తాజా కథలు @ CCK

జడుపుజ్వరం

2015-06-10 15:05:01 చిన్నారుల కథలు
అంగలకుదురు గ్రామంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. చిల్లరకొట్టు మీద కొన్నేళ్ళకు బాగా డబ్బు గడించాడు. మనిషి మాత్రం పరమ పిసినారి. వరహాలయ్యకు ఉన్నట్టుండి జ్వరం పట్టుకున్నది. మాట కూడా పడిపోయింది. గ్రామవైద్యుడు వచ్చి ఆయన నాడి చూశాడు.

అన్ని రకాల పరీక్షలు చేశాడు. ఆదుర్దా పడుతూన్న ఆయన కుటుంబ సభ్యులతో, ``శరీరంలో ఏ దోషమూ లేదు. చూడబోతే ఇది జడుపుజ్వరంలాగా ఉంది,'' అని తేల్చి చెప్పాడు. అతని మాట మీద నమ్మకంతో వరహాలయ్య కొడుకు ఆంజనేయులు, భూతవైద్యుణ్ణి పిలిపించాడు. వాడు మంత్రాలు చదివాడు; తాయెత్తులు కట్టాడు.

అయితే ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. ఆంజనేయులు వైద్యుడి దగ్గరికి వెళ్ళి, ``మీ మాట ప్రకారం జడుపు జ్వరానికి వైద్యం చేయించాను. కాని ఫలితం కనిపించలేదు,'' అని చెప్పాడు. అప్పుడు వైద్యుడు, ``చూడు నాయనా, జడుపుజ్వరం అంటే ఏ దెయ్యాన్నో, భూతాన్నో చూసి జడిస్తేనే వచ్చేది కాదు. జడిపించే ఏ విషయమైనా విని ఉన్నా రావచ్చు. మనసుకు భయం కలిగించే అటువంటి సంఘటన ఏదైనా జరిగిందేమో విచారించి, దానికి అనుగుణంగా నచ్చజెప్పి జడుపు పోగొట్టండి.

లేకుంటే మనిషి రోజు రోజుకూ మరింత క్షీణించి మనకు దక్కడు,'' అని చెప్పి హెచ్చరించాడు. ఆ మాట వినగానే ఆంజనేయులుకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. తండ్రి పిసినారి తనానికి విసిగిపోయిన ఆంజనేయులు రెండు రోజుల క్రితం, ``నా ఆస్తి నాకు పంచెయ్. నా బతుకు నేను బతుకుతాను,'' అని వాదులాటకు దిగాడు.

ఆ మాటకు భయపడి, తండ్రి జడుపు జ్వరం తెచ్చుకున్నాడేమోనని ఆంజనేయులు బాధపడ్డాడు. ఇల్లు చేరిన ఆంజనేయులు వైద్యుడు చెప్పిన విషయం తల్లికీ, భార్యకూ వివరించి, తండ్రి మంచం దగ్గరికి వెళ్ళి, ``నాన్నా, నన్ను క్షమించు. నేనెక్కడికీ వెళ్ళను. నీతోనే ఉంటాను,'' అని అన్నాడు. అయినా వరహాలయ్య జడుపుజ్వరం తగ్గలేదు.

వరహాలయ్య మంచాన పడడంతో, ఆంజనేయులు చిల్లరకొట్టు చూసుకోసాగాడు. ఆరా తీసిన ఖాతా దారులకు తండ్రి జడుపుజ్వరం గురించి చెప్పాడు. రంగయ్య అనే ఖాతాదారు వరహాలయ్యకు అయిదు వందలు బాకీ పడ్డాడు. అప్పు తక్షణం తీర్చమన్న వరహాలయ్యను కొంత గడువు ఇవ్వమని రంగయ్య ప్రాథేయపడ్డాడు. వరహాలయ్య ససేమిరా అన్నాడు. ఆగ్రహం చెందిన రంగయ్య, ``నీ బాకీ దమ్మిడీ తీర్చను. ఏం చేసుకుంటావో చేసుకో,'' అన్నాడు. దమ్మిడీకీ, అణాకూ కక్కుర్తి పడే వరహాలయ్య అయిదు వందల బాకీ ఎగ్గొడతాననే సరికి జడుసుకుని జ్వరం తెచ్చుకుని ఉంటాడని రంగయ్య అర్థం చేసుకున్నాడు.

నిజానికి రంగయ్య మంచిమనిషి. ఏదో కోపంలో అలా అన్నాడేగాని, బాకీ ఎగ్గొట్టే ఉద్దేశం అతనికి లేదు. రంగయ్య వెంటనే వరహాలయ్య దగ్గరికి వెళ్ళి, ``భయపడకు. నీ బాకీ వడ్డీతో సహా తీరుస్తాను,'' అని హామీ ఇచ్చాడు. అయినా వరహాలయ్య జడుపుజ్వరం తగ్గలేదు. వరహాలయ్య జడుపుజ్వరం గురించి ఊరంతా తెలిసిపోయింది. అందరూ వచ్చి, ఆయనకు ధైర్యం చెప్పి వెళ్ళారు. అయినా ఫలితం కనిపించలేదు. పొరుగూరిలో ఉన్న వరహాలయ్య వియ్యంకుడికి విషయం తెలిసింది. అతడు వచ్చి, ``కట్నం డబ్బుకు తొందర చేశాను. నిదానంగానే ఇద్దువులే! ఇవ్వక పోయినా ఫరవాలేదు. బంగారం లాంటి నీ కూతుర్ని మేం బాగానే చూసుకుంటున్నాం. దిగులు పడకు,'' అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. అయినా, వరహాలయ్య జడుపు జ్వరం తగ్గలేదు.

జరుగుతూన్న తంతు చూస్తూన్న వరహాలయ్య భార్య గజలక్ష్మికి ఉన్నట్టుండి ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఆమె భర్త దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో గొణిగింది. తక్షణం వరహాలయ్య లేచి కూర్చున్నాడు. ఆ దృశ్యం చూసిన కొడుకు, కోడలు, ఆశ్చర్య పడుతూ గజలక్ష్మిని, ``ఏం చెప్పావు? లేచి కూర్చున్నాడు!'' అని అడిగారు. గజలక్ష్మి కొద్దిగా సిగ్గు పడుతూ, ``పెళ్ళయిన దగ్గరి నుంచి బంగారు వడ్డాణం చేయించమని పోరుపెడుతున్నాను. వినిపించుకోలేదు.

వారం క్రితం, వడ్డాణం చేయించకపోతే బావిలో దూకి చస్తానని బెదిరించాను. అందుకే జడుపుజ్వరం తెచ్చుకున్నట్టున్నాడు. మతిమరుపు వల్ల ఆ విషయం నాకు ఆలస్యంగా గుర్తుకు వచ్చింది. వడ్డాణం చేయించనక్కర లేదులే అన్నాను. అంతే, వెంటనే లేచి కూర్చున్నాడు,'' అంటూ అసలు సంగతి బయట పెట్టింది. హఠాత్తుగా తను మంచం పడితే భార్యా పిల్లలు చెందిన ఆందోళన, తను కోలుకోవడానికి వాళు్ళ కనబరచిన శ్రద్ధ వరహాలయ్య మనసులో కదలాడాయి.

ఊరివారి ప్రవర్తన పట్లకూడా ఆయనకెంతో కృతజ్ఞత కలిగింది. ఆయన భార్య కేసి చేయి చూపుతూ, ``అంత పెద్ద రూపానికి వడ్డాణం చేయించాలంటే ఎంత బంగారం కావాలో అన్న భయంతో జడుపుజ్వరం వాతబడ్డాను కాని, నా మీద ప్రాణాలే పెట్టుకున్న భార్యకు ఎంత ఖర్చు పెడితే మాత్రం ఏం? ఆమె కోరిన వడ్డాణం చేయిస్తాను,'' అన్నాడు. ఆయనకు మాట కూడా రావడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషించారు.

గజలక్ష్మి భర్త చేయి పట్టుకుంటూ, ``నీ ఆరోగ్యం బాగుపడింది. అదే చాలు. అయినా, నీ పిసినారితనంతో విసిగిపోయి ఆరోజు అలా అన్నానే తప్ప, నాకు వడ్డాణం మీద మోజు ఎప్పుడో పోయింది. ఆ చేయించేదేదో మన కోడలుపిల్లకు చేయించు. చూడముచ్చటగా ఉంటుంది,'' అన్నది ఆప్యాయంగా. ఆ మాటకు వరహాలయ్యతో పాటు అందరూ ఎంతో సంతోషించారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం