిన ఆంజనేయ స్వామివారి గుడి అరుగు మీదికి చేర్చి, గాడిదను వానలోనే వదిలేసి, కోతులతో సహా, భార్యతో కలిసి అరుగు మీదికి చేరాడు. అప్పుడే గుడి తలుపులు మూస్తున్న పూజారి, ‘‘ఎక్కడెక్కడో తిరిగి వచ్చి, గుడి అరుగులు మైలచేయకండి, వెళ్ళండి,'' అని కసిరాడు.

అంతలో ఆడకోతి పూజారి ఎదుటికివచ్చి, రెండు కాళ్ళపై నిలబడి చేతులు జోడించింది. పూజారి దాన్ని కాస్సేపు పరిశీనలగా చూసి నటేశంతో, ‘‘ఒరేయ్‌, దీని వాలకం చూస్తూంటే ప్రసవ వేదన పడుతున్నట్టున్నది.

ఆంజనేయ స్వామి ప్రతిమను పూజిస్తూ, దీని మూగ అభ్యర్థనను మన్నించకపోతే, మనిషిగా నా జన్మకు అర్థంలేదు. మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళకండి. దీనికిక్కడ పిల్ల పుట్టడం స్వామి వారి లీలగా భావిస్తాను,'' అన్నాడు ఎంతో కనికరంతో. ఆయన ఊహించినట్టుగానే ఆడకోతి నిమిషాల్లో మగ కోతిపిల్లను కన్నది.

వాన తగ్గి నటేశం అరుగులు శుభ్రంచేస్తూంటే, మగకోతి పూజారి ఎదుటికి వెళ్ళి రెండు కాళ్ళ మీద నిలబడి నమస్కరించి పక్కకు తప్పుకున్నది. దానిని గమనించిన నటేశం భార్య పూజారితో, ‘‘అయ్యవారూ! ఈ మగకోతి తనకు పుట్టిన కొడును భవిష్యత్తు తెలుసుకోవాలని దణ్ణం పెడుతున్నట్టుంది,'' అన్నది నవ్వుతూ. పూజారి ఏ కళనున్నాడో ఏ మోమరి. ‘‘దీన్ని కోతిచేష్ట అని కొట్టిపారేయకూడదు.

కోతులు ఆంజనేయస్వామికి ప్రతిరూపాలు. నేను ఇంతవరకు మనిషి జాతకాలు వేశాను తప్ప, జంతువులకు వేయలేదు. అయినా, ఆంజనేయస్వామికి నమస్కరించి, దీని జనన సమయూన్ని బట్టి లెక్క కడతానుండు,'' అంటూ వేళ్ళతో లెక్క కట్టి, ‘‘ఇప్పుడు పుట్టిన కోతిపిల్ల జనన సమయూన్ని బట్టి చూస్తే మామూలు కోతి పిల్లలాగా ప్రవర్తించదు. ఇది ఎవరినైనా యూచించిందంటే వారు మహారాజు అంశ కలిగినవారుగా ఉంటారు. దీని కారణంగా మీ జీవితాలు ఉన్నత స్థితికి రాగలవని నాకనిపిస్తున్నది,'' అన్నాడు.

నటేశం బుల్లికోతిని చేతిలోకి తీసుకుంటూ, ‘‘చెప్పినట్టు ఇది నాలుగు విద్యలు నేర్చుకుని, జమీందారుగారి నాకర్షిస్తే నాకు కోతి మాన్యం దొరికి, ఇదే ఊళ్ళో స్థిరపడాలని ఉన్నది. మీ దీవన, హనుమంతులవారి దయ ఫలించాలని కోరుకుంటున్నాను,'' అని పూజారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయూడు. రోజులు గడిచే కొలది ఆటలు నేర్చుకుని ఒకయేడాది తిరిగే సరికి బుల్లికోతి జనాన్ని ఆకర్షించడం మొదలు పెట్టింది.

అయితే, అదేం చిత్రమోగాని, అది తల్లికోతి, తండ్రి కోతిలాగ చిప్ప పుచ్చుకుని ఎవరినీ చిల్లర డబ్బులు అడిగేది కాదు. ఇచ్చినా పుచ్చుకునేది కాదు. ఆట అయిపోగానే, కాలు మీద కాలువేసుకుని పడుకోవడం నటేశం దానికి నేర్పాడు. నటేశం నవ్వుతూ, ‘‘బాబూ! దీని జాతకం చాలా గొప్పది. మహారాజు అంశ కలవారిని తప్ప యూచించదు,'' అనేవాడు.

ఆట చూడ్డానికి వచ్చిన జనం ఉత్సాహం కొద్దీ దానికి డబ్బు ఇచ్చినా పుచ్చుకునేది కాదు. దాంతో ప్రజలు బుల్లికోతిని రాజుగారి కోతి అని పిలవసాగారు. ఆ సంగతి ఆనోటా ఈనోటా పడి సిరిపురం జమీందారు చెవిన పడింది. కోతులాడించే వాడు తన కోతిని రాజుగారికోతిగా ప్రచారం చేసుకోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది.

దివానును పిలిచి, ‘‘ఆ కోతులాడించే వాణ్ణి శిక్షించు. లేకుంటే పూర్వజన్మలో అది నా తాత అని చెప్పినా చెబుతాడు,'' అని ఆదేశించాడు. దివాను భటులను పిలిపించి, రాజుగారి కోతి వెనక ఉన్న కథంతా తెలుసుకుని జమీందారుతో, ‘‘ప్రభూ! పొట్టకూటి కోసం మాటలమ్ముకునే వారిని మనం శిక్షించ కూడదు. ఆ కోతిపిల్ల ఆంజనేయ స్వామి ఆలయం అరుగు మీద పుట్టింది. ప్రజలు దాన్ని అభి మానిస్తున్నారు. దాని జోలికి వెళ్ళడం మంచిదికాదు. కావాలంటే అది మహారాజు అంశ కలవారిని మాత్రమే యూచిస్తుందన్న విషయూన్ని మాత్రం పరీక్షించవచ్చు. దివాణంలో నటేశం కోతులాట ఏర్పాటు చేద్దాం.

ఎవరికీ అనుమానం రాకుండా తమరు ప్రజల్లో మారువేషంలో కలిసిపొండి. అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్ల కివ్వండి. ఆ మొత్తాన్ని పుచ్చుకుంటే దానికి మహారాజు అంశగలవారిని గుర్తించే శక్తి ఉన్నట్టు; అలా జరగని పక్షంలో నటేశం దంపతులను ఇక మీదట అలా రాజశబ్దాన్ని కోతికి చేరిస్తే శిక్షింప బడగలరని గట్టిగా హెచ్చరిద్దాం,'' అన్నాడు. జమీందారు అందుకు అంగీకరించాడు.

జమీందారు సమక్షంలో తన కోతులాట ప్రదర్శించే అవకాశం లభించినందుకు నటేశం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యూడు. ప్రదర్శన చక్కగా జరిగింది. కాని, కోతులాటను చూడ్డానికి జమీందారు రాకపోవడం తెలిసి నటేశం ఆశాభంగానికి లోనయ్యూడు. అయితే, తామిచ్చినా పుచ్చుకోదా అనే దర్పంతో జమీందారు బంధువులు పెద్ద మొత్తాలను బుల్లి కోతికిచ్చారు.

అయితే, కాలు మీద కాలు వేసుకుని పడుకుని పుచ్చుకోకుండా అలాగే చూస్తూన్న దాని దర్జాకు ముచ్చటపడి, ‘‘ఇది నిజంగా రాజుగారికోతే!'' అంటూ అందరూ నవ్వుకోసాగారు. అప్పుడు జనం నుంచి గుబురు గడ్డం మీసాలుగల సామాన్యుడి వేషంలో వున్న జమీందారు ముందుకు వచ్చి అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్ల మీదికి విసిరాడు. అంతే, ఆ కోతిపిల్ల చెంగున లేచి, ఆ చిల్లరను తీసి కళ్ళకద్దుకుని, మారువేషంలో వున్న జమీందారు వద్దకు వెళ్ళి రెండు కాళ్ళపై నిలబడి చేతులెత్తి మొక్కసాగింది.

ఆయన జమీందారని తెలియగానే ప్రజలు జేజేలు పలికారు. జమీందారు, ‘‘ఏనుగులూ, గుర్రాలూ మా మనసెరిగి ప్రవర్తిస్తాయన్నది మాకనుభవమే. అలాగే ఈ కోతికి రాజుగారిని గుర్తించే శక్తి ఉన్నదని అంగీకరిస్తున్నాను. ఇది నిజంగా రాజుగారికోతే! మూగజంతువులను ప్రేమిస్తూ, వాటి శక్తులను మనం ఉపయోగించుకోవాలన్నదే ఈ కోతిపిల్ల మనకిచ్చే సందేశం.

మూగప్రాణుల రక్షణకు నేనొక పరిరక్షణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ ఉద్యానవనంలో రాజుగారి కోతి మహారాజులా స్వేచ్ఛగా తిరుగుతుంది. దీనిని పెంచిన నటేశానికి మాన్యం ఇస్తున్నాను,'' అన్నాడు. కోతులను పరిరక్షణ ఉద్యానవనానికి అప్పగించి, నటేశం నక్కవాని పాలెంలో జమీందారు ఇచ్చిన మాన్యంతో సుఖంగా జీవించసాగాడు. పరిరక్షణ ఉద్యానవనంలో ఇతర జంతువులూ, పక్షులూ చేరడంతో రాజుగారికోతి తన తల్లికోతి, తండ్రికోతితో స్వేచ్ఛగా, హాయిగా జీవించసాగింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం