తాజా కథలు @ CCK

ప్రాపకం

2015-06-05 07:05:01 చిన్నారుల కథలు
చోళసింహపుర రాజ్యాన్ని విద్యాధరుడనే రాజు పరిపాలించేవాడు. మహారాణి శమంతకమణి న్యాయనిర్ణయం చేయడంలో మహాదిట్ట. విషయ పరిశీలనలో, వాస్తవాలను పసిగట్టడంలో ఆమె అసమానమైన ప్రజ్ఞను కనబరచేది. ఆ సంగతి గ్రహించిన రాజు విద్యాధరుడు పాలనావ్యవహారాలలో ముఖ్యంగా న్యాయనిర్ణయం చేసేప్పుడు మహారాణి సలహాలను తీసుకునే వాడు. తాను రాజధానిలో లేనప్పుడు న్యాయనిర్ణయం చేయవలసి వస్తే మహారాణిని సంప్రదించమని ప్రధానమంత్రికి చెప్పి వెళ్ళేవాడు.

న్యాయవిచారణ తరవాత చిన్నాచితక నేరాలు చేశారని రుజువైన దోషులకు జరిమానాలు, జైలుశిక్షలు విధించకుండా వారిచేత ప్రజోపయోగకరమైన పనులను చేయించమని మహారాణి ఆదేశించేది. చెరువులు, కాలువలు పూడికతీయడం, మొక్కలు నాటడం వంటి పనులు చేయడంవల్ల, ప్రజానీకానికి మేలు జరగడమే కాకుండా దోషులలో అపరాధభావం నశించి మంచి మానసిక పరివర్తన కలిగేది.

రాజ్యంలో ఎలాంటి అలజడులూ లేకుండా కొన్నాళు్ళ ప్రశాంతంగా రోజులు గడిచాయి. ఒకనాడు మధ్యాహ్నం భోజనం చేస్తూ రాజు విచారంగా ఉండడం మహారాణి గమనించి కారణం అడిగింది. ``ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. ప్రజలు కష్టపడుతున్నారు,'' అన్నాడు రాజు. ``అవును, ప్రభూ. మామూలు ప్రజలు కడుపునిండా తినలేనంతగా ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోయాయని మన పరిచారికలు కూడా చెబుతున్నారు.

దానికి గల మూలకారణాలను తెలుసుకుని వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు మరిన్ని కష్టాలపాలు కాగలరు. తమ పాలన పట్ల అసంతృప్తి తలెత్తగలదు,'' అన్నది మహారాణి. ``నువ్వన్నది నిజమే. అసలు కారణాలే అంతుబట్టడం లేదు. అదే సమస్య,'' అన్నాడు రాజు నిట్టూరుస్తూ. ``ఆహార ధాన్యాల కొరత ఏర్పడడానికి ప్రధానంగా రెండు కారణాలే వుంటాయి. ఒకటి, పంటలు సరిగా పండకపోవడం; రెండు, వ్యాపారులు ఆహార ధాన్యాలను దాచేసి ధరలు పెంచేయడం.

మన రాజ్యంలో ధరలు పెరగడానికి ఈ రెండింటిలో ఏది కారణమో తమరే నిర్ణయించాలి,'' అన్నది రాణి. ``గత మూడు సంవత్సరాలుగా సకాలంలో వర్షాలు కురవడం వల్ల పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఇక వ్యాపారుల విషయమే చూడాలి,'' అన్నాడు రాజు. మరునాడే రాజు మంత్రులతో సమాలోచన జరిపి, గూఢచారుల ద్వారా వ్యాపారుల కార్యకలాపాల మీద నిఘా ఏర్పాటు చేశాడు. మూడోరోజు కల్లా అసలు సంగతి బయటపడింది.

దురాశాపరులైన కొందరు వ్యాపారులు సరుకులను అక్రమంగా దాచేసి, కృత్రిమంగా కొరతను సృష్టించి అధిక ధరలకు అము్మకుంటున్నారు. సరుకులను ఎవరికీ అనుమానం రాకుండా వ్యాపారస్థలాలలో కాకుండా మరెక్కడో దాస్తున్నారని కూడా తెలియ వచ్చింది. దాంతో అనుమానాస్పదంగా ఉన్న ఇళ్ళను, భవనాలను భటులు గాలించ సాగారు.

రాజధానీ నగరం శివారులో సోమిదేవమ్మ, మనోహరి అనే ఇద్దరు స్త్రీలు వేరు వేరుగా రెండు సత్రాలను నడుపుతూ ప్రయాణీకులకు భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాళు్ళ తమ సత్రాలలో కొన్ని గదులను అక్రమవ్యాపారులు సరుకులు దాచుకోవడానికి ఇస్తున్నారు. ఒకనాటి ఉదయం ఇద్దరు రాజభటులు సోమిదేవమ్మ వద్దకు వచ్చి, ``మహారాణి నిన్ను వెంటబెట్టుకు రమ్మన్నారు,'' అని చెప్పారు. సోమిదేవమ్మ భయపడుతూ వాళ్ళ వెంట వెళ్ళి, సాయంకాలానికి తిరిగి వచ్చింది.

ఆమె రాకకోసం ఆత్రుతగా ఎదురు చూస్తూన్న మనోహరి కుతూహలంగా ఎదురువెళ్ళి, ``ఏమిటి సోమిదేవమ్మా, పొద్దుననగా వెళ్ళినదానవు చీకటి పడేవరకు రాజభవనం లోనే ఉన్నావా? ఇంతకూ మహారాణి నిన్నెందుకు పిలిపించారు? అక్కడేం జరిగింది?'' అని ప్రశ్నలవర్షం కురిపించింది. సోమిదేవమ్మ నవు్వతూ, ``ఏముందీ, మహారాణిగారికి పొద్దుపోవడం లేదు. కాలక్షేపం కబుర్లు చెప్పడానికి రమ్మని భటులతో కబురుచేసింది. సత్రం యజమానిగా నాకు చాలా సంగతులు తెలుస్తాయి కదా అని నన్ను పిలిపించింది.

వరసగా వారం రోజులు రమ్మని మహారాణిగారి ఆహ్వానం. మధ్యాహ్న భోజనంకూడా మహారాణి పక్కనే,'' అంటూ మరో ప్రశ్నకు తావివ్వకుండా వేగంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం కూడా సోమిదేవమ్మ బయటకు వెళ్ళడం మనోహరి గమనించి భర్తనూ, అత్తనూ పిలిచి విషయం చెప్పింది. భర్త వడ్డీకాసులు అమితాశ్చర్యంతో, ``సోమిదేవమ్మ ఏకంగా మహారాణిగారితోనే స్నేహం సంపాయించిందా! మధ్యాహ్న భోజనం కూడా అక్కడే అంటే మాటలా? ఆమెతో మర్యాదగా వుంటూ మనం కూడా మహారాణిగారి ప్రాపకం సంపాదించాలి,'' అన్నాడు.

``అవునవును. అప్పుడు ఏ అధికారీ మన సత్రం దరిదాపులకువచ్చే సాహసం చేయడు,'' అన్నది మనోహరి ఉత్సాహంగా. ``నువు్వ సున్ని ఉండలు చేస్తున్నావుగా. వాటిలో కొన్ని తీసుకెళ్ళి సోమిదేవమ్మకు ఇవు్వ. నెమ్మదిగా మనల్ని గురించి మహారాణిగారికి చెప్పి, పరిచయం చేయమని చెప్పు,'' అన్నాడు వడ్డీకాసులు. ``ఆ మాట నువు్వ చెప్పాలా? అంతమాత్రం నాకు తెలియదూ?'' అంటూ భర్తమాటకు అడ్డుతగిలిన మనోహరి, ఆ రోజు సాయంకాలం సోమిదేవమ్మ వద్దకు సున్ని ఉండలతో వెళ్ళి, ఆమెను పొగుడుతూ పలకరించి ఇచ్చి వచ్చింది. అయితే, మరునాడు కొందరు భటులువచ్చి రెండు సత్రాల్లో దాచిన ఆహార ధాన్యాలను తరలించుకు పోయారు. ఆ సమయంలో వ్యాపారులు అక్కడే ఉన్నా, అడ్డు చెప్పలేకపోయారు.

మనోహరి భర్త వడ్డీకాసులు మాత్రం వాళు్ళ అటు వెళ్ళగానే, ``సోమిదేవమ్మకు మహారాణిగారితో వున్న స్నేహం భటులకు తెలియదులాగుంది,'' అంటూ కాస్సేపు ఆలోచించి, ``వ్యాపారులు వారికి అడ్డు తగలక పోవడం కూడా ఒక రకంగా మనకు మంచిదే. కొంచెం తెలివి ఉపయోగిస్తే ఈ పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు,'' అన్నాడు ఉత్సాహంగా. ``ఎలాగా?'' అని అడిగింది మనోహరి కుతూహలంగా.

``నువు్వ ఇప్పుడే మహారాణిగారి వద్దకు వెళ్ళి, `మీ భటులు తరలించుకుని వచ్చిన ఆహార ధాన్యాలు వ్యాపారులవి కావు. మావే,' అని చెప్పాలి. అక్కడే వున్న సోమిదేవమ్మ నీకు సాయ పడుతుంది. అప్పుడు సరుకులు మనవే అవుతాయి,'' అన్నాడు. మనోహరి భర్త చెప్పింది విని, అతని కేసి మెచ్చుకోలుగా చూసి, అప్పటికప్పుడే రాజభవనానికి బయలుదేరింది.

కాపలా భటులతో, ``మహారాణిగారి స్నేహితురాలు సోమిదేవమ్మ ఎదురిల్లు మాది. మహారాణిగారిని చూడాలి,'' అన్నది. ఒక భటుడు ఆమెను మహారాణి వద్దకు తీసుకు వెళ్ళాడు. మనోహరి మహారాణికి తనను పరిచయం చేసుకుని నమస్కరిస్తూండగా, ``అరరే, మనోహరీ, అప్పుడే వచ్చావా? నీవంతు రాగానే నేనే నీకు కబురు పెడదామనుకున్నాను.

సరే, ఎప్పుడైతే ఏమిటి? ఆ రోకలి అందుకుని లోపలికి పద. అక్కడ నాలుగు బస్తాల ధాన్యం ఉంటుంది. అవన్నీ దంచి, బియ్యం, చిట్టు, తవుడు, నూకలు, ఊక వేరు చేసి ఇవ్వాలి. వాటిని నేను అనాథశరణాలయానికి పంపుతాను. అందరికీ న్యాయమైన ధరలతో అందవలసిన సరుకులు అక్రమంగా దాచడానికి సాయపడ్డ నీబోటి మహిళల భరతం పట్టే బాధ్యత మహారాజుగారు నాకు అప్పగించారు.

పరిస్థితి ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నది. నీకు తోడుగా ఇంకా కొందరు పనిచేస్తున్నారులే. వారం రోజులు ఇలాగే వచ్చి పని పూర్తిచేసివెళ్ళాలి,'' అంటూ భటుడి కేసి చూసింది. నిశ్చేష్టురాలై నిలబడ్డ మనోహరికి భటుడు రోకలి అందించి కొద్ది దూరంలో వున్న ఒక విశాలమైన గదికేసి నడిపించాడు. అక్కడ సోమిదేవమ్మతో సహా మరో ముగ్గురు స్త్రీలు ధాన్యం దంచుతూ కనిపించారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం