తాజా కథలు @ CCK

ఒక రాణిగారి వ్యూహరచన

2015-04-30 03:05:01 చిన్నారుల కథలు
ఏడు శతాబ్దాలకు పూర్వం 1296వ సం.లో సుల్తాన్‌ అలాఉద్దీన్‌ ఖిల్జీ, మామ జలాలుద్దీన్‌ను దారుణంగా హతమార్చి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. అతడికి అమితమైన రాజ్యకాంక్ష, అధికారదాహం ఉండేవి. అసంఖ్యాకమైన ఏనుగులు, డెబై్భవేల అశ్వాలతో గొప్ప సైనిక బలం తోడు కావడంతో అడుగు పెట్టిన ప్రతిప్రాంతాన్నీ ఆక్రమించుకోవాలి; కనిపించిన ప్రతి సంపదనూ దోచుకోవాలి అనే పేరాశ అతనిలో పెరిగిపోయింది.

ఒకనాడు అతడి దృష్టి రాజస్థాన్‌లోని సుసంపన్నమైన మేవారు రాజధాని చిత్తోర్‌ఘడ్‌ మీద పడింది. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య 500 అడుగుల ఎత్తయిన కొండమీద 700 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన అభేద్యమైన కోట అది. మాతృభూమి కోసం సర్వం అర్పించడానికి వెనుకాడని రాజపుత్ర వీరుల పోతుగడ్డ అది. దాన్ని ముట్టడించాలని ఖిల్జీ నిర్ణయించాడు. కోటను వశపరచుకోవడం కన్నా, మేవార్‌ రాజు మహారాణా రావల్‌ రతన్‌ సింగ్‌ ప్రియపత్ని అతిలోక సౌందర్యవతి రాణి పద్మినిని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్నదే అతడి కోరికగా ఉండేది. రాణి పద్మిని సౌందర్యం గురించి రాజకుటుంబాలలో కథలు కథలుగా చెప్పుకునేవారు.

నీళు్ళ తాగినా గొంతులో కనిపించేంత లేత బంగారు మేనిఛాయ గలదనీ; ఆమె సుమనోహర సుందర రూపాన్ని తిలకించడానికి సూర్యచంద్రులు సైతం క్షణం ఆగి వెళతారనీ -ఆమె సౌందర్యం గురించి కవులు కవితలు వెలయించారు. అలాంటి సౌందర్య రాశిని సొంతం చేసుకోవాలని 1302లో సుల్తాన్‌ ఖిల్జీ సైన్యంతో బయలుదేరి రాజపుత్ర వంశ గౌరవ మర్యాదలకు చిహ్నమైన చిత్తోర్‌ఘడ్‌ను ముట్టడించాడు.

కొండ దిగువ కోటను చుట్టుముట్టి ఆరు నెలలు పోరాడినప్పటికీ, సాహసవీరులైన రాజపుత్ర సైనికులను దాటుకుని సుల్తాన్‌ కోటలోకి అడుగు పెట్టలేకపోయాడు. ఆశాభంగానికి లోనైన సుల్తానుకు స్నేహహస్తం సాచడం తప్ప మరో మార్గం లేకపోయింది. ``రాణి పద్మిని మోమును ఒకసారి చూస్తే చాలు. ముట్టడిని ఎత్తివేసి సంతోషంగా తిరిగి వెళ్ళగలను,'' అని రాజుకు వర్తమానం పంపాడు. ``అసాధ్యం! ఢిల్లీ సుల్తాను మనరాణిగారిని ప్రత్యక్షంగా చూడడమా?'' అంటూ చిత్తోర్‌ ప్రముఖులు అడ్డుపలికారు.

కావాలంటే అతడు అద్దంలో రాణిగారి ప్రతిబింబాన్ని చూసి వెళ్ళవచ్చు అని ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సుల్తానుకు తెలియజేశారు. సుల్తాను అందుకు సమ్మతించాడు. తామర సరస్సు మధ్యలో వేసవి భవనం ఉంది. భవనం మెట్లవద్ద నిలబడితే, పైనున్న అద్దంలో మహారాణి ప్రతిబింబం కనిపించేలా ఏర్పాటు జరిగింది.

అమితాసక్తితో మెట్లపై నిలబడ్డ సుల్తాన్‌ ఖిల్జీ, తృటికాలం కనిపించిన రాణిగారి ప్రతిబింబాన్ని చూసి, ``ఆహా, అపురూపమైన ఈ సౌందర్యరాశిని ఎలాగైనా అపహరించుకు పోవాలి!'' అని ఆలోచిస్తూ కపటో పాయంతో తన కార్యాన్ని సాధించాలని పథకం రూపొందించుకున్నాడు. తనకిచ్చిన ఆతిథ్యానికి పరమానందం చెందుతున్నట్టు రాజును ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

రాణి ప్రతిబింబాన్ని చూడడానికి ఒంటరిగా వచ్చాడు గనక, అతన్ని కోట ద్వారం దాటి వెళ్ళి సాగనంపిరావడం మర్యాద అని భావించిన రాజు మహారాణా రతన్‌సింగ్‌ నిరాయుధపాణిగా, అంగరక్షకులెవరూ లేకుండా, మాట్లాడుతూ సుల్తాను వెంట వెళ్ళాడు. ద్వారం వెలుపలికి వచ్చిన రాణారతన్‌ సింగ్‌, ``మిత్రులుగా మసలుకోవలసిన మనం శత్రువులు కావడం విధివైపరీత్యం!'' అంటూ వింత అతిథికి వీడ్కోలు పలికాడు. అప్పటికే పొద్దుపోయి చీకటి అలముకుంటున్నది.

ఇద్దరూ ఆఖరు సారిగా కౌగిలించుకున్నప్పుడు, దుష్టుడైన ఖిల్జీ సైగ చేయడంతో, చుట్టూ పొదల మాటున దాగివున్న అతడి సైనికులు నిరాయుధపాణిగా ఉన్న రాణారతన్‌ సింగును చుట్టుముట్టి పట్టుకున్నారు. మైదానంలో ఉన్న తమ గుడారాలలోకి తీసుకువెళ్ళారు. రాజు తప్పించుకోలేని బందీ అయ్యాడు. ``వెంటనే రాణి పద్మినిని నాకు అప్పగించండి.

లేదా మీ రాజు తలను అందుకోవడానికి చిత్తోర్‌ వీరులు సిద్ధంకండి!'' అంటూ సుల్తాన్‌ ఖిల్జీ హెచ్చరిక పంపాడు. కోటను శోకం అలముకున్నది. అయినా, తెల్లవారే సరికి ఇద్దరు సైనికులు మహారాణి పద్మిని సందేశంతో సుల్తాన్‌ ఖిల్జీ శిబిరాన్ని చేరుకున్నారు: ``రాణి పద్మిని సుల్తానుకు లొంగి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, ఒక నిబంధన. ఆమె ఇక్కడి సంప్రదాయానుసారం మేనాలలో చెలికత్తెలతో సహా రావడానికి అనుమతించాలి. అందరినీ గౌరవంగా చూసుకోవాలి.''

సుల్తాన్‌ పట్టరాని ఆనందంతో ఎగిరిగంతేసి రాణిగారి ప్రతిపాదనకు సమ్మతించాడు. రాణి కోసం ప్రత్యేక గుడారం ఏర్పాటు చేశాడు. మరునాడు సాయంకాలం చిత్తోర్‌ కోట తలుపులు తెరుచుకున్నాయి. ఏడువందల మేనాలు-ఒక్కొక్క మేనాను నలుగురు బోయీలు మోసుకురాగా, కొండపై నుంచి కిందికి ఊరేగింపుగా బయలుదేరాయి.

గుడారాల మధ్య ఉత్కంఠతతో ఎదురు చూస్తూన్న సుల్తాను వద్దకు గోరా అనే ఆజాను బాహువైన రాజపుత్ర యోధుడు వచ్చి నమస్కరించి, ``ప్రభూ! మహారాణిగారు తన భర్తను కడసారి చూసి వీడ్కోలు చెప్పాలని ఆశిస్తున్నారు. ఆమె విన్నపాన్ని ప్రభువులు కాదనరని భావిస్తున్నారు,'' అన్నాడు. సుల్తాన్‌ ఆలోచనతో మౌనం వహించడంతో, ``మహారాణిగారి మాట మీద తమకు ఇంకా నమ్మకం లేదా ప్రభూ?'' అంటూ గోరా మేనాకేసి చేయి పైకెత్తగానే, అందులోని ఒక చెలికత్తె తెరను కొద్దిగా పక్కకు తొలగించింది.

కాగడాకాంతిలో అందాలరాశి తళుక్కుమనడం చూసి సుల్తాన్‌, ``ఆహా, నేను అద్దంలో చూసిన అదే సుందర రూపం!'' అనుకుంటూ పొంగిపోయాడు. ఆ తరవాత ఆమె ఇష్టానుసారం భర్తను చూడడానికి అనుమతించాడు. మొదటి మేనా మహారాణా బందీగావున్న గుడారం కేసి కదిలింది. గోరా దాన్ని అనుసరించి వెళ్ళి, రాణా రతన్‌ సింగును విడిపించి ఈలవేయడంతో, మేనాల నుంచి రెండువేలా ఎనిమిది వందల సాయుధులైన సైనికులు బయటకు ఉరికారు. మేనాలను మోసుకొచ్చినవారు కూడా సైనికులే. అందరూ మేనాల్లోని కత్తులను అందుకుని అందిన వారిని అందినట్టు తెగటార్చ సాగారు. ఈ అనూహ్యపరిణామానికి దిగ్భ్రాంతి చెందిన సుల్తాన్‌ సైనికులు ఎక్కువ మంది చెట్టుకొకరు పుట్టకొకరుగా పరిగెత్తారు.

మళ్ళీ కొన్ని మేనాలు కొండ మీది కోట కేసి బయలుదేరాయి. వాటిల్లో రాణి పద్మిని ఉందన్న ఆశతో కొందరు సైనికులు వెంబడించారుగాని, బాదల్‌ అనే యువకుడి నాయకత్వంలో రాజపుత్ర సైనికులు వారిని నిలువరించి ఎదుర్కొన్నారు. ఒక మేనాలో మహారాణా, గోరా క్షేమంగా కోటను చేరారు. ఆ తరవాత గోరా తిరిగి వచ్చి శత్రువులను ఎదుర్కొన్నాడు.

ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. అయితే, దురదృష్టవశాత్తు శత్రువులు చుట్టుముట్టి అతడి శిరస్సును ఖండించారు. ఆ స్థితిలో సైతం గోరా విసిరిన కత్తి వేటుకు, తాను ఎక్కిన గుర్రం రెండు ముక్కలు కావడంతో సుల్తాన్‌ ఖిల్జీ కిందపడి చిత్తోర్‌ మట్టికరిచాడని చెబుతారు. ఆ దెబ్బతో సుల్తాన్‌ ఢిల్లీకి తిరుగుముఖం పట్టాడు.

చిత్తోర్‌ రాణి పద్మిని-పినతండ్రి గోరా, సోదరుడు బాదల్‌తో కలిసి వూ్యహంపన్ని విజయవంతంగా శత్రువుల నుంచి బయట పడినప్పటికీ, ఆమె మాత్రం చిత్తోర్‌ కోట ద్వారాలు దాటి వెలుపలికి రాలేదు. సుల్తాన్‌ అద్దంలో చూసినది ఆమె చెలికత్తె ప్రతిబింబాన్ని! మేనాలో కనిపించినది కూడా అదే చెలికత్తె! తాము మళ్ళీ కలుసుకున్నందుకు రాజదంపతులు సంతోషించినప్పటికీ, గోరా మరణం వారికి ఆవేదన కలిగించింది. కొన్ని నెలలు ప్రశాంతంగా గడిచాయి.

ఆరోజు రతన్‌ సింగ్‌ జన్మదినోత్సవాన్ని ఆటపాటలతో జరుపుకుని, రాత్రి ఆలస్యంగా పడుకున్న చిత్తోర్‌ ప్రజలను యుద్ధభేరీలు, హాహాకారాలు మేలుకొలిపాయి. తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, ఇనుమడించిన ప్రతీకార వాంఛతో సుల్తాన్‌ ఖిల్జీ 1303లో మళ్ళీ చిత్తోర్‌ మీదికి దాడి చేశాడు. రాజపుత్రుల సైనికుల కన్నా, సుల్తాన్‌ సైనికులు పదింతలు ఉన్నారు. వాళ్ళందరూ కోటను ఒక్కసారిగా ముట్టడించారు.

అయినా రాజపుత్ర సైనికులు వెనుకాడకుండా పోరాడి వీరమరణం పొందారు. ఆఖరికి మహారాణా రతన్‌సింగ్‌, యువకిశోరం బాదల్‌ యుద్ధరంగంలోకి విజృంభించి, అసంఖ్యాకులను హతమార్చి మాతృభూమి పరిరక్షణకు ప్రాణాలర్పించారు! అదే సమయంలో కోటలోపల రాణి అంతఃపురంలో పెద్ద చితి పేర్చబడింది. రాణి పద్మిని ముకుళిత హస్తాలతో అగ్ని ప్రవేశం చేసింది.

ఆమె తరవాత దాదాపు ముపై్ఫవేల మంది స్త్రీలు ఆమెను అనుసరించారు! శత్రువుల చేజిక్కకుండా, మానసంరక్షణ కోసం అగ్నికి ఆహుతయ్యారు! ఆకాశాన్ని పొగమేఘాలు కము్మకున్నాయి. నగరాన్ని విషాద మేఘాలు ఆవరించాయి. మిగిలి వున్న సైనికులు చివరిశ్వాస ఉన్నంత వరకు శత్రువులను చీల్చి చెండాడారు. సహనం కోల్పోయిన సుల్తాన్‌ ఖిల్జీ, ``పద్మిని ఎక్కడ? ఎక్కడ?'' అని కేకలు పెడుతూ కోట అంతా వెతికాడు.

ఆగ్రహావేశంతో మతి చలించినవాడిలా కనబడిన కట్టడాలన్నిటినీ నాశపరిచాడు. ఆఖరికి రాణి పద్మిని భవనాన్ని సమీపించి అక్కడి దృశ్యాన్ని చూడగానే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అతిలోక సౌందర్యవతిగా ప్రసిద్ధి గాంచిన ఒక వీరవనిత వూ్యహ రచనకూ; ప్రదర్శించిన సాహసానికీ, అనుపమ త్యాగానికీ మౌనసాక్ష్యంగా ఆ కోట ఇప్పటికీ నిలచిఉన్నది!

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం