తాజా కథలు @ CCK

అగ్నిప్రవేశం!

2015-06-16 19:05:01 చిన్నారుల కథలు
పెనుగొల్లు గ్రామాన్ని ఆనుకుని పారే ఏటికి అవతలి ఒడ్డున ఒక పెద్ద మర్రిచెట్టు, రావిచెట్టు ఉండేవి. రావిచెట్టు కింద ప్రేమానందుడు అనే సాధువు ఇద్దరు శిష్యులతో ఉండేవాడు. రకరకాల సమస్యలతో తన దగ్గరికి వచ్చే భక్తులకు ఆయన తగిన సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పి పంపేవాడు. చిల్లర మల్లర వ్యాధులతో వచ్చే పేదసాదలకు వనమూలికలతో తయారు చేసిన మందులు ఇచ్చేవాడు.

ఆ ఊరికి ఒకనాడు కాలయోగి అనే మరొక సాధువు నలుగురు శిష్యులతో వచ్చాడు. ఆ ఊరిపెద్ద రమణయ్యకు సాధుసన్యాసులంటే ఎనలేని గౌరవం. ఆయన కాలయోగికి తన తోటలో బస ఏర్పాటు చేశాడు. కాలయోగి తన వద్దకు వచ్చే భక్తులకు వట్టి చేతులతో విభూతి సృష్టించి ఇస్తూ, ``ఈ విభూతి అద్భుత శక్తితో మీ బాధలన్నీ పటాపంచలై పోతాయి. హిమాలయాలలో పన్నెండేళు్ళ కఠోర యోగసాధన చేసి ఇలాంటి మహిమలను సాధించాను. అయితే, ఏటి గట్టున ఉన్న ప్రేమానందుడికి ఒక్క మహిమా చేతకాదు. బహుశా ఉదర పోషణకు అతడు కాషాయాంబరాలు ధరించాడని నా అనుమానం,'' అనే వాడు హేళనగా.

ఇది విన్న భక్తులు బాధపడేవారు. ప్రేమానందుడంటే గౌరవ మర్యాదలుగల రమణయ్యకు ఇది మరింత బాధ కలిగించింది. ఆయన కొందరు గ్రామస్థులతో కలిసి ప్రేమానందుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పాడు. అంతా విన్న ప్రేమానందుడు, ``ఇలాంటి యోగిపుంగవుల రాకకోసమే ఎదురుచూస్తున్నాను. వచ్చే ఏకాదశి రోజున మీ తోటలో పెద్ద యజ్ఞకుండం ఏర్పాటు చేయించు. ఏకాదశ రుద్రహోమం చేద్దాం.

పూర్ణాహుతి ముగిశాక పవిత్ర హృదయులైన యోగులు అందులో ప్రవేశిస్తే, వాళు్ళ ద్విగుణీకృత తేజస్సుతో, మరిన్ని శక్తులతో వెలుపలికి రాగలరు. అది మానవాళికి మేలు చేస్తుంది. ఆ సంగతి సర్వజ్ఞులైన కాలయోగికి తప్పక తెలిసే ఉంటుంది. ఆ యజ్ఞకుండంలో మహిమాన్వితులైన కాలయోగి మొదట ప్రవేశిస్తే, నేను ఆయన వెంట నా శిష్యులతో ప్రవేశిస్తాను. ఈ విషయం వారికి విన్నవించు,'' అన్నాడు.

ఆ సంగతి ఈనోటా ఆనోటా పడి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. రమణయ్య ఆ విషయం చెప్పగానే కాలయోగి, ``అలాగే! ఏకాదశికి ఇంకా రెండు రోజులున్నాయి కదా,'' అన్నాడు. మరునాడు తెల్లవారగానే తోటకాపు వచ్చి, రమణయ్యతో, ``అయ్యా, తోటలోని కాలయోగి కనిపించడం లేదు,'' అన్నాడు. ``చుట్టుపక్కల వెదికి చూడు. యోగి కదా! ప్రశాంత ప్రదేశంలో ఉండవచ్చు,'' అన్నాడు రమణయ్య. ``లేదయ్యా.

అక్కడ వారి వస్తువులేవీ కనిపించడం లేదు,'' అన్నాడు కాపలావాడు. రమణయ్య అప్పటికప్పుడే ప్రేమానందుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పాడు. ప్రేమానందుడు మందహాసం చేస్తూ, ``అవును నాయనా! ఎవరూ కోరి ప్రాణాల మీదికి తెచ్చుకోరుకదా? ప్రాణ భీతితో పారిపోయి ఉంటాడు. కాలయోగి కబుర్లతో, తాను నేర్చుకున్న ఇంద్రజాల విద్యతో అందరినీ బుట్టలో పెట్టి కాలక్షేపం చేసేరకం.

నిర్మలమైన మనస్సు ఉంటే తప్ప యోగికాలేడు. నిర్మల మనస్కుడికి అహంకారం, పరదూషణ ఉండవు. అందువల్లే అతడు కపటయోగి అని గ్రహించి, ఈ అగ్నిప్రవేశ నాటకం ఆడాను. నిజానికి అది అతనికి అగ్నిపరీక్ష! అయినా, యజ్ఞ యాగాలతో, మహిమలతో ప్రయోజనాలు ఉండవచ్చేమోగాని, మనిషికి వాటికన్నా ముఖ్యమైనది సాటి మనుషుల మీద ప్రేమానురాగాలతో మసలుకోవడం; సాయ పడడం.

పరస్పర సహకారంతో అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే మన గ్రామమే కాదు; మన దేశం, ఆ మాట కొస్తే భూప్రపంచమే సుఖసంతోషాలతో పరిఢవిల్లుతుంది,'' అన్నాడు. రమణయ్య ప్రేమానందుడి సలహాను ఆచరణలో పెట్టడానికి అక్కడి నుంచి సంతోషంగా బయలుదేరాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం