తాజా కథలు @ CCK

దయ్యం చేసిన పెళ్ళి

2015-05-25 13:05:01 చిన్నారుల కథలు
మైలవరంలో పేరు మోసిన నగలవర్తకుడు వరహాలయ్య కొడుకైన సుధీరుడు చదువూ సంస్కారం గల అందమైన యువకుడు. యేటా మైలవరంలో జరిగే అమ్మవారి జాతరకు చుట్టుపక్కల నుంచి జనం తండోపతండాలుగావస్తారు. అలా ఆ యేడు తన స్నేహితుడు మణికంఠుడి ఇంటికి వచ్చిన ఒక అందమైన యువతిని చూసి ఆశ్చర్యపోయి, ఆమె వివరాలడిగాడు సుధీరుడు. ఆమె పేరు సుచరిత అనీ, పొరుగూరిలో ఉన్న వాళ్ళ దూరపు బంధువు భూషయ్య కూతురు అనీ తెలియవచ్చింది.

ఆ రోజు సాయంకాలం మరేదో పని మీద సుధీరుడు మణికంఠుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ ఆ ఊళ్ళో భారతం చదివే పూజారి, వాళ్ళగుమ్మంలో, కూర్చున్న వారిని ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. ``మీరిన్నాళు్ళగా నేను చదివే భారతం వింటున్నారు కదా. పాపం, పుణ్యం అంటే ఏమిటో చెప్పండి చూద్దాం?'' అన్న పూజారి ప్రశ్నకు అక్కడున్న వారెవరూ సమాధానం చెప్పలేక పోయారు.

దూరంగా నిలబడ్డ సుచరిత చిన్నగా నవు్వతూ చెయ్యిపైకెత్తింది. ``నీకు తెలిస్తే చెప్పమ్మా,'' అన్నాడు పూజారి. ``ఇతరులకు మేలు కలిగించడం పుణ్యం, బాధ కలిగించడం పాపం,'' అన్నది సుచరిత. ``చక్కగా చెప్పావు తల్లీ. ఈ ప్రశ్నకు కూడా నువ్వే సరైన సమాధానం చెప్పగలవనుకుంటాను. నువు్వ సూర్యుడిలా ప్రకాశించాలని కోరుకుంటావా? చంద్రుడిలా ప్రకాశించాలని ఆశిస్తావా?'' అని అడిగాడు పూజారి. ``దుర్మార్గుల పట్ల సూర్యుడిలా తీక్షణంగానూ, మంచివారి వద్ద చంద్రుడిలా చల్లగా ఉండాలనీ ఆశిస్తాను,'' అన్నది సుచరిత.

ఆ సమాధానానికి అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. అంతలో మణికంఠుడి తల్లి ఇంటి నుంచి, ``భోజనాలకు వేళయింది. రండి,'' అంటూ వెలుపలికి వచ్చింది. అందరూ లేచి భోజనాలకు ఇంట్లోకి వెళ్ళారు. చాటు నుంచి సుచరిత అందమే కాకుండా ఆమె తెలివితేటలు, చలాకీతనం, అణకువ చూసి ముగ్థుడైన సుధీరుడు, ఆమెకు కూడా ఇష్టమైతే ఆమెను పెళ్ళాడాలనుకున్నాడు.

రెండు రోజుల తరవాత స్నేహితుడి ద్వారా సుచరిత తండ్రికి తన అభిమతాన్ని తెలియజేశాడు. మైలవరం వెళ్ళినప్పుడు అమ్మవారి గుడి వద్ద సుధీరుణ్ణి చూసిన సుచరిత కూడా, తండ్రి ద్వారా సంగతి తెలుసుకుని పరమానందం చెందింది. మంచిరోజు చూసుకుని భూషయ్య మైలవరం వెళ్ళి సుధీరుడి తండ్రి వరహాలయ్యను కలుసుకుని కూతురి పెళ్ళి విషయం ప్రస్తావించాడు. అంతా విన్న వరహాలయ్య, ``మా అబ్బాయి కూడా ఇష్టపడుతున్నాడంటు న్నావు గనక, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే, ఇప్పటికే లక్షలకు లక్షలు కట్నంగా ఇస్తామంటూ అనేక సంబంధాలు వచ్చాయి.

నువు్వ లక్ష వరహాలు కట్నంగా ఇచ్చేమాటయితే, రాబోయే ముహూర్తంలోనే పెళ్ళి జరిపించవచ్చు,'' అన్నాడు నిర్మొహ మాటంగా. అంత కట్నం ఇచ్చే తాహతు లేదు గనక, భూషయ్య మరేమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చి, కుమార్తెకు విషయం చెప్పాడు. సుచరిత ఎంతో బాధపడింది. నెల రోజులు గడిచిపోయాయి. సుచరిత ఒకనాడు బిందె తీసుకుని మంచి నీళు్ళ తేవడం కోసం తన స్నేహితురాలు సుమతితో కలిసి కొలను వద్దకు వెళ్ళింది. సుచరిత విచారంగా ఉండడం గమనించిన సుమతి, ``ఎందుకలా విచారంగా ఉన్నావు?'' అని అడిగింది.

సుచరిత గాఢంగా నిట్టూరుస్తూ, ``నాకు సుధీరుడితో పెళ్ళవుతుందనే ఆశపడ్డాను. అతడూ నన్నెంతగానో ఇష్టపడ్డాడు. నేనూ అతన్ని ఇష్టపడ్డాను. అయితే, అతని తండ్రి ధనాశ, మా పేదరికం అడ్డుగోడలుగా నిలవడంతో మా పెళ్ళి జరగలేదు. ఇప్పుడు వాళు్ళ సుందరి అనే ధనవంతురాలైన మరో అమ్మాయి పెళ్ళిచూపులకు వెళుతున్నారట,'' అన్నది.

ఆమె మాటలు మంచినీళ్ళ కొలనుకు కొద్ది దూరంలోని చింతచెట్టు మీద కునుకుపాట్లు పడుతున్న దయ్యం చెవిన పడి, ఉలిక్కిపడి లేచింది. చాలినన్ని కట్నకానుకలు తీసుకురాలేదని అత్తమామలు పెట్టిన బాధలు భరించలేక, ఆత్మహత్య చేసుకోవడం వల్లే, ఇవాళ తను దయ్యంగా కాలం వెళ్ళదీస్తోంది. సుచరిత పరిస్థితికి దయ్యం చలించిపోయి, ఆమెకు ఎలాగైనా సాయపడాలని నిర్ణయించింది.

తల్లిదండ్రుల వెంట సుధీరుడు పెళ్ళి చూపులకు వెళ్ళాడు. సుందరిని అలంకరించి తీసుకు వచ్చి ఎదుట కూర్చోబెట్టారు. సుందరి ఉన్నట్టుండి పళ్ళెంలో ఉన్న అరటి పండును తీసి, ఒక ముత్తయిదు మీదికి విసిరింది. పూల జడను లాక్కుంటూ తలపై కెత్తి బిత్తర చూపులు చూడసాగింది.

అంతే, వచ్చిన వారందరూ సుందరికి పిచ్చిపట్టిందనుకోవడంతో పెళ్ళిచూపులు ఆగిపోయాయి. మరునాడు ఒంటరిగా కొలనుకు నీళు్ళ తేవడానికి వెళ్ళిన సుచరిత, ``నిన్ను కాదన్న ఆ పొగురుబోతుకు తగిన శాస్తి జరిగింది. పెళ్ళి ఆపేశాను,'' అన్న మాటలు విని తల పక్కకు తిప్పి చూసింది. ఒక దయ్యం చెట్టుపై నుంచి కిందికి దూకుతూ, ``సుందరిని పట్టుకుని, వింత చేష్టలు చేసి, దాని పెళ్ళి చూపులు ఆగిపోయేలా చేశాను.

నీకు సంతోషమే కదా?'' అన్నది. సుచరిత దయ్యాన్ని చూసి మొదట భయపడ్డా, ఆ తరవాత తేరుకుని, ``ఎంత మాత్రం కాదు. నా మూలంగా ఒక ఆడపిల్ల పెళ్ళి ఆగిపోవడం చాలా బాధాకరం. అయినా, ఎవరు నిన్నీ పనిచేయమన్నారు?'' అన్నది బాధగా. ``ఎవరో చెప్పాలా ఏం? నాలుగు రోజుల క్రితం నువు్వ నీ స్నేహితురాలితో చెప్పిన మాటలన్నీ విన్నానులే. నువు్వ కోరిన సుధీరుడితో నీ పెళ్ళి జరిపించేంతవరకు నాకు నిద్ర పట్టదు,'' అన్నది దయ్యం పట్టింపుగా.

``ఇంతవరకు నువు్వ చేసిన నిర్వాకం చాలు. ఇకపై దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోవద్దు,'' అంటూ వేగంగా ఇంటికి తిరిగి వచ్చి, తండ్రికి జరిగిన సంగతి చెప్పింది. ఆ విషయాన్ని వరహాలయ్యకు చెప్పడానికి భూషయ్య అప్పటికప్పుడే మైలవరం బయలుదేరాడు.

భూషయ్యను చూసినవరహాలయ్య ఏమీ మాట్లాడలేక పోయాడు. కూర్చోమని చేయి చూపాడు. భూషయ్య కూర్చుని జరిగిన అసలు సంగతిని వివరించి, ``జరిగిందేదో జరిగిపోయింది. పెళ్ళిచూపుల వరకు వచ్చాక ఆ సుందరికి అన్యాయం జరగ కూడదు. ఆ అమ్మాయినే మీ అబ్బాయికి చేసుకోండి. తప్పులేదు,'' అన్నాడు. వరహాలయ్య మౌనంగా పక్కనున్న కొడుకు కేసి చూశాడు. సుధీరుడు, ``సుచరిత ఎంత మంచిదో ఇప్పుడైనా మీకు తెలిసిందా? తాను బాధ పడ్డా ఫరవాలేదు; సాటి యువతికి అన్యాయం జరగకూడదన్న గొప్ప మనసుతో తన తండ్రిని మీ దగ్గరికి పంపిందంటే ఆమెలోని మంచితనం ఎలాంటిదో ఆలోచించి చూడండి.

మీరేమో డబ్బూ, డబ్బూ అంటూ నాకు ఇష్టం లేని పెళ్ళి ఏర్పాటు చేయాలనుకున్నారు. ధన పిశాచం పట్టుకుని కన్న కొడుకు మీద కూడా కనికరం చూపని మీకన్నా, ఒక ఆడపిల్ల కష్టం చూసి కరిగిపోయి సాయపడాలనుకున్న ఆ దయ్యమే నయం కదా?'' అన్నాడు విరక్తిగా. వరహాలయ్య, ``నాయనా, మనం ఉన్న వాళ్ళమే అయినా, కలిగినవారింటి సంబంధం అయితే, నీకు మునుముందు మేలు చేస్తుందని ఆలోచించాను. అంతేగాని, ఇప్పుడు మించి పోయిందేమీ లేదు.

నీకు నచ్చిన సుచరితనే పెళ్ళి చేసుకుని హాయిగా జీవించు. ఒక్కగానొక్క బిడ్డవు. నీ ఇష్టానికి అడ్డురాను. నీ మాట కాదనను. సుచరిత వంటి గుణవంతురాలు మన ఇంటి కోడలుగా రావడమే అదృష్టం,'' అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పెళ్ళిళ్ళ పేరయ్య జరిగినదంతా తెలుసుకుని, ``ఆహా, ఇంకేం.

అంతా సవ్యంగా జరిగిపోయిందన్నమాట! సుందరి వివాహం కూడా సమస్య కాదు. తగిన వరుణ్ణి చూసి, మీ వివాహంతోనే ఆమె పెళ్ళి కూడా జరిపించే పూచీ నాది,'' అన్నాడు ఉత్సాహంగా సంచీలోంచి వరుల జాతకాల కట్ట వెలికి తీస్తూ. అనుకున్నట్టుగానే సుచరిత, సుధీరుల వివాహం వైభవంగా జరిగింది. తమ పెళ్ళి జరగడానికి సాయపడ్డ దయ్యానికి వధూవరులు మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం